సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..? | This week story on parliament incident | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..?

Published Sun, Feb 16 2014 10:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..?

సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..?

గీ సీమాంధ్ర ఎంపీలకు సిగ్గెప్పుడత్తదో. వాళ్లు ఏమన్న మనుసులేనా.. గట్లజేత్తరా ఏంది అనుకుంటనే రాయలింగు తిట్లపురాణం అందుకున్నడు. అగ్గో, పొద్దు, పొద్దుగాల్నేవన్లో గట్లతిడ్తాన్నవేందోయ్, ఏం జరిగిందేం ది, ఎవల్నో మస్తు తిట్టవడ్తివనుకుంట ఇంటి దగ్గర గల్మల గూసొనున్న రాయలింగు దగ్గరికచ్చిండు హన్మంతు. నీకు దెల్వదా ఏంది, తెలంగాణ కోసం ఎన్నేండ్ల సంది కొట్లాడ్తన్నం జెప్పు. నోటికాడికచ్చిన ముద్దను లాక్కుంటే ఎవలికైనా ఎట్లనిపిత్తది. గుండె మండదా ఏంది. పార్లమెంట్‌ల బేస్తా రం తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నలు. అగో గాళ్ల తీరుజూసే నాకు కోపమత్తందోయన్నడు రాయలింగు. ఔ మల్ల.. గా ది నాం నాడే కదా సారక్క గద్దెకచ్చింది. గంత మం చి రోజు పార్లమెంట్‌ల బిల్లు పెట్టి పాస్‌జేత్తమని హోంమంత్రి షిండే జెప్పిండు గద. తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మలకు సుత మొక్కుకున్నం.
 
 ఇంట్లోల్లమంతా జాతరకు పోయినం. ఏమైందోయ్ తెలంగాణ రాలేదా అనడిగిండు హన్మంతు. గంతట్లనే లచ్చయ్య పలకాయ నములుకుంట రాయలింగు, హన్మంతు దగ్గరకచ్చిండు. పొద్దుగాల్నే ఇద్దరు దెవ్సం మీద పడ్డరేందనన్నడు లచ్చయ్య. ఇగో లచ్చయ్య దెవ్సం కాడి ముచ్చట్లు నీకెర్కలేదు గని గీడ గూసో రాయలింగు జెప్తడు మనమిందామని హన్మంతు అనంగనే సరేనన్నడు. గల్మదగ్గర గా ముగ్గురు గిట్ల శెనారం ముచ్చట్లు పెట్టిండ్లు.
 
హన్మంతు : ఔను గని రాయలింగు, సమ్మక్క-సారక్క జాతరకుపోయి తెలంగాణ ఊసే మర్సిపోయినం. పార్లమెంట్‌ల బిల్లు పెట్టిండ్లేమో నెగ్గిందా, లేదా? ఏం జరిగిందోయ్ జెప్పు.
రాయలింగు : పార్లమెంట్‌ల బిల్లు పెట్టిండ్లు కని ఎటుగాకుండ పొయిందోయ్.  
హన్మంతు : గట్లేట్లైంది. తెలంగాణ ఎంపీలు ఏం పట్టించుకోలేదా ఏంది. జెర కళ్లకు గట్టినట్లు జెప్పరాదోయ్.
లచ్చయ్య : ఐతే... రాయలింగు తెలంగాణ రాదన్నట్టా ఏంది?
రాయలింగు : ఇగో ఇద్దరినుండ్లి. బేస్తారం పార్లమెంట్‌ల బిల్లు పెడ్తన్నమని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన జేత్తండు. తెలంగాణ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్, హోంమంత్రి చుట్టూరా ఏం జరగకుండా అడ్డంగా బందోబస్తుగా నిలుసున్నరు. గంతట్లనే జరగకూడంది జరిగిందోయ్.
హన్మంతు : అయ్యో.... ఏం జరిగిందో నస్కకుండ జెప్పరాదోయ్.
రాయలింగు : ఏం జరిగిందంటరా, పార్లమెంట్‌ల ఎన్నడన్న ఎంపీల కండ్లల్ల కారంపొడి జల్లిండ్ల, కత్తులు పట్టుకచ్చినట్లిన్నరా, లేదుగదా. గా దినాం మాత్రం గట్లనే జరిగింది.
లచ్చయ్య : ఏందీ..! గంతపని జరిగిందా ఎవలు జేసిండ్లేంది.
రాయలింగు : ఏవలేంది గా సీమాంధ్రల ఉన్నలుజూడు లగడపాటి రాజగోపాల్, మోద్గుల వేణుగోపాల్‌రెడ్డి, సీఎం రమేష్ ఇంకా పది, పన్నెండు మంది ఎంపీలు గంత నీచానికి ఒడిగట్టిండ్లు.
హన్మంతు : ఎవలకేం గాలేద్గదా?
రాయలింగు : ఎందుకు గాలేదు. కారంపొడి కళ్లల్ల జల్లంగనే స్పీకర్ మీరాకుమార్, తెలంగాణ ఎంపీల కండ్లల్ల నీళ్లచ్చినయ్. మంటలు లేచి దగ్గుకుంట పార్లమెంట్‌లకెళ్లి బయటికచ్చి గాయ్‌గాయ్ అయిపోయిండ్లు. మస్తులొల్లి జరిగిందనుకో.
లచ్చయ్య : మరి గట్ల జరగకుండా మార్షల్స్ ఉంటలు గద, గాళ్లేం అడ్డుకోలేదా ఏంది?
 రాయలింగు : ఎంపీలు గట్లజెత్తరని ఎవరననుకుంటరా, మామూలుగానే సభ జరుగుతుదనుకొని మార్షల్స్ జాగ్రత్తల లేకుండే. గదే మోఖ అనుకొని తెలంగాణ బిల్లు చర్చకు రాకుండాజేసిండ్లు.
 హన్మంతు : గట్లజేసిన ఎంపీలను స్పీకరమ్మ ఏమనలేదా?
 రాయలింగు : ఎందుకనలేదు, ఎవలెవలు లొల్లిజేసిండ్లో, కండ్లల్ల కారంపొడి జల్లిండ్లో, కత్తుల పట్టుకొనచ్చిండ్లెవలో గాళ్లను సభ జరిగేదాక సస్పెన్షన్ చేయిండ్లు.
 హన్మంతు/లచ్చయ్య : మంచిపని జేసింది. ఆ తల్లి సల్లంగుండా. మరి కమలం పువ్వు గుర్తోలేందో అంటండ్లట.
 రాయలింగు : ఔనవును. మొన్నటి దాక కాంగ్రెస్ పార్లమెంట్‌ల బిల్లు పెడితే మేం మద్దతిత్తమన్నలు. ఇప్పుడేమో పువ్వు గుర్తోళ్లు ముగ్గురు మూడు రకాలు మాట్లాడుతండ్లు.
 లచ్చయ్య : ఏమంటండ్లేంది.
 రాయలింగు : లొల్లి జర్గంగ బిల్లెందుకు పెట్టిండ్లని అద్వానంటండు. స్పీకర్ పార్లమెంట్‌ల బిల్లెప్పుడు పెట్టిండో తెల్వదని సుష్మాస్వరాజ్ అన్నది. ఇగ రాజ్‌నాథ్‌సింగేమో తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడున్నం. ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్తండు. గిట్ల ముగ్గురు మూడు రకాలుగా ఒకలకొకలకు పొంతన లేకుండా మాట్లాడుతండ్లు.
 హన్మంతు : మరింతకుముందుగాల కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిత్తమని చెప్పినోళ్లు గిట్లేందుకంటండ్లు.
 రాయలింగు : కాంగ్రెస్ బిల్లు పెట్టకుంటనేమో పెడ్తలేరని పువ్వుగుర్తోలు దెప్పిపొడిసిండ్లు. బిల్లు పెట్టినంక ఏమో డొంకతిరుగుడు మాటలంటండ్లు.
 లచ్చయ్య : పువ్వుగుర్తోళ్లు గట్లేందుకంటండ్లు.
 రాయలింగు : ఇప్పుడు తెలంగాణ అచ్చిందనుకో ఆ మంచితనమంతా కాంగ్రెసోళ్లకు పోతది. గట్ల ఇసారం జేసుకొని బిల్లు పెట్టినంక మనిషికో మాట మాట్లాడుతండ్లు.
 హన్మంతు : మరైతే తెలంగాణ రాదా?
 రాయలింగు : ఎందుకు రాదనుకుంటండ్లు. ఎవలెన్ని జేసిన తెలంగాణ అచ్చుడు ఖాయం. సోమారం సంది మళ్ల పార్లమెంట్ సమావేశాలు జర్గుతయ్. లొల్లిజేసిన ఎంపీలను ఇప్పటికే సస్పెండ్ జేసిండ్లు. ఇంకెవలు లొల్లిజేయకుండా కట్టుదిట్టం జేత్తరట. గట్ల అందరిని కట్టడిజేసి చర్చకు పెట్టి తెలంగాణ ఇత్తరట.
 హన్మంతు/లచ్చయ్య : ఏమో మళ్ల ఏం జర్గుతదో ఏమో.. గప్పటిదాకైతే దెవ్సం మీద జరిగిన ముచ్చట్లు జెర మా సెవుల పెట్టు రాయలింగనుకుంట ఇండ్లకుపోయిండ్లు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement