ఫ్లాప్ షో..! | not responce to PCC tour | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ షో..!

Published Tue, Mar 25 2014 3:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

not responce to PCC tour

సాక్షి, ఒంగోలు: ‘కాశీకి వెళ్లానని..కాషాయం..’ అంటూ ఇంద్ర సినిమా డైలాగ్‌తో ప్రారంభమైన ఆయన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది. నూనుగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దల్ని అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతనలేకుండా చేసిన  వ్యాఖ్యలివి.. సోమవారం ఒంగోలులో కాంగ్రెస్ బస్సుయాత్ర కాస్తా తుస్సుమంది.

గుంటూరు జిల్లా నుంచి నేరుగా ఒంగోలులోకి ప్రవేశించిన బస్సుయాత్ర నగరంలో ట్రంకురోడ్డు, చర్చిసెంటర్, కలెక్టరేట్, రామ్‌నగర్ మీదుగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.  

డీసీసీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. చిరంజీవి అభిమానులు అక్కడికొచ్చినా... వారు తమ అభిమాన నేతను కలిసే విషయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తీవ్రంగా విభేదించి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. నేతల ప్రసంగాలకు అడ్డుతగులుతున్న చిరు అభిమానుల హడావుడిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనానికి గురై మైక్‌లో కేకలేశారు.

స్వయంగా చిరంజీవి పైకిలేచి ..మైకు పట్టుకుని క్రమశిక్షణ అంటూ అభిమానులను కట్టడిచేసే ప్రయత్నం చే సినా.. వారిమధ్య వాగ్వాదాలు సద్దుమణగలేదు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దొంగే..దొంగదొంగ అని అరిచినట్లు చంద్రబాబు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని.. అతనికి భవిష్యత్‌లో ఘోరపరాభవం ఎదురుకానున్నదని రఘువీరా జోస్యం చెప్పారు. 

కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంభోదించగా.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌కల్యాణ్‌ను స్తుతిస్తూ కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. పలువురు రాష్ట్ర నేతలు మాట్లాడినప్పటికీ.. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, సీమాంధ్ర ప్యాకేజీలపై కార్యకర్తల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు. చివరికి చిరంజీవి ప్రసంగంలో ఒంగోలును జపాన్ చేస్తానని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రకాశం రైతులకు మేలంటూ .. చెప్పడంపై విసుగు చెందిన పలువురు నేతలతో పాటు సమావేశం నుంచి భారీగా కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు.

 ‘స్టాలిన్’ డైలాగ్‌ను గుర్తుచేసిన పనబాక
కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా డైలాగ్‌ను చెబుతూ.. కాంగ్రెస్‌పై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఒకరు మరో ముగ్గురుతో మాట్లాడి తిప్పికొట్టాలని సూచించారు. చిరంజీవి అభిమానులు ఈలలు, చప్పట్లకు పరిమితం కాకూడదంటూ.. రానున్న కాలంలో యువతకు తమపార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో అశ్లీలపొత్తుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఆయన తొమ్మిదేళ్లహయాంలో ఇంకుడు గుంతలు, నీరు, మీరు, వనం..మనం తదితర పథకాలతో పచ్చకండువాల నేతలకు రాష్ట్ర్రాన్ని బేరం పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. సీమాంధ్రకు కేంద్రమిచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఒక్కో పట్టణాన్ని ఒక్కో భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీమంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ పదవులు అనుభవించి పక్కకెళ్లిన నేతల కారణంగా కాంగ్రెస్‌కు కష్టాలు దాపురించాయన్నారు. త్వరలో సీమాంధ్ర అద్భుతప్రగతిని చూస్తుందన్నారు. మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ శేషు తదితరులు మాట్లాడారు.
 
కాంగ్రెస్ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, జీవి శేషు మినహా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కార్యక్రమం అంతటా చిరంజీవి అభిమానులు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దగా కనిపించలేదు.

గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చిరంజీవి చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు. చిరంజీవి మాట్లాడుతూ మాగుంట కాస్త అటూఇటుగా ఉన్నారని, ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని అన్నారు. విభజనపై తాను బాధపడుతున్నానని ఆయన చెప్పుకుంటూనే కాంగ్రెస్‌ను ఓట్లేసి గెలిపించమనడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బస్సుయాత్ర ఫ్లాప్‌షోగా మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement