దేవుని ప్రేమపాత్రులు!
ఆత్మీయం
భక్తుల్లో నాలుగు వర్గాల వాళ్లుంటారు. కొందరు ఆర్తితో భగవంతుణ్ని కొలుస్తారు. వాళ్లు ముందు బాగానే బతికినా, కాల కర్మ వైపరీత్యం వల్ల అన్నీ పోగొట్టుకుంటారు. మళ్లీ వెనకటిలాగ జీవితంలో సుఖపడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తారు. మరికొందరు తమ ఆత్మస్వరూపాన్ని గురించిన జిజ్ఞాసతో భగవంతుణ్ని సేవిస్తారు. ఇంకా కొందరు, గర్భదరిద్రులుగా ఉండి, ఐశ్వర్యం కోరుకుంటారు.
వాళ్లూ భగవంతుణ్నే ఆశ్రయిస్తారు. మరికొందరు భగవంతుని నిష్కామంగా ప్రేమించి సేవిస్తారు. వాళ్లనే ‘జ్ఞానులు’ అంటాడు శ్రీకృష్ణుడు ‘‘ఈ నాలుగు రకాల వాళ్లూ నాకు భక్తులే. కాని అందరికన్నా ఈ చివర చెప్పిన ‘జ్ఞాని’ అంటే నాకు ఎక్కువ మక్కువ. వాడు నాకు ఆత్మ’’ అని తెలియజేశాడు పరమాత్మ. అంటే నిష్కామంగా భగవంతుని సేవించడమే జ్ఞానం. అటువంటి వారినే భగవంతుడు ప్రేమిస్తాడు.