విద్యాభ్యాసం, విస్తృత పుస్తక పఠనాల వల్ల పొందే జ్ఞానం ఒకటైతే, మనిషిలో ఉండే సహజమైన గ్రహింపు శక్తి, అవగాహన శక్తి వలన వచ్చే జ్ఞానం మరొకటి. దీనికే ఇంగితం లేదా ఇంగితజ్ఞానం అని పేరు. చదువుకున్న వారిలోనే ఇది ఉండనక్కరలేదు.
ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక అంతర్లీనమైన ఒక జీవలక్షణం. జీవితంలో మనకు కలిగే అనేక అనుభవాలతో ఈ ఇంగితం మరింతగా పదునెక్కుతుంది. అందుకే ఇది ఎంతో విశిష్టమైంది. చదువుతో నిమిత్తంలేకుండా ప్రతి మనిషి జీవనానికి, జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ ఇంగితం మనలను అప్రమత్తులను చేసి వ్యవహార దక్షతను పొంచి జీవితం సజావుగా సాగేటట్టు చేస్తుంది.
విద్యాధికులలో ఉండే జ్ఞానమనే బంగరు పళ్లెరానికి ఇది ఒక గోడ చేర్పు లాంటిది. అనేక శాస్త్రాలను మధించి దాని జ్ఞానామృతాన్ని గ్రోలిన పండితులైనా, తమ జీవితాన్ని నూతన ఆవిష్కరణల కోసమై ధారపోసే శాస్త్రవేత్తలైనా తమ ఇంగితం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అలా కానివేళ, వారి జ్ఞానం వారికే కాక మానవాళికే ముప్పు తెస్తుంది. చరిత్ర పుటలు తిరగవేసినా, మన సమకాలీన చరిత్రను పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది.
ఒక గురువు తనవద్ద శ్రద్ధతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న నలుగురు శిష్యులకు చనిపోయిన వారిని బతికించగల అద్భుత శక్తినిచ్చాడు. అయితే, దానిని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించ మని హెచ్చరించి పంపాడు. వారిలో ముగ్గురు మార్గమధ్యంలో ఒక పులి కళేబరాన్ని చూసి వారి అద్భుత శక్తిని ప్రయోగించాలని ఉవ్విళ్ళూరటం, నాలుగవవాడు వారి మూర్ఖత్వానికి వగచి, హితవు పలికి భంగపడి వీరికి దూరంగా వెళ్లి తన ప్రాణాలు దక్కించుకున్న కథ మనకు తెలుసు. ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురు జ్ఞానసంపన్నులే.
కాని వారిలో కొరవడిన ఇంగితం ప్రాణం నిలబెట్టుకున్న వాడిలో మెండుగా ఉంది. అలాగే పరస్త్రీని తాకకూడదన్న ధర్మాన్ని మనసులో స్థిరరచుకున్న ఒక శిష్యుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక స్త్రీని రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఆపదలో ఉన్నది ఒక జీవి మాత్రమేనని భావించిన రెండోవాడు ఆమెను కాపాడటానికి కారణం ఇంగితమే. ఇంగితమంటే వివేకమే. ఒకరకమైన యుక్తాయుక్త విచక్షణ. సందర్భోచిత జ్ఞానం. మన చదువుల సారానికి, జీవితానుభవాన్ని విచక్షణాశక్తిని కలిపి చూడగలగటమే ఇంగితం. మన ప్రవర్తనలో, వ్యవహార శైలిలో దానిని చూపగలిగేవారి జీవితం అపార్థాలు, తగాదాలు లేకుండా సాగుతుంది.
వందలాది పక్షులకు ఆశ్రయమిచ్చే ఓపెద్ద చెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలో ఉన్నాడో పండితుడు. అపుడో పక్షి విడచిన విసర్జనం అతని తల మీద పడింది. విపరీతమైన కోపమొచ్చిన ఆయన దాని వంక తీక్షణంగా చూసాడు. అంతే! ఆ పక్షి కాలి బూడిదై పోయింది. ఆయనకు సంతోషమూ, గర్వమూ కలిగాయి. అన్ని పక్షులున్న చెట్టు కింద కూర్చుంటే ఆ అనుభవం ఎదురవ్వటం నీరు పల్లానికి వెళుతుందన్న నంత సహజం. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోవటానికి కారణం తన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించ లేకపోవటమే. ఇక్కడ ఇంగితమంటే వివేకమని అర్థం. చాల సహజమైన ఈ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పండితులు, జ్ఞానసంపన్నులు వారి శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని, సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎలా మట్టిపాలు చేసుకుంటారో చెపుతుందీ ఉదాహరణ.
నిస్సందేహంగా జ్ఞానమే ఆధిక్యమైనది, గొప్పది, విలువైనది. ఈ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక నియంత్రణాశక్తిగా ఈ ఇంగితం పనిచేయాలి. రివాల్వరు ఉపయోగించగలగటం జ్ఞానం. అయితే, దానిని ఆ సందర్భంలో వాడవలసిన అవసరం ఉందా లేదా అనే సంగతిని మనకు బోధపరచే గొప్ప వజ్జ ఈ ఇంగితం.
ఇంగితమంటే తార్కికత, విచక్షణ, భావోద్వేగాలపై ఒక పట్టు. ఇంగితమంటే మన శక్తియుక్తుల్ని అవసరమైన చోట, తప్పనిసరైన క్షణాన మాత్రమే ఉపయోగించేటట్టు మనల్ని సమాయత్తం చేసే ఒక నిబద్ధత, ఒక అదుపు. అలా కానివేళలలో అది పిచుక మీద బ్రహ్మాస్త్రమే అవుతుంది.
ఒక పండితుడు గణితంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. విశేషమైన ప్రజ్ఞతో గణితానికి చెందిన ఏ లెక్కనైనా, సమస్యనైనా పరిష్కరించసాగాడు. తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతటి మేధావి లేడని ఖ్యాతి పొందాడు. పేరు, డబ్బు వచ్చింది. ప్రజలు, ఇంత గణితశాస్త్ర పండితులు ఆయన ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యానుభూతికి లోనై ఆయనకు నీరాజ నాలిచ్చి సత్కారాలు, సన్మానాలు చేసారు. గణితంలో తనకన్నా ప్రజ్ఞావంతుడు లేడనే అహంకారం ప్రవేశించింది అతనిలో.
గర్వం తారస్థాయికి చేరుకొని ‘నాతో పోటీపడగలవారెవరైనా ఉన్నారా మీ గ్రామంలో?’ అని సవాలు విసరి, తలపడినవారిని ఓడించి, దూషించి అవమానించసాగాడు. ఒకసారి ఒక సాయంసంధ్య వేళలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయాన ఒక పశువుల కాపరి కలిసాడు. ఆ చదువురానివాడితోనూ తన గొప్పతనాన్ని గురించి అతిగా చెపుతూ వెళుతున్నాడు. ఒకచోట ఆ కాపరి తటాలున కిందకు వంగి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ‘అయ్యా, కొంచెం ఇదెంతో లెక్కించి చెప్పగలరా?’ అని ఆ గణితశాస్త్ర పండితుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకాపండితుడి నోటివెంట ఒక క్షణం మాట రాలేదు. ఆలోచన స్తంభించి పోయింది. చివరకు ఆ ఇసుకను లెక్కించలేమన్నాడు.
దానికా పశువులు కాపరి ‘సామీ! దీనిని గుప్పెడని కదా అంటారు. ఐదు వేళ్ళు దగ్గరకు చేర్చి తీసుకుంటే చారెడు, రెండు అరచేతులతో తీసుకుంటే దోసెడు, బొటనవేలికి, చూపుడువేలికి మధ్య తీసుకుంటే చిటికెడని కదా అంటారు’ అన్నాడు. అంతే ఆ పండితుడికి తన తప్పు తెలిసింది. మామూలు పద్ధతిలోనే ఆ ఇసుకను లెక్కించే యత్నం చేయటం వల్ల సమాధానం చెప్పలేకపోయానని. సహజసిద్ధమైన ఇంగితజ్ఞానాన్ని తను చూపలేకపోయానని అర్థం చేసుకుని తన అహంకారానికి సిగ్గుపడి అతడికి నమస్కరించి ఇంటిముఖం పట్టాడు. నిజానికి ఆ నిరక్షరాస్యుడు పండితుడికి ఏ విషయంలో పోటీనే కాదు.
కాని అతడు పండితుణ్ణి ప్రశ్నించటానికి కారణం అతడి ఇంగితమే. దీనినే మరో కోణం నుండి చూస్తే ఆ పండితుడి గర్వానికి, అనుచిత ప్రవర్తనకు ఆ పశువుల కాపరి ప్రశ్న నిరోధకం. అంతేకాదు. సహజ సిద్ధమైన ఇంగితానికి.. జీవితపరిశీలన, అన్వయం, సందర్భాచిత ఆకళింపు జత కూడితే అది విశేషమైన ప్రజ్ఞ. ఏ పుస్తకాలలో చెప్పని ఏ గురువు నేర్పని విద్య ఇది. ఇంగితమనే పుస్తకంలో జీవితానుభావాలే పుటలు, అధ్యాపకులు.
మనలో సహజంగా ఉండే ఏ అద్భుత శక్తి, మన జీవిత మార్గదర్శి. విద్య వల్ల మరింతగా పదునెక్కాలి. అపుడే మరింతగా ప్రకాశిస్తుంది. ఇంగితమంటే లోకజ్ఞానం. ఇది మన నిత్య వ్యవహారాల నిర్వహణలో సహాయపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇంగితం మనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. ఇంగితం మన ‘వివేచనా నేత్రం’ ఇన్ని ఉదాహరణలవల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? ఇంగితమంటే ఒకసహజమైన తెలివిడి, లోతైన పరిశీలన, బుద్ధికి, మనస్సుకి గోచరమయ్యే ఒక అద్భుత అవగాహన. చదువుకున్న వారిలో ఉండేవి, ఉండవలసిన లక్షణాలు ఇవే కదూ!
శాస్త్రపరమైన జ్ఞానం అక్షరాస్యులదైతే, నిరక్షరాస్యులది పరిశీలనా గతమైనది. ఇంగితం జ్ఞానమే. అది సహజాతమైనది అన్నారు పెద్దలు.
–బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు
Comments
Please login to add a commentAdd a comment