నిస్సారమైన భూమిలో దేవుని నూరంతల దీవెన
‘ఈ దేశంలోనే ఉండు, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తానంటూ దేవుడు వాగ్దానం చేస్తే, ఇస్సాకు దేవుని మాటకు కట్టుబడి ఎడారి అయిన గెరారు దేశంలోనే జీవించాడు. నిజానికి దేవుడు ఆయనకు చూపించిన గెరారు లోయ ఆ బెయేర్షెబా ఎడారిలోకెల్లా అత్యంత నిస్సారమైన ప్రాంతం. అయితే ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై అక్కడ నివసిస్తూ శ్రమించి వ్యవసాయం చేస్తే, దేవుడు నూరంతల పంటను అనుగ్రహించాడు. ఒక విత్తనం వేస్తే వంద విత్తనాలు రావడం ఎక్కడైనా జరిగేదే. కాని ఆ నిస్సారమైన భూమిలో దానికి నూరంతలు అంటే ఒక విత్తనానికి పదివేల విత్తనాల పంట చేతికొచ్చింది. అలా అనతికాలంలోనే ఇస్సాకు ఆ దేశంలోకెల్లా గొప్ప వాడయ్యాడు(ఆది 26:12).
ఇశ్రాయేలీయుల మూలపితరులు అబ్రాహాము, ఆయన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ‘మా దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు’ అంటూ ఇశ్రాయేలీయులు ఎంతో ఘనంగా చెప్పుకునే గొప్ప ‘పితరుల త్రయం’ వారు ముగ్గురూ!! ఈ ముగ్గురిలో ఇస్సాకు చాలా మెత్తటి వాడు, మితభాషి, పైగా మిగతా ఇద్దరికున్నంత తెగింపు, చైతన్యం ఉన్నవాడు కాదు. బైబిల్లో కూడా ఆయన గురించి చాలా తక్కువ వివరాలున్నాయి. కాని దేవుని పట్ల విధేయతలో మాత్రం ఆయన ఎవరికీ తక్కువ కాదు. గెరారు లోయ నిస్సారమైన ప్రాంతమని నిస్పృహచెందకుండా తాను కష్టపడితే దేవుడే ఆ కష్టాన్ని ఆశీర్వదిస్తాడని నమ్మి అతను నూరంతల దీవెన పొందాడు.
అయితే దేవుని ఆశీర్వాదంతో అతి త్వరలోనే అతడక్కడ చాలా ధనవంతుడై ఎంతో గొప్పవాడు కావడంతో, స్థానికులైన ఫిలిష్తీయులకు అసూయ కలిగి కలహించారు. కాని అతని వెనుక దేవుడున్నాడని గ్రహించిన ఫిలిష్తీయుల రాజు తానే తన పరివారంతో సహా ఇస్సాకు ఇంటికొచ్చి మరీ ఆయనతో శాంతి ఒప్పందం చేసుకొని విందారగించాడు. దేవుడిచ్చేదానికి, మనిషి సంపాదించుకునే దానికి మధ్య ఉన్న తేడా అదే. దేవుడిచ్చే సంపద శత్రువులను మిత్రులుగా మార్చుతుంది, మనిషి సంపాదించుకునేది మిత్రులను కూడా శత్రువులుగా మార్చుతుంది. అలా ఇస్సాకు క్రమంగా బలం, ధైర్యం పుంజుకొని అక్కడి పరిస్థితులన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
తన తండ్రి తవ్వించగా ఫిలిష్తీయులు పూడ్చేసిన బావుల్ని మళ్ళీ తవ్వించాడు. కొన్ని కొత్త బావుల్ని కూడా తవ్వించాడు. అలా ఎంత ఎదిగినా, ఆ దేశానికి రాజంతటివాడు స్వయంగా తనవద్దకు వచ్చినా, ఇస్సాకు మిడిసిపడలేదు. తలవంచే తత్వం, కష్టపడేతత్వం, సాత్వికత్వం, దేవుడిచ్చిన పారలౌకిక జ్ఞానం, శాంతికాముకత కలిగిన విశ్వాసిగా ఇస్సాకు తనపట్ల దేవుని ప్రసన్నతను నిరూపించుకున్నాడు. లోకంలోని ధనవంతుల్లో కళ్ళు నెత్తికెక్కి అది నడమంత్రపు సిరిగా మారి, అందర్నీ శత్రువులను చేసుకొని అశాంతితో జీవించేవాళ్లే చాలామంది ఉంటారు. అయితే ఎంతసంపన్నులైనా సరే అటు దేవునికి ఇటు సమాజానికి కూడా ఒదిగి జీవించే ఇస్సాకు లాంటి వాళ్ళు చాలా అరుదు. ఇస్సాకు లాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలను, శాంతిని పంచుతారు.
నేను మహా విశ్వాసియైన అబ్రాహాము కొడుకును కాబట్టి దేవుడెలాగైనా ఆశీర్వదిస్తాడులే అని అతను చేతులు ముడుచుకొని సోమరిలాగా కూర్చోలేదు. తన వంతు కష్టపడ్డాడు. దేవుడు ఎవరి ఆశీర్వాదాలు వారికే ఇస్తాడు. అబ్రాహామువి అబ్రాహామువే, ఇస్సాకువి ఇస్సాకువే!! నా తండ్రిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడులే అన్న భరోసాతో విశ్వాసులుండకూడదు. ప్రతి విశ్వాసికి దేవునితో సన్నిహితమైన, పూర్తిగా వ్యక్తిగతమైన తనదైన ఒక అనుబంధం, సహవాసం ఉండాలి. అదే సంపదలను, శాంతిని చేకూర్చుతుంది. ఆశీర్వాదాలను తన స్వాస్త్యంగా ప్రతి విశ్వాసి ఎవరికి వారు సొంతగా సంపాదించుకోవాలి. తాత్పర్యమేటంటే, దేవునికి మనవలు మనవరాళ్ళుండరు. విశ్వాసులంతా ఆయనకు కుమారులు, కుమార్తెలే!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్