this week story
-
ఈ వారం కథ: హైవే
ఉదయం 7:30కే కల్లాల వద్ద రోడ్డు మీద బస్సు దిగి, రోడ్డు అవతలికి దాటేందుకు రెండడుగులు వేసిన. ఇటు నుండి ఒకదాని వెనుక ఒకటి రెండు ఇసుక టిప్పర్లు, అటు నుండి రెండు కార్లు ఒకదాని తర్వాత ఒకటి దుమ్ములేపుకుంటూ పోయినాయి. ఏమాత్రం ఏ మారినా పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈమధ్యనే ఇది డబుల్ రోడ్డు కావడంతో ప్రొద్దుటూరు నుండి కమలాపురానికి వచ్చిపోయే వాహనాలన్నీ ఈ పల్లెల దారి పట్టాయి. రోడ్డు వెడల్పు కావడంతో వేగం మితిమీరింది. మా ఊరి పెన్నలో ఇసుక క్వారీకీ అనుమతిచ్చారు. రేయింబవళ్లు భారీ ఇసుక టిప్పర్లు. ఈసారి అటూ ఇటూ చూసుకొని రోడ్డు దాటాను. రోడ్డుకు ఊరి రచ్చబండకు ఓ అర ఫర్లాంగు దూరం. రచ్చబండ వరకున్న సిమెంటు బాటకు ఇరువైపులా ఊరి రైతుల కల్లాలు. రచ్చబండ వద్ద నుండి రెండు దారులు చీలి వాటికిరువైపులా ఇండ్లు మొదలవుతాయి. రోడ్డు దాటుకుని పది అడుగులు వేయగానే గవిని కాడి నాగిరెడ్డి కల్లం గోడ మీద.. వేపచెట్టు కింద ఓ పదిపన్నెండు మంది కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి ఓ నలుగురు వరుసలు పెట్టి పలకరిస్తూ క్షేమసమాచారాలడిగినారు. ‘మామకు కచ్చితంగా తెలిసుంటుంది.. ఏం మామా! మన చేలల్లో ఎక్స్‌ప్రెస్ హైవే ఖాయమే కదా, మళ్లా ఏమన్నా మారుస్తారా?’ పని వుంటే తప్ప వూరు దాటని శీను అడిగినాడు.నాకు జవాబు చెప్పే అవకాశం రానివ్వలేదు. ఊరి రాజకీయాల్లో ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే నారపరెడ్డి అందుకొని ‘సర్వే అయిపోయి ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. రేపో మాపో భూములకు లెక్క ఇచ్చి పొజిషన్లోకి తీసుకుంటారు. ఇంకేం మారుస్తారు!’ అన్నాడు. నేను అందరికీ చేయూపుతూ అక్కడి నుండి ముందుకు కదిలిన. రచ్చబండ వద్ద ఓ పదీపన్నెండు మంది మాట్లాడుకుంటున్నారు. బహుశా హైవే గురించే అనిపించింది. బావమరిది ఇంటికి చేరి కాళ్లూ, మొహం కడుక్కుని కూర్చున్నాక, ఒక కాగితం తెచ్చి చేతికిచ్చాడు. ఫలానా సర్వే నంబర్లో 55 సెంట్లను రోడ్డు నిర్మాణం కోసం తీసుకోబోతున్నట్లు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫలానా తేదీలోపు తెలియజేయాలని భూసేకరణ అధికారి నుండి వచ్చిన నోటీసు. హైవే కోసం స్వాధీనం చేసుకోబోతున్న భూముల గురించి భూయజమానులందరితో పాటు నాకూ పంపిన ఫార్మల్ నోటీసు అది. ఊరి అడ్రస్‌కు వచ్చింది. ఈ సారాంశం రెండు రోజుల కింద నా మొబైల్‌కు వచ్చినదే. ఇప్పుడు అభ్యంతరాలు తీసుకునేదేమీ ఉండదు. పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుంటారంతే! ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. నోటీసు పక్కన పడేసి, ‘ఊర్లో అంతా దీని మీదే మాట్లాడుకుంటున్నట్లుందే!’ అన్నాను. ‘అవును బావా! హైవే కోసం భూములు పోతున్న వారి బాధ ఒకటైతే, తమ భూములు హైవే పక్కన లేకుండా ఎక్కడో ఉన్న వారి బాధ ఇంకొకటి’ అన్నాడు శివ. నాకు అర్థమైంది. హైవే కోసం సేకరిస్తున్న భూములకు ఇప్పుడున్న రేటు కన్నా ఎక్కువే ఇస్తున్నా, హైవే పక్కనున్న భూములకు ఊహించని రేట్లు వస్తాయి. అందుకే హైవే కోసం భూమి పోవడం కన్నా హైవే పక్కన భూమి ఉన్న రైతులను చూసి ఒకింత ఈర‡్ష్య పడుతున్నట్లుంది. ఒకప్పుడు తమవి మంచి కండగలిగిన భూములని మురిసిపోయిన రైతులు, ఇప్పుడా భూములు హైవే చుట్టుపక్కల లేనందుకు ఖిన్నులవుతున్నారు. ‘మనసులో బాధపడటంతోనే ఇది ఆగిపోదు. ఎన్ని అనర్థాలు జరుగుతాయో! మనుషులంతా ఎలా విడిపోతారో!’ నాలో నేను అనుకున్నట్లే అన్నాను. ‘నిజమే బావా! ఎప్పుడో చేల పంపకాలు జరిగిన అన్నదమ్ముల నడుమ ఇప్పుడు కొత్తగా అసూయలు, సరిపోనితనాలు పొడచూపుతున్నాయి. పెద్ద సుబ్బన్న గారి కొండారెడ్డి, రామిరెడ్డి పదహైదేళ్ల కిందట భూములు పంచుకొని వేరుపడినారు. రాళ్లవాగు చేను నాలుగెకరాల్లో, పెద్దోడు కొండారెడ్డికి పైదిక్కు అంటే పడమర దిక్కు రెండెకరాలు, చిన్నోడు రామిరెడ్డికి తగ్గు దిక్కు తూర్పున రెండెకరాలు వచ్చింది. ఇప్పుడు చిన్నోడి చేను రెండెకరాలు పూర్తిగా హైవే కోసం పోతోంది. పెద్దోడి రెండెకరాలు హైవే పక్కన నిలబడింది. అప్పుడు చేను నిలువునా పంచినారు, ఇప్పుడు అడ్డంగా పంచి ఇద్దరికీ సమంగా లాభం వచ్చేలా చూడాలని చిన్నోడు సర్పంచు దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి తిరుగుతున్నాడు. పదహైదేళ్లనాడు జరిగిన పంపకం, ఎవరి పాస్ పుస్తకాలు వాళ్లవైనాయి, తిరిగి పంపకానికి ఒప్పుకోనని పెద్దోడు భీష్మించుకున్నాడు. చిన్నోడు ఓర్పు తక్కువ మనిషి. ఏమైతుందో!’ శివ మాటల్లో కొంత ఆందోళన కనపడింది. నాకు తెలియకుండానే ఒక నిట్టూర్పు వెలువడింది. నేను ఊరికి వచ్చింది కూడా ఈ హైవే గొడవల పంచాయతీకే. మేనమామ కొడుకులిద్దరూ ఎప్పుడో జరిగిన భూముల పంపకం మీద ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఆరోజు అన్నదమ్ములు ఇద్దరూ ఆస్తులు పంచుకునేటప్పుడు ఉన్న పెద్ద మనుషుల్లో నేనొకడిని. మేనరికపు చుట్టరికం కూడా ఉండడంతో పెద్దోడు రాఘవ ఫోన్ చేసి రమ్మన్నాడు. ఐదేళ్ల కిందట రాఘవ, చంద్ర భూములు పంచుకునేటప్పుడు వడ్డోనివంక పంపుల్లో నాలుగెకరాలు, రాళ్లవాగున ఐదెకరాలు త్రాసులో పెట్టి కోరుకోమన్నాము. వడ్డోనివంకన పంపులు కండగలిగిన సారవంతమైన భూములు. రాళ్లవాగున సాధారణ భూములు. అందుకనే ఇక్కడి నాలుగెకరాలు అక్కడి ఐదెకరాలకు సమానమని పెద్ద మనుషుల తీర్మానం. పెద్దోడు కాబట్టి రాఘవకే మొదట కోరుకునే అవకాశం వున్నింది. ఆరోజు రాఘవ కండగలిగిన వడ్డోనివంకన నాలుగెకరాల భూమి కావాలన్నాడు. చంద్ర మారు మాట్లాడకుండా రాళ్లవాగున ఐదెకరాలు తీసుకున్నాడు. ఇప్పుడు రాళ్లవాగు చేల మీదుగా ఆరులైన్ల హైవే నిర్మాణం జరుగుతోంది. చంద్ర చేలో ఒక ఎకరా హైవే భూసేకరణలో పోయి, హైవే పక్కన నాలుగు ఎకరాలు మిగులుతోంది. ఇప్పుడు రాఘవకు భరించలేనంత బాధగా వుంది. ఆడపిల్లలు గలోన్ని, ఐదారేళ్లుంటే పెళ్లికి ఎదుగుతారు. వడ్డోనివంకన రెండెకరాలు తీసుకొని హైవే పక్కన తనకు రెండెకరాలు ఇవ్వాలని అడుగుతున్నాడు. చంద్ర అందుకు ససేమిరా అంటున్నాడు. రాఘవ నాలుగెకరాలు ఇస్తే హైవే పక్కన రెండెకరాలు ఇస్తానంటున్నాడు. ఇది మరీ అన్యాయం అని చెబితే వినడం లేదు. మంచి పంట పండే నాలుగెకరాల భూమి అంతా తనకిచ్చి, హైవే పక్కన రెండెకరాలు రాఘవ ఏం చేసుకుంటాడు! పైగా అది సాధారణ భూమి. హైవే పక్కన పొల్యూషన్ వల్ల అసలు పంట పండదని చెబితే చంద్ర వినడం లేదు. ‘హైవే పక్కన పంటలు పండించుకోవడానికా వాడు అడిగేది? రెండేళ్లలో హైవే పడితే ఎకరా నలభై యాభై లక్షలు పోతుంది. ఇప్పుడే ఇరవైయైదు లక్షలకు అడుగుతున్నార’ని ఎదురు వాదన తీస్తున్నాడు చంద్ర.‘భూముల ధరలు గాలిలో దీపం రా! మొదట్లో పెరగొచ్చు. తర్వాత నిలబడి పోవచ్చు. రెండేళ్లకు పెరుగుతాయని గ్యారంటీ లేదు. అదంతా రియల్ దందాల మాయాజాలం మీద ఆధారపడి ఉంటుంది. పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుందని మీరు అమ్ముకోలేకపోవచ్చు. తర్వాత కొనేవాడు ఉండడు’ అని ఎంత చెప్పినా వినడం లేదు.రాఘవేమో కనీసం ఒక ఎకరంన్నర అయినా హైవే పక్కన తనకిప్పించమంటున్నాడు. ఆడపిల్లలు గలోన్నని ఏడుపు మొహం పెడతాడు. అన్నదమ్ముల నడుమ ఆ పంచాయతీ తీర్చడానికే ఇప్పుడు నేను ఊర్లో అడుగు పెట్టింది. నేను వస్తున్నానని నిన్ననే ఫోన్లో చెప్పడంతో అన్నదమ్ములతో పాటు వాళ్ల భార్యలు ఇండ్ల వద్దే వున్నారు.. మొగుళ్లకు దన్నుగా నిలబడటానికి. రాఘవ ఇంట్లోనే కూర్చున్నాం. కాఫీలు, టిఫిన్లు అని హడావిడి చేయబోతే వద్దన్నాను. శివుడి ఇంటి వద్ద కాఫీ తాగి వచ్చానన్నాను. మా కోసం వచ్చి అక్కడ తాగడమేమిటని రాఘవ భార్య నిష్ఠూరమాడింది. అన్నదమ్ములతో ఎంతసేపు మాట్లాడినా పాతపాటే. ఎవరూ ఒక మెట్టు దిగి రావడం లేదు. వాళ్లు ఒక మెట్టు దిగాలనుకున్నా, వాళ్ల భార్యలు దిగనివ్వడం లేదు.విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. ఆఖరకు ఆడోళ్లను గట్టిగా కసురుకునేసరికి, నా మీద రుసరుసలాడుతూ ఇద్దరూ నోరు మూసుకొని కూర్చున్నారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఇద్దరినీ ఒక మాట మీదికి తెచ్చిన. వడ్డోనివంకనున్న నాలుగు ఎకరాల్లో రాఘవ ఎకరంన్నర చంద్రకు ఇచ్చేటట్లు, హైవే పక్కన చంద్రకు మిగిలిన నాలుగెకరాల్లో ఒక ఎకరా రాఘవకు ఇచ్చేటట్లు ఖరారైంది. ఎకరాకు మించి ఇవ్వడానికి చంద్ర ససేమిరా ఒప్పుకోలేదు. ఆ ఎకరాకే రాఘవను ఒప్పించి ఇద్దరి నడుమ అప్పటికప్పుడు అగ్రిమెంటు రాయించాను. ఇద్దరికీ, ముఖ్యంగా ఆడవాళ్లిద్దరికీ నా మీద కోపంగానే వుంది. భోంచేసి పొమ్మని రాఘవ మొహమాటానికి పిలుస్తున్నా, వద్దని వారించి నేను బయటపడిన. నేను వచ్చినప్పటి నుండి ఆడవాళ్లిద్దరూ అక్కడే ఉన్నారు. ఇంకేం భోజనం ఉంటుంది? శివుని ఇంటికి చేరి, ఇంత తిని ఓ కునుకు తీసి, సాయంత్రం నాలుగు గంటల బస్సుకు కడపకు పోదామని బయలుదేరిన.రచ్చబండ వద్ద ఉదయం కన్నా ఇంకా ఎక్కువ మందే గుమిగూడి ఉన్నారు. ఈ నడుమ కాలంలో రచ్చబండ మీద ఒకరిద్దరు కునికిపాట్లు పడటం మినహా ఇంత జనాన్ని చూడలేదు. టీవీలు, తర్వాత సెల్ఫోన్లు వచ్చాక సంఘజీవనం మాయమైపోయింది. మనుషులు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆశ్చర్యంగా రచ్చబండ మీద పదహైదు పదహారుమంది ఉన్నారు. రెండు రోజుల్లో భూములు కోల్పోయిన రైతులకు హైవే భూసేకరణ డబ్బు, అందబోతోంది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిందనే సమాచారం రైతులకన్నా ముందు రాజకీయ నాయకులకు తెలుస్తుంది. రాజకీయ నాయకుల అనుచరగణమంతా నెలరోజుల కిందటి నుండే హైవే పక్కనున్న భూములు కొనేందుకు రైతులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రలోభ పెడుతున్నారు. ఇప్పుడు గ్రామీణ జనం అంత అమాయకంగా లేరు. ఆ ముచ్చట్లు చెప్పుకునేందుకే రచ్చబండ మీద కూడినట్లుంది.తనను ఫలానా వాడు ఎకరా ఇరవై లక్షలకు అడిగాడని ఒకడు చెబుతుంటే, మరొకడు ఆ ఫలానా వాడే నాకు ఇరవైయైదు లక్షలు ఇస్తానన్నాడని చెబుతున్నాడు. ఫలానా సుబ్బారెడ్డికి కోటి వస్తుందంటే, ఫలానా ఎల్లారెడ్డికి కోటిన్నర వస్తుందని చెప్పుకుంటున్నారు. అప్పుడే ఎందుకు అమ్మడం! హైవే ఓపెనింగ్ అయ్యేవరకు ఆగాలని ఒకడు అంటున్నాడు. మొదట్లోనే భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని, తర్వాత ఈ వేడి చల్లబడి భూముల అమ్మకం మందగిస్తే అప్పుడు అమ్ముకోవాలన్నా కొనేవాడు ఉండడని మరొకడు అంటున్నాడు. దోవన పోతున్న నన్ను చూసి కొందరు వాళ్ల డబ్బు మాటలు ఆపి, క్షేమ సమాచారాలు అడిగినారు. నేను పొడిపొడిగా సమాధానమిస్తూ దాటుకుందామని చూసిన.‘ఒక నిమిషం రావోయ్!’ అని టంగుటూరోల్ల జయరామిరెడ్డి పిలవడంతో, పెద్దవాడు పిలిచాడనే గౌరవంతో రచ్చబండ మీదకు చేరక తప్పలేదు. ‘హైవే పక్కన భూములకు ఇప్పుడే ఊహించని ధరలు పలుకుతున్నాయి. హైవే కోసం తీసుకున్న భూములకు పరిహారం పెంచాలని మండలాఫీసు కాడ ధర్నా చేస్తే ఎట్లుంటుంది? ఏమన్నా సలహా ఇయ్యి’ ఒక పెద్దమనిషి నన్ను సలహా అడిగినాడు.‘మైలవరం డ్యామ్ నుండి మన పొలాలకు నీళ్లు విడిచి పదహైదేళ్లయింది. ఒక్కసారన్నా మన నీళ్ల హక్కు గురించి అడిగినామా! డ్యామ్ నీళ్లన్నీ ఫ్యాక్టరీలకు ఇచ్చి మమ్మల్ని ఎండబెడుతున్నారని ధర్నా చేసినామా? కాలువలకు నీళ్లొచ్చేటప్పుడు రెండు పంటలు పండించుకున్నది మతికి లేదా? వాన లేని కరువులో కూడా నమ్మకంగా ఒక పంటైనా వచ్చింది. ఆ నీళ్ల హక్కును మనం అడగకుండా ఎందుకు వదిలేసుకుంటున్నాం’ అనడిగిన. అందరూ నన్ను తిక్కోడ్ని చూసినట్లు చూసినారు. జయరామిరెడ్డి కల్పించుకుంటూ ‘ఆ నీళ్ల కత ఇప్పుడెందుకు లేవోయ్! ఇప్పుడు నీళ్ల అవసరం లేకుండా అందరూ బుడ్డసెనగ వేయడం మరిగినారు. వానాకాలం పోయేముందు అక్టోబర్ ఆఖర్లో విత్తనం వేస్తే, తర్వాత చలికి అదే పండుతుంది. నీళ్లవసరం ఎవరికీ లేదు గానీ, ఇప్పుడు ఈ హైవే భూముల పరిహారం గురించి చెప్పు’ అన్నాడు. ‘ఈ హైవే ఎవరికి లాభం? ఊర్లో పదిమందికి లాభమేమో, మిగతా అందరూ దాని నష్టాలను అనుభవిస్తారు’ అన్నాను. ‘నష్టమేముంది మామా! హైవే పడితే విజయవాడకు కార్లో నాలుగ్గంటల్లో పోవచ్చు’ అన్నాడు రాము.‘హైవే పక్కన నీ రెండెకరాలు 50 లక్షలకు అమ్మి 20 లక్షలతో కారు తేవాలనుకుంటున్నావేమో! కారు బంగారు బాతు కాదు, రెండెకరాల పంట పొలం మాదిరి గుడ్లు పెట్టడానికి. అయినా నీయట్లాటోళ్లు నలుగురు కార్లు తెచ్చుకున్నా రోజూ విజయవాడకు ఏం అడుక్కు తినడానికి పోతావురా! ఆరేడు గంటల్లో పోతే నష్టమొస్తుందా?’ అని అడిగేసరికి వాడు గతుక్కుమన్నాడు. ‘కారు కొనేవాడివి, ఏడాదికి ఒకసారో రెండుసార్లో విజయవాడకు నాలుగైదు గంటల్లో పోవచ్చని నువ్వు సంతోషపడొచ్చు. బస్సులో పోయే వాళ్లు ఆ భారం ఎందుకు మోయాల్రా! ఇక్కడి నుండి విజయవాడకు పది టోల్గేట్లు పెడతారు. టోల్గేట్ చార్జీల భారం అంతా బస్సు ప్రయాణికుల మీద పడుతుంది. ఈ టోల్ చార్జీలన్నీ ఎవడి కోసం కట్టాలి? ఎవడో హైవే అవసరమైన వాడి కోసం లక్షలాది సామాన్యులు ఎందుకు నష్టపోవాలి?’‘ఏందబ్బా నువ్వు ఇట్లా అంటావు! రోడ్లు అభివృద్ధికి చిహ్నం’ అని అందరూ అంటుంటే చెండ్రాయుడు అర్ధోక్తిలో అన్నాడు.‘రోడ్లు అభివృద్ధికి చిహ్నమే. ఎంతవరకు? ఊర్ల కోసం, ఊర్లో జనం కోసం రోడ్లు ఉండాలి. అంతేగాని రోడ్ల కోసం ఊర్లు అన్నట్లు మారకూడదు.’ ‘మాకేం అర్థం కాలే!’ చెండ్రాయుడు మళ్లీ అదే అర్ధోక్తిలో. మిగతావాళ్లంతా తమకు రుచించని మాటలు వింటున్నట్లు మొహాలు పెట్టినారు.‘హైవే వల్ల మన ప్రాంత ఖనిజ సంపదంతా రాష్ట్రాలు, దేశాలు దాటిపోతుంది. మన ఖనిజ సంపదతో మనకు పరిశ్రమలొస్తే మనకు మేలు గానీ, తరలిపోతే మనకేం లాభం? ఇట్లాంటివెన్నో నష్టాలు. మన ఊరి రోడ్డునే తీసుకుందాం. రెండేళ్ల కిందట దాకా సింగిల్ రోడ్డు. ప్రొద్దుటూరు నుండి కమలాపురం వరకు బస్సు తిరిగేది. ఈ రూట్లో ఉన్న ఊర్ల వాళ్ల మోటార్ సైకిళ్లు తిరిగేవి. అంతవరకు మనకు అవసరం. నిరుడు డబుల్ రోడ్డు వేసినారు. బస్సుతోపాటు కమలాపురం – ప్రొద్దుటూరు తిరిగే వాహనాల సంఖ్య పెరిగింది. ఏడెనిమిది కిలోమీటర్లు కలిసొస్తుందని కడపకు పోయే వాహనాలన్నీ ఇదే రూట్లో పోతున్నాయి. అది కూడా నష్టం లేదనుకుందాం. డబుల్ రోడ్డు కాగానే మన ఊరి పెన్నలో ఇసుక క్వారీ లీజుకు ఇచ్చినారు. ఆ ఇసుక వల్ల ప్రభుత్వానికి వచ్చేదెంతో గానీ, ఎమ్మెల్యే మాత్రం రేయింబవళ్లు పెద్దపెద్ద టిప్పర్లతో ఇసుక తీసుకుపోతున్నాడు. మన సంపదను ఎవడో దోచుకుపోతున్నాడు. ఏట్లో ఇసుక లేకుండా పోవడంతో భూగర్భజలం అడుగంటింది. నిన్న వేసవిలో నీళ్లు లేక ఎంత అలమటించామో గుర్తులేదా! ఈ టిప్పర్లు వాహనాల వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో తెలుసు కదా! మన ఊరిలోనే ఈ ఏడాదిలో నలుగురు యాక్సిడెంట్లో చనిపోయినారు. పల్లెలకు ఎంత వెడల్పు రోడ్లు అవసరమో అంతే వెడల్పు రోడ్లు వుంటే అభివృద్ధి. అది జనం కోసం. అంతకు మించిన వెడల్పు వేసినారంటే అది జనం కోసం కాదు. ఇంకెవరి కోసమో! ఆ నష్టాలను మాత్రం మనమందరం పంచుకోవాలి. రోడ్డు వల్ల వచ్చే లాభాలను వాళ్లెవరో దండుకుంటారు. హైవే కూడా అంతే’ నేను ఊరి రోడ్డు గురించి చెప్పేసరికి ఒకరిద్దరు ఆలోచనలో పడినట్లున్నారు. రచ్చబండ మీదున్న చాలామందికి నా మాటలు రుచించలేదు. ‘సరేలేవోయ్, మనం వద్దంటే ఆగుతుందా! ఆ పరిహారం పెంపు కోసం ధర్నా చేద్దాం! నువ్వు కూడా ఈరోజు ఊర్లోనే ఉండి రేపు మాతోపాటు రా! నీది యాభైయైదు సెంట్లు రోడ్డుకు పోయింది కదా!’ అన్నాడు జయరామి రెడ్డి రచ్చబండ దిగిపోతూ. నేనూ రచ్చబండ దిగి కల్లాల బయటున్న రోడ్డు మొహం పట్టిన, కడపకు పోయేందుకు. ‘ఏ అభివృద్ధి ఎవరికోసమో తెలుసుకోలేనంత అజ్ఞానంలోకి భ్రమల్లోకి జనాన్ని తోసేస్తున్నారు. ఆ జ్ఞానం ఎవరు కలిగించాలి?’ నాలో ముసురుకుంటున్న ఆలోచనలు.ఇంతలో రచ్చబండ మీద పెద్ద పెద్దగా మాటల అలికిడి వినిపించింది. వెనక్కు తిరిగి చూసిన. రచ్చబండ మీద నుండి అందరూ బిలబిలమంటూ దిగి తగ్గుబజారు దిక్కు పరుగులు తీస్తున్నారు. ఏమైందోననే ఆందోళన నాకు. వెనక్కు వచ్చి, జనంలో పోతున్న రామును కేకేసి పిలిచిన. వచ్చినాడు.నేను అడగక ముందే ‘చేల పంపకాల్లో హైవే పక్కన సగం భూమిని తనకివ్వడానికి ఒప్పుకోలేదని రామిరెడ్డి, కొండారెడ్డి ఏదో గొడవపడినారంట. ఆ గొడవలో రామిరెడ్డి గొడ్డలి తీసుకుని అన్న తలకాయ పగుల కొట్టినాడంట. రా! నువ్వూ!’ అంటూ పరుగు లాంటి నడకతో ముందుకు కదిలినాడు.నాకు విస్మయం కలిగింది. ‘ఎవరి కోసమో జరుగుతున్న అభివృద్ధి. సాధారణ జనాలకు అవసరం లేని, సంబంధం లేని అభివృద్ధి. తను సాగినంత పొడవునా గ్రామాల్లో ఇంకా ఎంతమంది అన్నదమ్ముల్లో చిచ్చు పెట్టిందో ఈ హైవే’ ఆలోచిస్తూ, కొండారెడ్డి ఇంటిదిక్కు వడివడిగా అడుగులేసిన. పడమట పొద్దు మునిగిపోతూ ఆకాశమంతా ఎర్రగావు లేచింది. ‘ఆ నీళ్ల కత ఇప్పుడెందుకు లేవోయ్! ఇప్పుడు నీళ్ల అవసరం లేకుండా అందరూ బుడ్డసెనగ వేయడం మరిగినారు. వానాకాలం పోయేముందు అక్టోబర్ ఆఖర్లో విత్తనం వేస్తే, తర్వాత చలికి అదే పండుతుంది. నీళ్లవసరం ఎవరికీ లేదు గానీ, ఇప్పుడు ఈ హైవే భూముల పరిహారం గురించి చెప్పు’ అన్నాడు. -
ఈ వారం కథ - ‘కంటి నిండా కునుకు’
ఈమధ్య రాత్రయితే సరిగా నిద్ర పట్టడంలేదు దుర్గారావుకి. పక్కమీద యిటు దొర్లా, అటు దొర్లా. కునుకు పట్టినట్టే పట్టి, మళ్లీ యెవరో లేపినట్టు ఉలిక్కిపడి లేచిపోతాడు. పిసరు కునుకు కోసం, చీకట్లో మూతపడని కళ్ళతో యెదురుచూపులు... మంచానికి ఆవైపు భార్య జయమ్మ ఒళ్లెరుగని నిద్ర. ఇల్లాలు ఇంటిపనంతా చేసుకుని, మామయ్యగారి గదిలో పక్కసర్ది , పెద్దాయనకి దుప్పటి కప్పి, మంచం పక్క నీళ్ల చెంబు వుందో లేదో చూసుకుని, ఏమైనా కావాలంటే పిలవండి మామయ్యా అని నిష్క్రమిస్తుంది. దుర్గారావు సంగతికొస్తే, ధనార్జనకి యెన్ని అడ్డతోవలు వున్నాయో అతనికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు మరి. కాకుల్ని కొట్టి గద్దలకి వెయ్యడం దుర్గారావుకి వెన్నతో పెట్టిన విద్య. అన్నట్టు, కథలోంచి పిట్టకథకి వెళ్లడం యెందుకూ..! దుర్గారావుకి నిద్రయితే పట్టలేదు కానీ బుర్రనిండా ఆలోచనలే. రేపు తెల్లారితే యెన్ని పనులు! తను కబ్జా చేసిన రైతుల భూముల కేసు కోర్టులో హియరింగు. పనికిమాలిన లాయరు మూడేళ్లుగా లాగిస్తున్నాడు తెమల్చకుండా. లాభం లేదు... పెద్దరైతుని లేపేస్తే సరి. అప్పటికీ ఓ పదో పరకో పడేస్తాను, పట్టుకుపోయి బాగుపడండ్రా అంటే వినరుకదా! విత్తనాలకి డబ్బుండదు... పైర్లకు మందులు కొట్టించలేరు, నాట్లకీ.. కోతలకీ కూలీలు దొరకరు. వాళ్ళ కష్టాలకి జాలిపడి, భూములు కబ్జాచేసి, తలాకొంచెం పట్టుకుపోదాం రండిరా అంటే, వింటేగా! పెద్దరైతుని లేపెయ్యడమే బెస్టు. అలాగే కష్టపడి చెరువులు పూడిపించి ఫ్లాట్లు కట్టిస్తే, ఏడాదిలో బిల్డింగు కుంగిపోడం యేమిటో.. కొన్నవాళ్ళ ఖర్మ కాదూ. బిల్డింగు కూల్చేదానికి నోటీసు యిప్పించేసి, అది కూల్చే కాంట్రాక్టు కూడా తనే సంపాదించడం యెంత కష్టం. జనాలకి విశ్వాసం లేదు. అంతెందుకు.. కన్న కొడుక్కి వుందా విశ్వాసం! లక్షలు తగలేసి ఇంజనీరింగు చదివిస్తే, యాభై లక్షల కట్నంతో వస్తున్న ఎమ్మెల్యే గారి మెల్లకన్ను కూతుర్ని చేసుకోడానికి వీడికి యేమాయ రోగం? ఎవరినో లవ్వు చేశాట్ట. ఆ పిల్లను తీసుకుని సీమకెళ్లి చచ్చాడు. పైగా ‘నాయనా, నీ పాపపు ఆస్తి నాకొద్దు, ఎవడికి రాస్తావో రాసుకో’ అని నీతులు కూడాను. కునుకుపట్టే వేళకి వీథి తలుపు చప్పుడు, టక టకా, టక టకా... ఈ వేళప్పుడు యెవరా అనుకుంటూ, దుర్గారావు తలుపు తీశాడు. తనంటే కిట్టనివాళ్లు యెవరైనా వచ్చి రెండు పోట్లు పొడుస్తారన్న భయం కూడా లేదు. చీకట్లో కలిసిపోయేలా నల్లటి ఆకారం.. బలిష్టంగా, కళ్ళలో యేదో మెరుపు. ‘మీరు..’ అంతకన్నా మాటపెగల్లేదు దుర్గారావుకి. ‘ష్.. గట్టిగా మాట్లాడకు, మీ ఆవిడ, పక్కగదిలో నాన్న.. లేచిపోతారు’ అగంతకుడి గొంతు చిత్రంగా వుంది. ‘ఎవరు నువ్వు? నీకు మా వాళ్ళు యెలా తెలుసు?’ అని అడగాలనుకున్నా అడగలేకపోయాడు దుర్గారావు. నల్లటి ఆకారం పరిచయం వున్నట్టు డ్రాయింగ్ రూమ్‌లోకి నడిచింది. మంత్ర ముగ్ధుడిలా వెనక దుర్గారావు! లైటు వెయ్యబోతున్న దుర్గారావుని వద్దంటూ సైగ చేసింది ఆకారం. గది కిటికీలోంచి మసక వెలుతురు. ‘అలా కూర్చో’ అది తిరుగులేని ఆజ్ఞలా అనిపించింది దుర్గారావుకి. నెమ్మదిగా, ధైర్యం కూడగట్టుకున్నాడు దుర్గారావు. ‘యెవరు నువ్వు? యీ వేళకి యెందుకొచ్చావు?’ నీరసంగా మాట పైకి వచ్చింది. అప్పుడు నవ్వింది ఆకారం. ‘మృత్యువు పేరు విన్నావా? వినుండవేమో కదూ, నేనే ఆ మృత్యువుని. నాకు వేళాపాళా వుండదు. వెళ్లాలనుకున్న చోటికి వెళ్లడమే నాపని.’ దుర్గారావు వులిక్కిపడ్డాడు. నమ్మలేడు, నమ్మి తీరాలి.. అదీ పరిస్థితి. ‘మనం కాసేపు మాట్లాడుకుందాం.. సరేనా?’ దుర్గారావు జవాబుని యెదురు చూడలేదు మృత్యువు. దుర్గారావు చేసిన వొక్కో అకృత్యాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది మృత్యువు. ఇది యెలా సాధ్యం! ‘నిన్ను తీసుకెళ్లాలి, కానైతే నీతోవున్న యింత పెద్ద పాపపు భారాన్ని మోసుకెళ్లడం కుదరదు. నీ ప్రయాణంలో లగేజ్ అనుమతించ బడదు. యెలాగా అని ఆలోచిస్తున్నా’ మృత్యువు ముఖంలో చిరునవ్వు. సరే మరో నాల్గయిదు రోజుల్లో వస్తా... సిద్ధంగావుండు...’ ఆకారం లేచి నిల్చుంది. ‘నువ్వు... నువ్వు యెవరు? కరోనావా?’ దుర్గారావు నీరసంగా అడిగాడు ధైర్యం కూడగట్టుకుని. ‘చెప్పాను కదా... నేను మృత్యువుని... యింతకీ నువ్వనే కరోనా యెవరో నాకు తెలీదు. త్వరలో కలుద్దాం!’ చీకట్లో వచ్చిన ఆకారం గాల్లో తేలిపోతున్నట్టు నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోయింది. దుర్గారావుకి అంతా అగమ్యగోచరంగా వుంది. మృత్యువు ఎందుకొచ్చినట్టు, యిప్పుడెక్కడికెళ్ళినట్టు! దుర్గారావు భయమంటే ఎరగడు. అలాంటిది రాత్రి జరిగిన సంఘటన పదే పదే మెదులుతూ వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్నది. తనని చూసి జనాలు భయపడుతుంటే.. దాన్ని గౌరవం అని భావించడం ఒక పొరపాటు. తను ఏం చేశాడని కొడుకు విశ్వాసం చుపించాలి? కూడపెట్టిన సంపద ఇప్పుడు ఎవరికి యివ్వాలి? ‘సరే తరవాత ఆలోచిద్దాం’ అనుకున్నాడు దుర్గారావు. కోర్టుకి టైమవుతున్నదని పూనకం వచ్చిన వాడిలా బయలుదేరాడు. దుర్గారావు కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తుండగా జరిగిపోయింది ఆ సంఘటన. కోర్టు నుండి బయటకి వెడుతున్న కారు విసురుగా దుర్గారావుని ఢీ కొట్టడం, దుర్గారావుకి స్పృహ తప్పడం! కోర్టు జనాలు అతడివైపు పరుగెత్తుకుంటూ రావడం కూడా అతనికి తెలీలేదు. దుర్గారావు కష్టం మీద కళ్లు తెరిచాడు. చేతికి, తలకి, కట్లు. గదిలో నర్సుల హడావిడి. అప్పుడు గమనించాడు దుర్గారావు. తనకి రక్తం ఎక్కిస్తున్నారు... మర్నాడు పోలీసులు... ఎంక్వైరీ... యథావిధి. వకీలు ఎంతచెప్పినా దుర్గారావు వినిపించుకోలేదు. ‘ఈ సంఘటన యథాలాపంగా నా పరధ్యాన్నం వల్లే జరిగింది. ఇందులో కారు నడిపేవాడి తప్పులేదు. కోర్టుకి హాజరయే హడావిడిలో నేనే చూస్కోకుండా బండికి అడ్డం పడ్డాను’ దుర్గారావు స్టేట్మెంట్ యిస్తుంటే, నల్లకోటు తలపట్టుకుని కూర్చుంది. డ్యూటీ డాక్టర్లు, నర్సుల వల్ల అర్థమైందేవిటంటే.. కోర్టు ఆవరణలో అపస్మారకస్థితిలో ఉన్న తనని ఓ నలుగురు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. డిపాజిట్ అదీ వాళ్ళే కట్టి ట్రీట్మెంట్ వెంటనే జరిగేలా చూశారు. నాలుగు యూనిట్ల రక్తం కూడా వాళ్ళే దానం చేశారు. తన వకీలుకూ కబురుపెట్టి రప్పించారు. ‘ఇంతసాయం చేశారు కదా మీకు ఈయన యెలా తెలుసు?’ అని డాక్టర్లు అడిగితే, ‘యెలా ఏవిటండీ ఆరి భూవులు దున్నుకుని బతికేటోళ్ళం... ఆరికి మేం మాకున్నంతలో కూసింత రగతం యిచ్చాము... అంతేకదా సారూ’ అన్నారట. మరి తన వకీలుగారు యిదంతా యెందుకు చెప్పలేదో. రేపో మాపో డిశ్చార్జ్ చేస్తారనగా దుర్గారావు వకీలుకి కబురు పెట్టాడు.. ‘వీలునామా రాయాలి’ అని. ‘ఇప్పుడేం తొందర? మీరు హాయిగా యింటికెళ్లి కోలుకున్నాక రాయచ్చు లెండి’ అంటున్న వకీలు మాటలకి దుర్గారావు అడ్డుపడ్డాడు. ‘అన్నట్టు వకీలు గారూ... రేపు వచ్చేప్పుడు మన కక్షిదారు పెద్దరైతుని కూడా రమ్మనండి!’ దుర్గారావు మొహంలో వకీలుకి యే భావమూ కనిపించలేదు. ‘ఇది నేను పూర్తి ఆరోగ్యంతో వుండగా, యెవరి ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయం...’ అంటూ వకీలు రాసింది చదివాక దుర్గారావు సంతకం పెట్టాడు. కాగితం మీద పెద్దరైతు, మరో ముగ్గురు వేలిముద్రలు వేశారు. దుర్గారావు కోరికమీద ఒక డాక్టరు, నర్సు సాక్షి సంతకాలు కూడా పెట్టేశారు. మనం కూడా ఆ రాసిందంతా యెందుకు చదవడం... రెండు మెతుకులు ముట్టుకు చూస్తేసరి.. అన్నం వుడికిందో లేదో...! ‘కోర్టు పరిధిలో వున్న కేసులన్నీ వాపసు తీకుంటున్నాను... భూములు.. పంటపొలాలు సర్వే ప్రకారం కౌలుదార్లకీ, పెద్దరైతుకీ చెందుతాయి. మా వకీలు ఆ మేరకి కావలసిన పత్రాలు సిద్ధం చేస్తాడు. తనవల్ల నష్టపోయిన ఫ్లాట్ వోనర్లందరికీ నష్టపరిహారం...! తేలికపడిన మనసుతో దుర్గారావు యిల్లు చేరాడు. వకీలు తదుపరి కార్యక్రమంలో మునిగిపోయాడు. రోజులు వారాలయిపోయాయి. కాలెండర్లో నెలలు తిరిగాయి... దుర్గారావుకి పడుకోగానే కంటినిండా కునుకు పడుతున్నది. యే అర్ధరాత్రో తలుపు చప్పుడు విందామన్నా నిద్రలో వినపడదు కదా! - వల్లూరి విజయకుమార్ -
గెలుపు
విక్రాంత్‌కి మెలకువ వచ్చింది. తాను చనిపోయాడని అతనికి తెలుసు. ఇది స్వర్గమా లేక మధ్యలో ఏదైనా మజిలీనా.. అనుకుంటూ చుట్టూ చూశాడు. అది ఒక గది. విక్రాంత్ ఆ గదిలోని ఒక కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏదో ఆఫీస్ రూమ్‌లా ఉందా గది. కాస్త దూరంలో ఉన్న ఇంకో చైర్లో ఎవరో వ్యక్తి కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో ఏదో రాసుకోవడం కనిపిస్తోంది. తాను చనిపోయిన విషయం విక్రాంత్‌కి స్పష్టంగా గుర్తుంది. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళుతుంటే.. స్కూటీ మీదనించి ఎగిరి పడటం, రోడ్డు పక్కనున్న డివైడర్‌కి తల గుద్దుకోవడం, ఆ ఫోర్స్ తెలియడంతోనే ప్రాణం పోతోందని అర్థంకావడం, కళ్ళ మీంచి కారిపోతున్న రక్త ధారల మధ్యలోంచి తనని గుద్దిన కారు వేగంగా అక్కడినించి వెళ్లిపోవడాన్ని మసక మసకగా చూడటం.. ఇవన్నీ అతనికి గుర్తున్నాయి. ఆ యాక్సిడెంట్లో అతను బతికే అవకాశమే లేదు. తాను నిజంగా చనిపోయాడని అతనికి తెలీడానికి కారణం అదొక్కటే కాదు. తనకి శరీరం లేని విషయం, ఇప్పుడు ఆలోచిస్తున్నది తన ఆత్మ మాత్రమేనన్న సంగతి అతనికి బాగా అర్థమవడం కూడా! తన సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ చాలా గొప్ప వృద్ధి పొందినట్టుగా, బతికి ఉన్నప్పటి అనుభూతికి భిన్నమైన గ్రాహ్యత ఏదో అతనికి తెలుస్తోంది. ఎక్కడున్నాడు మరి! కొంచెం వెనక్కి జరిగి కిటికీ కర్టెన్‌ని జరిపి బయటకి చూశాడు. అంతా చీకటి. వీధి లైట్లు కూడా వెలగడం లేదు. ఇంతలో అతనున్న గదిలో కదలికకి మళ్ళీ తిరిగి చూశాడు. ఆ గదిలో కూర్చుని ఉన్న వ్యక్తి.. భయం, అయోమయం నిండిన ముఖంతో కదిలిన కర్టెన్లోంచి లోపలికి వస్తున్న వాహనాల హెడ్ లైట్ల వెలుగును చూస్తున్నాడు. ఆ వెలుగు నీడల మధ్య ఆ వ్యక్తిని గుర్తు పట్టాడు విక్రాంత్. అతను రఘు. తండ్రి అతనికి విక్రాంత్ అని పేరు పెట్టినప్పుడు అందరూ నవ్వారట. ‘నీ రాతల పైత్యం నీ కొడుకు పేరులో కూడా కనిపిస్తోందిరోయ్’ అంటూ స్నేహితుల్లాంటి శత్రువులు వెటకారం చేశారట. ‘నా కొడుకు ఈ జీవితమనే యుద్ధాన్ని గెలిచి విక్రాంతుడవాలి. అందుకే ఆ పేరు పెట్టాను’ అనేవాడట తండ్రి. అతను స్కూల్ చదువుకి వచ్చినప్పుడు కూడా పిల్లలు ‘వికారం వికారం’ అని ఏడిపించేవారు. తెలుగు మాస్టారు విశ్వనాథంగారు మాత్రం ‘మంచి మోడరన్ పేరు పెట్టాడురా మీ నాన్న!’ అన్నరోజు తాను పడిన సంతోషం ఇంకా గుర్తుంది విక్రాంత్‌కి. ఇంటికెళ్లి తండ్రికి ఎంతో గొప్పగా చెప్పాడు ఆ విషయం. మురిపెంగా నవ్వి ముద్దు పెట్టుకున్న తండ్రి, ప్రేమగా, గారంగా తనని చూసుకున్న తండ్రి అనుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు. పెద్దగా ఆస్తులేవీ లేని, కో ఆపరేటివ్ బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న తండ్రికి సరైన వైద్యం అందలేదు. అసలు రోగమేమిటో కూడా తెలీకుండానే నెల తిరక్కుండా తననీ, అమాయకురాలైన అమ్మనీ అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క మేనమామే వాళ్ళకి దిక్కయ్యాడు. ‘ఒక్కడే మగపిల్లాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది’ అని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడం విక్రాంత్‌కి తెలుసు. ఆ మేనమామ కొడుకే రఘు. రఘు ముఖంలో కనిపిస్తున్న ఆ భయం చూస్తుంటే విక్రాంత్‌కి అదో విధమైన ఆనందం కలిగింది. మెల్లగా కర్టెన్ వదిలేశాడు. రఘు ఓసారి గదంతా కలియజూసి, తిరిగి రాసుకోవడం మొదలుపెట్టాడు. మరోసారి కర్టెన్ జరిపి రఘు రియాక్షన్ ఏమిటో చూడాలనిపించింది విక్రాంత్‌కి. ‘చిన్న పిల్లాడిలా ఏంటిది!’ అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. చనిపోయాడు సరే, తన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? స్వాతి ఎంత కంగారు పడుతూంటుందో, తను యాక్సిడెంట్లో చనిపోయిన విషయం ఇంకా తెలిసిందో లేదో, సహజ తన కోసం ఎదురు చూసీ చూసీ నిద్రపోయి ఉంటుంది. సూపర్ మార్కెట్లో ఆ ఉద్యోగం వల్ల వచ్చే సంపాదనతో గడవక, పిజ్జా డెలివరీలు చేస్తుండటంతో ఇంటికి వెళ్ళడానికి ఒక టైమంటూ లేకుండాపోయింది. తను ఎప్పటిలాగే తిరిగి వస్తాడని అనుకుంటూండి ఉంటుంది స్వాతి. ఎదురుగా టేబుల్ మీద ఉన్న సెల్ మోగడంతో విక్రాంత్ అటువైపు చూశాడు. రఘు ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏం విన్నాడో గానీ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ‘ఎప్పుడు? ఎక్కడ? వస్తున్నా...’ అంటూ రూమ్ లోంచి బయటకి పరుగుతీశాడు. తిరిగి చూసేసరికి హాస్పటల్లో ఉన్నాడు విక్రాంత్. ఎదురుగా బెడ్ మీద పదిహేడు, పద్దెనిమిదేళ్ల అబ్బాయి వెంటిలేటర్ మీద కనిపించాడు. దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్. ముఖానికి కూడా బాగా గాయాలయ్యాయి. బతకడం కష్టంలాగే అనిపిస్తోంది. తర్వాతి నిమిషంలో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రఘుతో మాట్లాడుతూండటం కనిపించింది విక్రాంత్‌కి. ఈసారి హాస్పిటల్‌లోని విజిటింగ్ రూమ్‌లో ఉన్నాడు విక్రాంత్. ఈ మార్పులు, ప్లేస్‌లు, టైమ్ ఒక్కసారిగా ముందుకు జరిగిపోవడం ఇవన్నీ సహజంగానే అనిపిస్తున్నాయి విక్రాంత్‌కి. బతికి ఉన్నప్పుడే కనుక ఇలా జరిగి ఉంటే, తనకేవో అద్భుత శక్తులు లభించాయని అనుకునేవాడేమో! ‘చాలా స్పీడ్‌గా వెళ్లి.. ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు. పైగా డ్రింక్ చేసి ఉన్నాడు. మైనర్ కదా. అసలు కారెలా ఇచ్చారు మీరు అబ్బాయికి?’ ఇద్దరిలో కొంచెం పొడుగ్గా ఉన్న పోలీస్ అడుగుతున్నాడు రఘని. ‘వాడు కారు తీసుకెళ్లిన విషయమే నేను గమనించలేదు సార్. ఎప్పుడు తీశాడో ఏమో!’నిజమో అబద్ధమో తెలీదు గానీ రఘు శరీరం వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కుర్రవాడు రఘు కొడుకన్నమాట. పోలీస్ ఇంకా గట్టిగా గదమాయిస్తున్నాడు. కొంచెం పక్కకి తిరిగి చూస్తే కాస్త అవతలగా చైర్లో కూర్చుని కనిపించింది రేఖ. ఎటో చూస్తోంది. ఆమె శరీరంలో అసలు చలనం ఉందా అనిపిస్తోంది. కళ్ళు ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి. చెంపల మీదనించి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె వల్లనే కదా తను దొంగయ్యాడు! ఒకే కాలేజ్‌లో కలిసి చదువుకున్నారు విక్రాంత్, రఘు, రేఖలు. అప్పట్లో అమ్మాయిలు.. అబ్బాయిలతో పెద్దగా మాట్లాడేవారు కాదు. లైబ్రరీ బుక్స్‌లో అక్కడక్కడా కవితలు రాసి కింద పేరు రాసుకునేవాడు విక్రాంత్. అలా చూసిందట రేఖ.. అతని కవిత ఒకటి. నిజానికి అది కవిత కూడా కాదు, ఏదో ఒక ఆలోచనలాంటిది అంతే! అలా ఏదైనా ఊహ తోచినప్పుడు ఒక పుస్తకంలోనో, అక్కడో ఇక్కడో రాసేస్తూ ఉండేవాడు. లైబ్రరీ పుస్తకంలో రాసింది ఆమెకి బాగా నచ్చిందట. వచ్చి పలకరించింది. మెల్లగా పరిచయం పెరిగింది. అది ఇష్టంగా మారింది. ప్రేమ మాటలూ, చూపులూ దొర్లాయి. ప్రపంచం అంత అందంగా అంతకు ముందెప్పుడూ కనిపించలేదు విక్రాంత్‌కి. కానీ... అనుకోకుండా ఓ రోజు కాలేజ్‌లో ఇన్స్పెక్షన్ జరిగింది. అతని బ్యాగ్‌లో, రాబోయే సంవత్సరపు పరీక్ష పేపర్ దొరికింది. విక్రాంత్ కాలేజ్నించి ఎక్స్పెల్ అయ్యాడు. ఇంట్లో కూడా బీరువాలో ఉండే వెండి కంచం కనిపించకుండా పోయింది. మెడ పట్టి గెంటకపోయినా మేనమామ కాస్త మర్యాదగానే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అప్పటికే అతని తల్లి చనిపోయి రెండేళ్ళవుతోంది. ఉండటానికి చోటు లేక, తినడానికి తిండి లేక ఫుట్‌పాత్ మీద పడుకున్నాడు నాలుగైదు నెలలు. చివరికి కూలి పనికి వెళ్ళాడు ఆకలి తీర్చుకోవడానికి. కానీ అన్నింటికంటే పెద్ద బాధ రేఖ కోసం పడ్డదే. ఆమె మళ్ళీ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకో కూడా అతనికి తెలీదు. ప్రేమలో ఉన్నామన్న ఆ భావం వల్ల, అది పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ కంటే ఏదీ ఎక్కువ కాదేమో! నిద్ర పట్టేది కాదు. ఒకటే దుఃఖం. ఏం చెయ్యాలో ఎందుకు బతకాలో తెలీని స్థితి. చివరికి ఎలాగో అందులోంచి బయట పడ్డాడు. జీవితంలో కొంత స్థిరపడ్డాడు. తనలాగే స్వాతికి కూడా తల్లితండ్రులు లేరు. కులం ఒక్కటీ లెక్క చూసుకుని ఆమెని తనకి ముడేసి వదిలేసి, చేతులు దులుపుకున్నారు ఆమె దగ్గరి బంధువులు. తమ మధ్య అద్భుతమైన ప్రేమ బంధం ఏర్పడకపోయినా ఒక ఒప్పందంలాంటి జీవితం ఉంది. ఒకరికి ఒకరున్నారన్న ధైర్యం, ఆసరా ఉన్నాయి. సహజ పుట్టాక ఆ బంధం మరింతగా బలపడింది. ఇప్పుడు స్వాతి ఒంటరి. పైగా పసితనం ఇంకా వీడని సహజ బాధ్యత ఒకటి. స్వాతి పెద్దగా చదువుకోలేదు. తను లేకుండా ఎలా బతుకుతారో ఇద్దరూ...! అతనా ఆలోచనలో ఉండగానే ఏదో ఒక సందేశం లాంటిది అడ్డు తగిలింది. ‘నీ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి’ అంది అదృశ్య శక్తి. ‘ఏమిటవి?’ అన్నాడతను, జరుగుతున్నది అతి సహజమైన విషయంలాగా. ‘ఆ కుర్రవాడిని బతికించే చాయిస్ నువ్వు తీసుకుంటే పదేళ్ల పాటు ఒక చీకటి ప్రదేశంలో ఆకలి దప్పికలతో, ఒంటరితనంతో బాధ పడుతూ బతకాల్సి వస్తుంది’ అందా శక్తి. అంటే నరకమా... అనుకున్నాడు. అంతలోనే అవన్నీ మనిషిగా ఉన్నప్పటి నమ్మకాలని గుర్తొచ్చి, ‘మరి రెండో చాయిస్ ఏమిటీ?’ అడిగాడు. కుర్రవాడి చావుకి అతన్ని వదిలేసి నీదారి నువ్వు చూసుకుంటే ఆకలి దప్పికలు లేని వెలుగులోకంలో ఎప్పటికీ ఉండిపోయే అవకాశం. స్వర్గమన్నమాట... ఈసారి కావాలనే అనుకున్నాడు. ‘ఎందుకు అలా? మంచి పని చేస్తే శిక్షా! ఇదేం న్యాయం?’ అన్నాడు. ‘కుర్రవాడికి ఆయుష్షు లేదు. నీ కరుణతో అతన్ని బతికించి ఆ శిక్ష నువ్వు తీసుకోగలవా?’ అంది అదృశ్య శక్తి. ‘నిర్ణయం పూర్తిగా నీ ఇష్టం’ అంటూ మౌనం వహించింది. కళ్ళ ఎదురుగా మళ్ళీ రేఖ కనిపించింది. అప్పట్లో ఆమె తనని ఎందుకు దూరం పెట్టిందో తెలీలేదు. నిన్న చనిపోయే వరకు కూడా ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క చాలా బాధపడేవాడు. ఇప్పుడు ఎంతో సహజంగానే, అప్పట్లో అన్నీ చూసినట్టుగానే తెలుస్తోంది.రఘు... రఘు కూడా ఆమెని ఇష్టపడ్డాడు. విక్రాంత్‌కి ఆమె దగ్గర కావడం సహించలేకపోయాడు. ఆ క్వశ్చన్ పేపర్ విక్రాంత్ బ్యాగ్‌లోకి రావడానికి, ఇంట్లో వెండి కంచం పోవడానికి కూడా రఘునే కారణం. కవిత్వం కూడా రఘు రాసిందే విక్రాంత్ దొంగిలించినట్టుగా ఆమెని నమ్మించాడు. విక్రాంత్‌ని చూసి అంతో ఇంతో రాయాలని రఘు కూడా ప్రయత్నించేవాడు అప్పట్లో. విక్రాంత్‌ని రోడ్డు మీద పడేశాకా, జీవితంలో స్థిరపడ్డాకా విక్రాంత్ పాత కవితల పుస్తకాన్ని అచ్చు వేయించుకుని సో కాల్డ్ సాహితీ ప్రపంచానికి దగ్గరయ్యాడు. ఒక కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని కొడుకుని బతికిస్తే తనకి పదేళ్ల నరకం. తనకి ఎంతో ద్రోహం చేసినవాడికి మంచి చేసే అవకాశం. తన గొప్పతనానికి పరీక్ష. ఇప్పుడు తనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే మాత్రం తను కోల్పోయిన జీవితం వెనక్కి వస్తుందా! తను పడ్డ బాధ, కష్టాలు మాయమై పోతాయా! చీకటీ, ఆకలిదప్పికలూ తనకి కొత్తేమీ కాదు. ఇంకో పదేళ్లు భరిస్తే ఒక చిన్న కుర్రవాడు బతుకుతాడు. నిండు జీవితాన్ని అనుభవిస్తాడు. ఇద్దరు మనుషులకి కడుపు కోత తప్పుతుంది. అది రఘు కన్న ప్రేమ అయితేనేం... కత్తికి కత్తి, కన్నుకి కన్ను ఎలా సమాధానం అవుతాయి! తిరిగి పొడిస్తే పడిన పోటు మానిపోదు. అవతలి కన్ను కూడా పోగొడితే, పోయిన చూపు తిరిగి రాదు. నిర్ణయం తీసుకోవడానికి విక్రాంత్‌కి ఎక్కువ సమయం పట్టలేదు. లేకపోతే పట్టిందా... ఏమో... ఆ లెక్క ఇప్పుడు పెద్దగా తెలీడం లేదు. ‘సరే. నరకమే’ అన్నాడు అదృశ్య శక్తితో. అప్పుడు ఆ శక్తి ఇంకో విషయం కూడా చెప్పింది. ఈసారి ఆ కాస్త కూడా ఆలోచించకుండానే, ‘అయినా పర్లేదు’ అన్నాడు. అప్పుడే అతనికి ఒక విజన్ వచ్చింది. కలలాగా భవిష్యత్తు కనిపించింది. తన కొడుకు బతకడానికి కారణం విక్రాంత్ అని రఘుకి తెలియడం, విక్రాంత్ కుటుంబాన్ని ఆదుకుంటానని అతను మాట ఇవ్వడం, అంతేకాక సహజ తన ఇంట్లోనే తన బిడ్డలా పెరుగుతుందని చెబుతూ రఘు, విక్రాంత్ కూతుర్ని కన్నీళ్లతో దగ్గరికి తీసుకోవడం... ‘ఆపండి!’ అన్నాడు విక్రాంత్ వెంటనే. ‘ఇంకా తనకి మానవ సహజమైన రియాక్షన్స్వదిలినట్టు లేవు’ అనుకున్నాడు. ‘ఈ చాయిస్ తీసుకోవడానికి నాకు ఒక కండిషన్ ఉంది’ అన్నాడు విక్రాంత్. ఏమిటో చెప్పమంది అదృశ్య శక్తి. ‘నాకారణంగా రఘు కొడుకు బతుకుతాడన్న విషయం రఘు కుటుంబానికి తెలియకూడదు’ అన్నాడు. ‘నీ కుటుంబం ఏమవుతుంది?అతను ఆదుకుంటాడు కదా’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్. ‘సరే’ అంది అదృశ్య శక్తి. తండ్రి పోయాక తల్లి చెయ్యి పట్టుకుని మేనమామ ఇంటికి వెళ్లినప్పటినించీ అక్కడ ఎదుర్కొన్న అవమానాలన్నీ గుర్తొచ్చాయి అతనికి. పరాయి ఇంట్లో ఉంటూ, తింటూ, ఎంత చాకిరీ చేసినా, పెద్దగా మాటల రూపంలో వినకపోయినా, అవతలినించి ఎదురొచ్చిన నిర్లక్ష్యం, చులకన భావం, విసుగులూ, అసహనాలూ, లోకువతనాలూ అన్నీ అతన్ని ఒక్కపెట్టున చుట్టుముట్టాయి. ఆ బెంగతోనే కదా అతని తల్లి బతికున్నప్పుడు కూడా చనిపోయినట్టే ఉండేది. అటువంటి స్థితి మళ్ళీ స్వాతికి, సహజకి రాకూడదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఏమో అది అతనికి తెలీదు. ఇంతలో ఎవరో చిటికె వేసినట్టుగా చాలా వేగంగా కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అతను చూస్తూ నిలబడ్డాడు. విక్రాంత్ ఆర్గాన్స్‌తో రఘు కొడుక్కి సర్జరీ అవడం, కుర్రవాడు తొందరలోనే కోలుకోవడం, ఆర్గాన్స్డొనేట్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని తలుచుకుని రఘు, రేఖ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకోవడం... అలా సెకన్ల మీద అతని కళ్ళ ముందు... కాదు కాదు ఊహ ముందు కదిలిపోయాయి. ఇక ఇప్పుడు చీకటిలోకానికి ప్రయాణం. ఆ ప్రయాణంలో మరో విజన్ కలిగిందతనికి. మరో భవిష్యత్ దృశ్యం. స్వాతి, సహజ.. ఇండియాలో ఒక పెద్ద చైన్ అఫ్ హోటల్స్‌కి ఓనర్స్. వాళ్ళు ఎంతో సంతోషంగా, దర్జాగా, హుందాగా జీవిస్తున్నారు. తనకి తెలుసు. స్వాతి దగ్గర ఆ శక్తి ఉంది. ఆమె వంటలు చాలా బాగా చేస్తుంది. అతను పోయిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ మెల్లగా పచ్చళ్ళు చెయ్యడం, ఉద్యోగులకి క్యారేజ్‌లు వండి పంపడం మొదలుపెట్టింది స్వాతి. అది చాలా తొందరగా వృద్ధిలోకి వచ్చి ఒక హోటల్ కూడా పెట్టింది. అది చైన్స్గా విస్తరించింది. సహజ కూడా ఎంబీఏ చేసి ఆ బిజినెస్ నడపడంలో తల్లికి సహాయంగా ఉంది. విక్రాంత్ మనసు తృప్తితో నిండిపోయింది. ఈ బెంగ కూడా ఇక తనకి అవసరం లేదు. ‘రఘు కుటుంబానికి చెందిన భవిష్యత్తు కూడా చూస్తావా?’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్. అది తనకి సంబంధం లేని విషయం. తన ప్రయాణం ముగుస్తోందని విక్రాంత్‌కి అర్థం అయింది. అతను మెల్లగా.. ఏమీ లేని, ఏమీ తెలియని స్థితిలోకి జారిపోతున్నాడు. ఆ చివరి నిమిషంలో అతనికి ఓ విషయం అర్థమయింది. బహుశా ఆ చీకటి లోకం గురించి అదృశ్య శక్తి చెప్పిందంతా ఒక పరీక్ష. తాను ఆ నరకానికి వెళ్ళబోవడం లేదు. అలాగని స్వర్గంలోనూ అడుగు పెట్టడం లేదు. నిజానికి ఆ రెండూ ఉన్నాయో లేదో కూడా! తాను పూర్తిగా ఒక తెలియనితనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేకపోవడంలోకి. ఒక కథని, తన కథని తనే రాసుకుని పూర్తి చేసుకుంటున్నాడు. జీవితంలో ఓడిపోయి మరణంలో గెలుస్తున్నాడు. తన తండ్రి పెట్టిన పేరుని సార్థకం చేసుకుంటున్నాడు. ఆ ఆఖరి క్షణంలో అదృశ్య శక్తి చెప్పిన ఇంకో విషయం గుర్తొచ్చింది అతనికి. తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసి, అతని చావుకి కారణమైంది రఘు కొడుకే. ఆ కంగారులో కాస్త దూరం వెళ్ళాకా, ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు.ప్రయాణంతో పాటుగా, అతని ఆలోచన కూడా అక్కడితో అలా అంతమైపోయింది. ఇప్పుడతను పూర్తిగా విక్రాంతుడయ్యాడు. -భవానీ ఫణి -
సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..?
గీ సీమాంధ్ర ఎంపీలకు సిగ్గెప్పుడత్తదో. వాళ్లు ఏమన్న మనుసులేనా.. గట్లజేత్తరా ఏంది అనుకుంటనే రాయలింగు తిట్లపురాణం అందుకున్నడు. అగ్గో, పొద్దు, పొద్దుగాల్నేవన్లో గట్లతిడ్తాన్నవేందోయ్, ఏం జరిగిందేం ది, ఎవల్నో మస్తు తిట్టవడ్తివనుకుంట ఇంటి దగ్గర గల్మల గూసొనున్న రాయలింగు దగ్గరికచ్చిండు హన్మంతు. నీకు దెల్వదా ఏంది, తెలంగాణ కోసం ఎన్నేండ్ల సంది కొట్లాడ్తన్నం జెప్పు. నోటికాడికచ్చిన ముద్దను లాక్కుంటే ఎవలికైనా ఎట్లనిపిత్తది. గుండె మండదా ఏంది. పార్లమెంట్ల బేస్తా రం తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నలు. అగో గాళ్ల తీరుజూసే నాకు కోపమత్తందోయన్నడు రాయలింగు. ఔ మల్ల.. గా ది నాం నాడే కదా సారక్క గద్దెకచ్చింది. గంత మం చి రోజు పార్లమెంట్ల బిల్లు పెట్టి పాస్జేత్తమని హోంమంత్రి షిండే జెప్పిండు గద. తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మలకు సుత మొక్కుకున్నం. ఇంట్లోల్లమంతా జాతరకు పోయినం. ఏమైందోయ్ తెలంగాణ రాలేదా అనడిగిండు హన్మంతు. గంతట్లనే లచ్చయ్య పలకాయ నములుకుంట రాయలింగు, హన్మంతు దగ్గరకచ్చిండు. పొద్దుగాల్నే ఇద్దరు దెవ్సం మీద పడ్డరేందనన్నడు లచ్చయ్య. ఇగో లచ్చయ్య దెవ్సం కాడి ముచ్చట్లు నీకెర్కలేదు గని గీడ గూసో రాయలింగు జెప్తడు మనమిందామని హన్మంతు అనంగనే సరేనన్నడు. గల్మదగ్గర గా ముగ్గురు గిట్ల శెనారం ముచ్చట్లు పెట్టిండ్లు. హన్మంతు : ఔను గని రాయలింగు, సమ్మక్క-సారక్క జాతరకుపోయి తెలంగాణ ఊసే మర్సిపోయినం. పార్లమెంట్ల బిల్లు పెట్టిండ్లేమో నెగ్గిందా, లేదా? ఏం జరిగిందోయ్ జెప్పు. రాయలింగు : పార్లమెంట్ల బిల్లు పెట్టిండ్లు కని ఎటుగాకుండ పొయిందోయ్. హన్మంతు : గట్లేట్లైంది. తెలంగాణ ఎంపీలు ఏం పట్టించుకోలేదా ఏంది. జెర కళ్లకు గట్టినట్లు జెప్పరాదోయ్. లచ్చయ్య : ఐతే... రాయలింగు తెలంగాణ రాదన్నట్టా ఏంది? రాయలింగు : ఇగో ఇద్దరినుండ్లి. బేస్తారం పార్లమెంట్ల బిల్లు పెడ్తన్నమని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన జేత్తండు. తెలంగాణ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్, హోంమంత్రి చుట్టూరా ఏం జరగకుండా అడ్డంగా బందోబస్తుగా నిలుసున్నరు. గంతట్లనే జరగకూడంది జరిగిందోయ్. హన్మంతు : అయ్యో.... ఏం జరిగిందో నస్కకుండ జెప్పరాదోయ్. రాయలింగు : ఏం జరిగిందంటరా, పార్లమెంట్ల ఎన్నడన్న ఎంపీల కండ్లల్ల కారంపొడి జల్లిండ్ల, కత్తులు పట్టుకచ్చినట్లిన్నరా, లేదుగదా. గా దినాం మాత్రం గట్లనే జరిగింది. లచ్చయ్య : ఏందీ..! గంతపని జరిగిందా ఎవలు జేసిండ్లేంది. రాయలింగు : ఏవలేంది గా సీమాంధ్రల ఉన్నలుజూడు లగడపాటి రాజగోపాల్, మోద్గుల వేణుగోపాల్‌రెడ్డి, సీఎం రమేష్ ఇంకా పది, పన్నెండు మంది ఎంపీలు గంత నీచానికి ఒడిగట్టిండ్లు. హన్మంతు : ఎవలకేం గాలేద్గదా? రాయలింగు : ఎందుకు గాలేదు. కారంపొడి కళ్లల్ల జల్లంగనే స్పీకర్ మీరాకుమార్, తెలంగాణ ఎంపీల కండ్లల్ల నీళ్లచ్చినయ్. మంటలు లేచి దగ్గుకుంట పార్లమెంట్లకెళ్లి బయటికచ్చి గాయ్‌గాయ్ అయిపోయిండ్లు. మస్తులొల్లి జరిగిందనుకో. లచ్చయ్య : మరి గట్ల జరగకుండా మార్షల్స్ ఉంటలు గద, గాళ్లేం అడ్డుకోలేదా ఏంది? రాయలింగు : ఎంపీలు గట్లజెత్తరని ఎవరననుకుంటరా, మామూలుగానే సభ జరుగుతుదనుకొని మార్షల్స్ జాగ్రత్తల లేకుండే. గదే మోఖ అనుకొని తెలంగాణ బిల్లు చర్చకు రాకుండాజేసిండ్లు. హన్మంతు : గట్లజేసిన ఎంపీలను స్పీకరమ్మ ఏమనలేదా? రాయలింగు : ఎందుకనలేదు, ఎవలెవలు లొల్లిజేసిండ్లో, కండ్లల్ల కారంపొడి జల్లిండ్లో, కత్తుల పట్టుకొనచ్చిండ్లెవలో గాళ్లను సభ జరిగేదాక సస్పెన్షన్ చేయిండ్లు. హన్మంతు/లచ్చయ్య : మంచిపని జేసింది. ఆ తల్లి సల్లంగుండా. మరి కమలం పువ్వు గుర్తోలేందో అంటండ్లట. రాయలింగు : ఔనవును. మొన్నటి దాక కాంగ్రెస్ పార్లమెంట్ల బిల్లు పెడితే మేం మద్దతిత్తమన్నలు. ఇప్పుడేమో పువ్వు గుర్తోళ్లు ముగ్గురు మూడు రకాలు మాట్లాడుతండ్లు. లచ్చయ్య : ఏమంటండ్లేంది. రాయలింగు : లొల్లి జర్గంగ బిల్లెందుకు పెట్టిండ్లని అద్వానంటండు. స్పీకర్ పార్లమెంట్ల బిల్లెప్పుడు పెట్టిండో తెల్వదని సుష్మాస్వరాజ్ అన్నది. ఇగ రాజ్నాథ్సింగేమో తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడున్నం. ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్తండు. గిట్ల ముగ్గురు మూడు రకాలుగా ఒకలకొకలకు పొంతన లేకుండా మాట్లాడుతండ్లు. హన్మంతు : మరింతకుముందుగాల కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిత్తమని చెప్పినోళ్లు గిట్లేందుకంటండ్లు. రాయలింగు : కాంగ్రెస్ బిల్లు పెట్టకుంటనేమో పెడ్తలేరని పువ్వుగుర్తోలు దెప్పిపొడిసిండ్లు. బిల్లు పెట్టినంక ఏమో డొంకతిరుగుడు మాటలంటండ్లు. లచ్చయ్య : పువ్వుగుర్తోళ్లు గట్లేందుకంటండ్లు. రాయలింగు : ఇప్పుడు తెలంగాణ అచ్చిందనుకో ఆ మంచితనమంతా కాంగ్రెసోళ్లకు పోతది. గట్ల ఇసారం జేసుకొని బిల్లు పెట్టినంక మనిషికో మాట మాట్లాడుతండ్లు. హన్మంతు : మరైతే తెలంగాణ రాదా? రాయలింగు : ఎందుకు రాదనుకుంటండ్లు. ఎవలెన్ని జేసిన తెలంగాణ అచ్చుడు ఖాయం. సోమారం సంది మళ్ల పార్లమెంట్ సమావేశాలు జర్గుతయ్. లొల్లిజేసిన ఎంపీలను ఇప్పటికే సస్పెండ్ జేసిండ్లు. ఇంకెవలు లొల్లిజేయకుండా కట్టుదిట్టం జేత్తరట. గట్ల అందరిని కట్టడిజేసి చర్చకు పెట్టి తెలంగాణ ఇత్తరట. హన్మంతు/లచ్చయ్య : ఏమో మళ్ల ఏం జర్గుతదో ఏమో.. గప్పటిదాకైతే దెవ్సం మీద జరిగిన ముచ్చట్లు జెర మా సెవుల పెట్టు రాయలింగనుకుంట ఇండ్లకుపోయిండ్లు.