ఈవారం కథ: సుధీరన్న | Story of the week | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: సుధీరన్న

Published Sun, Jan 12 2025 8:57 AM | Last Updated on Sun, Jan 12 2025 8:57 AM

Story of the week

నిద్రరాని ఈ రాత్రి పూట, ఈ నగరంలో, ఆకాశహర్మ్యంలో నా వెడల్పాటి కిటికీలో కనిపిస్తున్న చంద్రుడిని, ఆ పక్కనే వున్న దీటైన చుక్కను చూస్తూ ఉంటే హఠాత్తుగా సుధీరన్న జ్ఞాపకం వచ్చాడు. ఎన్నిరోజులై ఉంటుంది అన్న చనిపోయి, కాదు ఆత్మహత్య చేసుకుని? అసలు మనల్ని మనం చంపుకోవడాన్ని స్వంత హత్యా అనో మరొకటనో అనకుండా ఆత్మహత్య అని ఎందుకు పేరు పెట్టారు. ఎవరు ఆ పేరు పెట్టారో కానీ విషయాలు చాలా లోతుగా తెలిసిన వాళ్ళే పెట్టి వుంటారు.

ఆత్మహత్యకి ఒక నెల ముందు ఫోన్‌ చేసి ‘అన్నా! నీ కథ రాయాలనుకుంటున్నా, చెప్తావా?’ అంటే  ‘ఎందుకు చెప్పను బుజ్జమ్మా? ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుండ్ల నీకు’ అన్నాడు.నేను ‘చెప్పేవులే గానీ, చాలా సంవత్సరాలు అయిపోలా, ఇంకా గుర్తుంటదా అన్నా? మళ్లీ మొదటనుండి చెప్పాల్సిందే’ అన్నాను. అందుకు బదులుగా ‘చెప్తా గాని బుజ్జమ్మ, నేనే  నీకు ఫోన్‌ చెయ్యాలనుకుంటా ఉండా, నువ్వే చేశావు! ఈ సంగతి చెప్పు, పాప, అదే నా బిడ్డ నన్ను కలవాలనుకుంటా ఉందంట, ఏం చేయమంటావు చెప్పమ్మా’ అన్నాడు.నేను అది విని ఆశ్చర్యపడి, ఎప్పుడో నాలుగు సంవత్సరాల బిడ్డని కదా అన్న వదిలొచ్చేవు ఇప్పుడేం చదవతావుంది’ అంటే, ‘ఇంజినీరింగ్‌ బుజ్జమ్మ’ అన్నాడు. 

ఆరోజే చివరి మాటలు, ఆ తరవాత మాట్లాడింది లేదు, సుధీరన్న ఆయన కథ చెప్పకుండానే తన ఆత్మను తానే హత్య చేసేసి, తన శరీరాన్ని ప్రపంచం మొహాన పారేసి వెళ్లిపోయాడు.సుధీరన్న అందగాడు. నల్లగా ఉంటాడు, కళ్ళు పెద్దవిగా దేవుడికి పెట్టిన కళ్ళలాగా తెల్లగా వెడల్పుగా ఉంటాయి. ఆరడుగుల ఒక్క అంగుళం ఎత్తుతో, వెడల్పయిన భుజాలతో, చెక్కినట్లు వుండే ముక్కుతో పోత పోసిన విగ్రహంలా ఉంటాడు. ఎంతమందిలో వున్నా అందరికంటే భిన్నంగా, తిరిగి చూసేట్టు ఉంటాడు. ఆయన బలమైన శరీరం మనల్ని ఒక వైపు భయపెడుతుంటే, ఆయన పసికందులాటి నవ్వు మనల్ని దగ్గరకి పిలుస్తుంది. 

ఆయన శరీరము, నవ్వు.. రెండూ ఒకదానికి ఇంకోటి విరోధాభాసం. కానీ వూర్లో ఏమన్నా గొడవలు జరిగితే ఆయనొక్కడే పదిమందిని ఒంటి చేత్తో కొట్టేవాడని అందరూ అంటారు.సుధీరన్న తల్లి, మా పెద్దమ్మ, ఆమె బావను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆమె అయినింటి ఆడపడచు. ఆమె బావ, ఆమె మాటల్లో చెప్పాలంటే ‘రంగు నలుపే కానీ అన్నిందాల ఆమెకి సరయిన జోడీ’. ఆస్తీ పాస్తీ దండిగానే ఉండేవి.అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సుధీరన్న తల్లి దేవసేనకు ఒక అలవాటు వుండేది, అదేమిటంటే అతిగా ఖర్చు పెట్టడం. ఎంత డబ్బునయినాసులువుగా ఖర్చు పెట్టగల మార్గాలు ఆమెకు అనేకం తెలుసు. అలాగే సుధీరన్న తండ్రికి కూడా ఒక బలహీనత ఉండేది, అదేంటంటే భార్య తానా అంటే తందానా అనడం.

దేవసేనకు బంధు మిత్రులంటే తగని ప్రీతి. మనుషులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటే ఆమెకు మహా ఇష్టం. అందుకు అనువయిన ప్రతి సందర్భాన్ని ఆమె వాడుకునేది. అదృష్టవశాత్తు ఆమెకు సుధీరన్న ఒక్కడితోనే సంతాన సౌభాగ్యం అడుగంటి పోయింది. అందుకని సుధీరన్నని ఆమె అల్లారు ముద్దుగా పెంచింది. సుధీరన్న ఆడుకోవడానికి పది బొమ్మలు అవసరమయిన చోట ముప్పయ్యారు బొమ్మలు కొనేది.వాటిని కొద్ది రోజులకే వాళ్ళకీ వీళ్లకీ దానం చేసేసి తిరిగి కొత్త బొమ్మలు కొనేది. తన చీరలయినా అంతే, పెళ్ళికో పబ్బానికో ఒకసారి కట్టిన చీర ఇంకోసారి కట్టుకునేది కాదు. 

అది వాళ్ళ కులంలో, పెట్టి పుట్టిన వాళ్ళు ఎవరూ చేయరని ఆమె నిశ్చితాభిప్రాయం. అంచేత ఆమె ప్రతినిత్యం చీరలు కొంటూ ఉండేది. ఆమె చీరలు కొనడానికి వాళ్ళ వూరు, వాళ్ళ పట్టణం, వాళ్ళ నగరం, చివరికి వాళ్ళ రాష్ట్రం కూడా దాటి, పక్క రాష్ట్రానికి చీరలు కొనడానికి వెళ్ళేది. ఆ రాష్ట్రంలో ఒకపెద్ద వస్త్ర దుకాణం చెట్టియారు, తెల్లటి ఛాయతో, రింగుల రింగుల తలతో దర్జాగా వచ్చే ఆమె కోసం గావురు గావురుమని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ చెట్టియారు ఆమెకి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పి, ఒక చీర కొనాల్సిన చోట పది కొనిపించేవాడు. ఆమె అలా కొన్నవాటిని బంధు మిత్రులకు ప్రీతిగా పంచి బంధువులు ‘దేవసేన మనసు వెన్న’ అంటే మురిసి కరిగి పోయేది.కొడుకు సుధీర్‌కి సరిగ్గా పదేళ్లు వచ్చేసరికి దేవసేన వాళ్ళ యాబయ్‌ ఎకరాల మాగాణి ఏడెకరాలయింది. 

కారణం నువ్వని నోరు తెరిచి ఏనాడు అనని భర్తను పట్టుకుని చేతకాని వాడని, అతని వల్లే తాను, తన బిడ్డ పడరాని కష్టాలు పడుతున్నామని వేధించడం మొదలు పెట్టింది దేవసేన. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె భర్త ఒకరోజు చుక్క పొద్దుకాడ లేచి కట్టు బట్టలతో ఇల్లు విడిచివెళ్ళిపోయాడు. భర్త కొడుకుని, తనను అనాథలను చేసి వెళ్లి పోయాక వున్న ఏడెకరాలను, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెమని అమ్ముకుంటూ కొడుకును పెంచి పెద్ద చేసింది దేవసేన.సుధీరు ఇరవైలలో పడ్డాక అందగాడైన తన కొడుకుకి అయినింటి సంబంధాలు ఎదురు కట్నమిచ్చి చేసుకోవడానికి వెదుక్కుంటూ వస్తాయని దేవసేన కలలు కనడం మొదలు పెట్టింది. 

కలలు నిజం కాకుండా సుధీరన్న ఇరవైతొమ్మిదేళ్ళ వాడయ్యాడు.ఒక్క సంబంధం కూడా వారి గడప తొక్కలేదు. దేవసేనకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మహిళా ప్రపంచం ఆస్తికి ఇచ్చిన విలువ మనిషికి అతని సౌందర్యానికి ఇవ్వదని గుర్తించింది. కానీ ఆమెకు ఇప్పుడున్న ఆస్తి కేవలం కొడుకు మాత్రమే. ఆ కొడుకును ఎరవేసి ఆమె తిరిగి తన మునుపటి వైభవానికి చేరుకోవాలి. అందుకే ఆమె పెళ్లిళ్ల బ్రోకరుకు ఈసారి సిగ్గు విడిచి గట్టిగా, ఎవరైనా పర్వాలేదు కానీ కాస్త గట్టిగా ఆస్తిపాస్తులు వుండేవాళ్ళను చూడమని చెప్పింది.సుధీరన్నది అతని తండ్రి లాటి స్వభావమే, పదేళ్ల బిడ్డగా తండ్రి వదిలేసి వెళితే తనని పెంచి ఇంత వాడిని చేసిందని తల్లి అంటే అతనికి అపారమైన ప్రేమ, గౌరవమూ. 

అందుకే తన పెళ్లి విషయంలో తల్లి ఏవేవో ఎత్తుగడలు వేస్తున్నా తనతో చదివిన వనజ తనను ఇష్టపడుతోందని, కులం వేరయినా చక్కగా చదువుకుని టీచరుగా పనిచేస్తుందని తల్లికి చెప్పే సాహసం అతను చేయలేదు.
సుధీరన్నకు, మాధురికి ఒక మాఘమాసంలో పెళ్లి జరిగింది. మాధురి ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్‌ నర్సు. ఒక్కటే కూతురు, ఆస్తిపాస్తులు దండిగా వున్నాయి. సుధీరన్నకంటే కొంచెం పెద్దది. మొదటి భర్త అవమానించి, అనుమానంతో హింసించి విడాకులిచ్చేశాడు. వయసు వచ్చేస్తుంది, ఒకవైపు సమాజం పనీపాటా లేకుండా కూర్చుని ఏదోకటి అంటూ ఉంది. అందుకని మాధురి పెళ్లి చేసుకోవాలనుకుంది. దేవసేనకి కావలసింది మాధురి దగ్గర, మాధురికి కావాల్సింది దేవసేన దగ్గర ఉండడంతో పెళ్లి ఘనంగా జరిగి పోయింది.

దేవసేన ప్రపంచమంతా తన భర్త, కొడుకు లాగా తన కనుసన్నలలో మెసులుతుందనే భ్రమలో హాయిగా బతుకుతూ వస్తుంది ఇన్ని రోజులు. మాధురి వచ్చీరావడంతోనే ఆ భ్రమను కాళ్లతో కసపిసా తొక్కి వేసింది. అత్తగారి ఇంటికి దగ్గరగా ఉద్యోగాన్ని బదిలీ చేయించుకోమని అత్త అంటే, నువ్వు నీ ఇంటిలో వుండు నా భర్త నా దగ్గర ఉంటాడని కోడలు అంది. ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీద రిజిస్టరు చేయించాలని అత్త అంటే, తన ఆస్తి తను కనబోయే పిల్లలకి చెందుతుందని ఇంకెవరికీ దాని మీద హక్కు లేదని కోడలు అంది. కోడలి మగరాయుడి తనానికి, జమాజెట్టి మాటలకు, కయ్యానికి కాలు దువ్వే తరహాకు దేవసేనకు మూర్ఛ వచ్చినంత పని అయింది. కోడలు తనకు అలివయ్యే ఘటం కాదని తెలుసుకున్నాక, అటునుండి నరుక్కు రావాలని కొడుకును సాధించడం మొదలు పెట్టింది దేవసేన.

స్వతహాగా మృదుస్వభావి అయిన సుధీర్‌కి, తల్లి ప్రణాళిక.. ఆశ మొదటి నుండి అర్థం చేసుకున్న సుధీర్‌కి.. మాధురి తరహా ఏమాత్రం నచ్చలేదు. ఆస్తి కోసమే కదా అమ్మ తనని రెండో పెళ్లి అమ్మాయికి ఇచ్చింది.. మరి ఇదేమిటని అతని ధర్మబుద్ధికి తోచింది. అదే అతను భార్యను అడిగాడు. దేవసేనకంటే పదహారాకులు ఎక్కువ చదివిన మాధురికి సుధీర్‌ ‘చూపుల గుర్రమ’ని, బాగా మెతక అని తెలిసిపోయింది. అందుకే గొడవ చిలికి చిలికి గాలీ వానా అవుతుండగా‘నువ్వు పైన పటారం లోన లొటారం గాడివి’ అనేసింది. అమ్మ కొంగు పట్టుకుని తిరగక నీకు పెళ్ళెందుకు కావాల్సి వచ్చిందని సుధీర్‌ ముఖాన ఉమ్మింది. 

ఆ మాట విని, చీమ పైన కూడా చెయ్యి ఎత్తని సుధీర్‌.. మాధురిపై చెయ్యెత్తాడు. చెయ్యెత్తాడే కానీ చెయ్యి చేసుకోలేదు. కానీ ఆ  రాత్రి గడిచి, వేకువయ్యీ అవగానే మాధురి తల్లి, మేనత్త,పెద్దమ్మ మూకుమ్మడిగా బస్సు దిగారు. అలా దిగిన వాళ్ళకి, దేవసేనకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తల్లికి వత్తాసుగా వెళ్లిన సుధీరును భార్య ఆమె తరపున ఆడవాళ్లు అందరూ కలిపి చితక కొట్టారు. సుధీర్‌ తల్లి ముందరే మాధురి అతనిని పడదోసి, అతని మీద కూర్చుని అతని వృషణాలని గట్టిగా వత్తేసింది. సుధీర్‌ ఆ నొప్పితో విలవిలలాడుతూండగా, దేవసేన నిర్ఘాంతపోయి చూస్తూండగా.. మాధురిని తీసుకుని ఆమె బంధుబలగం వెళ్లి పోయింది. వెళ్లిన మాధురి వెళ్లినట్లు వుండలేదు. సుధీర్‌పై, దేవసేనపై వరకట్నం కోసం తనను వేధించారని కేసు పెట్టింది.

ఒకరోజు ఉదయం పదిగంటలకి దేవసేన, సుధీర్‌.. వాళ్లకున్న చిన్న జామతోటలో పని చేసుకుంటూ వున్నారు. హఠాత్తుగా చెమటలు కక్కుకుంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు తోటలోకి వచ్చారు ‘సుధీరంటే ఎవరూ?’ అంటూ.సుధీర్‌.. పోలీసులని చూసి నిర్ఘాంతపోయాడు. కొద్దోగొప్పో చదువుకున్నా అతనికి ఈ పోలీసులు, కేసులు వంటి వాటి గురించి అవగాహన లేదు. తనని వెదుక్కుంటూ పోలీసులు రావడమేమిటో అతనికి అర్థం కాలేదు. పోలీసులను చూడగానే పైకెత్తి కట్టుకున్న పంచె కిందికి దించి నమస్కారం చేసి రెండు కుర్చీలు తెచ్చి వేసి, రెండు నీళ్ల టెంకాయలు కొట్టి వాళ్లకి ఇచ్చి వివరం అడిగాడు. అతని భారీ శరీరాన్ని అతని మృదువయిన గొంతును చూసి వాళ్ళు కొంచెం వివరం బోధపడినట్టు దేవసేన వైపుకి తిరిగి ‘నువ్వేనా దేవసేన అంటే’అని ప్రశ్నించారు. 

అలా వాళ్ళు తనని బొడ్డుకోసి పేరు పెట్టినట్టు అడగడం నచ్చలేదు దేవసేనకు. అయినా పోలీసులతో మనకెందుకు అని తల ఊపి వూరుకున్నది. వచ్చిన వాళ్ళు టెంకాయ నీళ్లు తాగి తెరిపిన పడ్డాక నిదానంగా మాధురి పెట్టిన కేసు వివరం చెప్పి.. తల్లీ కోడుకులిద్దరూ ఇప్పుడు తమతో రావాల్సి ఉంటుందని అన్నారు. ఆ మాట విని దేవసేన దడుచుకుని ఏడవడం మొదలుపెట్టింది.సుధీర్‌కి నెమ్మదిగా బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. వచ్చిన కానిస్టేబుళ్ళతో చాలా దీనంగా తన తల్లిని వదిలేయమని, తాను వాళ్ళతో వస్తానని, వాళ్ళేం చేయమంటే అది చేస్తానని అన్నాడు. వచ్చిన కానిస్టేబుళ్లలో ఒకావిడకి సుధీర్‌ని చూసి మనసు కరిగిపోయింది. తోటి కానిస్టేబుల్‌ని పక్కకి తీసుకుని వెళ్లి ‘సరేలే ఈ పిల్లాడు ముఖ్యం కదా మనకి, ఆవిడ కథ  తరవాత చూద్దాంలే! ఎక్కడికి పోతుంది!’ అని చెప్పింది. 

అలా వాళ్ళు సుధీర్‌ని వున్నపళంగా తీసుకెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘తెలిసిన వాళ్ళని పిలిచి సహాయం తీసుకో అమ్మ, రేపో మాపో మేము కాకపోతే ఇంకో పోలీసులు నీ కోసం వస్తారు. ఏం చేద్దాం పాపం చెట్టంత కొడుకుకి కష్టం వచ్చింది. చూస్తే బిడ్డ మంచివాడిలా వున్నాడు’ అని మరో నీళ్ల టెంకాయ తాగి, దేవసేన ఇచ్చిన కవర్లనిండా  జామకాయలు కోసుకుని వెళ్లిపోయారు.సినిమాలు చాలా తక్కువ చూసే సుధీర్‌కి పోలీసులు పట్టుకెళుతున్నపుడు జైలు ఎలా ఉంటుందో అనే ఆలోచన చప్పున మనసులోకి వచ్చింది. జైలు జీవితాన్ని చూపించిన సినిమా తాను ఒక్కటి కూడా చూడలేదని అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. 

భద్రంగా, తల్లిచాటు బిడ్డగా పెరిగిన అతనికి జైలులో వున్న కొన్ని నెలలలో డిప్రెషన్‌ తారస్థాయికి చేరుకున్నది. పడుకున్నా లేచినా మాధురిని తాను ఎంత ప్రేమగా చూసుకున్నాడో అతనికి జ్ఞాపకం వస్తూ ఉండేది. తన ఛాతీ మీద పడుకుని ‘ఇక్కడ తల పెట్టుకుని పడుకుని చచ్చిపోతే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు’ అన్న ఆమె మాటలు జ్ఞాపకం వచ్చేవి. తనని ఒకరోజు సాయంత్రం స్నానాల గదిలో వున్నప్పుడు బయట నుండి మాధురి గడియ పెట్టెయ్యడం జ్ఞాపకం వచ్చేది. ఆ రోజు తాను తలుపు కొట్టి, కొట్టి అలిసిపోయి ఒక లక్ష దోమలు తన మీద దాడి చేసి రక్తం పీక్కుతినేయడం జ్ఞాపకం వచ్చేది. ఎందుకలా చేశావని అడిగితే మాధురి చాలా అనాయాసంగా తమాషాకి గడి పెట్టానని, స్నేహితురాలితో మాట్లాడుతూ ఆ విషయం మరచిపోయానని చెప్పడం జ్ఞాపకం వచ్చేది. 

తను కొట్టే వాడో తిట్టే వాడో అయితే ఆ రోజు మాధురిని ఏదో ఒకటి అనేవాడు కదా? తనసలు నోరు తెరిచి ఒకమాట అనలేదు. మాధురికి ఇవన్నీ గుర్తు లేవా? తన తల్లి ఆస్తి అడిగిందే అనుకో దాన్ని తన పేరు మీదే కదా రాయమంది. రాస్తే ఏంపోయింది? తానే మాధురి సొంతం కదా? ఇంత చిన్న విషయం ఆమెకెందుకు అర్థం కాలేదు?..  ఇలా సుధీర్‌ ఆలోచనలు సాగిపోయేవి. ఏవేవో తలచుకుని, ఏవేవో గుర్తొచ్చి అతనికి ధారాపాతంగా కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉండేవి. మొదట అతని శరీరం చూసి భయపడ్డ జైలు సహచరులు అతని కళ్ళ నీళ్లు చూసి అతనికి ఆత్మీయులయ్యారు. అలా అనువుగాని చోట కూడా సుధీరన్న బోలెడు స్నేహితులను మూటకట్టుకున్నాడు కానీ, ఏడడుగులు నడిచి గుండెల మీద పడుకోబెట్టుకున్న భార్యకి మాత్రం అతను ఆత్మీయుడు, నమ్మకస్థుడు కాలేకపోయాడు. సుధీరన్న జీవితమనే బుల్లెట్టు బండి అక్కడ సడన్‌ బ్రేక్‌ వేసి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకుంది. 

ఆయన జైలు నుండి బయటకి వచ్చినా ఆయన జీవితం విషాదమనే కాలబిలం నుండి బయటకు రాలేదు. మొదటి నుండి తండ్రిలేని బిడ్డగా బాగా బతికి చెడిన తల్లి కొడుకుగా అతని చుట్టూ  విషాదం గూడు కట్టుకుని ఉండేది. దానిని మోసుకుంటూ ఆయన జీవితాన్ని లాక్కొచ్చేవాడు. నిజానికి తాను ఒక విషాద వలయంలో బతుకుతున్నానని అతనికి గుర్తింపు కూడా లేదు. చాలా ఉత్సాహంగా ఉరుకులు పెట్టే పదేళ్ల అబ్బాయి, తండ్రి అదృశ్యం తరువాత ఎందుకు ముభావం అయిపోయాడో తనలోకి తాను తరచి చూసుకునే శక్తి, జ్ఞానము అతనికి లేకపోయింది. అలా అతను మోసుకుంటూ, పెంచి పెద్దచేసుకుంటూ వచ్చిన విషాదం ఈసారి మాధురి ఘట్టంతో అతనిని పూర్తిగా లోబరుచుకుంది. సుధీరన్న అప్పుడు మొదలుపెట్టాడు తాగడం. మొదట బాధ మరచిపోవడానికి తాగేవాడు. ఆ తరువాత తాగకుండా ఉండలేక తాగేవాడు.

కాలక్రమంలో అతనికి విడాకులు వచ్చాయి. మాధురి పిల్లని కూడా అతను చూడకుండా జీవితాన్ని కట్టుదిట్టం చేసుకుంది. తన కొడుకు జీవితం తన కళ్ళ ముందే చిందరవందరగా మారడం చూసిన దేవసేన వైరాగ్యం పేరుతో సుధీర్‌ని ఒంటరిగా వదిలేసి ఎప్పటిలాగే తన స్వార్థం తాను చూసుకుని పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో చేరిపోయింది.మరి విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తరువాత ఏం జరిగిందని సుధీరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఎవరూ చెప్పలేక పోయారు.

సుధీరన్న చనిపోవడానికి కొంతకాలం ముందు కళ్ళకి ఆపరేషన్‌ చేయించుకోవాలని కొడుకు దగ్గరకి వచ్చిందట దేవసేన. తల్లి వచ్చినప్పటి నుండి కనిపించిన బంధువులకి ‘మా అమ్మ నస భరించలేకుండా ఉండాన’ని చెప్పుకునేవాడట. మళ్ళీ తనే ‘మా అమ్మ నన్ను సాకినట్టు ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డను సాకి ఉండదు’ అనే వాడట. ఏమయిందో ఎవరికీ తెలీదు, ఏం జరిగిందో దేవసేన ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు తల్లి పక్కగదిలో ఉండగానే తల్లికి అన్నము, కూర అన్నీ వండి గిన్నెలో వేసి చేతికిచ్చి పక్క గదిలోకి వెళ్లి వురి వేసుకున్నాడు. దగ్గరి బంధువుతో అంతకు కొన్నిరోజుల ముందు ‘మావా, సస్తే పోతది అనిపిస్తా వుంది. నావల్ల ఎవరికేమి ప్రయోజనం? సస్తే నాకన్నా శాంతి దొరకతది కదా?’ అన్నాడట. ఆ మాటలు విని బంధువు ‘అబ్బయ్య! బలవంతంగా సస్తే నరకానికి పోతామంట. అక్కడ కూడా నీకు మనశ్శాంతి దొరకదు’ అన్నాడట. ఆ మాట విని ‘అంతేనంటావా? అయితే సరేలే!’ అన్నాడట.

శవం దగ్గర పొర్లి పొర్లి ఏడుస్తున్న దేవసేనను చూసి ఎవరూ జాలిపడలేదు.మొదటి నుండి దేవసేన తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేదని అందరూ చెప్పుకున్నారు. బిడ్డ.. తల్లి మాట జవదాటేవాడు కాదని, అందుకే అతని జీవితం ఇట్లా నాశనమైందని అనుకున్నారు. పెళ్లయిన తరువాత భార్యాభర్తల మధ్యకి ఎవరూ పోగూడదని, ఈ దేవసేన.. సుధీర్‌ కాపురంలో చొరబడి నిప్పులు పోసిందని వచ్చిన వాళ్లలో విజ్ఞులు అన్నారు. కానీ శవానికి ఒకవైపు నిలబడి చేతులు కట్టుకుని ఇదంతా వింటున్న సుధీర్‌ స్నేహితుడు మాత్రం ‘ఏదంటే అది మాట్లాడబాకండి.. వాడికి అమ్మంటే ప్రాణం. ఇప్పుడు లేపి అడిగినా మా అమ్మ దేవత అంటాడు’ అన్నాడు.

చంద్రుడిని చూస్తుంటే సుధీరన్న ఎందుకు జ్ఞాపకం వచ్చాడో చెప్పాలి. మేము చిన్న పిల్లలుగా వున్నప్పటి సంగతి.. ఒక రోజు అందరం వెన్నెట్లో ఆటలాడుతూ వున్నాం సుధీరన్న హఠాత్తుగా ఆకాశంలోకి చూసి పక్కనున్న నాతో ‘బుజ్జమ్మ! ఆ చంద్రుడు, దాని పక్కనే వున్న ఆ చుక్కను చూశావా.. వాటిని చూస్తే నాకు మా అమ్మ, నాయన అనిపిస్తారు. చంద్రుడేమో మా అమ్మ. ఆ చుక్కేమో మా నాన్న. మా అమ్మని వదిలేసి నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎలా వెళిపోతున్నాడో చూడు మా నాయన, అందుకే అలా మసక మసకగా వున్నాడు’ అన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement