తల్లి మల్లమ్మతో ఎంపీ పొన్నం ప్రభాకర్
ఆ రోజు లోకసభలో స్పీకర్‌కు, బిల్లు ప్రవేశపెడుతున్న హోంమంత్రికి రక్షణగా నేను...అజహరొద్దిన్, రమేష్‌రాథోడ్, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ తదితరులతో కలిసి రెండు పక్కల నిలుచున్నాం. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వచ్చి రమేష్‌రాథోడ్‌ను లాగిపడేసి, టేబుల్‌పై అద్దం పగుల గొట్టాడు. అదే సమయంలో లగడపాటి వచ్చి స్ప్రే జల్లాడు... ఆ క్షణం మాకేమీ తెలియదు.. ఏం స్ప్రే అని తెలీదు...పెప్పర్ స్ప్రే అని తరువాత తెలిసింది....స్ప్రేతో స్పృహతప్పుతమా...కండ్లు మండుతాయా తెలీదు...స్ప్రే వల్ల స్పీకర్‌కు ఇబ్బంది కారాదనే ఉద్దేశంతో, ఆ స్ప్రేను అడ్డుకోవడానికి లగడపాటితో పెనుగులాడాం...ఈ క్రమంలో లగడపాటికి దెబ్బలు తగిలితే తగులొచ్చు....ఇది విషవాయివు అని లోకసభ సిబ్బంది వెంటనే బయటకు వెళ్లమని చెప్పారు...కండ్లకు నీళ్లు కారుతున్నాయని...నేను..ఉత్తరప్రదేశ్‌కు చెందిన తివారి అనే ఎంపీ ఇరువురం వాష్‌బేషన్‌లో కండ్లు కడుక్కుంటున్న సమయంలోనే మంట పెరిగిపోయి... కండ్లు పూర్తిగా కనపడలేదు...కండ్లు పోయాయనుకున్నా...సహచర ఎంపీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన పెప్పర్‌స్ప్రే దాడిలో అస్వస్థతకు గురైన ఎంపీ పొన్నం ప్రభాకర్ కోలుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన శనివారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకున్నారు. కొడుకు ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్న తల్లి మల్లమ్మ ఇంటికి వచ్చిన పొన్నంను గుండెలకు హత్తుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈనెల 21న తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమన్నారు.
కరీంనగర్ సిటీ : మరో ఐదు రోజుల్లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన సంఘటనలు చూస్తే కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదించేందుకు ఎంత పట్టుదలతో ఉందో తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రకటనలు ఆత్మహత్యలకు కారణమయ్యాయనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మంత్రులను సస్పెండ్ చేయాలంటున్న బీజేపీ నేత జవదేకర్, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయమని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ తమకు బీజేపీ మద్దతునిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ బిల్లు పట్ల బీజేపీ స్పష్టత ఇచ్చి, ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేయాలన్నారు.
లోకసభ సంఘటనను ఖండించాల్సిన బీజేపీ, అది మాని, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలేదనడం దారుణమన్నారు. సభలో లగడపాటిని తప్పుపట్టిన ఉండవల్లి లాంటి ఎంపీలు, బయటకు వచ్చి ఎవరు స్ప్రేజల్లారో తెలియదనడం సరికాదన్నారు. ఆత్మరక్షణ కోసం స్ప్రే చేశానంటూ లగడపాటి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆత్మాహుతి చేసుకుంటాం, సభలో సినిమా చూపిస్తాం అని ముందుగానే చెప్పి దాడికి దిగి, పైగా ఆత్మరక్షణ అనడం వారికే చెల్లిందన్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి లోకసభలో దాడికి పాల్పడిన లగడపాటి, మోదుగులను జీవితకాలం ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేదం విధించాలని సోమవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి కోరుతామన్నారు.
‘పొన్నం’కు ఘన స్వాగతం
కరీంనగర్ : లోకసభలో పెప్పర్ స్ప్రే దాడికి గురై తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పార్టీ శ్రేణులు, తెలంగాణవాదుల నుంచి ఘనస్వాగతం లభించింది. శనివారం సాయంత్రం ప్రభాకర్ మంకమ్మతోటలోని తన నివాసానికి చేరుకోగానే మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాధవి తదితరులు మంగళహారతులతో స్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్ది సంఘీభావం ప్రకటించారు. పూలు చల్లుతూ స్వాగతం చెప్పారు. నాయకులు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఇంట్లోకి వెళ్లిన ఎంపీ తన తల్లి పొన్నం మల్లవ్వ ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి ఫొటోకు నమస్కరించారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బోయినిపల్లి వెంకట్రామారావు ప్రత్యేకంగా వచ్చి పొన్నంను అభినందించారు. తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడుతున్నావంటూ కితాబిచ్చారు. పార్టీ నాయకులు డి.శంకర్, వై.సునీల్‌రావు, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఆమ ఆనంద్, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాచకొండ తిరుపతిగౌడ్, వేణుగోపాల్ కార్వా, కన్న కృష్ణ, కర్ర రాజశేఖర్, కటకం వెంకటరమణ, కట్ట సత్తయ్యగౌడ్, రాచకొండ చక్రధర్‌రావు, పురం రాజేశం, అర్ష మల్లేశం, మెండి చంద్రశేఖర్, సదానందచారి, గుగ్గిళ్ల శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, పడాల శంకరయ్య, వీరదేవేందర్, బోనాల శ్రీనివాస్, జేఏసీ నాయకులు రాచకొండ సత్యనారాయణరావు తదితరులు పొన్నంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.