JD Seelam
-
కేంద్రంపై కాంగ్రెస్ అవిశ్వాస నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో దేశ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ప్రారంభించిన అవిశ్వాసం పోరులో తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై నేరుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం లోక్‌సభ సెక్రటరీని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కలసి ఆ నోటీసులు అందజేశారు. మంగళవారం నాటి లోక్‌సభ బిజినెస్‌లో దీనిని చేర్చాలని కోరారు. 27వ తేదీన సభకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. 48 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసం నోటీసులివ్వడంతో లోక్‌సభలో ఆ తీర్మానానికి అనుకూలత పెరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ పరమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీ, టీడీపీ ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి సభ ఆర్డర్లో లేదని చెబుతూ వాయిదా వేస్తున్న స్పీకర్.. మంగళవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఉత్కంఠ రేగుతోంది. కాగా, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ పార్టీల ఎంపీల అభ్యర్థనపై సోమవారం లోక్‌సభకు స్పీకర్ సెలవు ప్రకటించారు. అలాగే రాజ్యసభకు కూడా సోమవారం సెలవు ప్రకటించారు. -
అవిశ్వాస తీర్మానం; మరో మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోదా కల్పన, విభజన హామీల అమలులో విఫలమైన ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసులు ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎంపీ జేడీ శీలం కూడా ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చాలా మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చకు అవకాశం కల్పించాల్సిందేనని జేడీ శీలం మీడియాతో అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా కాంగ్రెస్ పోరాడుతూనేఉంటుందని స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైఎస్సార్సీపీ, టీడీపీలు విడివిడిగా ఇచ్చిన నోటీసులు చర్చకు వచ్చినా తాము మద్దతుగా నిలబడతామని తెలిపారు. (చదవండి: అవిశ్వాసం తీర్మానం.. ఆరో రోజూ అదే ప్రకటన!) -
బాబు హైదరాబాద్ వదిలి ఎందుకొచ్చారు ?
క్రోసూరు(పెదకూరపాడు): రాష్ట్ర విభజన సమయంలో రాజధాని హైదారాబాద్ పదేళ్లు కావాలని పోరాడి తీసుకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ నుంచి ఎందుకొచ్చారో ప్రజలకు తెలుసునని రాజ్యసభ మాజీ సభ్యుడు జేడీ శీలం అన్నారు. క్రోసూరులో గురువారం ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు అధ్యక్షత వహించారు. జేడీ శీలం మాట్లాడుతూ 2019లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందన్నారు. ప్యాకేజీ సొమ్ముకు వడ్డీ చెల్లించాలి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంటే నూతన రాజధానికి అయ్యే పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని, అదే ప్రత్యేక ప్యాకేజీ అంటే ఎంత డబ్బు తెచ్చుకుంటే అంత వడ్డీతో సహా చెల్లించాలని చెప్పారు. అనంతరం సభలో ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ ప్రసంగం ఆడియోను ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, యార్డు మాజీ చైర్మన్ డాక్టర్ షరీఫ్, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు
► మ్యానిఫెస్టోలోని హామీలను విస్మరించిన టీడీపీ ► హామీల అమలు చేసి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారు ► బీజేపీ, టీడీపీ నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలను వంచించారు ► ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఒంగోలు సబర్బన్: ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా వెల్లడి చేయడానికి ఒంగోలు నగరంలోని ప్రధాన రోడ్లపై పర్యటించారు. జైరామ్ సెంటర్లో ప్రారంభమైన ప్రజా బ్యాలెట్ కార్యక్రమం గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, ప్రకాశం భవన్, నెల్లూరు బస్టాండ్ వరకూ నిర్వహించారు. అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో 600 హామీలను తన మ్యానిఫెస్టోలో పొందుపరిచారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ మ్యానిఫెస్టోనే ఒక మోసపూరితమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కీర్తించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో రాజశేఖరరెడ్డి ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. నూతనంగా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని దుయ్యబట్టారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను గాలికొదిలేసిన ఘనత ప్రధాని మోదీదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు రాబట్టారో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఈ.సుధాకరరెడ్డి, ఏఐసీసీ డి మానిటైజేషన్ జిల్లా చైర్మన్ బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్, ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, నియోజవర్గ ఇన్‌చార్జ్‌లు డాక్టర్ గుర్రాల రాజ్‌విమల్, షేక్ సైదా, పాశం వెంకటేశ్వర్లు, ఎస్కె.రసూల్, గాదె లక్ష్మారెడ్డి, యాదాల రాజశేఖర్‌తోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘విభజనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం’
సత్తెనపల్లి: ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఒక్కటే చేసిందనే అపవాదు వేస్తున్నారని, చంద్రబాబు రెండుసార్లు రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖలు ఇచ్చిన విషయాన్ని జేడీ శీలం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ తప్పుకాదని అందరూ కలిసి చేసిందే అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్ర మోదీ హమీ ఇచ్చి మాటమార్చడం దురదష్టకరమన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని దూషిస్తూ ప్రధానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.... సిగ్గు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జేడీ శీలం విమర్శించారు. చంద్రబాబు తన చర్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ భూములు పంపిణీ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బ్యాంకులు జాతీయకరణ చేస్తే మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడును ఓడించేందుకు ఇప్పటినుంచే సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
దోపిడీ కోసమే జన్మభూమి కమిటీల ఏర్పాటు
► తక్షణం కమిటీలను రద్దు చేయాలి ► రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం వెల్లడి ఫిరంగిపురం : ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారిని దోచుకోమని ప్రజలపై వదిలేశారని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ధ్వజమెత్తారు. ఫిరంగిపురం మండల కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు తలకోల డేవిడ్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అంబేడ్కర్ పేరును కూడా తలచే అర్హతలేదని చెప్పారు. అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారాన్ని పొందిన ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకొని పాలన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఈ నెల 20న గుంటూరులోని మహిమా గార్డెన్స్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని మండల్లాలోని పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంధ విభాగాలనూ కలుపుకొని అన్ని వర్గాలతో కలిసి సామాజిక న్యాయ సాధికారిత యాత్ర ముగించామన్నారు. అనంతరం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ముగింపు సభలో పీసీసీ అధ్యక్షుడు రాఘవీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొంటారన్నారు. కొరివి వినయ్‌కుమార్, బండ్ల పున్నారావు, తలకోల డేవిడ్, తిరుపతి సత్యం, పాలపాటి అనీల్, పసల రాజు, దాసరిరాజు పాల్గొన్నారు. -
రాయపాటి... ఇదేం పరిపాటి?
తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఎదురుదాడి చేయడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఇదే విద్య ప్రదర్శిస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలపై దానిపై సూచనలు, సలహాలు ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై చిందులేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడితో ఆగకుండా నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసేస్తున్నారు. ఎన్నికలకు ముందు 'హస్తం' గూటి నుంచి బయటకు వచ్చి పచ్చ కండువా కప్పుకున్న ఎంపీ రాయపాటి సాంబశిరావు- శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై తీవ్రారోపణలు చేశారు. కమిటీలోని కొంత మంది సీనియర్ సభ్యులు దొనకొండ, చుట్టుపక్కల ప్రాంతంలో భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. అందుకోసమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిందని శివమెత్తారు. కమిటీని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభావితం చేశారన్న విషయం తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక కమిటీ నివేదిక పట్ల సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కమిటీ దొనకొండలో పర్యటించినప్పటికీ... అక్కడకు కమిటీ సభ్యులు వెళ్లలేదని రాయపాటి చెప్పడం గమనార్హం. కమిటీపై ఆరోపణలు చేసిన రాయపాటికి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ ఇచ్చారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి రెచ్చిపోతున్నారని అన్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడగుంటూరు-తెనాలిమంగళగిరి(వీజీటీఎం)లో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుకున్నారని చెప్పారు. కమిటీ నివేదికతో రాయపాటి సహా టీడీపీ కంగుతిన్నారని ఎద్దేవా చేశారు. సమర్థులైన అధికారులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీపై రాయపాటి ఆరోపణలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమకు నచ్చనివారిపై నిందలు వేయడం పచ్చ బాబులకు పరిపాటిగా అంటున్నారు. -
'దొనకొండ ప్రస్తావనతో టీడీపీ నేతల్లో మంటపుట్టింది'
కాకినాడ: రాష్ట్ర రాజధానిపై ఏర్పాటైన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో రాజదానిగా దొనకొండ పేరును ప్రస్తావించడంతో టీడీపీ నేతల్లో మంటపుట్టుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ఎద్దేవా చేశారు. ఆదివారం కాకినాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో సమావేశంలో జేడీ శీలం ప్రసంగిస్తూ.... శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కాంగ్రెస్ పార్టీ కుట్రేనని టీడీపీ నేతల ఆరోపణను ఈ సందర్బంగా ఆయన ఖండించారు. సోనియా గాంధీయే స్వయంగా ఆ కమిటీని పిలిపించి నివేదిక రాయించిందని టీడీపీ నేతల ఆరోపణలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. విభజనకు మీరే కారణమంటూ అందరు మమ్మల్ని విమర్శిస్తున్నా... తాము మాత్రం మౌనంగానే ఉన్నామని శీలం ఆవేదనతో తెలిపారు. -
కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు రాయితీలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు రాయితీల కోసం కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలను బీజేపీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు కృషిచేయడం వల్లే విభజన బిల్లులో సీమాంధ్రకు నష్టం జరగకుండా రాయితీలు ఇచ్చారని జేడీ శీలం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ముందు యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీమాంధ్రకు అన్యాయం చేశారంటూ ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. -
విమానాశ్రయాలకు ఇంకా భూమి ఇవ్వలేదు
ఏపీ ఎయిర్‌పోర్టుల విస్తరణపై కేంద్ర మంత్రి వివరణ న్యూఢిల్లీ: తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల నవీకరణ పనులు కొనసాగుతున్నాయని, అయితే ఇందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నవీకరించేందుకు అవసరమైన అధ్యయనాన్ని జరిపించాలని గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖను కోరారు. దీనిపై ప్రస్తుత స్థితిని తెలుపుతూ ఆ శాఖ మంత్రి అజిత్‌సింగ్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలంకు జవాబు పంపారు. ఇందులో ఆయా విమానాశ్రయాల స్థితిగతులను వివరించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో కొత్త రన్‌వే, పార్కింగ్ స్టాండ్, రెండు ఏరో బ్రిడ్జిలతో కూడిన కొత్త టర్మినల్ భవన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. వరద నియంత్రణకు సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. రద్దీవేళల్లో 700 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కూడిన టర్మినల్‌ను 1,400 మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఇక తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించామని, అయితే అన్ని వసతులు సమకూరిన తర్వాతే అది అమల్లో వస్తుందని వివరించారు. 701.96 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇప్పటివరకు కేవలం 293.05 ఎకరాలను మాత్రమే ఇచ్చిందని తెలిపారు. సమీకృత టర్మినల్ నిర్మాణం గత ఫిబ్రవరి నాటికి 36 శాతం పూర్తయిందని, వచ్చే ఏప్రిల్ నాటికి వంద శాతం పూర్తవుతుందని వివరించారు. ఇది రద్దీవేళలో 500 దేశీయ, 200 అంతర్జాతీయ ప్రయాణికులకు సరిపడా సామర్థ్యంతో ఉంటుందని వివరించారు. ఇక విజయవాడ విమానాశ్రయానికి సంబంధించి రద్దీవేళల్లో 700 మంది ప్రయాణికులకు సరిపడా సామర్థ్యంతో టర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక ఉందని, ఇందుకు ఏఏఐకి చెందిన 536.19 ఎకరాల స్థలాన్ని వినియోగిస్తామని తెలిపారు. ఇందులో రన్‌వేను తొలివిడతలో 7,500 అడుగుల నుంచి 9 వేల అడుగలకు విస్తరించడానికి, రెండో విడతలో 9 వేల అడుగుల నుంచి 10,500 అడుగులకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. అయితే తొలివిడత రన్‌వే విస్తరణకు 361 ఎకరాలు, రెండో విడతకు 101 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉందని తెలిపారు. స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్ ఒకటో తేదీనే జీవో విడుదల చేసినప్పటికీ, ఇంతవరకు స్థలాన్ని అప్పగించలేదని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. -
ఈ 'ఖాళీ'లను నింపేదెలా..?
-
అంతా.. నా ఇష్టం!
చీరాల, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనానంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోగా.. అభిమానంతో కొనసాగుతున్న కొద్దిమంది కూడా నేతల చర్యలతో పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రమంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి తీరుతో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను తాను ఎంపిక చేసిన వారికే ఖరారు చేయాలని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరింది.ఈ క్రమంలో పార్లమెంట్ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రతిపాదనను ఆమె పీసీసీకి, పార్టీ అధిష్టానానికి నివే దించింది. ముఖ్య నాయకులతో సైతం చర్చించకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకుని పార్టీకి ఎటువంటి సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ఎలా ప్రకటిస్తారని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. చీరాలకు సంబంధించి పార్టీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే విభే దాలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి జేడీ శీలం ఏర్పాటు చేసిన సమావేశంలో చీరాలకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదిగాని గురునాథం, మరికొందరు నాయకులు పనబాక తీరును బాహాటంగా విమర్శించారు. పార్టీకి సంబంధంలేని వారి నుంచి డబ్బులు తీసుకుని టిక్కెట్లపై హామీ ఇస్తున్నారని ఆరోపించడంతో పాటు ఘర్షణకు కూడా దిగారు. చీరాలకు మెండు నిషాంత్, అద్దంకికి డాక్టర్ గాలం లక్ష్మి, పర్చూరుకు మోదుగుల కృష్ణారెడ్డి, సంతనూతలపాడుకు వేమా శ్రీనివాసరావు, వై.శశిభూషణ్, ఎన్.తిరుమలరావు, బాపట్లకు చేజర్ల నారాయణరెడ్డి, వేమూరుకు దేవళ్ల భరత్, రేపల్లెకు మోపిదేవి శ్రీనివాసరావు పేర్లను అసెంబ్లీ అభ్యర్థులుగా పనబాక ప్రతిపాదించారు. చీరాల అభ్యర్థి మెండు నిషాంత్ పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు తనయుడు. ఇప్పటి వరకూ రాజకీయాల్లో ప్రవేశంలేదు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. నిషాంత్‌ను పార్టీ అభ్యర్థిగా పనబాక ప్రతిపాదించ డం ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మాదిగాని గురునాథం, ఏఎంసీ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, అందె కనకలింగేశ్వరరావుతో పాటు మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీ కోసం పనిచేసేవారికే టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒక్క చీరాలలోనే కాకుండా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పార్టీలో ఉన్న అతికొద్ది మందిలో కూడా విభేదాలు తారాస్థాయికి చేరడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. -
కాంగ్రెస్ దళిత, గిరిజన బస్సుయాత్ర ప్రారంభం
-
ఫ్లాప్ షో..!
సాక్షి, ఒంగోలు: ‘కాశీకి వెళ్లానని..కాషాయం..’ అంటూ ఇంద్ర సినిమా డైలాగ్‌తో ప్రారంభమైన ఆయన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది. నూనుగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దల్ని అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతనలేకుండా చేసిన వ్యాఖ్యలివి.. సోమవారం ఒంగోలులో కాంగ్రెస్ బస్సుయాత్ర కాస్తా తుస్సుమంది. గుంటూరు జిల్లా నుంచి నేరుగా ఒంగోలులోకి ప్రవేశించిన బస్సుయాత్ర నగరంలో ట్రంకురోడ్డు, చర్చిసెంటర్, కలెక్టరేట్, రామ్‌నగర్ మీదుగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. చిరంజీవి అభిమానులు అక్కడికొచ్చినా... వారు తమ అభిమాన నేతను కలిసే విషయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తీవ్రంగా విభేదించి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. నేతల ప్రసంగాలకు అడ్డుతగులుతున్న చిరు అభిమానుల హడావుడిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనానికి గురై మైక్‌లో కేకలేశారు. స్వయంగా చిరంజీవి పైకిలేచి ..మైకు పట్టుకుని క్రమశిక్షణ అంటూ అభిమానులను కట్టడిచేసే ప్రయత్నం చే సినా.. వారిమధ్య వాగ్వాదాలు సద్దుమణగలేదు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దొంగే..దొంగదొంగ అని అరిచినట్లు చంద్రబాబు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని.. అతనికి భవిష్యత్‌లో ఘోరపరాభవం ఎదురుకానున్నదని రఘువీరా జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంభోదించగా.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌కల్యాణ్‌ను స్తుతిస్తూ కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. పలువురు రాష్ట్ర నేతలు మాట్లాడినప్పటికీ.. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, సీమాంధ్ర ప్యాకేజీలపై కార్యకర్తల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు. చివరికి చిరంజీవి ప్రసంగంలో ఒంగోలును జపాన్ చేస్తానని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రకాశం రైతులకు మేలంటూ .. చెప్పడంపై విసుగు చెందిన పలువురు నేతలతో పాటు సమావేశం నుంచి భారీగా కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ‘స్టాలిన్’ డైలాగ్‌ను గుర్తుచేసిన పనబాక కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా డైలాగ్‌ను చెబుతూ.. కాంగ్రెస్‌పై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఒకరు మరో ముగ్గురుతో మాట్లాడి తిప్పికొట్టాలని సూచించారు. చిరంజీవి అభిమానులు ఈలలు, చప్పట్లకు పరిమితం కాకూడదంటూ.. రానున్న కాలంలో యువతకు తమపార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో అశ్లీలపొత్తుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఆయన తొమ్మిదేళ్లహయాంలో ఇంకుడు గుంతలు, నీరు, మీరు, వనం..మనం తదితర పథకాలతో పచ్చకండువాల నేతలకు రాష్ట్ర్రాన్ని బేరం పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. సీమాంధ్రకు కేంద్రమిచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఒక్కో పట్టణాన్ని ఒక్కో భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీమంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ పదవులు అనుభవించి పక్కకెళ్లిన నేతల కారణంగా కాంగ్రెస్‌కు కష్టాలు దాపురించాయన్నారు. త్వరలో సీమాంధ్ర అద్భుతప్రగతిని చూస్తుందన్నారు. మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ శేషు తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, జీవి శేషు మినహా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కార్యక్రమం అంతటా చిరంజీవి అభిమానులు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దగా కనిపించలేదు. గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చిరంజీవి చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు. చిరంజీవి మాట్లాడుతూ మాగుంట కాస్త అటూఇటుగా ఉన్నారని, ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని అన్నారు. విభజనపై తాను బాధపడుతున్నానని ఆయన చెప్పుకుంటూనే కాంగ్రెస్‌ను ఓట్లేసి గెలిపించమనడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బస్సుయాత్ర ఫ్లాప్‌షోగా మిగిలిపోయింది. -
కాంగ్రెస్ ఓ మహాసముద్రం
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్:కాంగ్రెస్ మహాసముద్రం లాంటిదని కేంద్ర మంత్రి చిరంజీవి అభివర్ణించారు. కుళ్లూ, చెత్తా ఒడ్డుకు చేరుకుంటాయని, సముద్రం మాత్రం పవిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేశాయనీ, నిజాలు అందరికీ తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. బస్సుయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు గుంటూరు జీటీ రోడ్డులోని సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతరానికి అవకాశం ఇస్తుందనీ, యువత వినియోగించుకోవాలని సూచించారు. నిఖార్సయిన వాడ్ని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. తాను నికార్సయిన వ్యక్తిని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని చిరంజీవి చెప్పారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బీసీలు, దళితులను ముఖ్యమంత్రులనుచేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే అందరికీ సమానావకాశాలుంటాయని, సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లే విభజన సాకుతో పార్టీని ఎక్కువగా బలహీన పరచారని, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. స్టాలిన్ సినిమాలోని డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ తప్పులేదని చెప్పండి.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన పనులను ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ, వైఎస్సార్ సీపీలు ఇచ్చిన లేఖల ప్రతులను చూపించారు. వాటిని ఇంటింటికీ చూపించి విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులేదనే విషయాన్ని వివరించాలని కార్యకర్తలను కోరారు. గుంటూరు మిర్చి ఘాటు, పల్నాటి పౌరుషాన్ని చూపించి ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడితే రాష్ట్రం బలహీనపడినట్లేనన్నారు. బడా వ్యాపారవేత్తలు పార్టీ ముసుగులు ధరించి వస్తున్నారని, వారి ఉచ్చులో ఇరుక్కోవద్దని కోరారు. కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీతో చంద్రబాబు జతకట్టారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.వ్యాపారులను టీడీపీలోకి చేర్చుకోవడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ నడుతున్నారా వ్యాపార సంస్థ నడుపుతున్నారా అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా సందిగ్ధంలో ఉన్న తాను తన కుమార్తె ఇచ్చిన నైతిక స్థైర్యంతో స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.సమావేశంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, కొండ్రు ముర ళి, ఎమ్మెల్సీలు సింగం బసవపున్నయ్య, మహమ్మద్ జానీ, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘తుస్సు’మన్న బస్సుయాత్ర
కాకినాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ‘మామిడి పండు తిన్న నోటితోనే మేడిపండును చవి చూడాల్సి వచ్చినట్టు’ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పీసీసీ కొత్త సారథి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి తలపెట్టిన బస్సుయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పేలవంగా సాగింది. తునిలో ప్రారంభమై అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురంల మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్న యాత్రకు ఆశించిన స్పందన కానరాక పోగా పిఠాపురంలో చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తునిలో పార్టీ శ్రేణులు స్వాగత సన్నాహాలు చేసినా అక్కడి నుంచి జరిగిన పర్యటనలో ప్రజా స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. ముఖ్యంగా పిఠాపురం వద్ద కె.బాబ్జి అనే ఓ కార్యకర్త ‘ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి నట్టేట ముంచేశావు’ అంటూ బస్సుయాత్ర వద్ద ఒకప్పటి పీఆర్పీ కరపత్రాలను నేలకేసి కొట్టి నిరసన తెలియజేశాడు. చిరు అభిమానుల సందడే.. కాకినాడ సూర్యకళామందిరంలో జరిగిన డీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చిరంజీవి అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారే తప్ప నిజమైన పారీశ్రేణులు లేక సభ వెలవెలపోయింది. రఘువీరా, చిరంజీవిలతో పాటు కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, వంగా గీత మాత్రమే హాజరయ్యారు. రఘువీరా తొలిసారిగా హాజరైన డీసీసీ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్, ఎన్.శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పాముల రాజేశ్వరీదేవి రాలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ మాత్రం హాజరయ్యారు. విభజనకు కారణమైన పార్టీలు కాంగ్రెస్‌ను నిందిస్తున్న తీరుపై ప్రతి కార్యకర్తా మరో ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి.. అలా ప్రచారం చేయాలంటూ చిరంజీవి తాను నటించిన ఁస్టాలిన్* సినిమాలోని చైన్‌లింక్ విధానాన్ని ఊదరగొట్టారు. కిరణ్ సమైక్య చాంపియన్ కావాలని చేసిన రాజకీయంలో ఆయన హీరోగా, తాము జీరోలుగా ప్రజల్లో చులకన కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా చివరి బంతి మిగిలే ఉందంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందన్నారు. కిరణ్ నిర్వాకమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబుది అధికార దాహం.. ఒక ఓటు, రెండు రాష్ట్రాల నినాదంతో 18 ఏళ్ల క్రితం కాకినాడ సమావేశంలో రాష్ట్ర విభజనకు బీజం వేసిన మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహం తేటతెల్లమవుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సారథి, కేంద్రమంత్రి చిరంజీవి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక సూర్యకళామందిరంలో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అనేక పార్టీలు విభజనను కోరుకున్నాక కాంగ్రెస్ చివరిపార్టీగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ శ్రేణులు స్తబ్దతను వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ ప్రజారంజక పాలన కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కేంద్రమంత్రి కృపారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలకు కృషి చేసింది కాంగ్రెసేనన్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత, పంతం గాంధీమోహన్, ఎమ్మెల్సీలు రత్నాబాయి, లక్ష్మీశివకుమారి, మండలిలో విప్ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కొండ్రు మురళి, నాయకులు బుచ్చి మహేశ్వరరావు, కొప్పన మోహనరావు, పి.వి.రాఘవులు, పంతం నానాజీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఫణీశ్వరరావు పాల్గొన్నారు. -
హామీలు తక్షణం నెరవేర్చండి: జేడీశీలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్, హోంమంత్రి షిండే చేసిన ప్రకటనల్లోని అంశాలతోపాటు, బిల్లులోని సీమాంధ్రకు న్యాయం చేసే అంశాలన్నింటినీ తక్షణం కార్యరూపంలోకి తేవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 13 శాఖల పరిధిలోని 39 అంశాలను తక్షణం కార్యరూపంలో పెట్టేందుకు కేంద్రం కార్యాచరణ రూపొందించాలని, ఈమేరకు కేంద్రం, అధిష్టాన పెద్దలకు వివరించామని తెలిపారు. పోలవరం ముంపు మండలాలను కూడా సీమాంధ్రలో కలిపేందుకు త్వరితగతిన ఆర్డినెన్స్ తేవాలని కోరినట్టు చెప్పారు. ఈ మండలాలు వస్తే దిగువ సీలేరు ప్రాజెక్టు కూడా సీమాంధ్ర పరిధిలోకి వస్తుందని, గోదావరి డెల్టా ప్రాంతానికి రబీకి కూడా నీరు లభిస్తుందని తెలిపారు. -
రాష్ట్రపతి పాలన విధింపుపై ఇంకా సస్పెన్స్!
-
మా డిమాండ్లను రాహూల్‌కు చెప్పాం: జెడి శీలం
-
మంత్రి జేడీ శీలం కాన్వాయ్‌పై చీపుర్లు
విజయవాడ, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్యసెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ మీదకు సమైక్యవాదులు చీపుర్లు విసిసారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం విజయవాడలో రైలు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు రోడ్డు మార్గం గుండా వెళుతున్నట్టు సమాచారం తెలుసుకున్న సమైక్యవాదులు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు ఉద్యమకారులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సమయంలోనే మంత్రి కాన్వాయ్‌పైకి చీపుర్లు విసిరారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌పై అందరి హక్కు ఉందని మంత్రి జేడీ శీలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వ్యాఖ్యా నించారు. తెలంగాణ విడిపోతే ఉద్యో గులకు, విద్యార్థులకు భద్రత కల్పిం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
'కాంగ్రెస్ మాత్రమే మాటమీదే నిలబడి ఉంది'
ఏలూరు : రాష్ట్ర విభజన విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలు మాట మార్చాయని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్ మాత్రమే మాటమీద నిలబడి ఉందన్నారు. పార్లమెంట్లో విభజన బిల్లుపై ఇంకా సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడలేదని జేడీ శీలం అన్నారు. కాగా అంతకు ముందు హనమాన్ జంక్షన్ వద్ద జేడీ శీలం కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీపుర్లు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. -
కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ
గన్నవరం : కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ తగిలింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జేడీ శీలం కాన్వాయ్‌ని శుక్రవారం ఉదయం సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవటంతో...ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమైక్యవాదులు శీలం కాన్వాయ్‌పై చీపుర్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
నేను సమైక్యవాదిని కాదు: జేడీ శీలం
బెంగళూరు, న్యూస్‌లైన్: తాను సమైక్యవాదిని కాదని.. సమస్యలవాదిని మాత్రమేనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఆదివారమిక్కడ నిర్వహించిన ప్రభుత్వరంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తుందో రాదో అనేది ఇప్పటికీ యూపీఏలో స్పష్టమైన అవగాహన లేదని చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత పాస్ అవుతుందో లేదో తెలియదన్నారు. నిత్యం కొట్లాడుకొనే కంటే విడిపోవడం చాలా ఉత్తమమన్నారు. సీఎం కిరణ్ రాజీనామా ఎప్పుడు? కొత్త పార్టీ పెడతారా? అన్న ప్రశ్నలకు.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పూర్తి కావాలి కదా.. అంతవరకు వేచిఉండాలని ఆయన బదులిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఆయన కాంగ్రెస్‌వాది అని శీలం అన్నారు. -
పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
-
పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
తెలంగాణ బిల్లుకు తాము 10 సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలని, తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలని తాము కోరామన్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే జీహెచ్ఎంసీ పరిధిని యూటీ చేయాలని శీలం అన్నారు. అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని, సీమాంధ్రలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు ఉండేలా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు భాగం కావాలని, సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయితీలు ఇవ్వాలని శీలం అన్నారు. ఉమ్మడి సదుపాయాలను అలాగే కొనసాగించాలని, ఇప్పుడున్న సంస్థల్లో రెండు ప్రాంతాలకూ అవకాశమివ్వాలని తెలిపారు. సీమాంధ్రలో కొత్త విద్యాసంస్థలు ఏర్పడేవరకు ఇప్పుడున్న విద్యాసంస్థల్లో అందరికీ అవకాశాలు కల్పించాలని, ఈ సవరణలకు ఆమోదం తెలిపితే రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. -
రమ్మంటేనే వచ్చాం: చిరంజీవి
న్యూఢిల్లీ: గతంలో తామిచ్చిన డిమాండ్లకు విభజన బిల్లులో స్పష్టత లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. తమ ప్రతిపాదనలు తీసుకోకపోవడం వల్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. జీవోఎం సభ్యులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు తాముగా ఈ సమావేశానికి రాలేదన్నారు. రమ్మంటేనే సమావేశానికి వచ్చామని వెల్లడించారు. గతంలో తాము చేసిన డిమాండ్లపై ఈ సమావేశంలో సమీక్షించారని చెప్పారు. తాము అడిగిన వాటికి ఒప్పుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీవోఎం తీసుకునే నిర్ణయాలపై తమ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీవోఎం సభ్యుల ముందు తమ వాదనలు బలంగా వినిపించామని మరో కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. గతంలో ఇచ్చిన అభ్యర్థనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగినట్టు చెప్పారు. తెలుగు వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటే తమకు ఊరట కలుగుతుందన్నారు. కాగా, జీవోఎం సభ్యులు రేపు మరోసారి భేటీ కానున్నారు. -
సమస్యలు త్వరలో సమసిపోతాయి
కామవరపుకోట, న్యూస్‌లైన్ :కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజలకు కోపం ఉందని, అయితే త్వరలోనే సర్దుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం అన్నారు. కామవరపుకోట మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామవరపుకోట చౌత్‌నా సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి శీలం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలున్నాయని అవన్నీ త్వరలోనే సమసిపోతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కావూరు సాంబశివరావు సమర్థవంతమైన నాయకుడన్నారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు, రైతు కూలీలు అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఎన్ని పెట్టుబడులు పెట్టినా అభివృద్ధి అంతగా ఉండదని, రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పదవులు పొందే నాయకులున్న ఈ రోజుల్లో కనీసం 20- 30 శాతం మంచి ప్రజాప్రతినిధులున్నా దేశం బాగుపడుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తిమేరకు కృషి చేస్తానని కావూరు సాంబశివరావు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి ఇప్పటి వరకు రైతులు, రైతు కూలీల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఐడీసీ చైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ మాట్లాడుతూ కామవరపుకోటలో మూడు కిలోమీటర్లు సీసీరోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు, కామవరపుకోట - ద్వారకాతిరుమల మెయిన్ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణను కోరగా అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. అంతకుముందు తడికలపూడిలో రూ.22 లక్షలతో నిర్మించే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు భవనం, ఆడమిల్లిలో రూ.7 కోట్ల ఎస్సీ, ఎస్టీ గ్రాంట్‌తో నిర్మించే రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి, ఆదర్శ డిగ్రీ కళాశాలకు, కామవరపుకోటలో రూ.50 లక్షలతో నిర్మించే మార్కెట్‌యార్డు గోడౌన్‌కు, రావికంపాడులో రూ.24 లక్షలతో నిర్మించే పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.6.30 కోట్లతో కామవరపుకోటలో ఏర్పాటు చేసే సీపీడబ్ల్యూ పథకానికి శంకుస్థాపన చేశారు. నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటరత్నం నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, సీఈవో నాగార్జున సాగర్, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ జి.జయచంద్రరావు, పీఆర్ డీఈ డి.సత్యనారాయణ , తహసిల్దార్ జె.మదనగోపాలరావు, ఎంపీడీవో కె.శిల్ప తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించలేదు: తడికలపూడి సర్పంచ్ ఆరోపణ తమ పంచాయతీ పరిధిలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణానికి ఆదివారం మంత్రులు శంకుస్థాపన చేశారని, అయితే సర్పంచ్ అయిన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తడికలపూడి సర్పంచ్ కడిమి దివ్యభారతి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ అవడం వల్ల తనకు సమాచారం ఇవ్వకుండా అవమానపర్చారని ఆమె పేర్కొన్నారు. ఫ్రొటోకాల్ పాటించని వారిపై చర్య తీసుకోవాలని ఆమె కోరారు. -
పదవులు అనుభవించి ఇప్పుడు నిందలా?
ఒంగోలు : సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల మనోభావలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ చివర వరకూ పోరాడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి అదే పార్టీపై నిందలు వేయటం సరైన పద్దతి కాదని జేడీ శీలం వ్యాఖ్యానించారు. కాగా మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా సొంతపార్టీ ఎంపీలపై మండిపడిన విషయం తెలిసిందే. పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ విమర్శలు చేయటం తగదని ఆమె హితవు పలికారు. -
సమస్యల్ని చెప్పకోవడానికి జీవోఎం పిలవలేదు:జేడీ శీలం
ఢిల్లీ: తమ ప్రాంత సమస్యల్ని చెప్పడానికి వస్తే జీవోఎం నుంచి పిలుపు అందలేదని జేడీ శీలం తెలిపారు. కేబినెట్లో తెలంగాణ అంశం చర్చకు వస్తే ముగ్గురు సీమాంధ్ర మంత్రులు తమ అభిప్రాయాలను చెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన జేడీ శీలం..జీవోఎం తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. ఒకప్రక్క విభజన ప్రక్రియ జరుగుతుంటే సమైక్య రాష్ట్రం అని ఏమి చేయగలమన్నారు. జీవోఎం ఇప్పటి వరకూ ఏం చేయాలనుకుంటుందో తమకు చెప్పలేదన్నారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్రం జీవోఎం సమావేశమైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు. -
హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయండి: జేడీశీలం
ఢిల్లీ: రాష్ట్రవిభజనపై కేంద్రం వేగం పెంచిన నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కొత్తరాగం వినిపిస్తున్నారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయాలంటూ సీమాంధ్ర కేంద్రమంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యాంగ సవరణ అందుకు అవసరమని అన్నారు. అయితే తాము చెప్పే అంశాలను జీ వోఎమ్ పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటామని పేర్కొన్నారు. కాకపోతే హైదరాబాద్‌ను కనీసం ఐదేళ్లయినా యూటీ చేయాలంటూ కొత్తరాగాన్ని లెవనెత్తారు. రాష్ట్రవిభనపై ఓడిపోయాం లేదా గెలిచామని కాదు.. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని శీలం తెలిపారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఓ ఉద్యోగి.. ఆయనకు కొన్ని హద్దులుంటాయని అన్నారు. అయితే కేంద్రపాలిత బాధ్యతను కేబినెట్ మంత్రులపైనే పెట్టామని ఆయన చెప్పారు. రాయలతెలంగాణ అంశాన్ని.. రాయలసీమ నేతలే తేల్చుకోవాలిని శీలం పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన సీడబ్య్లూసీ తీర్మానంలో 10 జిల్లాల తెలంగాణయే ఉందిని జేడీ శీలం స్పష్టం చేశారు. -
జైపాల్‌రెడ్డితో జేడీశీలం భేటీ
-
తెలుగువారికి సీనియర్ నేత జైపాల్ రెడ్డి: జేడీ శీలం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో గురువారం జేడీ శీలం భేటీ అయ్యారు. జైపాల్ నివాసంలో దాదాపు ఇరువురు 20 నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ తెలుగువారికి సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అని అన్నారు. అందుకనే ఆయనతో ఇరు ప్రాంతాలకు చెందిన కొన్ని అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమస్యలపై ఇరు ప్రాంతాల నేతలు మాట్లాడాల్సి ఉందని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగానే జైపాల్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై సహచర మంత్రులతో కూడా కలవనున్నట్లు తెలిపారు. కాగా తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జేడీ శీలం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో మర్రి శశిధర్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణలో సీట్ల పెంపుపై ఆయన చర్చించినట్లు సమాచారం. -
హైదరాబాద్‌ను యూటీ చేస్తే.. తెలంగాణకు సహకరిస్తాం: జేడీ శీలం
హైదరాబాద్ నగరాన్ని కొన్ని సంవత్సరాలైనా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, అలాగైతే తెలంగాణకు తాము సహకరిస్తామని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. అలాగే ఈ ప్రతిపాదనకు అందరినీ ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. కనీసం సీమాంధ్ర రాజధాని ఏర్పడేంతవరకు హైదరాబాద్‌లో తమకు అవకాశం ఇస్తే చాలని శీలం చెప్పారు. రాయల తెలంగాణపై తమకు సమాచారం లేదని ఆయన న్యూఢిల్లీలో సోమవారం నాడు 'సాక్షి'తో మాట్లాడుతూ అన్నారు. -
కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారు: జెడి శీలం
గుంటూరు: కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారని కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు. అయితే ఎప్పటికైనా కాంగ్రెస్‌యే ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతోపాటు జేడీ శీలం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేసినట్లు కూడా ఆయన తెలిపారు. -
'హైదరాబాద్‌ను యూటీ చేస్తే విభజనకు ఒప్పుకుంటాం'
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని వారు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేశారు. జీవోఎం సమావేశం ముగిసిన అనంతరం జీవోఎం సభ్యులు షిండే, జైరాం రమేష్, నారాయణ స్వామితో ....కావూరి, శీలం భేటీ అయ్యారు. భేటీ అనంతరం కావూరి, జేడీ శీలం మాట్లాడుతూ తాము ప్రస్తుతం హైదరాబాద్‌పై దృష్టి పెట్టామని, ప్యాకేజీలపై తర్వాత చర్చిస్తామన్నారు. జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలు ప్యాకేజీల కోసం తాము చేస్తున్న డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కూడా కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్‌షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్‌లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందేనని సూచించారు. -
అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ముంపు: జెడి శీలం
ఒంగోలు: కేంద్ర మంత్రి జెడి శీలం ప్రకాశం జిల్లాలో వరద ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు, ప్రకాశం జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపంతో వరద ముంపు ఏర్పడిందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశిస్తున్నానన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం వచ్చేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలకు ప్రకాశం జిల్లాలో ఎక్కువ నష్టం విషయం తెలిసిందే. వాగులు, వంకలు తెగి భారీ మొత్తంలో పంటలు నష్టపోయాయి. -
భీమవరంలో జేడీ శీలంను అడ్డుకున్న సమైక్యవాదులు
-
శీలంను వెంటాడుతున్న సమైక్య సెగ
విజయవాడ/పాలకొల్లు/మలికిపురం, న్యూస్‌లైన్ : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలంకు వరుసగా మూడోరోజూ సమైక్య సెగ తగిలింది. వ్యక్తిగత పనిపై మంగళవారం కారులో విశాఖజిల్లా యలమంచిలి వెళ్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు, సమైక్యవాదులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగివచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరణ ఇచ్చారు. అంతకుముందు సమావేశం పెడితే అడ్డుకుంటామని విజయవాడలో సమైక్య, పొలిటికల్ జేఏసీలు హెచ్చరించడంతో జేడీ శీలం బసచేసిన హోటల్ యాజమాన్యం మీడియా సమావేశానికి అనుమతివ్వలేదు. దీంతో హోటల్ పోర్టికోలోనే ఆయన విలేకరులతో మాట్లాడాల్సి వచ్చింది. హైదరాబాద్ యూటీ అవుతుందని ఆశిస్తున్నా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తనను అడిగారని, యూటీ అవుతుందనే ఆశిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. ఆయన మంగళవారం విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా దిండి పర్యాటక కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. -
తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు: జేడీ శీలం
విజయవాడ : కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలంకు మరోసారి సమైక్య సెగ తగిలింది. మంగళవారం ఉదయం విజయవాడలో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్ర నేతల వైఖరి తెలపాలంటూ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ...జేడీ శీలంను డిమాండ్ చేశారు. విభజన విషయంలో తాము సందిగ్ధంలో ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే మిగతా నేతల గురించి వ్యాఖ్యానించే స్థాయి తనకు లేదన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, అయితే విభజనతో వచ్చే సమస్యలు పరిష్కరించుకుందామని జేడీ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీంచే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది నియంతల పార్టీ... ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అన్నారు. ఉద్యమ నేతలతో మంత్రులు మాట్లాడుతున్నారని.... సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీకి వివరిస్తామన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చిత్తశుద్దితో పని చేస్తోందని ఆయన తెలిపారు. కాగా విభజన ప్రక్రియ మొదలైందని...అయితే ఇది అంతం కాదని... ఆరంభం మాత్రమేనని జేడీ శీలం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందో రాదో తనకు తెలియదన్నారు. -
సమష్టిగా పరిష్కార మార్గం చూపాలి: జేడీ శీలం
వర్ధన్నపేట: రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజాప్రతినిధులు కలిసి చర్చించి, పరిష్కార మార్గం చూపాలని కేంద్రమంత్రి జేడీ శీలం కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన ఓ వివాహానికి బుధవారం ఆయన హాజరయ్యారు. అనంతరం ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో రాజధాని అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగస్తుల్లో అభద్రత భావం నెలకొందని, రాయలసీమలో తాగునీరు భయం పట్టుకుందన్నారు. ఈ క్రమంలో సీమాంధ్రలో ప్రజలు 75 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యలపై ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. -
సిడబ్ల్యూసి వెనక్కి తగ్గదు: జెడి శీలం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో సిడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదని కేంద్ర మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. ముందుకెళ్ళే క్రమంలో సమస్యలు పరిష్కరించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మె విరమించాలని ఆయన కోరారు. హైదరాబాద్ సమస్యను పరిష్కరిస్తే ఉద్యమ తీవ్రత తగ్గుతుందని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. -
కేంద్ర నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించాలో తెలుసు:జెడి శీలం
న్యూఢిల్లీ: సమైక్యరాష్ట్రం కోసం తాము రాజీనామాలు చేయవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేడి శీలం అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించాలో తమకు తెలుసని చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు ఆమోదం పొందుతుందని మంత్రి అన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూనే తమ పదవులకు రాజీనామాలు చేయని విషయం తెలిసిందే. -
రాజ్యసభలో శీలం - పాల్వాయి వాగ్వాదం; లోక్‌సభ రేపటికి వాయిదా
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ సైన్యం హతమార్చిన ఘటనపై ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందంటూ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలన్నీ ఒంటికాలిపై లేవడం, సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ మీరాకుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్‌సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు. తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు. తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ రాజ్యసభలో టీడీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీమాంధ్రులంతా తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని పాల్వాయి వ్యాఖ్యానించడంతో సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేంద్రమంత్రి జేడీ శీలం స్పందించారు. ఆయనకు రేణుకా చౌదరి కూడా మద్దతు పలికారు. అధికార పక్షానికి చెందిన పలువురు సభ్యులు వారిద్దరికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ పడొద్దని సీనియర్ సభ్యురాలు అంబికా సోనీ కూడా జేడీ శీలానికి సూచించారు. ఇంతలో టీడీపీ సభ్యులు రాష్ట్రాన్ని రక్షించాలంటూ నినాదాలు చేయడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారిని హెచ్చరించారు. సభా కార్యకాలపాలకు అడ్డు తగలడం మానకపోతే చర్య తీసుకుంటామన్నారు. దీని గురించి చర్చ వచ్చినప్పుడు ముందుగా మాట్లాడే అవకాశం వారికే ఇస్తానని చెప్పారు. ఇలాగే గొడవ చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని, అలా చేసేలా తనను బలవంత పెట్టొద్దని చెప్పారు. అయినా ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నినాదాలు కొనసాగించారు. ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే కారణమని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై చివరకు అధికార పార్టీయే ఒక్క మాటమీద లేదని, మంత్రికి - ఎంపీ పాల్వాయికి మధ్య జరిగిన వివాదమే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు.