విజయవాడ : కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలంకు మరోసారి సమైక్య సెగ తగిలింది. మంగళవారం ఉదయం విజయవాడలో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్ర నేతల వైఖరి తెలపాలంటూ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ...జేడీ శీలంను డిమాండ్ చేశారు. విభజన విషయంలో తాము సందిగ్ధంలో ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే మిగతా నేతల గురించి వ్యాఖ్యానించే స్థాయి తనకు లేదన్నారు.
తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, అయితే విభజనతో వచ్చే సమస్యలు పరిష్కరించుకుందామని జేడీ అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీంచే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది నియంతల పార్టీ... ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అన్నారు.
ఉద్యమ నేతలతో మంత్రులు మాట్లాడుతున్నారని.... సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీకి వివరిస్తామన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చిత్తశుద్దితో పని చేస్తోందని ఆయన తెలిపారు. కాగా విభజన ప్రక్రియ మొదలైందని...అయితే ఇది అంతం కాదని... ఆరంభం మాత్రమేనని జేడీ శీలం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందో రాదో తనకు తెలియదన్నారు.