ఈవారం కథ: తూటా | Story Of Week | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: తూటా

Published Sun, Dec 8 2024 9:10 AM | Last Updated on Sun, Dec 8 2024 9:10 AM

Story Of Week

‘బావగారూ! కాస్త పక్కకొస్తారా? ఒకసారి మీతో మాట్లాడాలి’ అన్నాడు గోవిందరావు, కాబోయే వియ్యంకుడు గోపాలరావుతో.గోవిందరావు ఇంట్లో నిశ్చితార్థం జరుగుతోంది. ఆనందసందోహాల ఆ వేడుకకి అతని మాటతో బ్రేక్‌ పడింది. అతనికి తన వియ్యంకుడు పెళ్ళిచూపుల్లో అన్నమాటలు గుర్తుకొచ్చాయి. ‘నిశ్చితార్థంలో కానీ, పెళ్ళి వేడుకలో కానీ డబ్బు కంటే ఆత్మీయతాను రాగాలే కనిపించాలి. మా నుండి కట్నకానుకల విషయంలో ఎలాంటి డిమాండ్‌ లేదు. మీ శక్తి కొద్ది ఇవ్వాలనుకున్నది ‘ఇదీ’ అని ఏ మాటైతే మీరిస్తారో అది తప్పకుండా సమయానికివ్వాల్సిందే! మాట, మర్యాదల విషయంలో నేను కాస్త కఠినంగా ఉంటాను’ అని!‘ఏంటి గోవిందరావుగారూ?’ అనుమానంగా అన్నాడు గోపాలరావు.

‘అదీ.. అదీ.. నిశ్చితార్థం నాడు కట్నకానుకల రూపంగా మీకిస్తామన్న రెండు లక్షల రూపాయలను కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సమకూర్చలేకపోతున్నా. పెళ్ళికింకా నెల రోజుల గడువుంది. మీకిస్తానన్న రొక్కాన్ని ఓ వారంలో ఇచ్చి తీరుతాను. ఇప్పటికి నన్ను మన్నించండి’ అన్నాడు గోవిందరావు.‘అదేంటండీ.. అప్పుడు మీరే ఇస్తానని, ఇప్పుడు మీరే కుదరదంటున్నారు? నాకు డబ్బు కంటే మాట ముఖ్యం. మీరు డబ్బు రెడీ చేసుకుని కబురు పంపండి. అప్పుడే తాంబూలాలు పుచ్చుకుందాం’ అన్నాడు..లోలోన దాగున్న తన కట్నదాహాన్ని బయటపెడుతూ గోపాలరావు.‘డబ్బు కారణంగా తల్లి లేని పిల్ల నిశ్చితార్థం ఆపడం భావ్యం కాదు బావగారూ..! కొంచెం పెద్ద మనసు చేసుకోండి’ అన్నాడు గోవిందరావు.

‘నేను మిమ్మల్ని ఏ డబ్బూ అడగలేదు. మీకు మీరుగా ఇస్తానన్నది మాత్రం ఇచ్చి తీరవలసిందే. లేదా మీకూ, మీ సంబంధానికో దండం’ అంటూ కటువుగా సమాధానమిచ్చి హాల్లో కేసి కదిలాడు.‘పంతులుగారూ.. కొన్ని కారణాల వల్ల  ఈరోజు తాంబూలాలు పుచ్చుకోవడం లేదు. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. క్షమించండి!’ అన్నాడు గోపాలరావు. అలాగే వచ్చిన బంధువర్గానికీ క్షమాపణలు చెబుతూ కార్యక్రమం రద్దయిందని ప్రకటించాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన నిశ్చితార్థానికి ఎన్నో అర్థాలు వెతుకుతూ, తమలో తామే గుసగుసలాడుతూ ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు బంధువులు.‘అంకుల్‌.. నిశ్చితార్థం నిలిపివేయడం ఏం బాగాలేదు. అసలేం జరిగింది? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అంతేగానీ ఈ తంతుని ఆపకండి..ప్లీజ్‌!’ అన్నాడు గోవిందరావు కొడుకు విశాల్‌..  గోపాలరావుని ప్రాధేయపడుతూ.

‘ఏం జరిగిందో వెళ్ళి మీ నాన్ననే అడుగు’ కోపంగా గోపాలరావు.‘ఇప్పుడీ కార్యక్రమాన్ని కానిద్దాం. ఏమున్నా తరువాత చూసుకోవచ్చుగా నాన్నా?’ అన్నాడు పెళ్ళికొడుకు తన తండ్రితో. అతడి తల్లి కూడా ఆ మాటల్ని బలపరచింది. చివరికి పెళ్ళికూతురు కూడా బతిమిలాడినా వినకుండా వడివడిగా బయటకి నడిచాడు గోపాలరావు. దాంతో అతడి కుటుంబం కూడా అక్కడి నుండి కదలక తప్పలేదు.పొంగివస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది పెళ్ళికూతురు. ‘నాన్నా..! ఏంటిదంతా? మీరంతా చూసుకుంటున్నారనుకున్నాను. ఈ గందరగోళమేంటి? ఏం జరిగింది?’ అన్నాడు విశాల్‌ తండ్రిని నిలదీస్తున్నట్టు!ఏమీ మాట్లాడకుండా ఒక్క ఉదుటన తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్నాడు గోవిందరావు. 

తండ్రి వాటం చూస్తే విశాల్‌కి  ఎందుకో అనుమానం వచ్చింది. ‘నాన్నా..! నాన్నా..!’ అంటూ గది తలుపులు బాదాడు విశాల్‌. అటు నుండి స్పందన లేదు. కిటికీ గుండా చూసి హడలిపోయాడు. ఆలస్యం చెయ్యకుండా గది తలుపులను భుజంతో బలంగా రెండు మూడుసార్లు తోసేసరికి లోపల చిన్న గొళ్ళెమే పెట్టి ఉండటంతో అది ఊడి వచ్చి తలుపులు తెరచుకున్నాయి.అప్పటికే గోవిందరావు కుర్చీ మీద నిలబడి పంచెతో సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరివేసుకునే  ప్రయత్నంలో ఉన్నాడు.ఒక్క ఉదుటన తండ్రిని సమీపించి గట్టిగా కాళ్ళు పైకెత్తి పట్టుకుని, మెడకు పంచె బిగుసుకోకుండా చూశాడు విశాల్‌. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ గొడవకి లోపలున్న గోవిందరావు కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం తెలుసుకుని భోరున విలపించింది. 

‘నాన్నా.. ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డారు? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. అసలు ఇంతకీ మీరు అంకుల్‌తో ఏం మాట్లాడారు? వివరంగా చెప్పండి’ అన్నాడు విశాల్‌. మౌనం వీడాడు గోవిందరావు..‘అదీ.. నిశ్చితార్థం రోజున వారికి రెండు లక్షలు ఇస్తానని మాటిచ్చాను. కానీ ఇవ్వలేకపోయా’ అంటూ ఆగాడు.‘ఎందుకు? పొలం అమ్మి నెలరోజుల క్రితమే డబ్బు సమకూర్చుకున్నారు కదా? చెల్లి పెళ్ళికోసమని నేనూ ఎప్పటి నుంచో నెల నెలా పదో, ఇరవయ్యో వేలు పంపుతునే ఉన్నానుగా? మరెందుకు ఇవ్వలేదు?’
‘ఆ డబ్బు లేదు నా దగ్గర’ అంటూ బాంబులాంటి వార్త పేల్చాడు గోవిందరావు.‘ఏంటీ..? డబ్బు లేదా..?’ షాకయ్యారు అన్నాచెల్లెళ్ళిద్దరూ! 
‘అవును. ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు’ దుఃఖం ముంచుకొస్తుండగా తల బాదుకుంటూ చెప్పాడు గోవిందరావు.‘అంత డబ్బు ఏం చేశారో చెప్పండి ప్లీజ్‌’ అడిగాడు విశాల్‌. అప్పుడు అసలు విషయం చెప్పసాగాడు గోవిందరావు.

ఆ రోజు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో గోవిందరావు పెళ్ళి పనుల షాపింగ్‌లో ఉండగా ఫోన్‌ మోగింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు.
‘లక్ష్మీగోవిందనారాయణగారా మాట్లాడేది?’ఆ మాటకు గోవిందరావు ఆశ్చర్యపోయాడు.. తన పూర్తిపేరు ఎవరికీ తెలియదు, పిల్లలతో సహా. మరి ఫోన్లో వ్యక్తికి ఎలా తెలిసింది చెప్మా.. అనుకుంటూ! ‘ఆ.. మీరెవరూ..?’ అడిగాడు గోవిందరావు.‘మేము ఎస్‌బీఐ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ నుండి కాల్‌ చేస్తున్నాం!’అప్పుడర్థమైంది తన పూర్తి పేరుతో అకౌంట్‌ ఉండబట్టే అతడలా పిలిచాడని. ‘చెప్పండి..?’‘మీ సేవింగ్స్‌ అకౌంట్‌ కేవైసీ అప్‌ డేట్‌ కాలేదు. ఆర్‌బీఐ రూల్స్‌ ప్రకారం వెంటనే అప్‌ డేట్‌ చేయకపోతే అకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుంది. అది చెబుదామనే ఫోన్‌ చేశాను.’ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు గోవిందరావు.

 ఆ అకౌంట్‌ ఎంత ముఖ్యమో అతడికి బాగా తెలుసు. కూతురి పెళ్ళి కోసం పొలం అమ్మగా వచ్చిన రెండు లక్షలతో పాటు, కొడుకు పంపుతున్న డబ్బూ అందులో ఉంది. రాబోయే మంగళవారమే కూతురి నిశ్చితార్థం. ఆ రోజుకు డబ్బు చాలా అవసరం. ‘సరే.. రేపు నేను బ్యాంకుకి వచ్చి కావలసిన ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తాను’ చెప్పాడు గోవిందరావు.‘సార్‌.. రేపు సెకండ్‌ శాటర్‌డే సెలవు, ఎల్లుండి ఆదివారం. సోమవారం నుండి మూడు రోజుల వరకు ఆలిండియా బ్యాంక్‌ యూనియన్‌ స్ట్రయిక్‌! మీరు గురువారం వెళ్ళి అప్‌ డేట్‌ చేసుకోండి..’అది విని గోవిందరావు మరింత కంగారు పడ్డాడు. కూతురి నిశ్చితార్థానికి ఒకరోజు ముందు బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేద్దామనుకున్నాడు.

 కానీ వాళ్ళు చెప్పింది వింటుంటే అది కుదిరేట్టు లేదనుకుని ‘వేరే మార్గమేం లేదా..?’ అడిగాడు.‘ఆన్‌లైన్‌లో అప్‌ డేట్‌ చేసుకోవచ్చు సార్‌! మీకు ఓకే అయితే మా టీమ్‌ మీకు కాల్‌ చేస్తుంది..’హమ్మయ్యా.. బతికించారు. అలా అప్‌ డేట్‌  చేసుకుంటే అకౌంట్‌ లాక్‌ అవకుండా ఉంటుంది అనుకుంటూ, ‘సరే’ అని చెప్పి, కాల్‌ కట్‌ చేశాడు గోవిందరావు.కాసేపటికే బ్యాంక్‌ నుండి కాల్‌ వస్తే, అవతల వ్యక్తి చెప్పినట్టు చేసి, కేవైసీ పూర్తయిందని ఊపిరి పీల్చుకున్నాడు.∙∙ విషయం చెబుతూ దుఃఖం ముంచుకురాగా మధ్యలో ఆగాడు గోవిందరావు. ‘మరి డబ్బు తీసే ఉంటారు కదా.. దాన్ని వారి మొహాన కొట్టలేకపోయారా?’ అన్నాడు విశాల్‌. ‘అవును కదా’ అన్నట్టుగా చూసింది గోవిందరావు కూతురు. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు గోవిందరావు. తండ్రి మౌనంతో ఒక్కసారిగా వారికి ఉత్కంఠ ఎక్కువైంది. 

‘ఏమైంది నాన్నా.. చెప్పండి..’ అడిగాడు విశాల్‌ ఆత్రంగా.‘అదీ.. అదీ.. కేవైసీ పేరుతో వచ్చిన కాల్‌ బ్యాంకు నుండి కాదు, సైబర్‌ మోసగాళ్ళ నుండి!’‘ఆ..!’ షాక్‌ అయ్యారు అన్నాచెల్లెళ్ళిద్దరూ!‘మొన్న ఆదివారం ఏటీఎమ్‌లో డబ్బు డ్రా చేయబోతే నిల్‌ బ్యాలెన్స్‌  చూపించింది. మతిపోయింది. బ్యాంకు స్ట్రయిక్‌ క్యాన్సిల్‌ అయిందని తెలుసుకుని, నిన్న బ్యాంకుకి వెళ్ళి మేనేజర్‌ని కలిశాను. జరిగింది చెప్పాను. తాము ఎలాంటి కాల్‌ చెయ్యలేదన్నాడు. తన కంప్యూటర్‌లో డీటెయిల్స్‌ చెక్‌ చేసి, నేను సైబర్‌ మోసగాళ్ళ వలకి చిక్కానని చెప్పాడు. అప్పుడు ఆలోచిస్తే నేను చేసిన తప్పు అర్థమైంది. ఆ ఎగ్జిక్యూటివ్‌ అడిగిన విధంగా నా ఆధార్‌ నంబర్, పాన్‌ నంబర్, చివరికి నా ఫోనుకి వచ్చిన ఓటీపీ అన్నీ చెప్పాను. నిశ్చితార్థం టెన్షన్‌లో నా బుర్ర పనిచేయలేదు. ఆ క్షణాన నాకే మాత్రం అనుమానం రాలేదు. నా అకౌంట్‌ లాక్‌ కాకుండా ఉంటే చాలనుకున్నాను. ఆ సైబర్‌ మోసగాడు నా బలహీనతని క్యాష్‌ చేసుకున్నాడు’ అంటూ భోరుమన్నాడు గోవిందరావు. 

‘మా కెందుకు చెప్పలేదు?’ నిలదీశాడు విశాల్‌.‘కష్టం మీద సెలవు దొరికి, పై ఊరు నుండి నువ్వు ఆరోజే ఇంటికొస్తుంటే ఈ విషయం చెప్పి నీ మనసు పాడుచేయదలచుకోలేదు. వియ్యంకుడిని బతిమిలాడుకుంటే జరగబోయే శుభకార్యాన్ని ఆపడని అనుకున్నాను. వెంటనే పోలీస్‌ కంప్లయింట్‌ ఇద్దామనుకుంటే ఈ విషయం బయటికి పొక్కి శుభకార్యం ఎక్కడ ఆగిపోతుందేమోనని.. నిశ్చితార్థం అయిపోయాక కంప్లయింట్‌ ఇవ్వొచ్చనుకున్నాను..’‘పదండి నాన్నా.. ఇప్పుడే వెళ్ళి సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇద్దాం’ అన్నాడు విశాల్‌.సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌ని కలిశారు గోవిందరావు, విశాల్‌.‘చెప్పండి..’అన్నాడు ఈశ్వర్‌.
‘సర్‌.. నాపేరు గోవిందరావు.

 నా బ్యాంకు అకౌంట్లోంచి రెండు లక్షలు పోయాయి’ సూటిగా విషయంలోకి వచ్చాడు గోవిందరావు.‘ఎప్పుడు? ఏలా? ’అంటూ ఈశ్వర్‌ అడిగిన రకరకాల ప్రశ్నలకు తనకి తెలిసినంత వరకూ సమాధానాలు ఇచ్చాడు గోవిందరావు. అతడి ఫోన్‌ తీసుకుని శ్రద్ధగా పరిశీలించాడు ఈశ్వర్‌. తరువాత అసిస్టెంట్‌ని పిలిచి ఆ ఫోన్‌ అతడికిస్తూ అందులో వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైనవి కాపీ చేయమన్నాడు.‘ఇన్‌స్పెక్టర్‌ గారూ! ఎలాగైనా మా డబ్బు మాకు దక్కేట్టు చెయ్యండి’ అన్నాడు విశాల్‌ కల్పించుకుంటూ. ‘ఆ.. ఆ.. ఇంతకీ నీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావ్‌?’ అడిగాడు ఈశ్వర్‌. ‘నా పేరు విశాల్, ఢిల్లీలో జాబ్‌ చేస్తున్నాను. ఈయన మా నాన్నగారు’ చెప్పాడు విశాల్‌.

‘సాధారణంగా సైబర్‌ బాధితులు ఎంత తొందరగా వచ్చి కంప్లయింట్‌ చేస్తే అంత త్వరగా డబ్బు తిరిగిపొందే అవకాశం ఉంటుంది. ఇది జరిగి ఐదురోజులవుతోంది. మోసానికి గురైనానని తెలిసి ఇంతవరకు కంప్లయింట్‌ చెయ్యకపోవడం మీరు చేసిన మరో తప్పు’ అంటూ కంప్లయింట్‌ రిజిస్టర్‌ చేసి, ఆ ఇద్దరి ఫోన్‌ నంబర్స్‌ తీసుకుని, వాళ్లను పంపించేశాడు ఈశ్వర్‌.  మూడు నాలుగురోజుల తరువాత గోవిందరావుకి ఈశ్వర్‌ నుండి కాల్‌ వచ్చింది, ఒకసారి స్టేషన్‌కొచ్చి కలవమని. సంబరపడ్డాడు.. దొంగల్ని పట్టుకుని తన డబ్బు రాబట్టారేమో అని! ఎక్కడలేని ఉత్సాహంతో వెంటనే స్టేషన్‌కి బయలుదేరాడు. స్టేషన్‌లో గోవిందరావును చూసి ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌ ‘మీ కేసులో కొంచెం ముందుకు వెళ్ళాం. 

బ్యాంక్‌ వాళ్ళతో కో ఆర్డినేట్‌ చేసుకుని వాళ్లిచ్చిన కొన్ని వివరాలతో ఇన్వెస్టిగేషన్‌ చేస్తే తెలిసిందేంటంటే.. మీకు వచ్చిన కాల్‌ ఉత్తరప్రదేశ్‌ నుండని! ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఎంక్వయిరీ చేస్తున్నాం. అసలు ఇలాంటి కేసుల్లో బాధితులకు ఎంతవరకు వాళ్ల డబ్బును తిరిగి ఇప్పించగలమో తెలీదు కానీ, మోసగాళ్ళను మాత్రం పట్టుకుని.. ఇంకెంతమందో వారి బారిన పడకుండా కట్టడిచేయడమే మా లక్ష్యం’ అన్నాడు. ఆ సమాధానానికి గోవిందరావు కాస్త నిరుత్సాహపడ్డాడు. ‘మరేం లేదు గోవిందరావుగారూ.. ఈ మధ్యకాలంలో మీకొచ్చిన కాల్‌ వివరాలు కావాలి. అందుకే పిలిపించాను’ అంటూ గోవిందరావుతో డిస్కస్‌ చేసి, కావలసిన సమాచారం తీసుకుని అతణ్ణి పంపించేశాడు ఈశ్వర్‌. 

సెలవులు ముగియడంతో విశాల్‌.. తిరిగి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇంట్లో అందరూ ముభావంగానే ఉన్నారు. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడవటంతో గోవిందరావు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఈశ్వర్‌! గోవిందరావు మొహంలో కాస్త ఆనందం తొణికిసలాడింది, అతడు ఏ శుభవార్తతో వచ్చాడోనని!‘రండి..’ అంటూ ఆహ్వానించాడు గోవిందరావు. ఎవరొచ్చారా అని లగేజ్‌ ప్యాక్‌ చేసుకుంటున్న విశాల్‌ బయటకొచ్చి ఇన్‌స్పెక్టర్‌ని చూసి ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వాడు. గోవిందరావు చూపించిన కుర్చీలో కుర్చుంటూ ఈశ్వర్‌ ‘గోవిందరావుగారూ! మీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆ విషయాలు మీతో పంచుకుందామని వచ్చాను’ అంటూ మొదలుపెట్టాడు ఈశ్వర్‌.

‘మంచి వార్త చెప్పారు. ఇంతకీ నేరగాళ్ళు పట్టుబడ్డారా? నా డబ్బు దొరికే అవకాశముందా?’ అంటూ ప్రశ్నల్ని సంధించాడు గోవిందరావు.
‘ఆ .. మోసగాళ్ళెవరో తెలిసింది’ అంటూ ఆగాడు ఈశ్వర్‌.గోవిందరావుతో పాటు విశాల్‌ కూడా చాలా సంతోషించాడు. ఇన్‌స్పెక్టర్‌  ఏం సమాధానం చెబుతాడోనని ఆసక్తిగా చూడసాగారిద్దరూ.‘ఘజియాబాద్‌ అంటే ఢిల్లీలోని ఓ భాగానికి చెందిన సైబర్‌ నేరగాళ్ళ పని ఇది!’ అన్నాడు ఈశ్వర్‌.‘ఏ ప్రాంతమైతే ఏంటి? ఇంతకీ ఆ మోసగాళ్ళు పట్టుబడ్డారా?’ అడిగాడు గోవిందరావు ఆత్రుతతో.
‘కొంత వరకు ఎవరన్నది తెలిసింది’ అంటూ ఆగాడు ఈశ్వర్‌.‘వారెవరో మేం తెలుసుకోవచ్చా సార్‌..?’ అడిగాడు గోవిందరావు.
‘విశాల్‌..!’ అంటూ బాంబు పేల్చాడు ఈశ్వర్‌.ఆ ముక్కతో గోవిందరావుకి మతిపోయింది. డబ్బు పోయినప్పటి షాక్‌ కంటే.. ఈశ్వర్‌ ఇప్పుడు చెప్పిన దానికి రెట్టింపు షాక్‌ తిన్నాడు.

‘ఏంటి సర్‌.. మీరంటున్నది? నేను సైబర్‌ మోసగాడినేంటి? మా నాన్న డబ్బు నేనే కాజేయడమేంటి? బీ సీరియస్‌’ దుఃఖం లాంటి స్వరంతో అన్నాడు విశాల్‌.‘ముమ్మాటికీ నువ్వే! కేవైసీ అప్‌ డేట్‌ చేయమని మీ నాన్నకి ఆరోజు కాల్‌ చేసింది నువ్వే. ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే ఆ విషయం నీకు కూడా తెలియదు’ అన్నాడు ఈశ్వర్‌.‘సార్‌.. మీరేం మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదు. వివరంగా చెప్పండి’ అన్నాడు విశాల్‌ ఓ రకమైన భయంతో.‘యెస్‌..! మా విచారణలో భాగంగా మీ నాన్నకి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ని ట్రేస్‌ చేస్తే అందులో నీ పర్సనల్‌ నంబరు నుండి రోజూ మీ నాన్నకి చేసే కాల్స్‌ లొకేషన్, ఆ రోజు కేవైసీ నెపంతో సైబర్‌ నేరగాడు మీ నాన్నకి కాల్‌ చేసిన లొకేషన్‌ ఒకే ప్రాంతం నుండి అని తేలింది. 

ఇంకా చెప్పాలంటే ఒకే బిల్డింగ్‌ నుండి! ఈ పాయింటే ఈ కేసును ఛేదించడంలో కీలకమైంది. మీ నాన్నని పిలిపించి మాట్లాడి నీ కంపెనీ వివరాలు సేకరించడంతో మా అనుమానం నిర్ధారణైంది. వెంటనే మా ఢిల్లీ సైబర్‌ డిపార్ట్‌మెంట్‌కి కాల్‌ చేసి మీ కేసు విషయం చెబితే వాళ్ళు ఎన్నో నిజాలు బయటకు లాగారు’ అంటూ ఆగాడు ఈశ్వర్‌.‘సార్‌.. మా కంపెనీ అలాంటిది కాదు. మా కంపెనీ ఎస్‌బీఐ బ్యాంక్‌కి ఫ్రాంచైజ్‌ చేస్తోంది.  కస్టమర్స్‌కి కాల్‌ చేసి, వారికి సేవలు అందించడమే మా డ్యూటీ. కానీ ఆధార్, ఓటీపీ లాంటివి నేనెప్పుడూ కస్టమర్స్‌ నుండి సేకరించలేదు. అటువంటప్పుడు నేను సైబర్‌ నేరగాడినెలా అవుతాను?’ ప్రశించాడు విశాల్‌.


‘అక్కడే మీ కంపెనీ తెలివి చూపిస్తోంది. ఎస్‌బీఐతో మీ కంపెనీకి ఎటువంటి టయ్యప్‌ లేదు. మీ కంపెనీలోనే బ్యాకెండ్‌ టీమ్‌ అంటూ మరో విభాగం ఉంది. అది చీకటి విభాగం. అక్కడే సైబర్‌ క్రిమినల్స్‌ అసలైన కథ నడిపిస్తున్నారు. మీరు మొదట కాల్‌ చేసిన కస్టమర్‌ డీటెయిల్స్‌ని ఈ నేరగాళ్ళు స్క్రూటినీ చేసి అందులో ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌  ని టార్గెట్‌ చేస్తారు. బ్యాంకులకి రెండు, మూడురోజులు వరుసగా సెలవులు వచ్చే ముందు రోజే వారు ఎక్కువగా మోసాలకి పాల్పడతారు. మీరు కాల్‌ చేశాక మా టీమ్‌ మిమ్మల్ని కన్సల్ట్‌ చేస్తారని చెప్పడంతో మీ పని ముగుస్తుంది. కానీ మీరిచ్చే వివరాలతో మీ వెనకున్న నేరగాళ్ళు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. 

అంటే తుపాకీని మీ భుజాల మీదుగా వాళ్ళు పేలుస్తున్నారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మీరు తూటా లాంటి వారు. దాన్ని పేల్చేది మీ వెనకున్న సైబర్‌ క్రిమినల్స్‌! మీ నాన్న విషయంలో తుపాకీని పేల్చింది ఆ నేరగాళ్ళే అయినా.. తూటా రూపంలో నువ్వే మీ నాన్నని గాయపరచావు. ఆ రోజు మీ నాన్నకి మొదట కాల్‌ చేసి కేవైసీ అప్‌ డేట్‌ చేసుకోమని చెప్పింది నువ్వే! ఇది మా ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. కస్టమర్‌ కేర్‌ కాల్స్‌ సాధారణంగా క్లారిటీగా ఉండవు. అందుకే నువ్వుగానీ, అటు మీ నాన్నగానీ ఒకరినొకరు పోల్చుకోలేకపోయుండొచ్చు.’ఆ నిజం తెలుసుకుని విశాల్‌ విస్తుపోయాడు. గోవిందరావుకైతే నోట మాటలేదు. ‘విశాల్‌..! నేరగాళ్ళు పట్టుబడేవరకు నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళకూడదు. నీ పాత్ర ఏంటన్నది తేలాకా, నీపై ఫైనల్‌ యాక్షన్‌ ఉంటుంది’ చెప్పాడు ఈశ్వర్‌. 

‘సర్‌.. మా డబ్బు దొరుకుతుందో లేదో ఆ దేవుడికే ఎరుక. కానీ నేరగాళ్ళని మీరు పట్టుకుంటే నేను బయటపడటమే కాక, మరికొందరు మోసపోకుండా ఉంటారు. అందుకు నా పూర్తి కో ఆపరేషన్‌ ఉంటుంది!’  స్థిరంగా చెప్పాడు విశాల్‌.మా విచారణలో భాగంగా 
మీ నాన్నకి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ని ట్రేస్‌ చేస్తే అందులో నీ పర్సనల్‌ నంబరు నుండి రోజూ మీ నాన్నకి చేసే కాల్స్‌ లొకేషన్, 
ఆ రోజు కేవైసీ నెపంతో సైబర్‌ నేరగాడు మీ నాన్నకి కాల్‌ చేసిన లొకేషన్‌ ఒకే ప్రాంతం నుండి అని తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement