హైదరాబాద్ ఆదాయాన్ని పంచండి: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెసేనని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే లక్షణం కాంగ్రెస్కు లేదని దుయ్యబట్టారు. 2004 నుంచి రాజకీయ లబ్దితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు మాట మార్చాయని, బీజేపీ ఒక్కటే నిక్కచ్చిగా ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రెండు ప్రాంతాలను విభజించండి, ప్రజలను కాదు అని స్పష్టం చేశారు. భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాలపై సీమాంధ్రులకు ఆందోళన ఉందని చెప్పారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణకు మాత్రమే రెవెన్యు మిగులుందని వెల్లడించారు. హైదరాబాద్ ఆదాయం ఇరు ప్రాంతాలకు కీలకంగా మారిందన్నారు. హైదరాబాద్లో మిగులుతున్న ఆదాయాన్ని మిగతా ప్రాంతాలకు పంపిణీ చేయాలని సూచించారు.
విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచాలన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్లు కేటాయించాలన్నారు. బిల్లుపై సవరణల గురించి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో తప్పులేదన్నారు.