అధికారంలోకొస్తే పదేళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి
బీజేపీ నేత వెంకయ్యనాయుడు
సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం విజయ వాడలో జరిగిన ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోవడం బాధాకరమే అయినప్పటికీ రాబోయే రోజుల్లో సీమాంధ్ర ప్రాం తానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్రతిపత్తిగల రాష్ట్రంగా ప్రకటించడంవల్ల అనేక కొత్త పరిశ్రమలు వస్తాయని, కేంద్ర ఇచ్చే నిధుల్లో 90శాతం సబ్బిడీ ఉంటుందని, కేవలం 10శాతం మాత్రమే అప్పు ఉంటుందని చెప్పారు.
ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్ తదితర పన్నులో రాయితీలు కూడా వస్తాయని వివరించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడంతోపాటు ఓడరేవులను అభివృద్ధి చేస్తే రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో మీడియా ప్రసారాలు నిలిపివేయడంపై తాము అధికారంలోకి రాగానే దానిపై విచారణ చేయిస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.