
సమష్టిగా పరిష్కార మార్గం చూపాలి: జేడీ శీలం
వర్ధన్నపేట: రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజాప్రతినిధులు కలిసి చర్చించి, పరిష్కార మార్గం చూపాలని కేంద్రమంత్రి జేడీ శీలం కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన ఓ వివాహానికి బుధవారం ఆయన హాజరయ్యారు. అనంతరం ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో రాజధాని అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగస్తుల్లో అభద్రత భావం నెలకొందని, రాయలసీమలో తాగునీరు భయం పట్టుకుందన్నారు. ఈ క్రమంలో సీమాంధ్రలో ప్రజలు 75 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యలపై ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు.