ఈవారం కథ: కుట్ట | This week story | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: కుట్ట

Published Sun, Dec 22 2024 9:47 AM | Last Updated on Sun, Dec 22 2024 9:48 AM

This week story

‘అలివర్‌! రేపు పార్టీ.. గుర్తుంది కదా? ఈవినింగ్‌ త్వరగా వచ్చేయ్‌. పార్టీకి ఒక్కణ్ణే అన్ని ఏర్పాట్లు చెయ్యలేను’ అన్నాడు ఆస్కార్‌. ‘గాబరాపడకు.. అన్ని ఏర్పాట్లూ చేసేశాను..’ అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు అలివర్‌.కారు వెళ్ళిపోతుంటే అలా చూస్తుండిపోయాడు ఆస్కార్‌. అంతా తను అనుకున్నట్లే జరిగితే అలివర్‌ని ప్రాణాలతో చూడటం ఇదే ఆఖరు అనుకున్నాడు ఆస్కార్‌. ఆ ఆలోచన రాగానే అతని కాళ్ళు చేతులు వణకసాగాయి.ఆరేళ్ళ క్రితం ఆస్కార్‌కి అలివర్‌ ఒక బస్సులో పరిచయం అయ్యాడు. అప్పటికే అలివర్‌ ఒక కంపెనీలో మేనేజర్‌గా ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆస్కార్‌ మాత్రం ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. అప్పటికే అతను ఐదు ఉద్యోగాలు మారాడు. 

ఏ కంపెనీలోనూ స్థిరంగా ఉండేవాడు కాదు. కారణం ఆస్కార్‌  సోమరిపోతు. కష్టపడే మనస్తత్వం కాదు. దాంతో ఏ కంపెనీలోనూ ఆరునెలల కన్నా ఉండేవాడు కాదు. ఎప్పుడైతే అలివర్‌ పరిచయమయ్యాడో ఆస్కార్‌ జాతకం మారిపోయింది. అతను ఆస్కార్‌ని చేరదీసి తన ఇంట్లో స్థానమిచ్చాడు. స్వంత తమ్ముడిలా ఆదరించాడు. అతని బాగోగులన్నీ అలివరే చూసుకోవడంతో ఆస్కార్‌ ఉద్యోగం మానేసి ఇంటి పనులు చేసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు.అలివర్‌ తల్లితండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించడంతో అమ్మమ్మ ఎస్టెల్లానే అలివర్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. వృద్ధాప్యం వల్ల ఆమె ఏడాది కిందట చనిపోయింది. దాంతో ఆమెకున్న ఐదుకోట్ల ఆస్తి ఇటీవలే అలివర్‌ పేరు మీదకు బదిలీ అయింది.

 ఆ వార్తను ఆస్కార్‌కి చెప్పి, అతన్ని తన ఆస్తికి నామినీగా పెట్టాడు అలివర్‌. అంటే తన తదనంతరం ఆ ఆస్తి ఆస్కార్‌దే అన్నమాట. దాంతో ఆస్కార్‌ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అలివర్‌కి ఇదివరకే మార్గరెట్‌ అనే అమ్మాయితో పెళ్ళైనా, ఆమెతో పొసగక విడాకులు తీసుకున్నాడు. అయితే అలివర్‌ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ ఆస్తి అతని భార్యకు చెందుతుంది.ఈమధ్యనే అలివర్‌ మేరీ అనే అమ్మాయితో డేటింగ్‌ చేస్తూ పెళ్ళి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆస్కార్‌కి తెలిసింది. ఆ విషయమే ఆస్కార్‌కి నిద్రలేకుండా చేస్తోంది.ఒక ఆదివారం మద్యం తాగుతున్న సమయంలో మేరీతో తన పెళ్ళి విషయాన్ని అలివర్‌.. ఆస్కార్‌కి చెప్పడంతో అతని గుండెలో పిడుగు పడ్డట్లయింది. అలివర్‌ పెళ్ళి చేసుకుంటే  ఐదుకోట్ల ఆస్తికి మేరీ వారసురాలౌతుంది. తన బతుకు అధోగతే! ఆస్తి దక్కకుండా పోతుండటంతో అతనికి బాధగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.

పెళ్ళికి ముందే అలివర్‌ను చంపేస్తే..? అవును! అలివర్‌ ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే ఆ ఐదుకోట్ల ఆస్తికి తను వారసుడవుతాడు. ఆ తరువాత జీవితమంతా హాయిగా గడిపెయ్యవచ్చు. ఎలా చంపడం? ఏ మాత్రం అనుమానం వచ్చినా జీవితాంతం జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే! కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపాలి. కానీ అదంత సులభం కాదు. అసలే స్కాట్లండ్‌ పోలీసులు.. ఆవలిస్తే పేగులు లెక్కపెడతారు.ఆ సమయంలో అతనికి కీత్‌ గుర్తుకొచ్చాడు. కీత్‌.. అలివర్‌ ఇంట్లో తోటపనివాడు. పాతికేళ్ళ పొడవైన యువకుడు. ఏవో చిన్న చిన్న గొడవల్లో రెండుసార్లు జైలుక్కూడా వెళ్ళొచ్చాడు.కీత్‌ గుర్తుకురాగానే ఆస్కార్‌ మెదడులో ఒక పథకం రూపుదిద్దుకుంది. వెంటనే కీత్‌ని పిలిచి విషయం చెప్పాడు. వినగానే కీత్‌ ఆశ్చర్యపోయాడు. కానీ ఆ పని చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆస్కార్‌  చెప్పడంతో కీత్‌ మెత్తబడ్డాడు. 

‘ఎలా ఇవ్వగలవ్‌?’ సందేహం వెలిబుచ్చాడు కీత్‌.‘అలివర్‌ చనిపోతే నాకు ఐదుకోట్ల ఆస్తి వస్తుంది. అందులోంచి నీకు కోటిస్తాను’ చెప్పాడు ఆస్కార్‌. ఒప్పుకున్నాడు కీత్‌. పథకాన్ని ఎలా అమలు చెయ్యాలో వివరించాడు ఆస్కార్‌. అలివర్‌ రోజూ ఉదయం ఏడు గంటలకు ఆఫీస్‌కి బయలుదేరుతాడు. అతను వెళ్ళే దార్లో అడవి ఉంటుంది. విగ్గు, మీసాలు పెట్టుకొని కీత్‌ అడవిలో అలివర్‌ని లిఫ్ట్‌ అడగాలి. ఎవరు లిఫ్ట్‌ అడిగినా అలివర్‌ కాదనడు. అతనలా కారు ఆపగానే కీత్‌ అందులోకి ఎక్కుతాడు. కొంతదూరం వెళ్ళాక బహిర్భూమి కోసమని కారు ఆపమంటాడు కీత్‌. అప్పుడు కీత్‌ తన వెంట తెచ్చుకున్న సుత్తితో అలివర్‌ తల మీద కొట్టి చంపేసి, అతని శవాన్ని దగ్గర్లోని ఒక లోతైన చెరువులో పడేసి, ఆ కారునేమో కొద్ది దూరంలో ఉన్న లోయలోకి తోసేస్తాడు. తరువాత తను ఆస్కార్‌ దగ్గరికి వచ్చి ‘ఆపరేషన్‌ సక్సెస్‌’ అని చెబుతాడు. ఇదీ ప్లాన్‌. 

అందుకే ఈరోజు అలివర్‌ కార్లో బయలుదేరగానే అతన్ని సజీవంగా చూడటం అదే ఆఖరుసారి అనుకున్నాడు ఆస్కార్‌. ∙∙ అలివర్‌ వెళ్ళి అప్పుడే నాలుగు గంటలయింది. ఈపాటికి అలివర్‌ని చంపేసి, కీత్‌ ఇంటి ముఖం పట్టుండాలి. అలా అనుకోగానే ఆస్కార్‌లో వణుకు మొదలైంది. అతని మస్తిష్కం మొద్దుబారిపోసాగింది. వెంటనే సిగరెట్‌ తీసి వెలిగించాడు. కీత్‌ కోసం వాకిలి కాస్తున్నాడు.టైమ్‌ పదయింది.. కీత్‌ ఇంకా రాలేదు. టీ తాగి వరండాలో కూర్చున్నాడు ఆస్కార్‌. ఏమైంది? కీత్‌ ఇంకా రాలేదు ఎందుకు? కాలం గడుస్తున్నా కొద్ది అతనిలో ఆందోళన పెరగసాగింది. సిగరెట్‌ మీద సిగరెట్‌తో వరండా అంతా పొగ వ్యాపించింది. టైమ్‌ పదకొండు అయింది. కీత్‌ జాడ లేదు. గడియారం ముల్లు శబ్దం మినహా వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది. 

వెంటనే లేచి అలివర్‌ ఆఫీసుకి ఫోన్‌ చేశాడు ఆస్కార్‌. ఆ సమయంలో అలివర్‌ అక్కడ ఉండడని అతనికి తెలుసు. ఆ ఫోన్‌ ద్వారా అతను ఆఫీసుకి చేరలేదన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు ఫోన్‌ చెయ్యడం వల్ల తన ఆందోళన ఆఫీసు వాళ్ళకి తెలిసి, అది రేప్పొద్దున పోలీసు ఎంక్వైరీలో ఎలిబీగా ఉపయోగపడుతుందని అతని ఆలోచన.అవతలి వైపు నుంచి అలివర్‌ సెక్రటరీ రూత్‌ ‘హలో! ఎవరు కావాలి?’ అడిగింది.‘రూత్‌! నేను ఆస్కార్‌ని. అర్జెంట్‌గా అలివర్‌తో మాట్లాడాలి’ చెప్పాడు. ‘అలివర్‌ ఆఫీసులో లేరు సార్‌’ అంది రూత్‌. ఆ మాట వినగానే ఆస్కార్‌ ముఖంలో చిన్నగా నవ్వు మెరిసింది. ‘ఓకే! ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఉంటాడు. రాగానే ఫోన్‌ చెయ్యమను’ చెప్పాడు ఆస్కార్‌.. తనకేమీ తెలియనట్లు నటిస్తూ. ‘క్రితం మంగళవారం నుంచి అతను ఆఫీసుకి రావటం లేదు. వచ్చే సోమవారం వరకూ రాడు’ చెప్పింది రూత్‌.

ఆ మాటలు వినగానే ఆస్కార్‌ మెదడు కొద్ది క్షణాలు మొద్దుబారిపోయింది. ఏమీ అర్థంకాక కుర్చీలో కూలబడిపోయాడు.క్రితం మంగళవారం నుంచి అలివర్‌ ఆఫీసుకి వెళ్ళటం లేదా? ఉదయం 7 గంటలకి ఆఫీసుకి బయలుదేరి సాయంత్రం ఇంటికి రావడం అతని దినచర్య. అలాగే  ప్రతిరోజూ ఇంటి నుంచి ఏడు గంటలకు ఆఫీసుకి అని చెప్పి బయలుదేరుతున్నాడు. మరి మంగళవారం నుంచి ఆఫీసుకి రావటం లేదని చెబుతోందేంటి రూత్‌? వారం నుంచి అతనెక్కడికి వెళుతున్నట్లు? రూత్‌ చెప్పిందే నిజమైతే అడవిలో కీత్‌కి అలివర్‌ కారు ఎదురుపడి ఉండదు.

 మరి కీత్‌ అక్కడ ఏం చేస్తున్నట్లు? ఇంకా అలివర్‌ వస్తాడని ఎదురు చూస్తున్నాడా? ఇప్పటి వరకూ అలివర్‌ రాకపోతే కీత్‌ తనకి ఫోన్‌చేసి ఆ విషయం చెప్పి ఉండేవాడు. ఏం జరిగింది? కొంపదీసి తన ప్లాన్‌ అలివర్‌కి తెలిసిపోయిందా? కీత్‌ ఏమైనా చెప్పి ఉంటాడా? అందుకే అలివర్‌ ఆఫీసుకి వెళ్ళటం లేదా? రకరకాల ఆలోచనలు ఆస్కార్‌లో. ఆందోళనతో సిగరెట్లు ఊదేస్తున్నాడు. మళ్ళీ రూత్‌కి ఫోన్‌ చెయ్యాలనుకున్నాడు. కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని, కీత్‌ వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు.

సమయం రెండయింది. కీత్‌ రాలేదు. ఆలోచనలు మళ్ళీ ఆస్కార్ని చుట్టుముట్టాయి. ఒకవేళ అలివరే కీత్‌ని చంపేసుంటే? ఆస్కార్‌ ముఖం నిండా చెమటలు. ఇంతలో కారు హారన్‌ వినిపించింది. ఆస్కార్‌ ముఖంలో ఒక వెలుగు. పరుగున వెళ్ళి తలుపు తీశాడు. అప్పుడే కారు దిగుతూ కనిపించాడు కీత్‌. ‘అన్నీ సవ్యంగా జరిగాయా?’ కంగారుగా ఆస్కార్‌.‘అంతా సవ్యమే’ అన్నట్లు బొటనవేలిని ఎత్తి చూపాడు కీత్‌.‘మరింత ఆలస్యం అయిందేంటి?’ ఇంకా ఆందోళన తగ్గలేదు ఆస్కార్‌లో. ‘అన్నీ పూర్తిచేసుకొని వచ్చేసరికి ఈ టైమ్‌ అయింది’ కీత్‌.
‘మనం అనుకున్నట్లే అతను కారు ఆపి నీకు లిఫ్ట్‌ ఇచ్చాడా?’ అడిగాడు ఆస్కార్‌.‘నేను చెయ్యెత్తగానే కారు ఆపాడు. ఎక్కడ నుంచి వస్తున్నావ్‌? ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు. 

చెప్పాను. ప్లాన్‌ ప్రకారమే కొంత దూరం వెళ్ళాక చిటికెన వేలు చూపించి, కారు ఆపమన్నాను..’ అని ఆగాడు కీత్‌.‘ఆ తరువాత?’ ఆస్కార్‌లో కుతూహలం.  ‘సుత్తితో తల మీద కొట్టి, చంపేసి, శవాన్ని చెరువులో పడేసి, కారుని లోయలోకి తోసేశాను’ చెప్పాడు కీత్‌. ప్రశ్నల వర్షం ఆగిపోవడంతో కాఫీ తాగి వెళ్ళిపోయాడు కీత్‌. అప్పుడు రూత్‌కి ఫోన్‌చేసి ‘అలివర్‌ గురించి ఆందోళనగా ఉంది. అతను వారం నుంచీ ఆఫీసుకి వెళుతున్నాడు. ఈరోజు కూడా వెళ్ళాడు’ చెప్పాడు ఆస్కార్‌. ‘లేదు సార్‌. రావట్లేదు..ఈరోజు కూడా రాలేదు.. మంగళవారం వరకు రాననే చెప్పాడు. కాబట్టి నేనేమీ గాబరా పడట్లేదు’ స్పష్టం చేసింది రూత్‌.‘మరి ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా?’ ఆస్కార్‌. 

‘లేదు సర్‌.. ఏదో పనుందంటూ వారం సెలవు మాత్రం తీసుకున్నాడు’ రూత్‌.‘రేపు మేము ఓ పార్టీ ఇస్తున్నాం. చాలామంది స్నేహితులను పిలిచాం. అతనికేదో జరిగి ఉంటుందనిపిస్తోంది నాకు. అతని స్నేహితుల్ని కనుక్కొని ఏం జరిగిందో చెప్పు’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు ఆస్కార్‌. అరగంట తరువాత రూత్‌ ఫోన్‌ చేసి ‘సార్‌! అతని స్నేహితులు పార్కర్, మిస్‌ సాషెల్‌తో మాట్లాడేను. అతను వాళ్ళకు తనెక్కడికి వెళుతున్నాడో చెప్పలేదుట. ఒకరోజు వేచి చూసి పోలీసులకు ఫిర్యాదు చెయ్యమని చెప్పారు. మీరేం గాబరా పడకండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పింది.ఆరోజు సాయంత్రం.. అలివర్‌ కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆస్కార్‌. వాళ్ళు అలివర్‌ కారు నంబరు, మిగతా వివరాలు అడిగి అతని ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు. 
∙∙ 
పోలీస్‌ డిటెక్టివ్‌ సార్జెంట్‌ క్లేమోర్‌ నుంచి ఆస్కార్‌కి ఫోన్‌ వచ్చింది. అలివర్‌ ఆచూకీ గురించి వాకబు చేశాడు ఆస్కార్‌. ఇంకా తెలియలేదు, ఆ పనిలోనే ఉన్నామని చెప్పాడు క్లేమోర్‌. ‘అలివర్‌కి ఏదో జరిగుంటుందనిపిస్తోంది. ఏదో అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని నా అనుమానం’ అన్నాడు ఆస్కార్‌.‘అంటే ఆత్మహత్య చేసుకున్నాడనా?’ క్లేమోర్‌. ‘కావొచ్చని భయడుతున్నాను’ ఆస్కార్‌.  ‘ఆత్మహత్యకు పాస్‌పోర్ట్‌ ఎందుకతనికి?’ అన్నాడు క్లేమోర్‌.‘పాస్‌పోర్టా?’ అర్థంకాలేదు ఆస్కార్‌కి. ‘వారం క్రితం ఆఫీసుకి వెళ్ళినప్పుడు అలివర్‌ అక్కడున్న పాస్‌పోర్టును తీసుకెళ్ళాడని వాళ్ళ డైరెక్టర్‌ చెప్పాడు నాతో. ఎటైనా టూర్‌కెళ్ళి ఉంటాడు. మీరేం గాబరా పడకండి. అతను ప్రాణాలతోనే ఉండుంటాడు. నిన్న అతని లాయర్‌తో మాట్లాడేను. అలివర్‌ ఈమధ్య తన ఆస్తి విల్లును మార్చి రాశాడని చెప్పాడతను. ఆత్మహత్య చేసుకోబోయేవాడు అవన్నీ చెయ్యడు కదా! బహుశా ఇవేమీ తెలియక మీరు కంగారుపడుతున్నారు’ అన్నాడు క్లేమోర్‌.

‘నాకవేమీ తెలియవు’ ఆస్కార్‌. మర్నాడు ఉదయమే 9 గంటల వేళ ఆస్కార్‌ ఇంటికి వచ్చాడు క్లేమోర్‌. పెద్ద పెద్ద మీసాలతో పొడవుగా తెల్లగా సన్నగా ఉన్నాడతను. వస్తూనే ‘మిస్టర్‌ ఆస్కార్‌! అలివర్‌ చనిపోయాడని ఎందుకనుకుంటున్నారు మీరు?’ అడిగాడు.‘ఆరేళ్లుగా అతని దగ్గరే ఉంటున్నాను. నాకు చెప్పకుండా అతనెప్పుడూ ఎక్కడికీ వెళ్ళడు. అందుకే అనుమానం’ చెప్పాడు ఆస్కార్‌.‘అతని అదృశ్యం వెనక మీ పాత్ర ఉందనుకోవచ్చా?’ సందేహపడ్డాడు క్లేమోర్‌.  అతని మాటలకు ఆశ్చర్యపోతూ ఆస్కార్‌ ‘ఏం మాట్లాడుతున్నారు?’ అన్నాడు. ‘అతన్ని చంపడానికి మీరు ప్రయత్నించి ఉంటారని నా అనుమానం’ సార్జెంట్‌ క్లేమోర్‌.‘చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అలివర్‌ నా ప్రాణస్నేహితుడు. నేనెందుకు అతన్ని చంపాలనుకుంటాను?’ బాధను ఒలికిస్తూ ఆస్కార్‌.

‘మీ ప్రాణస్నేహితుడు చనిపోయుంటాడని నిన్నట్నుంచి మీరే అంటున్నారు పదేపదే!’ అన్నాడు క్లేమోర్‌.‘నాకెందుకో అలా అనిపించిందన్నాను తప్ప, అదే నా భావన కాదు’ ఆస్కార్‌.‘మీ ఇద్దరిలో అతనే ఆస్తిపరుడు. అందుకే మీ మీద నాకు అనుమానం’ క్లేమోర్‌.‘అలివర్‌ భార్య మార్గరెట్‌తో విడాకులు తీసుకున్న దగ్గర్నుంచీ నిస్పృహకు లోనయ్యాడు. నాతో ఆ బాధను పంచుకుంటూ చనిపోవాలనుందన్నాడు ఎన్నోసార్లు. అందుకే అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అనుమానం వచ్చింది. కానీ దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదనిపిస్తోంది’ ఆస్కార్‌.  ‘అలివర్‌ కేసుని సీరియస్‌గానే తీసుకున్నాం ఆస్కార్‌! ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేమి జరిగుండొచ్చని మీ అనుమానం?’ అడిగాడు  క్లేమోర్‌.‘అతన్నెవరైనా హత్య చేసి ఉండొచ్చు’ ఆస్కార్‌.‘అదెలా సాధ్యం?’ అడిగాడు క్లేమోర్‌.

‘అలివర్‌ అడిగిన వాళ్ళందరికీ కారులో లిఫ్ట్‌ ఇస్తూంటాడు. అలా ఇవ్వొద్దని ఎన్నోసార్లు చెప్పినా వినేవాడు కాదు. అలా లిఫ్ట్‌ అడిగిన వ్యక్తెవరైనా అలివర్ని హత్య చేసుండొచ్చని నాకనిపిస్తోంది’ ఆస్కార్‌.‘అంటే అతన్ని ఎవరో ఆగంతుకుడు హత్య చేసి ఉండొచ్చంటున్నారు?’ ఆశ్చర్యంగా క్లేమోర్‌.‘అనే నమ్ముతున్నాను..’‘అంటే ఆత్మహత్య కన్నా హత్యే జరిగుండొచ్చనా?’ ‘బహుశా’ ఆస్కార్‌. ‘అంటే ఆగంతుకుడెవరో అలివర్‌ని లిఫ్ట్‌ అడిగి, అతని కారెక్కి, అతన్ని చంపి.. శవాన్ని ఎందులోనైనా పడేసి, అతని దగ్గరున్న డబ్బుతో పరారైపోయుంటాడని మీ అనుమానం.. అంతేనా?’ క్లేమోర్‌.‘అదే జరిగుండొచ్చు. ఎందుకంటే అలివర్‌ దగ్గర పదిలక్షలకు తక్కువ కాకుండా డబ్బుంటుంది ఎప్పుడూ! బహుశా ఆ డబ్బు కోసమే అలివర్‌ని చంపేసి ఉండొచ్చు’ అన్నాడు ఆస్కార్‌. 

‘మీరు చెప్పింది కాకుండా ఇంకోటి జరిగి ఉండొచ్చనిపిస్తోంది నాకు’ క్లేమోర్‌.  ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ఆస్కార్‌.‘అతని అదృశ్యంలో మీ హస్తం ఉండొచ్చని, హత్యలో మీరూ భాగస్వాములవొచ్చని నా అనుమానం’ క్లేమోర్‌. అతని మాటలకు నిశ్చేష్టుడయ్యాడు ఆస్కార్‌. ఏం చెప్పాలో అర్థంకాక  క్లేమోర్‌ వైపు కోపంగా చూశాడు. ‘మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?’ అన్నాడు. ‘మిస్టర్‌ ఆస్కార్‌.. మీరేం చెబితే అది నమ్మడానికి మేమంత అమాయకులం కాము. అంతా పరిశోధించే ఒక నిర్ణయానికి వస్తాం’ అన్నాడు క్లేమోర్‌.‘అలివర్‌ని చంపేటంతటి అవసరం నాకేం ఉంది చెప్పండి?’ అమాయకత్వం ధ్వనింపజేస్తూ ఆస్కార్‌.

‘అతని ఆస్తి.. అలివర్‌ చనిపోతే అతని ఐదుకోట్ల ఆస్తి మీకు చెందుతుంది. ఎందుకంటే ఆ ఆస్తికి మీరే నామినీ కాబట్టి’ క్లేమోర్‌.‘నిన్నంతా ఈ ఇంట్లోనే ఉన్నాను. అతన్ని నేనెలా చంపగలను?’ ఆస్కార్‌.‘మీరే హత్య చేశారని అనటం లేదు. చేయించారు అంటున్నాను. అతని హత్యకు కుట్ర పన్నారు’ ఆస్కార్‌ ముఖంలోకి చూస్తూ  క్లేమోర్‌.‘కుట్రా! నేనా?’ ఆస్కార్‌ ఆశ్చర్యం నటిస్తూ!‘నిన్న కీత్‌ని పట్టుకొని విచారిస్తే జరిగినదంతా చెప్పాడు’ క్లేమోర్‌.‘అతను మీకన్నీ అబద్ధాలు చెప్పి ఉంటాడు. అతని మాటలు నమ్మవద్దు’ ఆస్కార్‌.‘నువ్వు అలివర్‌ని చంపడానికి పన్నిన కుట్రనంతా కళ్ళకు కట్టినట్లు కీత్‌ చెప్పాడు. రూఢి చేసుకున్న తరువాతే ఇక్కడికి వచ్చాను. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి’ అంటూ ఆస్కార్‌ని అరెస్ట్‌ చేశాడు క్లేమోర్‌. 

ఓ వారం తరువాత ఆస్కార్‌ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. జైల్లో ఉన్న అతనికి ఆ ఉత్తరాన్నిచ్చారు పోలీసులు. ‘డియర్‌ ఆస్కార్‌!
నీ పథకం ప్రకారం కీత్‌ నన్ను చంపాలని ఆ రోజు నన్ను లిఫ్ట్‌ అడిగాడు. తీరా కారులోకి ఎక్కిన తరువాత ఆ పని చెయ్యలేక భయపడిపోయి నిజం చెప్పేశాడు. అప్పుడు నేను కొన్నాళ్ళు అదృశ్యం అవుతాననీ, నీకు మాత్రం నన్ను హత్యచేసినట్లే చెప్పమనడంతో కీత్‌ నీకలా చెప్పాడు. నువ్వు దాన్ని నమ్మావు. 

నా చేతికి ఐదుకోట్ల ఆస్తి వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తనలో మార్పు గమనించాను. అందుకే రెండు నెలల క్రితం లండన్‌లో మేరీని పెళ్ళి చేసుకొని, ఆస్తికి ఆమెను నామినీగా పెట్టి విల్లు మార్చాను. ఆస్కార్‌! నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడానికి తప్పుడు దారిని ఎంచుకున్నావ్‌. ఇప్పుడు నేను, మేరీ లండన్‌ లో హనీమూన్‌లో ఉన్నాం. కోర్టులో నీ కేసు వాదనలు మొదలయ్యేలోపే స్కాట్లండ్‌ వస్తాను.ఇంకా బతికే ఉన్న నీ స్నేహితుడు..అలివర్‌!’ఆ ఉత్తరం చదివి చేష్టలుడిగిపోయాడు ఆస్కార్‌.              

∙గన్నవరపు నరసింహ మూర్తి

(మైఖేల్‌ అండర్‌వుడ్‌ ఓకే ఫర్‌ మర్డర్‌ కథ ఆధారంగా) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement