ఈవారం కథ: క్షమాఛాయ | This week's story | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: క్షమాఛాయ

Published Sun, Dec 15 2024 10:57 AM | Last Updated on Sun, Dec 15 2024 10:57 AM

This week's story

ఆకాశంలో గురకొయ్యలు టైమ్‌ నాలుగైనట్టుగా నిలబడి మిణుకు మిణుకుమంటున్నాయి. కోళ్ళెందుకో ఇంకా సడి మొదలెట్టలేదా రోజు. కీచురాళ్ళ రొద మాత్రం దారి పొడవునా కొనసాగుతానే ఉంది. చేపల చెరువు వైపు అంత చీకట్లో అంచనా కొద్దీ వెళుతున్న కొండా దొంగల్ని పట్టుకొనే టైమ్‌ ఇది కాదేమోనని అనుమానపడ్డాడు. ఇంకొంచెం ముందు రావలసిందనుకొంటా అనుకున్నాడు. బండేసుకొస్తే సౌండ్‌కి తెలిసిపోతుందని, చీకట్లో కనిపించకుండా ఉండాలని, బూడిద రంగు షర్ట్, అదే రంగు ప్యాంట్‌తో వచ్చాడు. కొండాకి తాను శారీరకంగా దృఢంగా, ఎత్తుగా ఉంటానని, ధైర్యం ఎక్కువని, ఒక్కసారి దొంగలు తనని చూశారంటే చాలు దడ పుట్టాల్సిందే అనే గట్టి నమ్మకం. సైకిల్‌ రోడ్డు దిగి కాలిబాట పట్టేసరికి ఎగుడు దిగుడుగా ఎగురుతూ వెళ్తున్నట్టుంది. ఇంకెంత దూరంలో చెరువు ఉందో అని దృష్టి సారించబోయాడు కొండా.

‘నాన్నా’ భయంతో వణుకుతున్నట్టుగా పెద్ద కేక వినపడింది. ఎవరది! ఈ టైమ్‌లో? పైగా ఎవరో చిన్నపిల్లాడి అరుపులా ఉంది! చీకట్లో దూరంగా కొంచెం ఎత్తుగా చెరువు కట్ట కనిపిస్తూంది.‘నాన్నా’ ఎంతో ఆర్తిగా ఉందా పిలుపు. కీచుగా వినపడటంతో అటుగా సైకిల్‌ పోనిద్దామని చూస్తే సైకిల్‌ వెళ్ళేలా లేకపోవటంతో దాన్నక్కడే వదిలేసి రెండడుగులు వేశాడో లేదో మరోసారి ‘నాన్నా, రా నాన్న..’ దీనాతిదీనంగా ఉన్న ఆ అరుపు కొండాని తుప్పలకడ్డంగా పరుగందుకునేలా చేసింది. చెరువు కట్టకి దగ్గరలో బురద గుంతలు ఉన్నాయని గుర్తొచ్చి, అక్కడి నుంచేనా ఈ కేకలు అనే అనుమానంతో మరింత వేగంగా అడుగులేశాడు కొండా. రెండు నిమిషాల్లోపే అక్కడికి చేరుకొని, సెల్‌లో లైట్‌ ఆన్‌ చేసి చూసి ఆశ్చర్యంగా, ‘వోరివోరి ఊబిలో పడిపోయావా’ అన్నాడు.

మెడ, తలా.. పైకి లేపి ఉంచిన ఒక చెయ్యి.. మాత్రమే కనిపిస్తున్నాయి. చేతికందనంత దూరంలో ఉన్నాడు. అటూ ఇటూ ఎటు చూసినా కర్రా గట్రా ఏం దొరికేలా లేదని అర్థమై పోయింది కొండాకి. భయంతో దిగాలు ఏడుపు, చూస్తుండగానే ఇంకొంచెం బురదలోకి కూరుకుపోయినట్టున్నాడు వాడు. వెంటనే ప్యాంట్‌ తీసి ఒక కాలి అంచు తను పట్టుకుని రెండో కాలి అంచు వాడికి అందేలా విసిరేశాడు.
‘చేత్తోనే కాదు నోటితో కూడా పట్టుకోరోయ్‌’ అరిచాడు కొండా. చావు భయంతో ఉన్నాడని వాడికి తెలియదు కానీ ఉన్నాడు. దాంతో చెప్పింది చెప్పినట్టు చేశాడు వాడు. బురద నుండి మెల్లగా తప్పించి చేతికి అందేంత దూరంలోకి రాగానే పట్టుకుని బలంగా తన వైపు లాక్కున్నాడు కొండా. బయటికిరాగానే వాడు ‘నాన్నా’ అంటూ బురద అంటి ఉన్న చేతులు కొండా మెడ చుట్టూ వేసి ఏడవసాగాడు. వాడు షాక్‌లో ఉన్నాడని అర్థమైంది. 

‘భయం లేదు.. బయటకు వచ్చేశావ్‌ కదా, ఇంక భయపడకు’సెల్‌ఫోన్  లైట్‌ వెలుగులోనే వాడిని చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. అలవాటైన మాటల శబ్దం విన్న చేపలు గుంపుగా బులబులమంటూ తోసుకొంటూ తెరిచిన నోళ్ళు పైకి పెట్టి మేత వేస్తాడని నెట్టుకోసాగాయి. వాడు భయంతో ‘నాన్నా’ అంటూ మళ్ళీ చేయి గట్టిగా పట్టుకున్నాడు. బురదంతా శుభ్రంగా కడిగి తన ప్యాంట్‌ కూడా చెరువులో జాడించి నీళ్ళు పిండి మళ్ళీ దాన్నే వేసుకున్నాడు కొండా. వదిలేసిన సైకిల్‌ దగ్గరికి ఆ తడి బట్టలతోనే ఇద్దరూ నడవటం మొదలెట్టారు. ‘బడికి పోతున్నావేంరా?’ అని అడిగాడు కొండా. ‘ఆ పోతున్నా’ అన్నాడు. ‘ఎన్నో తరగతి?’ ‘ఒకటో తరగతి’ ‘నీ పేరేంటిరా?’ ‘సూర్య’ 

‘ఇంత చీకట్లో ఇంటికాణ్ణుంచి నువ్వెందుకొచ్చావురా ఇటు?’ఒక క్షణం మాట్లాడలేదు వాడు. మళ్ళీ అడగటంతో ‘మా నాన్న వస్తంటే ఎనకాలొచ్చాను’ అన్నాడు. ‘మరి నిన్నెందుకు వదిలేసెల్లాడిట్టా?’‘నేనొచ్చినట్టు మా నాన్నకి తెలీదు. తెలిత్తే  కొడతాడని నేనే నక్కినక్కి వచ్చా’‘ఈ టైమ్‌లో మీ నాన్నెందుకు వచ్చాడ్రా ఇటు?’ ‘రోజూ ఒత్తాడుగా’ ‘ఆ! వస్తాడా! ఎందుకు?’‘చేపలు పట్టుకోటాకి’‘మీ నాన్న పేరేంట్రా?’‘కృష్ణదాసు’మనసులో తను వచ్చిన పని నెరవేరినట్టు అనిపించింది కొండాకి. ఒకవేళ రాకపోతే అని ఆలోచించాడు. అమ్మో!! వీడేమైపోయేవాడు!! రోడ్డు వరకు సైకిల్‌ నడిపించుకుంటూ వచ్చి, అక్కడి నుండి సూర్యని సైకిల్‌ ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే భార్య సురేఖ వాకిలూడుస్తూ ఉంది. జరిగిన విషయాన్ని సూర్య ఎదురుగానే భార్యకు చెప్తున్నాడు కొండా. 

జరిగిందంతా విని ‘అయ్యో అవునా’ అంటూ సూర్య వంక చూసి జాలి పడింది. కృష్ణదాసు చేసిన దొంగతనాల లిస్టు, పంచాయతీలో వాడికి వేసిన జరిమానాలు, సూర్య వాళ్ళ అమ్మ డబ్బులు కట్టడాలు, ఆమె హఠాత్‌ మరణం అన్నీ వాడెదురుగానే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నారు.వేడినీళ్ళు పెట్టి వాడికి రుద్దిరుద్ది స్నానం చేయించిందామె. తెల్లగా తెల్లారిన వెలుగులో ఒళ్ళు తుడుస్తూ ఏడేళ్ళుండొచ్చు అనుకొంటూ వాడి ముఖవర్చస్సు చూస్తూ వీడు నలుపులో మెరుపులా ఉన్నాడని మనసులో అనుకుంది. ‘ఒక్క నిమిషం ఉండు’ అని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి నిక్కరు, టీ షర్టు తీసుకొచ్చింది. టీ షర్ట్‌ వేస్తే బాగానే ఉంది. నిక్కర్‌ వేస్తే వాడు భయం భయంగా చేత్తో పట్టుకున్నాడు. 

‘ఏం కాదులే, వదిలేయ్, నేను ఎంత లూజ్‌ ఉందో చూసి పిన్నిస్‌ పెడతాను’ అంది. వాడు వదిలేయగానే నిక్కరు టప్‌న కింద పడింది. వెంటనే నిక్కర్‌ పైకి లాక్కున్నాడు. వాడిని అలా చూడగానే సురేఖ పకపక నవ్వడంతో వాడు మొహం చిన్నబుచ్చుకొన్నాడు. సూర్య మొహం చూసి నవ్వాపి వాడిని దగ్గరికి తీసుకుంది. వాడు కూడా సురేఖ మెడ చుట్టూ చేతులేసి కొన్ని క్షణాలు అలా ఉండిపోయాడు. సూర్య మెత్తని చేతుల ఆ స్పర్శ సురేఖకు మనసులో ఎక్కడో ఏదో తట్టి లేపినట్టు అయింది. ఒక్కసారిగా కొత్త రకం భావనలతో కళ్ళు ఊట చెలమలయ్యాయి. చిన్నతనం నుంచి దొంగతనాలు చేయడం సరదాగా ఉన్న కృష్ణదాసు పదో తరగతి ఫెయిల్‌ అయినప్పటి నుంచి దాన్నే వృత్తిగా కొనసాగించాడు. సుమతితో పెళ్ళయిన తర్వాత కూడా దొంగతనాలు మానింది లేదు.

 కానీ దొంగతనం చేసి ఎక్కడ, ఎప్పుడు పట్టుబడినా జరిమానా కట్టాల్సి వచ్చిన ప్రతిసారి సుమతికి అది ఎంతో అవమానకరంగా.. ఆ అవమానమే తనని దహించి వేస్తున్నంతగా బాధ పడేది. దొంగతనాలు చెయ్యొద్దని బతిమిలాడి మరీ చెప్తూ ఉండేది. జరిమానా కట్టాల్సి వచ్చినప్పుడు తను కూలికి వెళ్ళి దాచుకున్న వెయ్యో, రెండు వేలో  ఏమాత్రం ఆలోచించకుండా అతనికిచ్చి జరిమానా కట్టించేది. చివరిగా పసుపు కళ్లంలో చేసిన దొంగతనానికి వేసిన ఐదువేల రూపాయల జరిమానా వారం రోజుల్లో కట్టాలి అన్నప్పుడు ఆ దిగులుతోనే మంచం పట్టిన సుమతి తిరిగి కోలుకోలేక పోవటం, దానిలోనే ఉద్ధృతంగా వచ్చిన గుండెపోటుతో చనిపోయింది. అప్పుడు కూడా కృష్ణదాసు పెద్దగా చలించింది ఏమీ లేదు. 

అతిగా ఏడ్చేవాళ్ళను చూస్తే కృష్ణదాసుకు చాలా ఆశ్చర్యం. అంతగా ఎందుకు ఏడుపు వస్తుంది వీళ్ళకి అని. మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళని చూసినా కూడా ఆశ్చర్యమే. ఇంతలా నవ్వాల్సిన అవసరమేంటో! కనీసం మనిషిలా స్పందించే గుణం ఏమాత్రం లేని కృష్ణదాసు.. భార్య అలా అవడానికి కారణాలు ఏంటి అని ఆలోచించటం గాని, నామమాత్రంగా కూడా బాధపడింది గాని లేదు. జేబు నింపుకుని ఇంటికి తిరిగొచ్చిన కృష్ణదాసుకి తను వెళ్ళేటప్పుడు దగ్గరగా వేసి వెళ్ళిన తలుపు ఇప్పుడు తీసి ఉండటంతో అనుమానం వచ్చింది. సైకిల్‌ అక్కడే వదిలేసి ఇంట్లోకి వచ్చి చూస్తే బోసిపోతున్న ఇల్లు సూర్య లేడనేసింది. ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. ఇంతకు ముందు తను ఏకువజామున లేచి ఎళ్ళేప్పుడు సూర్య తన ఎనకాలే వచ్చాడు. కోపంగా బెదిరించి ఎనక్కి తీసుకొచ్చి ఇంట్లో వదిలాడు. రెండోసారి ఎనకాల వస్తుంటే సులగ తీసుకుని గట్టిగా కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అసలే సుమతి లేని ఇల్లు కళతప్పి బావురుమంటున్నా పట్టని కృష్ణదాసు.. ఈడినెక్కడెతకాలో అనుకొంటా బయటకొచ్చాడు. 

సాయంత్రం వరకు ప్రయత్నించినా కొడుకు జాడ తెలుసుకోలేకపోయాడు. ఏడవుతుండగా అతనికి వరుసకు తమ్ముడైన శేఖరు.. ‘కొండా ఇంటి ముందు మీవాడు ఆడుతున్నాడు అన్నా..’ అని చెప్పాడు. కొండా పేరు వినపడగానే కృష్ణదాసుకి అనుమానం వచ్చింది. తను తెల్లారుజామున బయటికి వెళ్ళగానే వచ్చి కొండా తన కొడుకుని ఇంట్లో నుంచి తీసుకెళ్ళుంటాడని అనుకున్నాడు. వెంటనే సైకిలేసుకుని ఊరికి అటు చివర ఉన్న కొండా ఇంటికి వెళ్ళాడు. ఇంటిముందు ఇంకో పిల్లాడితో కలిసి ఆడుకుంటున్న సూర్యాను చూసి ‘రారా ఇంటికి పోదాం’ అన్నాడు కృష్ణదాసు. వాడు ఒకసారి ఎగాదిగా తండ్రి వంక చూసి మళ్ళీ తలొంచుకుని ఆడుకుంటున్నాడు. బయట అలికిడికి కొండా బయటికి వచ్చాడు. 

‘అట్టెట్టా వత్తాడ్రా ఊరికినే? రేప్పొద్దున పంచాయతీ పెట్టుకుని మాట్లాడుకుందాం. అప్పుడు తీసుకెళ్దువుగాని’ అన్నాడు. కృష్ణదాసు కోపంగా ‘తెల్లారుజావున ఇంట్లో ఎవరూ లేని టైమ్‌ చూసి పిల్లాడ్ని ఎత్తుకొచ్చి ..’ అంటూ ఇంకేదో మాట్లాడబోతుంటే–‘దాసు ఆగు అక్కడితో. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. రేప్పొద్దున తొమ్మిది గంటలకి గంగరావి చెట్టు దగ్గరికి రా. వీడిని తీసుకొని నేను కూడా వస్తాను అక్కడికి. మాట్లాడుకున్న తర్వాత నీ కొడుకుని తీసుకెళ్దువు గాని’ అన్నాడు కొండా. అయిష్టంగా ముఖం పెట్టుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కృష్ణదాసు. తెల్లవారక ముందే మెలకువ వచ్చిన కొండాకి మంచం దిగాలనిపించలేదు. ఇంటర్‌ వరకు చదువుకున్న కొండాకి ఫార్మా కంపెనీలో సంవత్సరం ఉద్యోగం చేసేసరికి ఆ వాతావరణమే కాదు ఆ ఉద్యోగం కూడా సరిపడదని అర్థమయ్యేసరికి సొంత ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. 

దాంతో పాటుగా రెండు చేపల చెరువులు చూసుకుంటున్నాడు.  తన పని తాను నిజాయితీగా చేసుకొనే కొండాకి అమ్మకానికొచ్చిన చేపలు దొంగతనానికి గురవుతున్నాయని తెలుసుకోగానే మనసంతా కలతగా మారింది. ఒకడి కష్టార్జితాన్ని ఇలా దొంగతనం చేయడం అంటే.. అని లోతుగా ఆలోచిస్తూనే పంచాయతీకి సిద్ధం అయ్యాడు.ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి గంగరావి చెట్టు దగ్గరికి ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. అన్నీ కలిపి వంద ఇళ్ళ కంటే తక్కువే ఉండేంత చిన్న ఊరు అది. పంచాయతీ ఉందని తెలిస్తే ఎవరికి వాళ్ళు రావటం ఆ ఊరి ఆనవాయితీ. ఎవరూ ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు. కొండా సూర్యని తీసుకుని వచ్చి గంగరావి చెట్టు చుట్టూతా కట్టి ఉన్న గట్టు మీద కూర్చున్నాడు. గుంపుగా మరో 10 మంది వచ్చారు. నిలబడగలిగిన వాళ్ళు నిలబడ్డారు. మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. కొందరు తలవంచుకొని పక్కవాళ్ళతో మాట్లాడుతున్నారు. మరికొందరు పబ్లిక్‌గా పైకే మాట్లాడుతున్నారు. ఇంకొందరు పక్క వాళ్ళ చెవిలో నెమ్మదిగా ఏదో చెప్తున్నారు.

శివయ్య, ఎర్రన్న, పాపారావు వస్తుంటే చూసిన వాళ్ళు పక్కకు తప్పుకుని దారి ఇచ్చారు. ‘బాబాయ్‌ ఇటు రండి’ అంటూ కొండా పిలవటంతో ముగ్గురూ వచ్చి ఆ గట్టు మీదే కూర్చున్నారు. పనులకు అకాలం కావటం వలన పైగా ఆదివారం కావటం వలన కూడా చాలామందే వచ్చారు. కాని ఇంతకీ కృష్ణదాసు వస్తాడా రాడా అనుమానం వచ్చింది కొండాకి. అప్పుడప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ బుగ్గలు ఉబ్బిచ్చి గాలి వదులుతూ అసహనంగా ఉన్నాడు. అప్పటి వరకు అందరినీ చూస్తూ కొండా పక్కనే నిలబడ్డ సూర్య కొండా చెయ్యి పట్టుకుని ఊపుతూ ‘మనం ఇక్కడకెందుకొచ్చాం’ అని అడిగాడు.   ‘మీ నాన్న కూడ ఇక్కడికే వస్తానన్నాడు’ వాడి వంక చూస్తూ చెప్పాడు. ‘ఎందుకు?’ ‘నిన్ను తీసుకెళ్ళటానికి’అందరూ ఎదురు చూస్తున్న కృష్ణదాసు ఎదురుగా వస్తూ కనిపించాడు.వాళ్ళు చూస్తున్నవైపు కొండా కూడ చూశాడు. ఐదడుగుల బక్క పల్చటి మనిషి, నిర్లక్ష్యంగా రేగిన జుట్టుతో ఎప్పటిలానే నల్ల టీ షర్ట్‌ వేసుకుని వస్తూ కనిపించాడు. 

 ‘అదుగో, అటు చూడు’ అంటూ కృష్ణదాసు వస్తున్న వైపు సూర్యకి చూపెట్టాడు కొండా. కృష్ణదాసు వచ్చి గట్టుకి దగ్గరగా నిలబడ్డాడు.
‘ఏంది మావా నీ కత? పోయిన పొడుగూత ఈ దొంగతనాలేంది, నువ్వేంది ? ఒల్లొంచి ఏదోక పనిచేసుకుని బతక్కా’ అన్నాడు సాంబయ్య . 
కృష్ణదాసుకు అలాంటి మాటలకు సమాధానం చెప్పే అలవాటు మొదటి నుంచీ లేదు. ‘నిన్న తెల్లారుజామున ఏం జరిగిందిరా దాసు’ అడిగాడు శివయ్య. కృష్ణదాసు మాట్లాడ లేదు. ‘అసలు నిన్న ఏకుజావున ఏం జరిగిందిరా కొండా ఇవరంగా చెప్పు’ శివయ్య అడిగాడు. 
కొండా జరిగింది జరిగినట్టు స్పష్టంగా చెప్పాడు. విన్నవాళ్ళల్లో చాలామంది ఆశ్చర్యంగాను, అయ్యో అనవసరంగా పిల్లాడు బలయ్యేవాడుగదా అంటా జాలిపడ్డారు.కృష్ణదాసుని మాట్లాడమని ఇద్దరు ముగ్గురు గట్టిగా చెప్పినా ఏం ప్రయోజనం లేకపోయింది. 
‘పిల్లాడు చనిపోబోయేవాడు బతికి బయటపడ్డాడని తెలిసినాక కూడా నువ్వు మాట్లాడకపోవడం ఏంట్రా? నువ్వేం మనిషివి రా దాసు’ ఆశ్చర్యంగా అన్నాడు శివయ్య. 

 ‘ఇలాంటి మనిషినెక్కడా చూళ్ళేదురా బాబూ’ అన్నాడు ఎర్రన్న.  కృష్ణదాసులో ఎలాంటి మార్పు లేదు.  ‘యాందబ్బాయా ఈణ్ణి బతివాలేది? జబిర్రొండు బుచ్చుకోకా’ గుంపులోంచి ఒకరు.  ‘ఏందిరో అణాకాణీ దొంగతనాలకింత యాగీ జాత్తన్నారు. వేలకోట్లు దోసుకొని ఇక్కడే కులికేవాళ్ళు, దేశవొదొలి పారిపోయే వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఈడు మీకు తేరగా దొరికాడా?’ జోగీంద్ర.
‘అలాంటి అణాకాణీలన్నీ పొతం జేసుకుంటేనే గదరా రూపాయి అయ్యేది? అదే పనిగా వాటి కోసవే కన్నాలేత్తంటే అంతంతమాత్రపాళ్ళం బతికేదెట్టా’ అన్న పాపారావు ప్రశ్నకి  ‘అవున్లే అదీ నిజవే’ అని ఒప్పుకున్నాడు జోగీంద్ర.

మళ్ళీ ఆయనే ‘అదొక్కటే సమస్య కాదు జోగీంద్రా.. మనది అనుకున్నదేదో దోపిడీకి గురైందని గుర్తించిన ప్రతిసారి అలా జరగటం మన అసమర్థత వల్లేమో.. అజాగ్రత్త మూలంగానేమో అనిపించగానే మనలో తెలియకుండానే ఒక అసహనం మొదలై అంతర్లీనంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇక్కడున్న వాళ్ళల్లో చాలామందికి ఇది అనుభవ పూర్వకంగా తెలుసు’ వాళ్ళలో ఎక్కువమంది తమ బాధని సరిగ్గా అర్థం చేసుకొని కరెక్ట్‌గా చెప్పినందుకు ఆయనవైపు గౌరవంగా చూశారు. పక్కింటి విమల పెద్దమ్మ కూడా వచ్చి గుంపుగా ఉన్న వాళ్ళకి వెనకగా నిలబడింది. ‘ఇయ్యన్ని ఎందుగ్గాని.. దాసు అసలు నిన్న తెల్లారుజామున చేపలు పట్టావా లేదా? ఒక మాట చెప్పు’ పాపారావు అడిగాడు. పట్టానన్నట్టుగా తలూపాడు కృష్ణదాసు. 

‘అది కాదురా నోటితో చెప్పు’ మళ్లీ ఆయనే అన్నాడు గట్టిగా. ‘పట్టాను’ మెల్లగా అన్నాడు కృష్ణదాసు. జనంలోంచి వేగంగా కృష్ణదాసు దగ్గరకొచ్చిన శీనయ్య ‘ఆరోజు మా అరుగు మీదున్న మొక్కజొన్నల మూటెత్తుకొని చీకట్లో పారిపోయింది కూడ నువ్వే కదరా’ ఆవేశంగా అడిగాడు. ‘అవును నేనే’ అన్నాడు కృష్ణదాసు. ఆ మాట వినగానే అప్పటికే పట్టుకొన్న కృష్ణదాసు షర్ట్‌ కాలర్‌ని గట్టిగా రెండూపులూపి, కాలి చెప్పు తీయబోవటం చూసిన కొండా వెంటనే ‘ఆ ఆ’ అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్లి ‘ఆగాగు నువ్వా పనులేం పెట్టుకోకు. వాణ్ణి కొట్టడానికి కాదు ఇక్కడకు పిలిచింది’ అంటూ శీనయ్యని ఆపాడు కొండా.  పాపారావు కూడా లేచి వచ్చి ‘ఇది వాడిని కొట్టే సమయం కాదులేరా శీనయ్యా.. ఆ విషయం తర్వాత చూసుకుందాం’ అని శీనయ్య చేతిలో నుంచి కృష్ణదాసు షర్ట్‌ కాలర్‌ విడిపించాడు. 

కృష్ణదాసు చూస్తా ఉండిపోయాడు. ‘రేయ్‌ దాసు, నీ జీవితాన్ని నువ్వు ఎటై్టనా జీవించొచ్చు అనుకుంటే పొరపాటురోయ్‌. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాందని పదిమంది నీకు చెప్పినప్పుడు ఒక్కసారైనా మనిషిగా నీ గురించి నువ్వు ఆలోచించుకుని నీ పంథా మార్చుకోవాల్రా. లేపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏవుందిరా?’ అన్నాడు కొండా. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ తనే, ‘దాని కోసం నేను నిర్ణయించుకున్నది ఒక్కటే. అదేంటంటే ఇదిగో నీ కొడుకుని నేను ఇక్కడ వదిలి పెడుతున్నాను. వాడు నీతో వస్తానంటే తీసుకెళ్ళు. కానీ నాతో వస్తానంటే మాత్రం నేను వదిలిపెట్టన్రోయ్‌. నేనే తీసుకెళ్తాను’ అంటూ కొండా కృష్ణదాసు వైపు చూశాడు. కృష్ణదాసు నిర్లక్ష్యంగా నుదుటి మీదకు పడుతున్న జుట్టుని పైకెగరేసుకున్నాడు. ‘ఇలా చేస్తే మారతాడనే నమ్మకం, ఇలాగే చేయాలనే ఆలోచన, పట్టుదల నీకెందుకొచ్చినయ్‌రా కొండా’ ఎంతో ఆసక్తిగా అడిగాడు పాపారావు. 

‘మనం అన్ని రకాలుగా బాగుండాలంటే మనుషుల మధ్య సరైన సంబంధాలుండాలి. ఈ లోకంలో మానవ సంబంధాలను మించిన ఆస్తిగాని, దానిని మించిన గొప్ప విలువగాని మరోటి లేదని మా పంతులుగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. దాన్ని నేనెప్పుడూ పదే పదే మననం చేసుకుంటాను’ కొండా అలా చెప్పగానే పాపారావు దగ్గరకొచ్చి ‘శభాష్‌ రా కొండా’ అంటూ భుజం తట్టాడు. ఆ తాత్త్వికత అక్కడున్న వాళ్ళలో ఎంత మందికి అర్థమైందా అని గాలికి వంగిన చెట్ల శిఖరాగ్రాలు ఆసక్తిగా తొంగి చూశాయి. నాకెవరితోనూ సంబంధం లేదన్నట్టుగా అందర్నీ తాకుతూ ఓ పిల్లతెమ్మెర వెళ్ళి పోయింది. ‘సూర్య మీ నాన్నతో ఇంటికి వెళ్ళు’ అంటూ వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళి వదిలిపెట్టి ఇవతలికి వచ్చేశాడు కొండా. 

సూర్య అక్కడే నిలబడి పోయి ఉన్నాడే కానీ వాడేమీ వాళ్ళ నాన్న వైపు ఒక్కడుగు కూడా వేయలేదు. ఇంటికి వెళ్ళేందుకు కొండా నాలుగడుగులు వేయగానే వెనక నుంచి సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి కొండా చేయి పట్టుకున్నాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంతమందిలో ఒకరిద్దరు మినహా ఎవ్వరూ ఊహించని పరిణామం. గుంపుగా ఉన్న వాళ్ళు వెళ్ళడానికి దారి ఇచ్చారు.వాళ్ళందరినీ దాటుకుంటూ నాలుగడుగులు వేయగానే ‘అయ్యా’ అని వినపడటంతో కొండా వెనక్కి తిరిగి చూస్తే పెద్దావిడ విమలమ్మ గబగబా నడుచుకుంటూ వస్తూ కనిపించడంతో ఆగాడు. కొండా దగ్గరికి వచ్చి, ఆమె ‘ఏందిరా అయ్యా ఈ అన్నాయం? ఆడి కొడుకుని నువ్వు తీసుకెళ్ళి పోతుంటే ఆడన్నాయమై పోతాడుగందా. 

అసలే ఆడి భార్య చనిపోయి మూణ్ణెల్లుగూడ గాలేదాయె’ వణికే స్వరంతో, జాలిగా, కొండా రెండు చేతులు పట్టుకుని ఇలా చేయొద్దని అభ్యర్థిస్తున్నట్టుగా ‘ఒద్దయ్యా’ అంటూ బతిమిలాడుతూ అడిగింది. కొండా ఆమెకు మాత్రమే వినిపించేలా ‘వేరే వాళ్ళ పంటలు, వస్తువులు దొంగతనం చేసి అమ్మేస్తుంటే అవతలి వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఈ రకంగా అయినా దాసుకి అర్థమవుతే మారుతాడేమోనని ఆశ పెద్దమ్మా. అంతేకానీ ఆడి కొడుకుని నేను ఎందుకు శాశ్వతంగా తీసుకెళ్తాను. వాడిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను అంతే’ అన్నాడు. పెద్దమ్మ ఏమి మాట్లాడలేక చూస్తా ఉంది. ‘నన్ను నమ్ము’ ఆమె చెయ్యి పట్టుకుని నమ్మకంగా చెప్పాడు. 
కొండా చెయ్యి పట్టుకుని వెళ్తున్న సూర్య ఆ చెయ్యి వదిలి వెనక్కు తిరిగి ‘నాన్నా’ అంటూ పిలిచాడు తండ్రిని. కొండా ఒక్కసారిగా హతాశుడై నిల్చుండిపోయాడు. 

కృష్ణదాసు.. సూర్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘నువ్వూ , యాక్‌ త్ఫూ .. నాన్నవి’ ఆ మాట అన్న వెంటనే వెనుదిరిగొచ్చి కొండా చెయ్యి పట్టుకున్న సూర్య అతని ముఖం వంక చూస్తూ ‘పద పోదాం’ అని ఓ పెద్ద మనిషిలా అన్నాడు. సురేఖకి సూర్య తమ సొంత కొడుకు కాదనే విషయం గుర్తు చేసుకోవటం మొదటి నుండి అస్సలు ఇష్టం ఉండదు. తమకు పిల్లలు పుట్టరని తెలిశాక అది మరింత ఎక్కువైంది. ఇంటర్‌ చదువుతున్న సూర్యకి అలాంటి విషయాల ఊసెత్తడం కూడ ఏమాత్రం నచ్చదు. సూర్య తను ఒకటో తరగతి వరకు గడిపిన జీవితమూ మర్చిపోలేదెప్పుడు. ఓ రోజు మాటల సందర్భంలో, ‘అమ్మా అన్నం పెట్టిందగ్గర నుండి దగ్గరే కూర్చుని తల, వీపు నిమురుతూండే నీ ప్రేమను పొందుతున్నానంటే ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను! నా మనసులో ఈ మాట అనుకోని పూట ఉండదు’ అన్నాడు సూర్య .

‘పిచ్చి తండ్రి, మాకున్న లోటుని నువ్వు ఎంత బాగా తీర్చావో నీకు అర్థం కాదురా నాన్నా. మా బతుకులో ఇంత సంతోషాన్ని నింపావు. మేమే కాదు నువ్వొచ్చింతర్వాత ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఎంత సందడిగా ఉందో నీకు తెలీదురా’ మనసులోని ఆర్ద్రత కళ్ళల్లో కొస్తుండగా అన్నది సురేఖ. కొండా పెంపకంలో సూర్య వంక పెట్టలేని వ్యక్తిగా ఎదుగుతున్నాడు. ఓ రోజు సూర్యతో ‘నీ కన్నతండ్రి బాధ్యత కూడ నీదే. అది మాత్రం మర్చిపోకూడదురా నువ్వెప్పటికీ’ అన్నాడు కొండా. ‘అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా నాన్నా, నీ పెంపకంలో ఎలాంటి విషయాలైనా నిర్లక్ష్యం చేయకుండా పాటించేలా వాటంతటవే వచ్చేస్తాయి’ ప్రేమగా కొండా వంక చూస్తూ చెప్పాడు సూర్య. 
‘చాలురా కన్నా ఈ పూటకి అన్నం తినకపోయినా పర్వాలేదు. కడుపు నిండిపోయింది నీ మాటతో’ సూర్యని దగ్గరకు తీసుకుంటూ ఎంతో తృప్తిగా అన్నాడు కొండా. 

శిక్షలిచ్చే గోడలతో పాటు క్షమను పంచే నీడలతో ఈ సమాజం అనాదిగా సాగుతోంది. ఇక మీదటా సాగుతుంది– గోడలు అక్కర్లేని, శిక్షలు అనివార్యమయ్యే అవస్థకు మనుషులు చేరుకొనే సమాజాన్ని నిర్మించుకునేంత వరకు. 

అప్పటి వరకు అందరినీ చూస్తూ కొండా పక్కనే నిలబడ్డ సూర్య కొండా చెయ్యి పట్టుకుని ఊపుతూ ‘మనం ఇక్కడకెందుకొచ్చాం’ అని అడిగాడు.  

తెల్లగా తెల్లారిన వెలుగులో ఒళ్ళు తుడుస్తూ  ఏడేళ్ళుండొచ్చు అనుకొంటూ వాడి ముఖవర్చస్సు చూస్తూ వీడు నలుపులో మెరుపులా ఉన్నాడని మనసులో అనుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement