మేం నలుగురం ఊరి చివర నల్లవాగు మీద కట్టిన ఆ పాత కల్వర్టు దగ్గరకు చేరుకునేసరికి దూరంగా శ్మశానంలో అరగంట ముందు మాకు సెంటరులో కనపడిన శవయాత్ర తాలూకు మనుషుల గుంపు కనపడింది. కల్వర్టుకి, శ్మశానానికి సుమారు కిలోమీటరు దూరం. అప్పటివరకు లీలగా మా చెవుల్లో వినిపించిన చావు డప్పు అక్కడితో ఆగిపోయింది. శ్మశానంలో మనుషులని చూడగానే మామధ్య నిశ్శబ్దం అలముకుంది. అప్పటికి పడమటి సూర్యుడు పూర్తిగా వాలిపోయాడు. అందరం పాతకాలంనాటి పెచ్చులూడిపోయిన కల్వర్టు సిమెంటు గట్టుమీద కూర్చున్నాం. మా మధ్యలో రామబ్రహ్మం మేష్టారు.
అసలీ సాయంత్రపు నడక ఎవరు మొదలుపెట్టారో తెలీదు. రామబ్రహ్మంగారే మొదలుపెట్టారంటారు. తరవాత చాలామంది సరదాగా వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. నేనొచ్చి సంవత్సరమైంది. ప్రతిరోజూ సాయంత్రంకల్లా సెంటరుకు చేరుకుంటాం. ఒక్కోసారి బ్రహ్మంగారు మాకంటే ముందే వెళ్ళిపోతారు. అందరం స్కూలు టీచర్లమే. దూరంగా కనపడుతున్న మనుషుల్ని చూస్తూ ‘మీరెప్పుడైనా శ్మశానానికి వెళ్ళారా?’ అడిగేరు బ్రహ్మంగారు.‘వెళ్ళకపోవడమేంటి.. చాలాసార్లు వెళ్ళాం. చుట్టాలెవరో చనిపోతే’ అన్నాడు రామప్ప. అతను మా స్కూల్లో కొత్తగా వచ్చిన సైన్సు టీచరు. పత్రికలలో కథలు, కవిత్వం రాస్తూంటాడు.
అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు.
‘మీవాళ్ళెవరో చనిపోతేనో కాదు రామప్ప. చిన్నప్పుడు స్నేహితులతోనో.. ఒంటరిగానో..’మాలో ఎవరూ మాట్లాడలేదు.‘మీరు రచయితలు కదా.. ఆ వయసులో మీకెప్పుడూ శ్మశానం చూడాలని కుతూహలం కలగలేదా?’ అన్నారు మేష్టారు మళ్లీ రామప్పని ఉద్దేశించి.‘రచయితలైతే మాత్రం.. శ్మశానం చూడాలని ఎందుకుంటుంది చెప్పండి?’ అన్నాడు లెక్కల టీచరు కృష్ణారెడ్డి.‘ఎందుకుండదు? జీవితానికి అర్థం తెలుసుకోవాలనే ఆలోచన అక్కడే మొదలవచ్చు. చావుపుట్టుకలకి అర్థం ఏమిటి? చనిపోయాక మనిషి ఎక్కడికి వెళతాడు? బాల్యం, యవ్వనం, ప్రేమ, ముసలితనం అలా అనేక ఆలోచనలు అక్కడే పుడతాయి. మీరు అలా అంటున్నారు గానీ గోర్కీ చాలా చిన్నవయసులో తోటి స్నేహితులతో పందెంకట్టి ఒక రూబుల్ కోసం రాత్రంతా శ్మశానంలో గడిపాడు. ఆ శ్మశానంలో అతడి తల్లి సమాధి కూడా ఉంది.’
‘ఆయన రూబుల్ కోసం శ్మశానంలో కూర్చున్నాడు సార్, కుతూహలంతో కాదేమో’ అన్నాను నేను.‘అయితేమాత్రం.. అది ఆయనకు గుర్తుండిపోయే అనుభవంగా మిగిలిపోయింది కదా!’బ్రహ్మం మేష్టారు తెల్లచొక్కా, పంచెతో చూట్టానికి తెలుగు పంతుల్లా కనపడతారు గాని ఆయన స్కూల్లో ఇంగ్లీషు టీచరుగా పనిచేసి రిటైరయ్యారు. ఆ ఇంగ్లీషు టీచరు కూడా తీరికవేళల్లో బొమ్మలు గీస్తుంటారు. ఆయన చెప్పుకుపోయారు.‘శరత్ రాసిన శ్రీకాంత్ నవలలో కూడా శ్రీకాంత్ తన స్నేహితులతో పందెం కట్టి ఒక రాత్రంతా శ్మశానంలో గడుపుతాడు. అక్కడ అతనికి భయంగొలిపే అనుభవాలు ఎదురౌతాయి. విచిత్రం ఏమంటే మర్నాడు మళ్ళీ ఎవరో పిలుచుకెళ్ళినట్లు తనకు తెలీకుండానే ఆ శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్తాడు శ్రీకాంత్. ఇది ఇంకోరకమైన అనుభవం.’
‘మనలో ఎవరికైనా చిన్నతనంలో దయ్యాలు, భూతాలు మంత్రాలని భయం ఉంటుంది. ఆ భయం మనలోకి ఎలా వస్తుందో తెలీదు. అది ఎప్పుడు పోతుందో కూడా తెలీదు. వయసుతోపాటు పెరిగే ఎరుక చాలా భయాల్ని పోగొడుతుంది. లేదా ఇంకేదైనా కారణంచేత కూడా మనలో ఆ భయం పోవచ్చు. ఏదైనా సంఘటన జరిగి..’చుట్టూ చీకట్లు ముసురుకుంటుండగా శ్మశానంలో ఎర్రటి మంట వెలిగి తెల్లటి పొగ చెట్ల మధ్య నుంచి పైకి లేచింది. బ్రహ్మంగారు మననం చేసుకున్నట్టుగా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ నిదానంగా చెప్పడం ప్రారంభించారు. ‘నేనూ చిన్నతనంలో అంటే పదిహేనేళ్ళ వయసులో మా ఊరి శ్మశానంలో అడుగుపెట్టాను. చాలా సంవత్సరాల పాటు ప్రతిరోజూ సాయంత్రం దాని పక్కనుంచే గుండ్లకమ్మ నదికి నడిచివెళ్ళేవాడిని. ఆ వయసులో నాకూ అందరిలానే దయ్యాలు, భూతాల భయాలుండేవి. కానీ ఒకరోజు శ్మశానంలో జరిగిన సంఘటనతో అవన్నీ పక్కకి జరిగిపోయాయి. నేను వయసుతో పాటు వచ్చే ఎరుక సంగతి చెప్పడం లేదు.’
ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే..
దూరంగా శ్మశానంలోని చెట్ల నుండి నల్లటి చుక్కలు ఎగిరినట్లు కాకుల గుంపు పైకి లేచింది. ఆయన చెప్పడం మొదలెడితే ఎవరైనాసరే చెవులొగ్గి వినాల్సిందే! ఏది చెప్పినా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.‘నేను హైస్కూలు చదివేరోజుల్లో శ్రీనివాసరావు అనే స్నేహితుడు ఉండేవాడు. వాడిని ‘శీనాయ్’ అని పిలిచేవాడిని. చదువులో మేమంత తోపులం కాదుగాని మిగతా పిల్లలకీ మాకు మధ్య కొంత తేడా ఉండేది. తేడా అంటే అది చందమామ, బాలమిత్రలాంటి పుస్తకాలు చదవడం వలన వచ్చింది. ఈ పుస్తకాలు చదవడానికి తోడు మేము ఖాళీ దొరికినప్పుడల్లా అటు శింగరకొండకో, ఇటు మేదరమెట్లవైపో ఈత పండ్లనీ రేక్కాయలకనీ ఊరవతల పోరంబోకు భూముల్లో తిరుగుతా ఉండేవాళ్ళం. ఇక ప్రతిరోజూ పొద్దుగూకే టయానికి గుండ్లకమ్మ ఒడ్డుకి పోతావుండేవాళ్ళం. వచ్చేటప్పుడు శీనాయి మంచినీళ్ళ కోసరమని ఖాళీ ఇత్తడి బిందె తీసుకొచ్చేవాడు.
అద్దంకి నుంచి గుండ్లకమ్మ వెళ్ళడానికి మూడుదారులు ఉన్నాయి. మొదటిది ఊరి బయట చిన్న కాలవ ఒకటి దాటాక పొలాల మధ్య వేసిన రోడ్డు దాటుకుని ఎర్రమట్టి డొంకలోంచి గుండ్లకమ్మకి నడుచుకుంటూ పోవడం. అటువైపు పొరుగూర్ల నుంచి ఎవరైనా ఇటువైపు అద్దంకి రావాలంటే ఇది తప్ప మరో దారి లేదు. రావాలంటే నీళ్ళలోంచి నడుచుకుంటూ రావాల్సిందే. దాటేటప్పుడు మధ్యలో మెడలోతు నీళ్ళు. నీళ్ళలో నడవకూడదనుకుంటే ఏదైనా ఎడ్లబండి వచ్చేదాకా ఆగాలి. ఆడవాళ్ళు ఎడ్లబండి వచ్చేదాకా ఒడ్డునే కూర్చునేవారు. ఆదారి కాక, చాలా కాలానికి ఊరు దాటాక అద్దంకి నుంచి దర్శి వైపు వెళ్ళే రోడ్డుమీద వంతెన కట్టారు. ఈ రెండూ కాక మూడో దారి ఒకటి ఉంది. ఊరికి దక్షిణం వైపున దూరంగా ఉంటుందది. ఆ కాలిబాట గుండ్లకమ్మ దగ్గర కలిసేచోట నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ పక్కనే శ్మశానం.
ఎప్పుడన్నా అక్కడ శవాలని పూడ్చిపెట్టడమో, కాల్చడమో చేస్తారుగాని మేమెప్పుడూ చూసింది లేదు. చీకటి పడ్డాక ఆ దారిలో ఎవరూ పోరు. లోపలవైపు చిల్లచెట్ల మధ్య సున్నం వెలిసిపోయిన పాతకాలంనాటి సమాధులు కనపడతాయి. గుండ్లకమ్మ వెళ్ళేటప్పుడు మేమెప్పుడైనా ఆ శ్మశానంలోకి నడిచేవాళ్ళం. ముళ్ళ కంపలు, జిల్లేడు చెట్లు, పగిలిపోయిన కుండ పెంకులూ, ఎముకలూ కనిపించేవి. వాటిని చూసి మాకు అనేక ఆలోచనలు కలిగేవి. చందమామ కథల్లాంటి రకరకాల దయ్యాల కథలు, మాంత్రికుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. మాకు భయమైతే లేదుగాని దయ్యాలూ మా్రంతికులూ ఉంటారని నమ్మేవాళ్ళం.
మేము ఒడ్డున కూర్చుని చూస్తావుండగానే మనుషులు పంచెలు పైకి ఎగలాక్కుని నది దాటి అవతలవైపు పడమట దిక్కున ఉండే తిమ్మాయిపాలెం వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు రైతుల ఎడ్లబండ్లు నీళ్ళలోంచి అవతలికి వెళ్ళేవి. మధ్యలో లోతు దాటేటప్పుడు ఎద్దుల తలలు, బండి ముందువైపు కూర్చున్న మనిషి మాత్రం కనిపించేవాడు.
మేము ‘తిమ్మాయిపాలెం’ పేరు వినడమేగాని గుండ్లకమ్మ అవతలి ఒడ్డుకు ఐదారు మైళ్ళుండే ఆ ఊరికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇటువైపు నిలబడి అవతలికి చూస్తే ఒడ్డు నుండి ఒక అరమైలుదాకా అంతా ఒండ్రుమట్టి, ఇసక. ఆ పైన రెల్లు దుబ్బు, చిల్లచెట్లు ఆపైనంతా ఎటుచూసినా పోరంబోకు భూమి. రకరకాల వరుసల్లో దట్టంగా సరివిచెట్లు కనపడేవి. ఎక్కడపడితే అక్కడ పొడవాటి తాటిచెట్లు. ఆ తరవాత దూ..రం..గా.. భూమీ ఆకాశం కలిసే ఆకుపచ్చ అడవి మధ్య ఒకచోట గుండ్రంగా ఎవరో నిలబెట్టినట్లుగా నల్లగా ఎత్తైన తాటిచెట్లు. ఆ తాటి చెట్ల తలల మధ్య ఆకుపచ్చ, నీలం కలగలిసి బూదరబూదరగా కనపడేది. అక్కడేముందో తెలిసేదికాదు. శీనాయికీ నాకూ ఒక్కసారన్నా అవతలి ఒడ్డుకు వెళ్ళి ఏముందో చూడాలని అనిపించేది. మేం ఎప్పుడు వెళ్ళినా ఈతపండ్ల కోసం అద్దంకికి ఉత్తరాన ఉండే శింగరకొండకో, దక్షిణంవైపు మేదరమెట్లకో నడిచి వెళ్ళేవాళ్ళమే కానీ గుండ్లకమ్మ దాటుకుని అవతలి ఒడ్డుకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడన్నా పారే నీళ్ళలో మునకలేస్తున్నప్పుడు శీనాయ్‌గాడితో ‘ఒరేయ్.. తిమ్మాయిపాలెం దాకా కాకపోయినా కనీసం ఆ తాటితోపు వరకయినా వెళ్ళొద్దాంరా’ అనేవాడిని.
ఒక అదివారంనాడు గుండ్లకమ్మ ఒడ్డుకెళ్ళి ఒక్కణ్ణే కూర్చున్నాను. అప్పటికి సూర్యుడు ఏటవాలుకి దిగినా ఎండ ఇంకా నులివెచ్చగా ఒంటికి గుచ్చుకుంటూ ఉంది. నేను చూస్తుండగానే ఎద్దులబండి ఒకటి నీళ్ళలోకి దిగింది. రైతు ఎవరో అద్దంకిలో పని ముగించుకుని తిమ్మాయిపాలెం వెళుతున్నాడు. బండి కాస్తంత ముందుకు పోగానే వెనకవైపు కూర్చున్న మనిషిని చూసి అదిరిపడ్డాను. వెనకాల చెక్కమీద కాళ్ళు కిందకేసి కూర్చున్న శీనాయి! వాడు నన్ను చూడగానే ‘రేయ్.. రారా.. బండెక్కు’ అన్నాడు.అప్పటిదాకా తీరుబాటుగా కూర్చున్న నేను వాడి పిలుపు వినగానే ఉలిక్కిపడి ఒక్కసారిగా నీళ్ళలోకి పరుగెత్తి ఎద్దులబండి వెనకాల ఎగిరి కూర్చున్నాను. బండి కుదుపుకి రైతు వెనక్కితిరిగి చూశాడు.
బళ్ళు నీళ్ళలోంచి వెళ్ళేటప్పుడు మనుషులు వెనకాల ఎక్కడం వాళ్ళకి అలవాటే. శీనాయి వచ్చే దారిలోనే ఎక్కడో ఎక్కి కూర్చున్నట్లున్నాడు. బండి లోతుకు దిగేకొద్దీ మా అరికాళ్ళకు చల్లగా నీళ్ళు తగలసాగాయి. మొదట పాదాలు.. ఆ తరవాత నిదానంగా నీటిమట్టం పెరుగుతూ మోకాళ్ళు.. చివరికి నేను కూర్చున్న చెక్కమీదికి నీళ్ళు వచ్చి నా నిక్కరు కిందవైపు తడిసిపోయింది. మందువైపు చూస్తే ఎద్దుల మూతుల దాకా వచ్చాయి నీళ్ళు. పంచె తడవకుండా రైతు ముందువైపు నిటారుగా నిలబడి ఉన్నాడు. కొంచెం దూరంపోయాక నీటిమట్టం మళ్ళీ తగ్గసాగింది. ఒడ్డు దగ్గర పడ్డాక బండి నీళ్ళలో ఉండగానే ఇద్దరం కిందకి దూకేశాం.
అక్కడ ఒడ్డున నిలబడి చూస్తే ఇరువైపులా తాటిచెట్లున్న ఎత్తైన రోడ్డు కనపడింది. అక్కడికి దగ్గరలోనే ఉంటుందనుకున్న ఊరు పొలిమేర కనుచూపులో కూడా లేదు. ఆ కనపడే రోడ్డువైపు కాకుండా మరోవైపు నడవడం మొదలుపెట్టాం. అది దుక్కిదున్ని సేద్యం చేసే నేల కాదు. ఎటుచూసినా అడ్డదిడ్డంగా పెరిగిన చిల్ల చెట్లు, పల్లేరు కాయలతో ముళ్ళ పొదలు, మట్టిదిబ్బలతో ఎగుడుదిగుడు నేల. దారిపొడుగునా పచ్చగా పెరిగిన పసిరిక గడ్డిలో రాలి ఎండిపోయిన తాటి ఆకులు, జిల్లేడు మొక్కలు, కొన్నిచోట్ల మనిషెత్తు పెరిగిన జపా¯Œ తుమ్మచెట్లు తప్పితే మరింకేంలేదు. చివరికి తాటివనంలా కనిపిస్తున్న చోటు చేరేసరికి అదంతా పోరంబోకు భూమిలో చెదురుమదురుగా పెరిగిన తాటిచెట్లు.
విసుగుపుట్టి ఒకచోట మొదలు నరికి ఒరిగిపోయిన తాటిచెట్టు మీద కూర్చున్నాం.తలెత్తి చూస్తే మళ్ళీ మా చుట్టూ తలలెత్తుకుని నిలబడిన తాటిచెట్లు. మా వెనక ఏటవాలుకు దిగిన సూర్యుడి పసుపురంగు ఎండ. అప్పటిదాకా ఎండలో ఆవిర్లు గక్కిన గాలి నెమ్మదిగా చల్లబడుతూ ఉంది. మాముందు నల్లటి పికిలిపిట్ట కొత్తవారిని చూసి ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఊరికూరికే హైరానా పడతావుంది. మాకు కొద్ది దూరంలో మందనుంచి తప్పిపోయిన గేదె మోర వంచి తదేకంగా గడ్డి పెరుక్కుంటావుంది. శీనాయి దిగ్గున లేచి ‘ఒరేయ్ అక్కడ ఎవరో మనుషులు కనిపిస్తున్నార్రా’ అన్నాడు.లేచి నిలబడి చూశాను. అక్కడినుండి చూస్తే దూరంగా అద్దంకివైపు గుండ్లకమ్మ అవతలి ఒడ్డు కనబడతావుంది.
ఎండ పొడకు మెరుస్తున్న నీటి ప్రవాహం .. ఆ తరువాత తీరపుగట్టు, ఆపైన ఎత్తుగా ఎర్రటి మట్టి.. అక్కడ ఆకుపచ్చచెట్లలో లీలగా అక్కడక్కడా పైకి లేచిన తెల్లటి గోరీలు.. వాటి మధ్య నలకల్లా మనుషులు కనబడ్డారు. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి వాళ్ళని చూస్తుండిపోయాం. ఉన్నట్టుండి శీనాయి..‘ఒరే.. ఎవరో చనిపోయార్రా.. అందుకే ఆ జనం’ అన్నాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. అవతల వాళ్ళని చూడగానే ఎలాగైనా అక్కడ జరిగేది చూడాలని అక్కడనుంచి లేచి గబగబా నడవడం మొదలుపెట్టాం. పరుగులాంటి నడక.
నేలపై పిచ్చి మొక్కలు కాళ్ళకి గీరుకుంటున్నాయి. అడుగులు చిన్నపాటి గుంతలు, రాళ్ళురప్పలు, తుమ్మ ముళ్ళు ఎదురైనప్పుడల్లా తడబడుతున్నాయి. వేటినీ లెక్క చేయకుండా పరుగులాంటి నడక.. తాటివనం నుంచి గుండ్లకమ్మ ఒడ్డుకు వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు. నీళ్ళలోకి దిగి గబగబ అడుగులు వేస్తుంటే తపతపమని నీళ్ళు పైకి చిమ్మి మొహాల మీద పడ్డాయి. మోకాళ్ళదాకా వచ్చాక నీళ్ళు కాళ్ళకి ఎదురీదుతున్నాయి. ఇంకాస్త లోపలికి నీళ్ళలో సంకలదాకా వచ్చాక అడుగులు ముందుకు వెళుతుంటే ప్రవాహం పక్కకి నెడతావుంది. మరింత ముందుకు వెళ్ళాక నీటిమట్టం తగ్గినచోట గబగబా అడుగులు వేస్తుంటే అడుగున పాచిపట్టిన రాళ్ళు పాదాలకు తగులుతున్నాయి. బొటనవేళ్ళు రాళ్ళల్లో గుదిగుచ్చి ఒక్కొక్క అడుగు బలంగా వేసుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళాం. అప్పటికి బట్టలు పైదాకా పూర్తిగా తడిసిపోయాయి.
ఒక్క ఉదుటున శ్మశానంలో వచ్చిపడ్డాం. ఒక గోతి చుట్టూ నిలబడిన నల్లటి మనుషులు కనపడ్డారు. అస్తమించే సూర్యుడి లేత పసుపురంగు ఎండ ఆచ్ఛాదనలేని నల్లటి మనుషుల శరీరాల మీద పడతావుంది. వాళ్ళకి కొంత దూరంలో నేల మీద చాపలో చుట్టిన శవం. తల బయటికి కనిపిస్తా ఉంది. ఎవరో యువకుడు. పాతికేళ్ళుండొచ్చు. జుట్టంతా చెదిరి, తల ఒక పక్కకి ఒరిగి ఉంది. ఉండీ లేనట్లు మొలిచిన లేలేత గడ్డం వెంట్రుకలు. ఆ మసిబారిన గాజు కళ్ళు కలలు కంటున్నట్లుగా సగం తెరుచుకుని నిశ్చలంగా ఉన్నాయి. శవానికి రెండడుగుల దూరంలో ఒంటికి చుట్టుకున్న ముతక చీర కొంగునే భుజాల చుట్టూ శాలువాలాగా చుట్టుకుని ఒక నడివయసు ఆడ మనిషి నిలబడి ఉంది.
మరోపక్క భూమిలో గసగసమని మనుషులు గొయ్యి తవ్వుతున్న చప్పుడు. లోపలనుంచి దోకుడు పారతో పైకి ఎగదోసిన మెత్తటి మట్టి గోతి చుట్టూ పేరుకుంటోంది. గొయ్యి తవ్వడం పూర్తయ్యాక ఇద్దరు మనుషులు గోతిలోంచి పైకి వచ్చారు.చివరికి అందరూ చూస్తుండగా చాపలో శవాన్ని బయటికి తీశారు. తల, కాళ్ళు ఏ దిక్కులో ఉండాలనే మంతనాలయ్యాక తలవైపు ఇద్దరు పాదాల వైపు ఇద్దరు పట్టుకుని శవాన్ని గోతిలో బోర్లా పడేశారు. లోపల నేల మీద దబ్బున శబ్దం వచ్చింది. నేను రెండడుగులు ముందుకు వెళ్ళి గోతిలోకి చూశాను. ఉత్త నేల మీద, బొక్క బోర్లా పడిన శవం, ఒక పక్కకి తిరిగిన తల.. అవే గాజుకళ్ళు. అక్కడ నిలబడిన వాళ్ళలో ఒక మనిషి ‘ఏంది గుడ్డతో కప్పెడతావా? అట్టా కుదర్దు.
ఆ లుంగీ తీయాలి’ అన్నాడు. పొడవాటి కర్ర పట్టుకున్న మనిషి గోతిలోకి కర్రని పోనిచ్చి ఆ శరీరం మీద ఉన్న మాసిన లుంగీని పక్కకి జరిపాడు. అలా జరపడంతోటి నల్లటి అతడి వీపు కింద, సరిగ్గా నడుము మీద ఎర్రగా ఉన్న అరచేతి మందం ఎర్రటి పుండు కనిపించింది. పైనుండి పడిన అదురుపాటుకి నడుముకి కట్టిన గాజుగుడ్డ రక్తపు మరకల దూదితోపాటు చెదిరి నల్లటి ఒంటి మీద ఎర్రటి పుండు బయటపడింది. ‘ఎన్నాళ్ళబట్టి ఓర్చుకున్నాడో నా బిడ్డ. యియ్యాల్టికి నెల దినాలు. సివరికి ఈ మాయదారి పుండు పొట్టనబెట్టుకుంది’ అన్నది అక్కడ నుంచున్న ముసలమ్మ.‘ప్రార్థన చేసే వాళ్ళెవురూ లేరా ఇక్కడ?’ అన్నాడు అక్కడున్న నడివయసు మనిషి.‘ఊరుగాని ఊళ్ళో పేస్టరుని ఎక్కడనుంచి తెచ్చేది’ అన్నది ఆ ముసలి తల్లి.
‘అయితే కడసారి కొడుకుని చూసుకో’ అన్నారెవరో ఆ గుంపులో వెనక నుంచి.ఆ ముసలామె ఒకడుగు ముందుకు వేసి గోతిలో బోర్లా పడిన శవాన్ని తేరిపార చూసింది. అలా చూడటంతోటే ఆమె కళ్ళనుంచి నీళ్ళు బొటబొటా కారాయి. ఆమె కొంగుతో చెంపల మీద నీళ్ళను తుడుచుకుంటూ వెనక్కి జరిగింది. అక్కడ నిలబడ్డ నలుగురు మనుషులు దోకుడు పారతో మట్టిని గోతిలోకి ఎగదోయసాగారు. నేను చూస్తుండగానే ఆ మనిషి మీద కాస్తకాస్త మట్టి పడుతూ చివరికి కనుమరుగయింది.అలా పైనుంచి మట్టి పడుతున్నంతసేపూ ఆ మనిషికి ఊపిరి ఆడటం ఎలా? అతడు ఎలా లేవగలుగుతాడు. అయ్యో కాళ్ళు చేతులు కదిలించలేడు కదా. చనిపోయిన తరవాత మనుషులు చివరికి ఎక్కడికి వెళతారు? చివరికి ఏమవుతుంది? కొంత కాలానికి ఆ శరీరం అస్థిపంజరంలా మారిపోతుందేమో అన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి. పక్కన జిల్లేడు పొదలో కపాలం దవడలు విప్పి నావైపే తదేకంగా చూస్తావుంది.
గొయ్యిని పూర్తిగా మట్టితో పూడ్చాక ఇద్దరు మనుషులు మట్టిని దట్టంగా ఎగదొక్కి చివరికి గుర్తుగా ఎత్తైన నిలువుపాటి గుట్టను గోరీలాగా పారలతో చదును చేశారు. వాళ్ళంతా తమ పనిలో నిమగ్నమయి ఉండగా ఆ ఆడామె ఉన్నచోటునే నిలబడి శూన్యంలోకి చూస్తావుంది. ఆమె చెంపల మీద చారికలు ఇంకా తడారి పోలేదు.చివరికి అందరూ అక్కడ్నుంచి కదలబోతున్నంతలో ఆ ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. వాడ్ని సూడ్డానికి ఎంత దూరం నుంచి వచ్చుండారు. మా మీద ఎంత ప్రేమ మీకు’ అని అంటా ముందుకు నడిచింది.
ఆవిడ మాటలు మొదట నాకు అర్థం కాలేదు. ఆవిడ కొడుకు మీద మాకు ప్రేమ ఏమిటి? వాళ్ళెవురో మాకు తెలీదు. మేము ఆవిడ కొడుకుని చూట్టానికి రాలేదనీ, ఆ శ్మశానంలో కర్మకాండలు చూట్టానికి మాత్రమే వచ్చామనీ, అంతకు మించి మరేమీ కాదని ఆవిడ దగ్గరకెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాను. ఎందుకో సిగ్గనిపించింది. అది కూడా చెప్పడానికి మనసురాక ‘ఆవిడ ఎలాగనుకుంటే అలాగ అనుకోనిమ్మని.. ఆవిడ అలా అనుకుంటేనే బాగుందనుకున్నాను.మేమంతా శ్మశానం నుంచి బయటకు వస్తావుంటే ఆమె మాత్రం కొంచెం ఇవతలికి వచ్చాక ఒక జిల్లేడు చెట్టు మొదల్లో కూలబడింది. ఒక మేస్త్రీలాంటి మనిషెవరో కూలీలకు డబ్బు లెక్కచేసి వెళ్ళబోతా ‘ఇంకేవిటికి ఇక్కడ పెద్దమ్మా.. కొడుకు లేచొస్తాడని కూకుండావా? దబ్బునెళ్ళి మీవూరి బొస్సు పట్టుకో. చీకటి పడిపోతావుంది’ అని కాలిబాట పట్టాడు.
ఆవిడ ఆయన చెప్పిన మాటలు వినిపించుకోకుండా అక్కడే కూర్చుని గుడ్ల నీరు కుక్కుకుంటా కుళ్ళికుళ్ళి ఏడుస్తావుంది. మేమిద్దరం ఆమెను దూరం నుంచి చూస్తా, అటు ఇటు తారట్లాడతా ఏం చేయలేక ఊరకుండిపోయాం. చీకటి పడ్డాక ఎవురి దారిన వాళ్ళు ఇళ్ళకు పోయాక ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు. కండ్లు మూసుకుంటే ‘నాయనలారా నా బిడ్డ మీద మీకెంత ప్రేమ..’ అంటూ చింకిచీర కట్టుకుని ఆ శ్మశానంలో గోరీల మధ్య నిలబడిన ఆ నల్లటి ఆడమనిషి మాటలే చెవుల్లో వినిపించాయి. చాలాకాలం ఆమెని మర్చిపోలేకపోయాను. ఆ తరవాత ఎప్పుడు గుండ్లకమ్మ వెళ్ళినా ఆ పక్కనే ఉండే ఆ శ్మశానంలోకి అడుగుపెట్టలేదు. అంతకుముందు భయపెట్టే శ్మశానం ఆ రోజు నుంచి మామూలుగా కనపడసాగింది. నా మనసులో ఏదో మాయపొర తొలగినట్లైంది. ఒక అనుభవం అలా అనేక ఆలోచనలని చెరిపేసింది.
ఈడు పెరిగేకొద్దీ చావంటే దుఖమనీ అంతులేనివిషాదమనీ తెలిసొచ్చింది.బ్రహ్మం మేష్టారు చెప్పడం ముగించి మౌనంగా ఉండిపోయారు. మేము ఎన్నో సంవత్సరాల కిత్రం గుండ్లకమ్మ ఒడ్డున ఒక సాయంత్రంలోంచి ఇప్పటి దట్టమైన ఈ చీకటి లోకంలోకి వచ్చి పడ్డాం. మేష్టారి తెల్లటి జుట్టు చీకట్లో వెండి జరీలా మెరుస్తా ఉంది. మీసం లేని ఆయన నల్లటి మొహంలోని గీతలు అస్పష్టంగా కనబడుతున్నాయి.‘అయితే మేష్టారూ, మరణం అనేది ఒక రహస్యం కాదంటారా?’ అన్నారు కృష్ణారెడ్డిగారు ఉన్నట్లుండి తన మౌనంలోంచి బయటపడి.‘కాదని ఎవరన్నారు.. అది ఎవరూ తెలుసుకోలేని ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే..’ ‘అదిసరే.. ఆరోజు నుంచి మీకు దేవుడంటే నమ్మకం పోయిందన్నమాట’ అన్నాడు రామప్ప మధ్యలో కల్పించుకుని.
‘ఆ మాట నేను అనలేదే? దయ్యాలూ, భూతాలు అంటే భయం పోయిందని అన్నాను. దేవుడి మీద నమ్మకం పోయిందని చెప్పానా?’
‘మరయితే అది కూడా మూఢనమ్మకమేగా మేష్టారూ?’ఆ మాటకి ఆయన గట్టిగా నవ్వి ‘నాది మూఢ నమ్మకమే. దాన్నలాగే ఉండనీ..’ అని కొంచెం సేపు ఆగి ‘మనిషి లోపల దయ్యం ఉంటుందన్నది నిజం. పాపాలు అందరిలోనూ ఉన్నాయి. అసలు ఉన్నదల్లా సైతానే. దానిని పోగొట్టడానికి మనం చేయాల్సిందల్లా దేవుడిని కనుక్కోవడమే. అంటాడు దోస్తయేవ్‌స్కీ’ అని ఇక చెప్పాల్సింది ఏదీ లేదన్నట్లు మేష్టారు లేచి నిలబడి పంచెకు అంటుకున్న దుమ్ము దులుపుకున్నారు.అందరం లేచి ఇంటిదారి పట్టాం. దూరంగా నల్లటి చీకటి మధ్య ఎర్రటి కాష్ఠంలో రగులుతున్న మంటలు చీకట్లోకి నాలుకలు చాపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment