ఈ వారం కథ: నల్లకోడి-తెల్లదెయ్యం | story Of This week | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: నల్లకోడి-తెల్లదెయ్యం

Published Sun, Jan 19 2025 1:32 PM | Last Updated on Sun, Jan 19 2025 1:32 PM

 story Of This week

‘ఓబ్బీ! లేయ్‌ నాయన.. నా తండ్రివి గదూ! నా రత్నం గాదూ! మన ఇంటికి రాక రాక ఇన్ని దినాలకు అబ్బొచ్చినాడు. పాపం.. మనం బాగా మర్యాద జేసి పంపొల కదా? కోడ్ని అలల జేయించుకుని రావాల, మీ నాయన జూస్తే టైంకి ఊర్లో లేకపాయ. కిస్టపాడు పోవాలా.. లెయ్‌ నాయనా.’మాయమ్మ చెవిలో జోరీగ మాదిరి నస పెట్టేది వింటా తట్టుకోలేక దుప్పటి కాళ్ళ కిందునుంటి ఇరికిచ్చి తలవెనక్కి బిర్రుగా తోసి ముదరజుట్టుకుని పడుకున్నా.అహా! అసలుకి ఈ రగ్గు మా నాయన నెల్లూరు పోయినపుడు తెచ్చివుండాడు. నాతో అబద్ధం జెప్పి వుంటాడు. మా ఇటుకల బట్టి అంటించినాక ఆకాశంకేసి పై పైకి లేస్తాపోయే పొగతోబాటు గాల్లోకి ఎగిరి అట్టనేబోయ్‌ మబ్బులు తెంపి ఇట్టా తెచ్చినట్టు ఎంత హాయిగా, ఎంత మెత్తగా వుంటాదో ఈ  దుప్పటి.

దీన్ని తెచ్చిన పొద్దు జూడాల మాయమ్మ బేసిన భరతనాటికం, ఈ లేత నీలం రంగు చూసి మా నాయన మీదకి పూనకమొచ్చిన మాదిరి వూగింది. ఈ రంగు బేన్నే మాసిపోద్దనీ, ఇంత లావు రగ్గుని ఉతికేటాలకు నడుము, చేతులు పడి పోతాయని వాపసు ఇచ్చి రమ్మనింది. నేనే నాకు నచ్చిందని మాయమ్మని కాళ్ళా, వేళ్ళా పడి బతిమాలి వున్నించుకున్నా. ఉతికేతపుడు నేను సాయంగూడా జేస్తానన్నా. అట్టా దీన్ని దక్కించుకున్న.ఇది కప్పుకుంటే పానం గాల్లో తేలుతాపోతాన్నెట్టు ఉంటాది.కాకుంటే ఒకటే .. మా అమ్మ నా తాలాపు దిక్కున మంచంకోడుకు ఆనుకుని కుచ్చిని నన్ను లేపుతావుంటే సూసే అమ్మలక్కలు తోడై, రాగాలు పెడతారేమోనన్న ఆలోచన మనసులోకి రాంగానే భయమేసి గబుక్కుని లేస్తి.

‘మా! ఏంది మా? సంకురాత్రి సెలవులిచ్చినాక, ఈ మాద్దిరి ఎండపొద్దు దాకా పొండుకోవాలని కలలుగంటి. తలాపున కుచ్చోని ఈమైన ‘ఓ..’ అని రాగాలు పెడతావుండావు. ఏం? కిట్టపాడు దాకా ఏంటికి? నాలుగీదులవుతలనే ‘ఈసోబు’ మామ వుండ్లా్య. ఎప్పుడూ ఆయనే  సేసిస్తాడుగదా అలల’ అంటి విసుగ్గా. ‘ఏంటికి నాయన ఇంత చిరాకు నీకు? పొద్దున్నే పాలకోసం ఈసోబు మామ చిన్న బిడ్డవుండ్లా? అదే ఆయమ్మి గౌసియా వచ్చింటే నేను ముందే ఎచ్చరిస్తి. మీ నాయన వుండాడా అమ్ములు? కోడిని తెస్తా అలల జేపిచ్చాడేమో’ అని అడిగితి. దానికి ఆయమ్మి..‘లేడత్తోవ్‌! నిన్ననే మా మున్ని అక్కను అత్తగారింటి నుండి మనింటికి కాన్పు కోసమని తోడకరావాలని ఊరికి పోయినాడు’ అని చెప్పింది రా’ అంది మాయమ్మ.

‘గౌసియా వచ్చిందా?’ అంటి టక్కున ఆత్రం ఆపుకోలేక. మళ్ళా మాయమ్మ ఏమనుకుంటుందో అని ఉత్తుత్తి ఆవలింతలు దీస్తా మెరిసిన ఆనందపు కళ్లను నులుపుకుంటానట్లు అరచేతులను అడ్డుబెట్టుకుని ‘చా! భలే ఛాన్సు పాయ’ అని మనసులో అనుకున్నా. ఆయమ్మి నాదిక్కు జూసినపుడు నవ్వే నవ్వంటే నాకు శానా శానా ఇష్టం. కానీ ఆయమ్మి ఇంత పొద్దన్నే వచ్చుద్దని అసలు అనుకోలా నేను.
‘బిరాన పోయిరాపో నాయనా! నెను పప్పు నానబెట్టిన, నువ్వచ్చేలోపు గారెల పిండి రుబ్బేసి. తెల్లబాయలు వొలిసి మసాలా నూరి పెడతా! నువ్వొచ్చినాక కోడి కూర పులుసుజేసి వేడి వేడిగా నాలుగు గారెలు జేసిపెడతాను. మా నాయన కదూ! పోయ్రాపో బంగారూ’ అంటా మాటలతో ఊరిచ్చే మాయమ్మ.

సరేని ఉదరాబదరా పండ్లు తోమి, మాయమ్మ ఇచ్చిన పెద్ద గలసానిండాకు ఉడుకుడుకు పాలు తాగినాక.. నేను, మాయమ్మ ఇద్దరం కలిసి కోళ్ల గూటిలో తారాడి తారాడీ గుడ్లకు వచ్చిన నల్ల కోడిని ఒకదాన్ని చూసి ఒడుపుగా పట్టుకుంటిమి. మాయమ్మ దాని కాళ్ళు రెండు పురికొసతో ముడేసిస్తే చెయ్‌ సంచిలో కుక్కి, జేబులో రూపాయి పెట్టుకొని దావ పట్టిన.మా ఊరికి కిస్టపాడు రెండు కిలోమీటర్ల దూరం. బస్సులు ఎపుడో ఒకటి తప్ప రావు. అందుకే అందరూ సైకిళ్ల మీదనో, నడుచుకునో పొయ్యేవాళ్లు. పొయ్యేటపుడు డబుల్స్‌ లేని సైకిల్‌ జూసి చెయ్‌ చాపి ఎక్కి, సరాసరి మా నాయన దగ్గర పనిజేసే మస్తానోళ్ళ ఇంటికి బోతి. ఈడకు ఎప్పుడు వచ్చినా యజమాని కొడుకు హోదా ఇస్తారు వీళ్లు. ఒకదిక్కు మస్తాన్‌ మామ కోడిని అలాల్‌ జేసేదానికి తీసుకొనిబోతే, నేను ఆయప్ప భార్య ఇచ్చిన కారం చుట్టలు తింటా కూసున్న.

‘నాయన లేడు కదా అబ్బయ్యా! నేనే కోడిని కాల్చి కొట్టిస్తాగానీ రోసేపు అట్ట మంచంలోనే కూకో’ అనే. సరే అని కుచ్చుంటి నేను. అంతలోనే ఆయమ్మ లోటాతో బానలోని చల్లటి నీళ్లు తెచ్చిచ్చే. తాగి చొక్కాతో మూతి తుడుచుకుని లేచేతరికి, ముక్కలుగా కొట్టిన కోడి మాంసంను స్టీల్‌ టిఫను డబ్బాలో బెట్టిస్తా ‘టిపను డబ్బా రేప్పొద్దున వచ్చినప్పుడు తెచ్చుకుంటాలే గానీ నువ్‌ భద్రంగా పోయిరా చిన్నోడ’ అనే.నేను టిఫను డబ్బా పట్టుకుని ఊపుకుంటా, గారెల రుచి ఊహించుకుంటా పాటలు పాడుకుంటా, ఎవురన్న సైకిల్‌ మీద వస్తాండారేమో అని యనకమాలకి తిరిగి తిరిగి సూసుకుంటా నడుస్తావుండా.

 మా ఊరినింటి కిష్టపాడు మధ్యలో ఒక లోతువంక దారి ఉంటాది. వంకకు ఒక పక్క చింతమానుల కిందున్న సమాధులు నన్ను ఎప్పుడూ భయపెట్టేదానికే జూస్తాయి. పొయ్యేతపుడు సైకిల్‌ మీద ఆ దిక్కు తిరిగి కూర్చుని పోయినా కాబట్టి కనపడలేదేమో గాని ఈ మధ్య కొత్తగా కట్టినట్టువుండారు ఓ సమాధిని. కట్టింది చాలదని దాని మీద సిమెంట్తో ఒక మనిషి ఆకారం కూర్చున్నట్టుగా కూడా చెక్కినారు. ఎర్రంచు పంచా, తెల్లటి చొక్కా, నల్లంగా గుబురు మీసాలు, చేతికర్రా.. అచ్చం మనిషి కూర్చున్నట్టే వుంది. నాకు గుండె దడ దడ మనే. 

అంతలో ఎవరో నా పేరు పిలిచినట్టు అనిపించింది. ఇంగ నా భయం జూడాల. అప్పటిదంకా పాడిన శిరంజీవి పాట ఆపేసి ‘అనుమంతుడి’ దండకం ఎత్తుకుంటి నేను. అయినా కూడా గుండెలో దడకేమో ఎండ ఎక్కువ లేకున్నా చెమటపడతానే వుంది. పొద్దున తాగిన పాలు ఆవిరైపాయ, తిన్న కారం సుట్టలు అరిగిపాయ, గబ గబా నడిసి వంకపైకి వచ్చేసి ఊపిరి తీసుకున్నాను. ఎదురుమల్లె దూరంగా మా ఊరు కనపడి హమ్మయ్య అని ఇంగ ధైర్యం తెచ్చుకుంటి. రోన్ని నీళ్లు తాగితే బాగుండు అని నాలిక పిడసగట్టినట్టు అనిపిస్తంది.

అంతలో ‘ఓఓ..బ్బీ’ అని ఎవరో పిలిసిన పిలుపు మళ్ళా వినపడి యనక్కి తిరిగి జూస్తి. వంక లోతట్టులో తెల్లగుడ్డ కదులుతున్నట్టు, నడుస్తాన్నట్టు కనపడి వెన్నులో పదురు లేసింది. ‘ఓఓబ్బీ.. నువ్‌ రత్నం గాదూ.. ఆడనే వుండు నే వస్తన్న’ అంటా మల్లోసారి కేకేసింది ఆ ఆకారం. ఆమెను ఇంతకు ముందు చూసిన గాపకం లేదు. అసలు తలంతా తెల్ల గుడ్డలాంటిది చుట్టుకుంది మొహం కానరాకుండా. దానికి తోడు తెల్ల చీర కట్టుకుంది.నాకు కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. ‘ఒరా! దయ్యాలకు మన గురించి తెలుసుకోవడం శానా వీజీ అంటరా. అవిగాన తలచుకుంటే మన పేరే గాదు, తరగతిలో మనం యా సెక్షనో గూడా తెలిసిపోతాయంటరా. వాటికీ.. తెల్లచీరలన్నా, నల్ల కోళ్లన్నా, చింత మానులన్నా  శానా ఇష్టమంటా మా అబ్బ జెప్పినాడ’ని కళ్ళు గోళికాయలంత జేసుకుని చెప్పిన మా రమణగాడు గుర్తొచ్చాడు.

అంతలో ఆ ఆకారం నవ్వుతా ‘ఏందో టిపన్‌ డబ్బాలో కొండబోతండవే. సియ్యలేనా? అయితే బువ్వదినేకి నేనూ వస్తా వుండు నీతోబాటు మీ ఇంటికి’ అని తుపుక్కున నేల మీద ఉమ్మింది తార్రోడ్డు మీద ఎర్రగా నెత్తురు మాదిరి..  ‘ఉండబ్బీ’ అంటా తలెత్తి నా దిక్కు జూస్తా ముందుకు నడుస్తా వస్తంది. నాకు ఏం జేయాలో తెలియక చేతులు, కాళ్ళు ఆడట్లేదు. ఆమె ఆగి నెత్తిమీద నుండి∙జారిపోతున్న తెల్లగుడ్డ సరి జేసుకుంటా ఉంటే, నేను ఇదే ఛాన్సని ఇంగ దొమ్మల నిండాకు ఊపిరి దీసుకొని పరుగు అందుకున్నా.అట్టా పరిగెత్తిన నాకు వాకిట్లో వాల్చిన నులకమంచంలో బడి మా యమ్మను వాటేసుకున్నది మాత్రమే గ్యాపకం. ఇంగ ఆ పడుకోడం పడుకోడమే పట్టుకుంది అల్లుజ్వరం. వారమయినా తగ్గలేదు.

ఓనాడు నేను పొద్దున్నే పాలు, బన్ను తిని జొరం మాత్తరేసుకుని ముదరజుట్టుకుని ముడుసుకుని పడుకునివున్నా. మా అమ్మ నా ఎదురుగా కుచ్చుని రాగులు ఇసురుకుంటా వున్నపుడు వచ్చింది గౌసియా వాళ్ళమ్మ.‘వదినా సేమిరికి రొంత పెరుగు కావాలా’ అంటా అడుగుతా మంచంలో పొడుకున్న నన్ను జుసిందేమో ‘ఏం పిల్లకాయ వదినా! మీ రత్నమయ్య? ఆ మధ్య ఊరినింటి మా అమ్మ వస్తా వుంటే ఈ యబ్బి కనపడినాడంటా. ఎదో మాట్లాడతా తోడుగా పోవచ్చులే అని పిలిస్తే ఉలుకూపలుకూ లేదంటా, ఆకేసుకుంటా నిలబడి ‘ఏంది టిపనులో సియ్యలా నేనూ వస్తా’ అని నవ్వాతా అనిందో లేదో ఆ మయిన ఒకటే పరుగులెత్తి పోయినాడంట. నిజంగానే సియ్యలు లాక్కుంటాదనుకున్నాడా ఏమి?’ ఒకటేమయిన నవ్వుతా వుంది.

మాయమ్మ నా దిక్కుజూస్తా ‘లేదులే వదినా! శానాళ్ళయ్యింది కదా మీ అమ్మ మనూరు రాక, అత్తని వాడు గుర్తుపట్టి వుండడులే, ల్యాకుంటే మర్యాదకైనా ఎచ్చరిచ్చే పిలకాయేగాదు మావాడు? వాడి గురించి నీకు తెలీదా!’ అంటా నన్ను ఎనకేసుకోస్తా వున్నింది. ఇద్దరూ అట్లా మాట్లాడతానే నిలబడుకోనుండారు.అన్నీ ఒక్కోటిగా గుర్తు తెచ్చుకుంటి. ఆమె దయ్యం కాదనీ, ఉమ్మింది రక్తం కాదనీ.. గౌసియా వాళ్ల అవ్వకోసం ఆకులు, వక్కలు కొనక్కపోయేదీ, ఆ జేజి ఎప్పుడూ ఆకొక్క నములతాంటాదని అప్పటికి జ్ఞాపకం వచ్చింది. తెల్ల గుడ్డ కప్పుకుంటే మట్టికీ అందరూ దయ్యం కాదని అర్థమై లోలోపల నవ్వుకుంటి నేను.

గౌసియా వాళ్లమ్మ రోసేపు మాటాడి పోతా పోతా నా మనసులోని భయం కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఆ పొద్దు గట్టిగా అనుకుంటి. ఇంగెప్పుడూ భయం అన్న మాట లేకుండా తిరగాలని.మా కానుగచెట్టు నుండి చల్లని గాలి నా మొహాన్ని తాకుతా వుంది. మా అమ్మ నుదురు మీద అరచెయ్యేసి జూసి ‘హమ్మయ్య! చెమట పోస్తంది లే. ఇంగ జ్వరం ఇడిసినట్టే రత్నమా’ అంది ప్రేమగా నా నుదురు ముద్దాడి.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement