జ్ఞానం అందరికీ సమానమే | everyone same to Wisdom | Sakshi
Sakshi News home page

జ్ఞానం అందరికీ సమానమే

Published Sat, Oct 28 2017 11:34 PM | Last Updated on Sat, Oct 28 2017 11:34 PM

   everyone same to Wisdom

ఆచార్య మాడభూషి శ్రీధర్‌
ఆ కోలాహలం గందరగోళం విన్న గోష్టీపూర్ణుల వారు ఏం జరిగిందని అడిగారు. శిష్యులు జరిగింది వివరించారు. ఆశ్చర్యపోయారాముని. తనకు మాట ఇచ్చిన మరుక్షణంలో భంగం చేయడమా? ఈ వ్యక్తినా నేను శిష్యుడని నమ్మింది? ఈ రామానుజుడి గురించేనా శ్రీరంగనాథ పెరుమాళ్, కాంచీ పూర్ణులు చెప్పింది? నేనే అపరాధం చేశానా?  ...ఏం జరిగింది? రంగ రంగా ఎంత పని జరిగింది?
రామానుజుడిని పిలిపించమన్నారు. ...

తమిళనాడులోని మదురైకి 70 కి.మీదూరంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయగ్రామం. హిరణ్యకశిపుడు లోక కంటకుడై అందరినీ బాధిస్తుంటే హిరణ్య కశిపుడు రాలేని చోటేది అని బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు, సప్తరుషులు ఆలోచించారు. అది తిరుగోష్ఠియూర్‌ అని తెలిసి అక్కడ సమావేశమై రాక్షసుడి అంతానికి మార్గాలను వెదికారు. గోష్ఠి అంటే సమావేశం. దేవతలు సమావేశమైన ఊరు కనుక ఈ గ్రామానికి తిరుకోష్టియూర్‌ అనే పేరు వచ్చింది. ఇక్కడ సౌమ్య నారాయణుని కోవెల ఉంది. 108 వైష్ణవ దివ్యదేశాలలో ఇది కీలకమైనది.  రామానుజులతో ఈ ఊరికి అవినాభావ సంబంధం ఉంది. గోష్ఠీపూర్ణుల వారి తిరుమంత్రోపదేశం కోసం 18 సార్లు శ్రీరంగం నుంచి ఇక్కడికి కాలినడకన వచ్చి భక్తి శ్రద్ధలతో సాధించిన అష్టాక్షరి ‘‘ఓం నమో నారాయణాయ’’ తిరుమంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ చెప్పిన అద్భుత సంఘటన తిరుగోష్ఠియూర్‌ లో జరిగింది. జగద్గురువు రామానుజుని జీవనంలో అది పతాక సన్నివేశం. కనుక రామానుజ మార్గం దీనితో ప్రారంభమైంది.

గాలి వెలుతురు వలె జ్ఞానం కూడా అందరికీ సమానమే రామానుజుని బహిరంగ తిరుమంత్రోపదేశంతో తిరుగోష్ఠియూర్‌ ఊరు ఊరంతా ఉర్రూతలూగుతున్నది. ఆయనకు ఎంతో కష్టపడితే దొరికిన మంత్రం మనకు ఇంత సులభంగా అందించారు. ఆయన ఎంతటి మహానుభావుడు. గురువుగారు ఏమంటారో ఏమో అని ఆందోళితులవుతున్న జనమూ ఉన్నారు. తనకిచ్చిన మాట తప్పి విచక్షణారహితంగా అందరికీ రహస్యమంత్రోపదేశం చేయడం ఎంత అన్యాయం అంటూ ఆచార్యులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అర్హులకు, యోగ్యులకు మాత్రమే ఉపదేశించవలసిన మంత్రాన్ని మంత్రార్థాలని విచక్షణారహితంగా అందరికీ గోపురం ఎక్కి చెప్పడమా, తనకిచ్చిన మాట తప్పడమా? ఇంత పరీక్షంచి, మెచ్చి, ఇంతగా నమ్మి దివ్యమంత్రోపదేశం చేసినందుకు ఇదా ఫలితం? అని పరిపరివిధాల ఆలోచిస్తున్నారు. ఆగ్రహోదగ్రులైన గోష్టీపూర్ణుల ముందు అడియేన్‌ అంటూ పాదాభివందనం చేసి చేతులుకట్టుకుని తలవంచుకుని వినయంగా నిలుచున్నాడు రామానుజుడు.

తీవ్రమైన ఆవేశాన్ని అణచుకునే ప్రయత్నం చేస్తూ....‘ఏమిటిది రామానుజా, నాకు మాట ఇచ్చి తప్పుతావా? ఆచార్యుని ఆదేశాన్నే ధిక్కరిస్తావా, ఇదేనా నీ గురుభక్తి, ప్రతిజ్ఞను భంగపరుస్తావా? గురువంటే, అపురూపమైన విద్యంటే అంత నిర్లక్ష్యమా, గురువుకు ఇంత అవమానమా?’ అని గురువు ప్రశ్నించారు.‘మిమ్మల్ని అవమానించే ఉద్దేశం ఏ కోశానా లేదు ఆచార్యా, మీ ద్వారా వ్యక్తమయిన ఈ మహామంత్రం అందరికీ చెందాలని, తద్వారా ఈ మంత్ర ప్రాధాన్యత, ముక్తిసాధనా అందరికీ అర్థమై మీ గౌరవం, గొప్పదనం ప్రపంచ ప్రసిధ్ధం కావాలనే నా లక్ష్యం, ఆ పుణ్యం మీకే చెందాలని నా సంకల్పం, కాని మీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లజేయడం కానే కాదు ఆచార్యా’.‘అయితే అవిధేయత సంగతేమిటి. ప్రతిజ్ఞా ఉల్లంఘనకు శిక్ష నీవెరుగవా. ఈ వాగ్దాన భంగానికి నీవు అనుభవించే శిక్ష ఏమిటో మరిచిపోయావా రామానుజా...’‘లేదు. మీ వంటి పవిత్ర మూర్తుల ఆజ్ఞను ధిక్కరించిన నేను నరకానికి పోవడం తథ్యం అని తెలుసు గురువర్యా..’

‘అయితే తెలిసే ఇంత నేరం చేశావన్నమాట.’ ‘దయచేసి నావినతి నిదానంగా వినండి. నేను అపరాధం చేసిన మాట నిజమే. మాట తప్పిందీ నిజమే. కాని మీ మాట మీద గౌరవం లేక కాదు. నేనింత కష్టపడి మీ దయతో ప్రాప్తమైన దివ్యమంత్రాన్ని, మంత్రార్థాన్ని నా ఒక్కడికోసమే వినియోగిస్తే అంతకన్నా స్వార్థం మరొకటి ఉంటుందా, ఈ మంత్రాన్ని కేవలం నాకే పరిమితం చేసుకుంటే ఆ అపురూపమైన మంత్రానికీ, ఉపదేశం చేసిన మీ ఆచార్యత్వానికే అవమానం అవుతుందనుకున్నాను. దీనులందరినీ కరుణించి మోక్షమార్గానికి వారినందరినీ మళ్లించే ఈ మంత్రాన్ని నా ఒక్కడికే కాకుండా లోకానికే అంకితం చేయాలనే అనుకున్నాను. ఆచార్యవర్యా...నేను చేసిన ఈ వాగ్దాన భంగానికి నరకానికి వెళ్తాను, సరే. నేనొక్కడినే కదా స్వామీ నరకానికి వెళ్లేది..... ఇంతమంది భక్తులు తిరుమంత్రార్థ సాధనంతో ముక్తిమార్గంలో పరమాత్ముడిని చేరగలిగితే, అంతకన్నా కావలసిందేమిటి, నేనొక్కడిని నరకంలో ఉంటే మాత్రం నష్టమేమిటి స్వామీ...పోనీయండి నన్ను నరకానికే పోనీయండి’ అని  రామానుజులు దీనంగా వివరించారు.

నల్లని మబ్బులు గుమికూడి మెరుపులు పిడుగులు కురుస్తూ, ఆకాశం భయంకరంగా ప్రతిధ్వనిస్తూ ఉంటే భయవిచలితులైన జనం అంతలోనే గాలి వీచి మబ్బులు తొలగిపోయి, సన్ననిజల్లులు కురిపించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడితే ఎంత సంతోషించినట్టే, రామానుజుని మృదుమధురమైన సంభాషణం, అందులో çసహృదయ సంభావనం అక్కడ వాతావరణాన్ని సానుకూలంగా మార్చివేసింది.
ఆగ్రహం ఆశ్చర్యంగా మారిపోతూ ఉంటే గోష్టీపూర్ణుడు ‘‘ ఇదెంత ఉదాత్త భావన. ఇందాకా పెద్దలెవరికీ తోచనే లేదే. నా మనసులోనూ ఎన్నడూ ఇంతటి సద్భావనే ఉదయించలేదే. తన ముక్తిని సైతం త్యాగం చేసి, నరకం వచ్చినా సరే అనుకుని, అందరి ముక్తికోసం ఆలోచించిన ఈ రామానుజుడెంత ఉత్తముడు, ఎంతటి విశాల హృదయుడు, ఎంత దయామయుడు.

కరుణామ యుడైన పరమాత్ముడు మాత్రమే ఇంతటి ప్రేమను కురిపిస్తాడు. వర్షం వలె, సూర్యరశ్మివలె అన్నీ అందరివనీ, భగవంతుడి కరుణ, ఆచార్యాను గ్రహం, భక్తి మార్గం, ముక్తి మార్గం కూడా అందరికీ సమానంగా పంచాలనే ఈ ఆలోచన ఎంత సముచితమయినది... ఇదే కదా సమానత, సమత అంటే... ఈ రామానుజుడి సమతా సంకల్పం, నవీన వైష్ణవ సిద్ధాంతం ఎంత గొప్పది. ఇది సమతా మతం, సమానతా మతం.. సమన్వయతా మతం. సన్మతం, సతతం నిలిచే మతం. కొంతసేపు ఆచార్యుని నోట మాట బయటకు రావడంలేదు. ఆలోచిస్తూ రామానుజుని తిర్ముఖమండలాన్ని(శ్రీ ముఖ మండలం) అలా చూస్తూ ఉండిపోయారు. మనసు కరిగింది. కోపం తరిగిపోయింది. ఆ స్థానంలో నెమ్మదిగా అభిమానం, ఆప్యాయత చోటుచేసుకుంటున్నాయి.

ఎంబెరుమానార్‌
ఆచార్యుని చూపుల్లో కరుగుతున్న ఆయన మనసు గోచరించింది. ఆ కంటితడిలో కొత్త వెలుగు కనిపించింది. గోïష్టీపూర్ణుల కోపం ఆశ్చర్యంగా మారింది, నెమ్మదిగా ఆశీస్సుగా పరిణమించింది. రామానుజుడి అపారమైన కరుణలో ఆయనకు కరుణామయుడైన భగవంతుడి సాక్షాత్కారం లభించింది. ఈ రామానుజుడే భగవంతుడా... నాకూ భగవంతుడా, నా భగవంతుడు రామానుజుడేనా అనుకుంటూ అదే మాట పైకి అన్నారు గోష్టీపూర్ణుల వారు. ఎంబెరుమానార్‌ (=నాపాలి భగవంతుడా) అని పిలిచారు. రామానుజుడికి అర్థం కాలేదు. అయినా గురువు చేతులుసాచి పిలుస్తుంటే వెళ్లారు, ఆయన ఆలింగనం చేసుకున్నారు. కరుణించారని అర్థమయింది. శిష్యగాత్ర పరిష్వంగ సుఖం అనుభవిస్తున్నారు గురువుగారు. ఆచార్యులు కరుణించినందుకు శిష్యుని కళ్లు ఆనందబాష్పాలు వర్షిస్తున్నాయి.

‘‘నీవన్నదీ నిజమే రామానుజా. ఈ విద్య అందరిదీ, వర్షం వలె, సూర్యరశ్మివలె, చల్లదనం వలె, వెన్నెల వలె, భగవంతుని కరుణ అందరిది, మంత్రం అందరిది, ముక్తి మనందరిదీ, నారాయణుడు దీనజనపరాయణుడు, భక్తజనాధీనుడు, జనార్దనుడు. నీ ఆలోచన సామాన్యమైంది కాదు. నీవే నా భగవంతుడివి, ఎంబెరుమానార్‌’’. రామానుజుడి నోటి వెంట మాట రావడం లేదు. గురువుపట్ల కృతజ్ఞతాబద్ధుడైనాడు. ధన్యోస్మి అనుకున్నాడు. శిష్య వాత్సల్యం తో గురువుగారు మళ్లీ తన గుడిసెలోకి కొని పోయి, ఇంకా ఎన్నెన్నో నిగూఢమైన అర్థాలు సాదరంగా వివరించారు. నారాయణ స్వరూపాన్ని అష్టాక్షరీ మంత్ర వైభవాన్ని విశదం చేశారు. ‘‘నీ భక్తి మార్గాన్ని ప్రపంచమంతా చాటు. జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమైనదనీ, పామరులు కూడా భక్తి తో పరమాత్ముడిని చేరవచ్చుననే నీ మార్గం రామానుజ మార్గమై, రామానుజ మతమై వర్థిల్లుగాక’’ ‘‘రామానుజార్యదివ్యాజ్ఞాం వర్థతా అభివర్థతాం’’ అని ఆశీర్వదించారు. ‘మళ్లీ ఒకసారి రా నాయనా, అప్పుడు నీకు అపురూపమైన ద్వయం మంత్రాన్ని, ఆ మంత్ర విశేషార్థాలను వివరిస్తాను. వెళ్లు నాయనా ఇక నీ వైష్ణవ జైత్రయాత్ర ప్రారంభించు’.  అని గురువు ఆదేశించారు.

అడియేన్‌ అంటూ పదేపదే పాదాభివందనం చేసి రామానుజుడు పరమానంద హృదయారవిందుడై శ్రీరంగానికి మళ్లాడు..ఊరు ఊరంతా కొత్తగా లభించిన జగద్గురువును, ఆయన గురువును ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే. తిరుగోష్టియూర్‌ దాటే దాకా దారిపొడుగునా పాదాభివందనాలే. భక్తి విశ్వాసాలతో పరమాత్ముడి దరిచేరే గొప్ప జ్ఞానాన్ని అందుకోవడానికి 18 యాత్రల పాటు సాగిన దీక్షకు, పట్టుదలకు చరిత్రలో మరెక్కడా లభించని ఉదాహరణ.రామానుజుడి ఉదాహరణతో పోల్చితే గజనీ మహ్మద్‌ 18 సార్లు భారతదేశంపై దాడిచేసిన సంఘటనను పట్టుదలకు ఉదాహరణగా చెప్పుకోవడం సమంజసం కాదు. ఒక జాతిని ధ్వంసం చేయడానికి కుట్రలు కూహకాలతో సాగిన దాడులెక్కడ, జ్ఞానం కోసం వినయంగా విశ్వాసంతో సాగే కృషి ఎక్కడ? ఇటువంటి గురుశిష్యులు ఎక్కడ మనకు కనిపిస్తారు? అహంకారానికి తావివ్వకుండా, శిష్యుడి ఉదాత్త భావనలను అర్థం చేసుకోవడం, ప్రశంసించడం, చివరకు నీవే నాదైవానివి అనేంత విశాల హృదయుడు ఆచార్యుడు.

అర్హతా పరీక్ష అవసరం అంటూనే రామానుజుడి వంటి ఆచార్యుడు జగదాచార్యుడు అవుతాడన్న భవిష్యద్దర్శనం చేసిన గోష్టీపూర్ణులకు సాటి ఎవరు? 18 ప్రయాణాలు విసుగు లేకుండా ప్రతిజ్ఞాభంగానికి భయపడకుండా మోసం చేయకుండా, వినయం కోల్పోకుండా గురువుగారి మన్ననలు పొందిన శిష్యుడు మనకెక్కడ తారసిల్లుతాడు?అందుకే రామానుజుడు సంస్కర్త, జ్ఞానం అందరిదని ప్రకటించి ఊరుకోకుండా అందరికీ తెలియజేయాలని జీవితం అంకితం చేసిన గురువు. జాతిమతకుల భేదాలు లేకుండా అందరికీ ఆలయసమీపంలోని కూటములలో మధ్యాహ్న భోజనం ఇవ్వాలనే ఆలోచనను మొదట అమలుచేసిన వాడు రామానుజుడు.

ఇస్లాం మతవాదులైన ముస్లింరాజులు కొల్లగొట్టిన హిందూ దేవతా మూర్తులను తన వాక్చాతుర్యంతో, వాదనా పటిమతో, సంప్రదింపుల నైపుణ్యంతో మర్యాదగా మాట్లాడి వారిని ఒప్పించి వందలాది దేవతా విగ్రహాలను మళ్లీ ఆయా దేవాలయాల్లో ప్రతిష్ఠించిన రామానుజుడు గోష్టీ సమరాంగణ సార్వభౌముడు, అహింసా వాది, సంవాదం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చుననే సూత్రాన్ని ఈ నాడు ప్రపంచం బోధిస్తున్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానానికి తొలి కర్త కర్మ క్రియ రామానుజుడే. గాంధీ అహింసా సిద్ధాంతాన్ని వెయ్యేళ్ల కిందటే ఆచరించి చూపిన మార్గదర్శి. ఊళ్లో చెరువులుండాలని అవి అందరికీ నీరివ్వాలని ఎవ్వరినీ నిరాకరించకూడదని నియమాలు పెట్టిన జగద్గురువు కూడా రామానుజుడే. తొండనూరులో ఆయన తవ్వించిన చెరువు వెయ్యేళ్లనుంచి నీళ్లిస్తూనే ఉన్నది. మేల్కోటే తిరునారాయణ పురం ఆలయంలో ప్రవేశించడానికి మాకెందుకు అర్హత లేదని అక్కడి హరిజన గిరిజనులు అడిగితే అప్పుడే రండి అని ఆలయంలోకి తీసుకువెళ్లిన మహానుభావుడు రామానుజుడు.

108 వైష్ణవ దివ్యదేశాలలో శ్రీరంగం తలమానికమైనది. ఎనిమిది నారాయణ స్వయం వ్యక్త క్షేత్రాలలో ఇది ముఖ్యమైనది. శ్రీ వైష్ణవమతానికి ఇది రాజధాని వంటిది. తిరువరంగ తిరుపతి, పెరియకోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపం అని కూడా శ్రీరంగాన్ని పిలుస్తారు. 156 ఎకరాలలో కోటగోడల వంటి ఏడు ప్రాకారాలతో 21 సమున్నత గోపురాలతో సువిశాలమైన ఒక నగరాన్ని తలపించే ఆలయం ఇది. ఒక్కొక్క ప్రాకారంలో జన జీవనం వర్గీకరించబడి ఉంది. ఉభయ కావేరీ నదుల మధ్య ద్వీపంలో 156 ఎకరాలలో విస్తరించిన శ్రీరంగం భూలోక వైకుంఠం. వాల్మీకి రామాయణం, పద్మ మత్స్య పురాణాలలో శ్రీరంగం ప్రస్తావన ఉంది. సభామండపంలో కొలువుదీరినాడు కనుక రంగనాథుడు. 21 గోపురాలు, 9 పుణ్యతీర్థాలు ఉన్నాయి. చంద్ర పుష్కరిణి ఆలయం మధ్యలో ఉంటే 8 పుష్కరిణులు 8 దిక్కులలో ఉన్నాయి. సప్తప్రాకారాలు ఏడు ఊర్థ్వలోకాలకు సంకేతాలు. శ్రీరంగం త్రిచి సమీపంలో ఉంది. త్రిశిరుడి వల్ల తిరుచ్చి త్రిచి అనే పేరు వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement