అది మండు వేసవి. అప్పుడే సూర్యోదయం అయింది. లేత కిరణాలు సోకి సాలవృక్షం పచ్చదనాన్ని వెదజల్లుతూ పరవశించిపోతోంది. ఆ అడవిలో తానే ఎత్తైన వృక్షాన్ని అనే గర్వంతో కూడిన ఆనందం అది. అంతలో..ఒక కాకి ఎగిరి వచ్చి ఆ వృక్షం కొమ్మల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో వాలింది. దాని ముక్కున పండిన మాలువా పండు ఉంది. ఆ పండును కాలివేళ్ళతో తొక్కి పట్టి, గుజ్జునంతా తినేసింది. ముక్కును అటూ ఇటూ రాచి, వాలుగా చూసి, ‘కా..కా’’ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది.
అలా కాకి వెళ్ళిపోగానే, తన మీద వదిలి వెళ్ళిన మాలువా విత్తనాన్ని గమనించిన ఆ సాలవృక్షం ఆలోచనలో పడింది. భయం పుట్టి వణికింది. అయినా తనని తాను సమాధాన పరచుకుని శాంతించింది. వేసవి ముగిసింది. మాలువా విత్తనం టెంకె పగిలింది. దానిలోంచి నిగనిగలాడే విత్తనం బయటకొచ్చి పడింది. ఆ విత్తనాన్ని చూడగానే సాలవృక్షానికి వేళ్ళు కుంగినట్లయింది. పెనుగాలికి కూలినట్లు భావించింది. కార్చిచ్చుకి తగలబడి బూడిద అయినట్లు అనిపించింది. నిలువెల్లా వణకసాగింది. మొత్తుకోసాగింది.
అప్పుడు ఆ వృక్షం చుట్టూ ఉండే ఇతర వృక్ష మిత్రులంతా ‘‘దుఃఖ కారణం ఏమిటి?’’ అని అడిగారు. ‘‘సాలవక్షం విషయం చెప్పింది. అప్పుడు ‘‘సాలవృక్షమా! చింతించకు. అనవసరంగా భయపడుతున్నావెందుకు? ఆ విత్తనాన్ని నెమలి తినవచ్చు. జింక నమిలి వేయవచ్చు. కార్చిచ్చు కాల్చవచ్చు. ఎవరైనా మనిషి చూసి తీసుకుపోవచ్చు. ఎండకు ఎండిపోవచ్చు. నీడలో నాని కుళ్ళిపోవచ్చు. చెద పురుగులు తినొచ్చు. చీమలు తీసుకుపోవచ్చు. ఇన్ని అవరోధాలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని అది మొలకెత్తలేదు.
ఒకవేళ మొలకెత్తినా వెంటనే వానలు ఆగిపోతే, మొలకలోనే మాడిపోవచ్చు. కాబట్టి లేనిపోని భయాన్ని ఊహించుకుని వణికిపోకు’’ అంటూ ధైర్యం చెప్పాయి. తోటి వృక్షాల ఓదార్పుకు ఆ సాలవృక్షం ధైర్యాన్ని తెచ్చుకుంది. కానీ ఆ విత్తనం మొలవడానికి ఏ అవరోధం కలగలేదు. ఆ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో చక్కగా మొలకెత్తింది. వేగంగా పెరిగింది. పెద్ద పెద్ద తమలపాకుల్లా లేత పచ్చని ఆకుల తీగపైకి లేచింది. దాన్ని చూసి సాలవృక్షం లబోదిబోమంది. మరలా వృక్షాలన్నీ– ‘‘నీవు మహావృక్షానివి. అది చిన్న తీవె. అయినా ఆ బుజ్జి కాడ ఎంత ముచ్చటగా, అందంగా ఉందో, అది నీకు మంచి అలంకారంగా ఉంది.
ఈ చిన్న తీవె నిన్నేమి చేయగలదు’’ అని మరలా ధైర్యం చెప్పాయి. వాటి మాటలు విని సాలవృక్షం కొంత సాంత్వన పడింది. కానీ.. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ బలపడింది. దాని బెరడును చీల్చుకుని వేళ్ళను లోనికి పంపింది. ఆ వృక్ష సారాన్నే పీల్చుకోసాగింది. చివరికి చెట్టంతా కమ్ముకుపోయింది. సారాన్ని కోల్పోయిన సాలవృక్షం ఎండి.. క్రమంగా జీవాన్నీ కోల్పోయింది. ఒకప్పుడు అడవిలో తిరిగే మనుషులు ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటూ ‘‘ఆ పెద్ద సాలవృక్షం దగ్గర ఆ మహా సాలవృక్షం పక్కన..’’ అని ఆనవాళ్ళను చెప్పుకుంటూ ఉండేవారు.
కానీ.. ఇప్పుడు.. ఆ మాలువా పొద పక్కన’’ అంటూ చెప్పుకోసాగారు. చెడ్డవారిని చేరదీయడం వల్ల, చెడ్డతనం పట్ల ఉపేక్ష భావంతో ఉండటం వల్ల అది మన ఉనికికే చేటు తెస్తుంది. మనిషి మనసులో చెడు కోరికలు రేగినప్పుడు.. ‘‘ఇది చిన్న కోరికే కదా! ఈ ఒక్కసారికీ ఈ పని చేసి ఇక ఆ తరువాత చేయకుండా ఉంటే మనకు వచ్చే నష్టం లేదు. కలిగే కష్టమూ లేదు’’ అనుకుని ఆ చెడ్డ కర్మలకు పూనుకుంటారు.
కానీ, ఆ తర్వాత వాటిని మానడం అటుంచి, మరింత లోతుకు కూరుకుపోతారు. కామ రాగాలన్నీ ఇలానే ప్రవేశించి, పెరిగి పెరిగి మన ఉనికికే ప్రమాదాన్ని తెస్తాయి. వాటిని మనస్సులో పుట్టకుండా చేసుకోవాలి. లేదా పుట్టిన వెంటనే నివారించుకోవాలి. ఆపేక్షతో ఉపేక్ష చూపితే మన ఉనికికే నిక్షిప్తం చేస్తాయి. ఇది కామరాగాల పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో బుద్ధుడు చెప్పిన కథ ఇది. ఆ రోజుల్లో ‘మోక్షానికి కామం కూడా ఒక మార్గమే’ అని చెప్పే సాధువులు కొందరు ఉండేవారు. వారికి కనువిప్పు కలిగించడం కోసం, బుద్ధుడే ఈ కథ చెప్పాడు.
– డా. బొర్రా గోవర్ధన్
(చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!)
Comments
Please login to add a commentAdd a comment