parliament incident
-
ఆ రోజేం జరిగిందంటే అమ్మా...
ఆ రోజు లోకసభలో స్పీకర్‌కు, బిల్లు ప్రవేశపెడుతున్న హోంమంత్రికి రక్షణగా నేను...అజహరొద్దిన్, రమేష్‌రాథోడ్, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ తదితరులతో కలిసి రెండు పక్కల నిలుచున్నాం. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వచ్చి రమేష్రాథోడ్ను లాగిపడేసి, టేబుల్‌పై అద్దం పగుల గొట్టాడు. అదే సమయంలో లగడపాటి వచ్చి స్ప్రే జల్లాడు... ఆ క్షణం మాకేమీ తెలియదు.. ఏం స్ప్రే అని తెలీదు...పెప్పర్ స్ప్రే అని తరువాత తెలిసింది....స్ప్రేతో స్పృహతప్పుతమా...కండ్లు మండుతాయా తెలీదు...స్ప్రే వల్ల స్పీకర్‌కు ఇబ్బంది కారాదనే ఉద్దేశంతో, ఆ స్ప్రేను అడ్డుకోవడానికి లగడపాటితో పెనుగులాడాం...ఈ క్రమంలో లగడపాటికి దెబ్బలు తగిలితే తగులొచ్చు....ఇది విషవాయివు అని లోకసభ సిబ్బంది వెంటనే బయటకు వెళ్లమని చెప్పారు...కండ్లకు నీళ్లు కారుతున్నాయని...నేను..ఉత్తరప్రదేశ్‌కు చెందిన తివారి అనే ఎంపీ ఇరువురం వాష్బేషన్లో కండ్లు కడుక్కుంటున్న సమయంలోనే మంట పెరిగిపోయి... కండ్లు పూర్తిగా కనపడలేదు...కండ్లు పోయాయనుకున్నా...సహచర ఎంపీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన పెప్పర్‌స్ప్రే దాడిలో అస్వస్థతకు గురైన ఎంపీ పొన్నం ప్రభాకర్ కోలుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన శనివారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకున్నారు. కొడుకు ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్న తల్లి మల్లమ్మ ఇంటికి వచ్చిన పొన్నంను గుండెలకు హత్తుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈనెల 21న తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమన్నారు. కరీంనగర్ సిటీ : మరో ఐదు రోజుల్లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన సంఘటనలు చూస్తే కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదించేందుకు ఎంత పట్టుదలతో ఉందో తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రకటనలు ఆత్మహత్యలకు కారణమయ్యాయనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మంత్రులను సస్పెండ్ చేయాలంటున్న బీజేపీ నేత జవదేకర్, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయమని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ తమకు బీజేపీ మద్దతునిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ బిల్లు పట్ల బీజేపీ స్పష్టత ఇచ్చి, ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేయాలన్నారు. లోకసభ సంఘటనను ఖండించాల్సిన బీజేపీ, అది మాని, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలేదనడం దారుణమన్నారు. సభలో లగడపాటిని తప్పుపట్టిన ఉండవల్లి లాంటి ఎంపీలు, బయటకు వచ్చి ఎవరు స్ప్రేజల్లారో తెలియదనడం సరికాదన్నారు. ఆత్మరక్షణ కోసం స్ప్రే చేశానంటూ లగడపాటి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆత్మాహుతి చేసుకుంటాం, సభలో సినిమా చూపిస్తాం అని ముందుగానే చెప్పి దాడికి దిగి, పైగా ఆత్మరక్షణ అనడం వారికే చెల్లిందన్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి లోకసభలో దాడికి పాల్పడిన లగడపాటి, మోదుగులను జీవితకాలం ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేదం విధించాలని సోమవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి కోరుతామన్నారు. ‘పొన్నం’కు ఘన స్వాగతం కరీంనగర్ : లోకసభలో పెప్పర్ స్ప్రే దాడికి గురై తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పార్టీ శ్రేణులు, తెలంగాణవాదుల నుంచి ఘనస్వాగతం లభించింది. శనివారం సాయంత్రం ప్రభాకర్ మంకమ్మతోటలోని తన నివాసానికి చేరుకోగానే మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాధవి తదితరులు మంగళహారతులతో స్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్ది సంఘీభావం ప్రకటించారు. పూలు చల్లుతూ స్వాగతం చెప్పారు. నాయకులు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఇంట్లోకి వెళ్లిన ఎంపీ తన తల్లి పొన్నం మల్లవ్వ ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి ఫొటోకు నమస్కరించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బోయినిపల్లి వెంకట్రామారావు ప్రత్యేకంగా వచ్చి పొన్నంను అభినందించారు. తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడుతున్నావంటూ కితాబిచ్చారు. పార్టీ నాయకులు డి.శంకర్, వై.సునీల్‌రావు, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఆమ ఆనంద్, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాచకొండ తిరుపతిగౌడ్, వేణుగోపాల్ కార్వా, కన్న కృష్ణ, కర్ర రాజశేఖర్, కటకం వెంకటరమణ, కట్ట సత్తయ్యగౌడ్, రాచకొండ చక్రధర్‌రావు, పురం రాజేశం, అర్ష మల్లేశం, మెండి చంద్రశేఖర్, సదానందచారి, గుగ్గిళ్ల శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, పడాల శంకరయ్య, వీరదేవేందర్, బోనాల శ్రీనివాస్, జేఏసీ నాయకులు రాచకొండ సత్యనారాయణరావు తదితరులు పొన్నంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..?
గీ సీమాంధ్ర ఎంపీలకు సిగ్గెప్పుడత్తదో. వాళ్లు ఏమన్న మనుసులేనా.. గట్లజేత్తరా ఏంది అనుకుంటనే రాయలింగు తిట్లపురాణం అందుకున్నడు. అగ్గో, పొద్దు, పొద్దుగాల్నేవన్లో గట్లతిడ్తాన్నవేందోయ్, ఏం జరిగిందేం ది, ఎవల్నో మస్తు తిట్టవడ్తివనుకుంట ఇంటి దగ్గర గల్మల గూసొనున్న రాయలింగు దగ్గరికచ్చిండు హన్మంతు. నీకు దెల్వదా ఏంది, తెలంగాణ కోసం ఎన్నేండ్ల సంది కొట్లాడ్తన్నం జెప్పు. నోటికాడికచ్చిన ముద్దను లాక్కుంటే ఎవలికైనా ఎట్లనిపిత్తది. గుండె మండదా ఏంది. పార్లమెంట్ల బేస్తా రం తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నలు. అగో గాళ్ల తీరుజూసే నాకు కోపమత్తందోయన్నడు రాయలింగు. ఔ మల్ల.. గా ది నాం నాడే కదా సారక్క గద్దెకచ్చింది. గంత మం చి రోజు పార్లమెంట్ల బిల్లు పెట్టి పాస్జేత్తమని హోంమంత్రి షిండే జెప్పిండు గద. తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మలకు సుత మొక్కుకున్నం. ఇంట్లోల్లమంతా జాతరకు పోయినం. ఏమైందోయ్ తెలంగాణ రాలేదా అనడిగిండు హన్మంతు. గంతట్లనే లచ్చయ్య పలకాయ నములుకుంట రాయలింగు, హన్మంతు దగ్గరకచ్చిండు. పొద్దుగాల్నే ఇద్దరు దెవ్సం మీద పడ్డరేందనన్నడు లచ్చయ్య. ఇగో లచ్చయ్య దెవ్సం కాడి ముచ్చట్లు నీకెర్కలేదు గని గీడ గూసో రాయలింగు జెప్తడు మనమిందామని హన్మంతు అనంగనే సరేనన్నడు. గల్మదగ్గర గా ముగ్గురు గిట్ల శెనారం ముచ్చట్లు పెట్టిండ్లు. హన్మంతు : ఔను గని రాయలింగు, సమ్మక్క-సారక్క జాతరకుపోయి తెలంగాణ ఊసే మర్సిపోయినం. పార్లమెంట్ల బిల్లు పెట్టిండ్లేమో నెగ్గిందా, లేదా? ఏం జరిగిందోయ్ జెప్పు. రాయలింగు : పార్లమెంట్ల బిల్లు పెట్టిండ్లు కని ఎటుగాకుండ పొయిందోయ్. హన్మంతు : గట్లేట్లైంది. తెలంగాణ ఎంపీలు ఏం పట్టించుకోలేదా ఏంది. జెర కళ్లకు గట్టినట్లు జెప్పరాదోయ్. లచ్చయ్య : ఐతే... రాయలింగు తెలంగాణ రాదన్నట్టా ఏంది? రాయలింగు : ఇగో ఇద్దరినుండ్లి. బేస్తారం పార్లమెంట్ల బిల్లు పెడ్తన్నమని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన జేత్తండు. తెలంగాణ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్, హోంమంత్రి చుట్టూరా ఏం జరగకుండా అడ్డంగా బందోబస్తుగా నిలుసున్నరు. గంతట్లనే జరగకూడంది జరిగిందోయ్. హన్మంతు : అయ్యో.... ఏం జరిగిందో నస్కకుండ జెప్పరాదోయ్. రాయలింగు : ఏం జరిగిందంటరా, పార్లమెంట్ల ఎన్నడన్న ఎంపీల కండ్లల్ల కారంపొడి జల్లిండ్ల, కత్తులు పట్టుకచ్చినట్లిన్నరా, లేదుగదా. గా దినాం మాత్రం గట్లనే జరిగింది. లచ్చయ్య : ఏందీ..! గంతపని జరిగిందా ఎవలు జేసిండ్లేంది. రాయలింగు : ఏవలేంది గా సీమాంధ్రల ఉన్నలుజూడు లగడపాటి రాజగోపాల్, మోద్గుల వేణుగోపాల్‌రెడ్డి, సీఎం రమేష్ ఇంకా పది, పన్నెండు మంది ఎంపీలు గంత నీచానికి ఒడిగట్టిండ్లు. హన్మంతు : ఎవలకేం గాలేద్గదా? రాయలింగు : ఎందుకు గాలేదు. కారంపొడి కళ్లల్ల జల్లంగనే స్పీకర్ మీరాకుమార్, తెలంగాణ ఎంపీల కండ్లల్ల నీళ్లచ్చినయ్. మంటలు లేచి దగ్గుకుంట పార్లమెంట్లకెళ్లి బయటికచ్చి గాయ్‌గాయ్ అయిపోయిండ్లు. మస్తులొల్లి జరిగిందనుకో. లచ్చయ్య : మరి గట్ల జరగకుండా మార్షల్స్ ఉంటలు గద, గాళ్లేం అడ్డుకోలేదా ఏంది? రాయలింగు : ఎంపీలు గట్లజెత్తరని ఎవరననుకుంటరా, మామూలుగానే సభ జరుగుతుదనుకొని మార్షల్స్ జాగ్రత్తల లేకుండే. గదే మోఖ అనుకొని తెలంగాణ బిల్లు చర్చకు రాకుండాజేసిండ్లు. హన్మంతు : గట్లజేసిన ఎంపీలను స్పీకరమ్మ ఏమనలేదా? రాయలింగు : ఎందుకనలేదు, ఎవలెవలు లొల్లిజేసిండ్లో, కండ్లల్ల కారంపొడి జల్లిండ్లో, కత్తుల పట్టుకొనచ్చిండ్లెవలో గాళ్లను సభ జరిగేదాక సస్పెన్షన్ చేయిండ్లు. హన్మంతు/లచ్చయ్య : మంచిపని జేసింది. ఆ తల్లి సల్లంగుండా. మరి కమలం పువ్వు గుర్తోలేందో అంటండ్లట. రాయలింగు : ఔనవును. మొన్నటి దాక కాంగ్రెస్ పార్లమెంట్ల బిల్లు పెడితే మేం మద్దతిత్తమన్నలు. ఇప్పుడేమో పువ్వు గుర్తోళ్లు ముగ్గురు మూడు రకాలు మాట్లాడుతండ్లు. లచ్చయ్య : ఏమంటండ్లేంది. రాయలింగు : లొల్లి జర్గంగ బిల్లెందుకు పెట్టిండ్లని అద్వానంటండు. స్పీకర్ పార్లమెంట్ల బిల్లెప్పుడు పెట్టిండో తెల్వదని సుష్మాస్వరాజ్ అన్నది. ఇగ రాజ్నాథ్సింగేమో తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడున్నం. ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్తండు. గిట్ల ముగ్గురు మూడు రకాలుగా ఒకలకొకలకు పొంతన లేకుండా మాట్లాడుతండ్లు. హన్మంతు : మరింతకుముందుగాల కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిత్తమని చెప్పినోళ్లు గిట్లేందుకంటండ్లు. రాయలింగు : కాంగ్రెస్ బిల్లు పెట్టకుంటనేమో పెడ్తలేరని పువ్వుగుర్తోలు దెప్పిపొడిసిండ్లు. బిల్లు పెట్టినంక ఏమో డొంకతిరుగుడు మాటలంటండ్లు. లచ్చయ్య : పువ్వుగుర్తోళ్లు గట్లేందుకంటండ్లు. రాయలింగు : ఇప్పుడు తెలంగాణ అచ్చిందనుకో ఆ మంచితనమంతా కాంగ్రెసోళ్లకు పోతది. గట్ల ఇసారం జేసుకొని బిల్లు పెట్టినంక మనిషికో మాట మాట్లాడుతండ్లు. హన్మంతు : మరైతే తెలంగాణ రాదా? రాయలింగు : ఎందుకు రాదనుకుంటండ్లు. ఎవలెన్ని జేసిన తెలంగాణ అచ్చుడు ఖాయం. సోమారం సంది మళ్ల పార్లమెంట్ సమావేశాలు జర్గుతయ్. లొల్లిజేసిన ఎంపీలను ఇప్పటికే సస్పెండ్ జేసిండ్లు. ఇంకెవలు లొల్లిజేయకుండా కట్టుదిట్టం జేత్తరట. గట్ల అందరిని కట్టడిజేసి చర్చకు పెట్టి తెలంగాణ ఇత్తరట. హన్మంతు/లచ్చయ్య : ఏమో మళ్ల ఏం జర్గుతదో ఏమో.. గప్పటిదాకైతే దెవ్సం మీద జరిగిన ముచ్చట్లు జెర మా సెవుల పెట్టు రాయలింగనుకుంట ఇండ్లకుపోయిండ్లు.