రమ్మంటేనే వచ్చాం: చిరంజీవి
న్యూఢిల్లీ: గతంలో తామిచ్చిన డిమాండ్లకు విభజన బిల్లులో స్పష్టత లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. తమ ప్రతిపాదనలు తీసుకోకపోవడం వల్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. జీవోఎం సభ్యులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు తాముగా ఈ సమావేశానికి రాలేదన్నారు. రమ్మంటేనే సమావేశానికి వచ్చామని వెల్లడించారు. గతంలో తాము చేసిన డిమాండ్లపై ఈ సమావేశంలో సమీక్షించారని చెప్పారు. తాము అడిగిన వాటికి ఒప్పుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీవోఎం తీసుకునే నిర్ణయాలపై తమ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు.
జీవోఎం సభ్యుల ముందు తమ వాదనలు బలంగా వినిపించామని మరో కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. గతంలో ఇచ్చిన అభ్యర్థనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగినట్టు చెప్పారు. తెలుగు వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటే తమకు ఊరట కలుగుతుందన్నారు. కాగా, జీవోఎం సభ్యులు రేపు మరోసారి భేటీ కానున్నారు.