జగన్మాత
జీవిత పరమార్థాన్ని చూపించగలిగే మహాశక్తి జగన్మాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలలో నవరాత్రులూ ఆరాధించి విజయదశమి పర్వదినాన విశ్వజనని దివ్యరూపాన్ని విశేషంగా కొలుస్తారు. వసంతరుతువు, శరదృతువు ప్రాణులకు క్లిష్టకాలాలు.
జనులకు అనారోగ్యం కలిగించే ఈ మాసాలలో చెడును ఎదుర్కొని, శుభాలను ప్రసాదించమని కాంక్షిస్తూ జగద్రక్షకి అయిన దుర్గాదేవిని పూజించాలని శాస్త్రోక్తం. మానవుడికి కలిగే ప్రమాదాలను అంతర్ముఖ తత్త్వంతో దర్శించిన వ్యాసాది ఋషిపుంగవులు వాటి నిర్మూలన కోసం, నివారణ కోసం దివ్య చైతన్య దీపిక అయిన జగన్మాత ఆరాధనే అనివార్యం, ఆనంద ప్రదాయకం అని ప్రబోధించారు. జగములనేలే జగన్మాత సత్యానికీ, ధర్మానికీ, సామరస్యానికీ విజయానికీ అధినేత్రి. వివేకం, విజ్ఞానం, శాస్త్రం, శక్తి, సంగీతం, సాహిత్యం అమ్మ విభూతిలోని భాగాలే.
జీవితంలో ఒడిదుడుకులు, స్తబ్ధత ఏర్పరిచే పరిస్థితులు మనిషిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తే భగవంతునిపై భారం వేసి కాలానుగుణంగా జీవిత యజ్ఞం కొనసాగించాలనే ఆంతర్యం, విశ్వకళ్యాణం కోసం, ధర్మపరిరక్షణ కోసం అలౌకిక భావనాతుల్య అవతారాలలో జగన్మాత ఆవిర్భావం జరిగింది. దసరా అంటే పది రోజులని అర్థం. కనుక అమ్మవారిని నవరాత్రులూ విశేషంగా ఆరాధించి జీవన దృక్పథాన్ని విజయ పథంలో నడిపించమనీ వేడుకోవాలి. సంప్రదాయం, సంస్కృతి కలగలసిన విజయదశమి మానవ జీవితాల్లో ఆనంద అనుభవాలను అందిస్తూ పావనం చేస్తుంది.
-ఇట్టేడు అర్కనందనాదేవి
దివ్య చైతన్య దీపిక
Published Thu, Oct 2 2014 11:07 PM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement