చిరంజీవి మంచి నటుడు... థ్యాంక్స్
న్యూఢిల్లీ: చిరంజీవి తనకు మంచి మిత్రుడని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. చిరంజీవి మంటి నటుడని కితాబిచ్చారు. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఇతర విపక్ష సభ్యులు అడ్డుతగలడంతో చిరంజీవి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య లేచి చిరంజీవి మంచి నటుడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం రేగింది. తన వ్యాఖ్యలపై వెంటనే ఆయన వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం చిరంజీవి సభలో నటిస్తున్నాడని కాదని, ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పాపులర్ నటుడని సవరించారు. కేంద్ర మంత్రి ఉన్న చిరంజీవి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని వెంకయ్య సూచించారు. ఏ మంత్రీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదన్నారు. చిరంజీవి అభ్యంతరాలను పార్టీ, కేబినెట్ వేదికలపై చెప్పాలని సలహాయిచ్చారు. ఓ మంత్రిగా సొంత అభిప్రాయాలు చెప్పకూడదన్నారు. దీనిపై రూలింగ్ ఇవ్వాలని చెప్పి వెంకయ్య కూర్చుకున్నారు.
తర్వాత చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తనను సినిమాల్లో తనను మంచి నటుడిగా పేర్కొన్నందుకు వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రకటనను ఎలా చూడాలన్న అరుణ్ జైట్లీ ప్రశ్నకు స్పందిస్తూ... తెలుగు ప్రజల తరపున తాను మాట్లాడుతున్నట్టు చూడాలని చిరంజీవి జవాబిచ్చారు.