నాగమ్మ పెద్దమ్మ | Funday new story of the week 17-03-2019 | Sakshi
Sakshi News home page

నాగమ్మ పెద్దమ్మ

Published Sun, Mar 17 2019 12:30 AM | Last Updated on Sun, Mar 17 2019 12:30 AM

Funday new story of the week 17-03-2019 - Sakshi

బతికున్నప్పటి కంటే కొంతమంది చనిపోయాకే  ఎక్కువ గుర్తుంటారేమో! అక్షరఙ్ఞానం లేకపోయినా తమ అనుభవాలతో   జీవితాన్ని గడిపి ఆ శేషాన్ని ఙ్ఞాపకాలుగా మార్చి పోయినవాళ్లు ఇంకా బాగా గుర్తుంటారు. నాకు ఊహ తెలినసిన దగ్గర్నుంచి ఊరు విడిచిపెట్టే వరకూ నాగమ్మ పెద్దమ్మతో వున్న అనుబంధం కూడా అలాంటిదే. ఒంట్లో ఓపికున్నంత వరకూ కష్టపడాలని, ఇతరుల మీద అత్యవసరమైతే తప్ప ఆధారపడకూడదనే సత్యం నాగమ్మ పెద్దమ్మ నాకు నేర్పింది. సన్నగా, పొడుగ్గా, విశాలమైన నుదురు, నిటారుగా వుండే ముక్కుతో తెల్లగా కళగా వుండేది పెద్దమ్మ. తలంతా తెల్లబడి తలపైన ముగ్గుబుట్ట బోర్లించినట్లుగా వుండేది. నుదురునిండా కనిపించే ముడతలు కోనేటి దగ్గరున్న మెట్లను తలపించేవి. పట్టుకోకలు కట్టుకుని కోకచెంగును బొడ్డులో దోపుకునేది. నుదుటున బొట్టుండేది కాదు.బొట్టు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది.  ఇంటిముందున్న బూరుగుచెట్టు నుండి గాలికి రాలిపడిన బూరుగుకాయల్ని ముందేసుకుని వాటిలోని దూదిని వేరుచేస్తూ కనిపించేది పెద్దమ్మ. పసిపిల్లని సాకినట్లుగా ఒక్కో బూరుగుకాయనీ పగులకొట్టి అందులోనుంచి తీసిన దూది గాలికి ఎగరకుండా దాన్ని జాగ్రత్తగా చుట్టచుట్టిన దుప్పట్లో దాచిపెట్టేది. ఎప్పుడన్నా ఆడుకుంటూ పెద్దమ్మ ఇంటి వాకిట్లోకి వెళ్తే ‘కూర్చో’మన్నట్లుగా సైగచేసేది. ‘‘ఒక్కదానివే కదా ఇంట్లో వుండేది! కాసేపు పడుకోకుండా నడుము నొప్పెట్టేలా ఈ పనులెందుకు’’ అని అమాయకంగా అడిగేవాడిని. 

బోసినోటితో చిన్నగా నవ్వి నా బుగ్గలపైన సుతారంగా నొక్కి కణత దగ్గర మొటికలు విరిచి ముద్దు పెట్టుకునేది. తర్వాత లోపలికెళ్లి పండిన అరటిపండు తీసుకొచ్చి తినమని ఇచ్చేది. పెద్దమ్మ భర్త వ్యవసాయం బాగా చేసేవాడు.  సొంతభూమి లేకపోయినా కౌలుకు తీసుకుని పసుపు, అరటి పంటలు పండించేవాడు. అరటితోట కాపుకొచ్చినప్పుడు పండడానికి సిద్ధంగా వున్న గెలను తీసుకొచ్చి ఇంటి మధ్యలో వేళ్లాడదీసేవాడు. రోజుకు ఒకటో రెండో పండితే వాటిని తినడమో, పెరుగన్నంలో నంజుకుని తినడమో చేసేవాళ్లు. రెండో మూడో పాడిగేదెలుండేవి. గేదెల్ని పొలానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాక పాలుతీసి ఇంటింటికీ వెళ్లి ఖాతాల్లెక్కన పాలు పోసి వచ్చేది. పొరపాటున కూడా పాలల్లో నీళ్లు కలిపేది కాదు.  ఎవరైనా వేళాకోళానికి ‘అందరూ పాలల్లో నీళ్లు కలిపి దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకుంటుంటే... నువ్వేమో తీసిన పాలు తీసినట్లే పోస్తున్నావు’’ అని మాట్లాడితే ‘‘పాలూనీళ్లల్లా సంసారం సాగాలిగానీ వ్యాపారం చేయకూడదు..’’ అని సున్నితంగా మందలించేది. పెద్దమ్మకి పిల్లల్లేరు. లోపం ఎవరిదో ఆ భగవంతుడికే తెలియాలి. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పిల్లల్లేరనే దిగులు లేకుండా జీవితం గడిపేవారు. అయినా లోపం లోపమే కాబట్టి తెలిసిన బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచు కున్నారు. కడుపున పుట్టకపోయినా వాడిని ఏ పనీ చేయనివ్వకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడిగిందల్లా లేదన కుండా ఇవ్వడం, అతిగారాబం వల్ల వాడు చదువబ్బక జులాయిగా మారాడు. ఎటూ చదువబ్బడం లేదుకాబట్టి వ్యవసాయం నేర్చుకుంటాడని పొలానికి తీసుకెళ్తే తండ్రి చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు. పిల్లలు కళ్లముందు ఎంత అల్లరిచేసినా అది తల్లిదండ్రులకు సంబరంగానే వుంటుంది. ఎప్పుడైనా ఇరుగుపొరుగు వాళ్లు వాడిమీదేమైనా చాడీలు చెప్తే ‘‘అల్లరి చేయకుండానే పెద్దవాళ్లు అయిపోయారా? పసితనం కదా... వాడే తెలుసుకుంటాడులే..’’ అని సర్ది చెప్పి పంపించేది. 
కాలం కలకాలం ఒకేలా వుండదు. మనిషి లెక్కలు మనిషికుంటే కాలం లెక్కలు కాలానివి.

పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరిచివరి  మామిడితోటలో వున్న దిగుడుబావిలో పడి చనిపోయాడు వాడు. పెద్దమ్మ గుండె పగిలిపోయింది.  పిల్లాడిని పెంపకానికిచ్చిన తల్లి పెద్దమ్మను తీవ్రంగా తిట్టిపోసింది. ‘గొడ్డుమోతుదానివి, పేగుతెంచుకుని కంటే ఆ బాధ తెలుస్తుంది, పెంపకానికి తెచ్చుకుంటే పిల్లలపైన ప్రేమెలా పుడుతుంది, వాళ్లను కాపాడుకోవాలనే ఙ్ఞానమెలా వస్తుంది...’’ కడుపుమీద కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడ్తున్న ఆమెవంక విషాదంగా చూస్తుండిపోయింది పెద్దమ్మ.  సొంత తల్లికాకపోయినా అంతకంటే ఎక్కువగానే సాకింది వాడిని. తన పెంపకంలో లోపం లేదు, తన ప్రేమలో లోటులేదు. అయినా అనుకోని విపత్తు జరిగితే లోకం దృష్టిలో ఎన్ని నిందలుపడాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది పెద్దమ్మకి.  కాలం గాయాలు చేస్తుంది, ఓదార్పునూ ఇస్తుంది. కొన్నాళ్లు వాడి ఙ్ఞాపకాలతోనే భారంగా గడిచిపోయింది జీవితం. వాడి గుర్తులనుండి బయటపడి ఈ లోకంలోకి వస్తున్న పెద్దమ్మకి భర్తమరణం పిడుగులా మారింది. ఒకరోజు ఉదయాన్నే పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్లిన భర్త పాముకాటుకు గురై చనిపోయాడు. పెద్దమ్మకి పెళ్లైనప్పటి నుండీ వాళ్ళిద్దరూ ఎంత సాన్నిహిత్యంగా వుండేవారో తెలిసిన వాళ్లు ఆమెను ఓదార్చారు గానీ బాధను తీసేయలేకపోయారు. భర్త పోయిన తర్వాత పంటనుండి వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చింది. పాలమ్మగా వచ్చిన ఆదాయాన్ని రోజువారీ ఖర్చులకోసం వాడుకునేది. రోజులు గడిచేకొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోవడం, గేదెలకు చాకిరీ ఎక్కువగా చేయాల్సి రావడంతో వాటిని అమ్మేసింది. ఇంటిచుట్టూ మట్టిగోడలు పడగొట్టించి ఇటుకలతో కట్టించింది.  అరసెంటు స్థలం చుట్టూ వున్న పిచ్చిమొక్కల్ని తొలగించి కంచె పాతించింది. ఇంటిముందున్న సపోటా చెట్టుకిందో, జామచెట్టుకిందో మంచం వేసుకుని కూర్చునేది. 

ఇంటిముందునుంచి ఎవరెళ్తున్నా ‘ఎలా వున్నారం’టూ అందర్నీ ఆరాతీసేది. ‘కాసేపు కూర్చుని పోదువు రా’ అంటూ పిల్చేది.  ‘‘నీకేమే పెద్దమ్మా... ఒంటరిదానివి. ఒక ముద్దొండుకుని తింటావు, నిద్రొస్తే పడుకుంటావు. నీకులాగా మాకెలా కుదురుతుందీ...’’ అంటూ దీర్ఘం తీసుకుంటూ వెళ్ళే వాళ్లవంక చూస్తూ ‘‘ఒక్కదాన్నే వుండడం ఎంత నరకమో నీకెంత చెప్పినా తెలియదులే...’’ నీళ్లను కళ్లల్లోనే దాచుకుని తనలో తనే గొణుక్కునేది పెద్దమ్మ. పొద్దున్నే లేచి చక్కగా ముఖం కడుక్కుని అద్దం ముందేసుకుని జామచెట్టు కింద కూర్చుని తలదువ్వుకునేది.  ఒత్తుగా కొబ్బరినూనె రాసుకుని తలపై వున్న కాసిని వెంట్రుకలనే శుభ్రంగా దువ్వుకుని దానిలో సవరం పెట్టి అల్లుకుని పెద్ద ముడేసుకునేది. అటూఇటూ అద్దాన్ని తిప్పి కాసేపు చూసుకునేది. ‘‘ఇంత వయసొచ్చినా సోకు తగ్గలేదు నీకు... నిండా నాలుగెంట్రుకలు లేవు, పొద్దస్తమానం దువ్వుతూనే వుంటావు...’’ అనేవాళ్లని చూసి ‘‘నాతోపాటు పుట్టినయ్, పోయే దాకైనా జాగ్రత్త చేయాలిగా...’’ అంటూ ముసిముసిగా నవ్వుకునేది.  పెద్దమ్మ ఎండుచేపలు అమ్మేది. ప్రతీ ఆదివారం తెల్లవారుజామునే లేచి పెద్ద గోనెసంచి తీసుకుని ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న సంతకి వెళ్లేది. ఎండురొయ్యలు, చీలికచేపలు, రొయ్యపొట్టు, ఉప్పుచేపలు తీసుకుని వెనక్కి వచ్చేది.  బస్సుదిగి ఊర్లోకి నడిచివస్తుంటే ఆడోళ్లందరూ పెద్దమ్మ వెనకాలే వచ్చేవాళ్లు ఎండుచేపలకోసం. కనీసం మూట కూడా దించుకోనివ్వకుండా మీదకి ఎగబడేవాళ్లు. వాళ్లందర్నీ తోసి ‘ముసలిముండని... అంతదూరం నుండి ఇంత పెద్ద మూటేసుకుని పడతా లేత్తా ఇంటికొస్తే ఒక్కతన్నా గుక్కెడు మంచినీళ్లిచ్చిందా? చేపలో చేపలో అని నా గోచి లాగుతున్నారు, అవతలికి పొండెహే...’’ అంటూ తిట్టేది. 

గోనెసంచి ముడివిప్పగానే ఎండుచేపల వాసన గుప్పున వచ్చేది. ఈగల్లాగా అందరూ మూకుమ్మడిగా చేరి ‘నాకివి కావాలి, నాకవి కావాలి’ అంటూ ఎవరిక్కావలసిన చేపలు  వాళ్లు పట్టుకెళ్లేవాళ్లు. తక్కెడ సర్ది లోపల దాచిపెట్టేది.  గురువారం నుండి శనివారం వరకూ ఎవరికైతే చేపలు అప్పుగా ఇచ్చిందో వాళ్లదగ్గరకెళ్లి డబ్బులు వసూలుచేసేది. ఆ డబ్బులు లెక్కచూసుకుని మళ్లీ ఆదివారం సంతకి సిద్ధమయ్యేది. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునేది కాదు. ఒకవేళ కూర్చున్నా బూరుగుకాయల నుంచి దూది వడుక్కునేది. పొయ్యి వెలిగించుకుని నాలుగుగింజలు ఉడికించుకుని కాల్చిన ఎండుచేప నంజుకుని ఆ పూటకి భోజనం కానిచ్చేది. రెండుముద్దలు కాకులకోసం విసిరేది. ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చే వాటికి, ఏకాకిగా జీవితం గడుపుతున్న తనకీ పెద్దగా భేదం కనిపించేది కాదు. పిచ్చాపాటిగా ఎవరైనా ఎప్పుడైనా ‘‘ఒక ముద్దొండుకుని తిని ఇంట్లో కూర్చోకుండా ఎందుకే ఎండనపడి అంతదూరం వెళ్లి సుఖంగావున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావు? మధ్యదారిలో ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది...’’ అనేవాళ్ళు.దానికి పెద్దమ్మ ‘‘పోయే ప్రాణమే గానీ వచ్చే ప్రాణం కాదుగా... ఎప్పటికైనా పోవలసిందే! ఎంతసేపూ ఇంట్లోనే కూర్చుంటే ఇబ్బందిగా వుంటుంది. సంతకెళ్తే నాలుగు ముఖాలు కనిపిస్తాయి, నలుగురి మాటలు వినిపిస్తాయి. ప్రపంచంలో నా ఒక్కదానికే కష్టాలున్నాయనుకునేదాన్ని. సంతలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకం కష్టం. వాళ్లకంటే నేనే నయమనిపిస్తుంటుంది...’’ అని  చెప్తూ సొట్టబుగ్గలు ఇంకా గుంటలుపడేలా పెద్దగా నవ్వేది. 

మళ్ళీ తనే నవ్వుతూ ‘‘ఇదిగో ఇంకో మాట చెప్తా విను... కాలూచెయ్యీ పడిపోయి మంచానపడి అందరిచేతా సేవ చేయించుకుంటూ తిట్టించుకుంటూ పోయేకంటే... ఈ చిలక ఎక్కడో ఒకచోట గుటుక్కున ఎగిరిపోతేనే బాగుంటుంది.... ఏమంటావు?’’ అంటూ నవ్వుకుంటూ లోపలికెళ్తున్న పెద్దమ్మ వంక ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు అయోమయంగా చూసేవాళ్ళు.  అన్నట్టుగానే పెద్దమ్మ వెళ్లిపోయింది. ఎవరిచేతా మాటపడకుండానే, ఎవరితోనూ చేయించుకోకుండానే పడు కున్నది పడుకున్నట్లే నిద్రలోనే చనిపోయింది. అటువంటి మనిషి మళ్లీ పుట్టదని ఊరంతాఅనుకున్నారు. అటువంటి చావు ఎవరికీ రాదని కూడా అందరూ అనుకున్నారు. 
- డా. జడ సుబ్బారావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement