
గంగవరం: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదన్న కోపంతో కన్నతల్లి అని కూడా చూడకుండా గోడకు తలను కొట్టి హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన మండలంలోని నూగుమామిడిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపిన వివరాలు... కొలుతూరి అబ్బాయి, ఆదమ్మ(54) భార్యాభర్తలు. వీరికి వివాహాలైన ఇద్దరు కొడుకులున్నారు.పెద్ద కొడుకు బాలయ్య భార్యతో కలిసి అదే గ్రామంలో నివాసముంటున్నాడు. చిన్నకొడుకు కృష్ణను భార్య విడిచి వెళ్లిపోవడంతో గ్రామంలోనే తల్లిదండ్రులతో ఉంటున్నాడు.
నిత్యం తాగుతూ తిరగడమే పనిగా పెట్టుకున్నాడు. రోజూలాగే తాగేందుకు ఆదివారం రాత్రి కూడా తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోడంతో గొడవపడ్డాడు. తీవ్ర ఆగ్రహంతో తల్లి తలను గోడకు కొట్టాడు. గొడవ జరగడంతో కొడుకు తనను కూడా కొడతాడేమోనని భయపడి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన తల్లి ఆదమ్మ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. తల్లిని హత్య చేసి కృష్ణ పరారయ్యాడని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు. అడ్డతీగల సీఐ రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారని, ఆయన ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌బీ హెచ్‌సీ రాజారావు వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment