కేంద్ర మంత్రి చిరంజీవికి వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో తెలంగాణ సెగ తగలింది. ఇక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం వచ్చిన ఆయన ముందుగా స్వామి వారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆయన రాగానే అక్కడ ఉన్న ఇద్దరు ఏబీవీపీ నాయకులు జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. దీంతో భక్తులంతా జైజై తెలంగాణ అంటూ నినాదాలు హోరెత్తించారు. పోలీసులు వారిని నిలువరించినా ఫలితం లేకపోయింది. చిరంజీవి దంపతులు అక్కడున్న 40 నిమిషాల సేపు క్యూలైన్లలో ఉన్న భక్తుల తెలంగాణ నినాదాలు ఆగలేదు.
ఎంపీ పొన్నం గన్‌మన్ పిస్టల్ గల్లంతు.. లభ్యం
చిరంజీవి రాక సందర్భంగా వేములవాడ ఆలయ ఆవరణలో జరిగిన తోపులాటలో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అంగరక్షకుడి 9ఎంఎం పిస్టల్ గల్లంతైంది. ముప్పావుగంట హైరానా తర్వాత లభ్యమైంది. ఆలయ ఆవరణలోని 6వ నంబర్ అతిథిగృహం వద్ద చిరంజీవి కాన్వాయ్ నిలిచింది. ఆయనకు స్వాగతం పలికేందుకు పొన్నం ప్రభాకర్, నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా తోపులాట జరగ్గా.. ఈ క్రమంలో పొన్నం గన్‌మన్ 9ఎం.ఎం పిస్టల్ గల్లంతైంది. అందులో 10 బుల్లెట్లున్నట్టు సమాచారం. 45 నిమిషాల తర్వాత ఓ కానిస్టేబుల్‌కు పిస్టల్ దొరికిందని స్థానిక సీఐ తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.