సమయోచిత జ్ఞానమే.. వివేచన! | Topical Knowledge Discernment: Lalitha Vasanthi | Sakshi
Sakshi News home page

సమయోచిత జ్ఞానమే.. వివేచన!

Published Mon, Aug 12 2024 8:38 AM | Last Updated on Mon, Aug 12 2024 8:38 AM

Topical Knowledge Discernment: Lalitha Vasanthi

మంచి మాట

వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.

అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.

విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు.

"పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"

ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ,  మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.

కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు.  వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.

బెర్ట్రాండ్‌ రసెల్‌.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్‌ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి.  ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement