తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నా: చిరంజీవి
న్యూఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడడానికి లేవగానే సభలో నిశ్శబద్ద వాతావరణం నెలకొనడం విశేషం. చిరంజీవి ప్రసంగం ఆయన మాటల్లోనే... ''నేను తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. కోట్లాది మంది తెలుగు ప్రజలు తమను అన్యాయంగా విభజిస్తున్నారని బాధపడుతున్నారు. నేను ఏ ఒక్క ప్రాంతం తరఫునో మాట్లాడటం లేదు. రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం చాలా దురదృష్టకరం. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహావేశాలను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీలో కూడా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని తెలిపింది.
విభజన అనేది 11 కోట్ల మంది ప్రజలకు గుండెకోత కలిగించే విషయం. అయినా నేను పార్టీ వైఖరికి కట్టుబడి ఉన్నా. అనేకమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉన్నట్టుండి రాష్ట్రాన్ని విభజిస్తామని సీడబ్ల్యుసీ ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. చివరకు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు. ప్రజల ఆవేదనను కూడా పట్టించుకోవాలన్నదే నా విజ్ఞప్తి. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమాత్రం చర్చ జరగకుండా ఆమోదించారు. అది చాలా దురదృష్టకరం.
ఎన్డీయే కేవలం ఓట్ల కోసమే తెలంగాణకు మద్దతు చెబుతోంది. లోక్సభలో మద్దతు పలికి, ఇక్కడ మాత్రం సవరణలు చెబుతోంది. సీపీఐ, టీడీపీ ఇతర పక్షాలు కూడా రెండు రకాల మాటలు చెబుతున్నాయి. తెలంగాణకు మద్దతుగా నిర్ణయం తీసుకున్న ఆఖరి పార్టీ కాంగ్రెస్సే. అన్ని పార్టీలూ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాయి. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి ఇతర పార్టీలు ఏమాత్రం పట్టించుకోలేదు. సమైక్యాంధ్రే సరైన పరిష్కారం అని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. చంద్రబాబు నాయుడు సమన్యాయం అంటున్నారు.. అంటే ఏంటో చెప్పాలి. అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? చంద్రబాబు నాయుడు గారూ, అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి'' అన్నారు.
దాంతో ఇతర పార్టీల సభ్యులు.. ముఖ్యంగా టీడీపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు ఒక్కసారిగా చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన వెనకాలే కూర్చున్న కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు మాత్రం జరిగేది చూస్తూ కూర్చున్నారు.