Panabaka Laksahmi
-
అంతా.. నా ఇష్టం!
చీరాల, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనానంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోగా.. అభిమానంతో కొనసాగుతున్న కొద్దిమంది కూడా నేతల చర్యలతో పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రమంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి తీరుతో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను తాను ఎంపిక చేసిన వారికే ఖరారు చేయాలని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరింది.ఈ క్రమంలో పార్లమెంట్ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రతిపాదనను ఆమె పీసీసీకి, పార్టీ అధిష్టానానికి నివే దించింది. ముఖ్య నాయకులతో సైతం చర్చించకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకుని పార్టీకి ఎటువంటి సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ఎలా ప్రకటిస్తారని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. చీరాలకు సంబంధించి పార్టీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే విభే దాలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి జేడీ శీలం ఏర్పాటు చేసిన సమావేశంలో చీరాలకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదిగాని గురునాథం, మరికొందరు నాయకులు పనబాక తీరును బాహాటంగా విమర్శించారు. పార్టీకి సంబంధంలేని వారి నుంచి డబ్బులు తీసుకుని టిక్కెట్లపై హామీ ఇస్తున్నారని ఆరోపించడంతో పాటు ఘర్షణకు కూడా దిగారు. చీరాలకు మెండు నిషాంత్, అద్దంకికి డాక్టర్ గాలం లక్ష్మి, పర్చూరుకు మోదుగుల కృష్ణారెడ్డి, సంతనూతలపాడుకు వేమా శ్రీనివాసరావు, వై.శశిభూషణ్, ఎన్.తిరుమలరావు, బాపట్లకు చేజర్ల నారాయణరెడ్డి, వేమూరుకు దేవళ్ల భరత్, రేపల్లెకు మోపిదేవి శ్రీనివాసరావు పేర్లను అసెంబ్లీ అభ్యర్థులుగా పనబాక ప్రతిపాదించారు. చీరాల అభ్యర్థి మెండు నిషాంత్ పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు తనయుడు. ఇప్పటి వరకూ రాజకీయాల్లో ప్రవేశంలేదు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. నిషాంత్‌ను పార్టీ అభ్యర్థిగా పనబాక ప్రతిపాదించ డం ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మాదిగాని గురునాథం, ఏఎంసీ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, అందె కనకలింగేశ్వరరావుతో పాటు మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీ కోసం పనిచేసేవారికే టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒక్క చీరాలలోనే కాకుండా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పార్టీలో ఉన్న అతికొద్ది మందిలో కూడా విభేదాలు తారాస్థాయికి చేరడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. -
ఫ్లాప్ షో..!
సాక్షి, ఒంగోలు: ‘కాశీకి వెళ్లానని..కాషాయం..’ అంటూ ఇంద్ర సినిమా డైలాగ్‌తో ప్రారంభమైన ఆయన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది. నూనుగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దల్ని అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతనలేకుండా చేసిన వ్యాఖ్యలివి.. సోమవారం ఒంగోలులో కాంగ్రెస్ బస్సుయాత్ర కాస్తా తుస్సుమంది. గుంటూరు జిల్లా నుంచి నేరుగా ఒంగోలులోకి ప్రవేశించిన బస్సుయాత్ర నగరంలో ట్రంకురోడ్డు, చర్చిసెంటర్, కలెక్టరేట్, రామ్‌నగర్ మీదుగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. చిరంజీవి అభిమానులు అక్కడికొచ్చినా... వారు తమ అభిమాన నేతను కలిసే విషయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తీవ్రంగా విభేదించి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. నేతల ప్రసంగాలకు అడ్డుతగులుతున్న చిరు అభిమానుల హడావుడిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనానికి గురై మైక్‌లో కేకలేశారు. స్వయంగా చిరంజీవి పైకిలేచి ..మైకు పట్టుకుని క్రమశిక్షణ అంటూ అభిమానులను కట్టడిచేసే ప్రయత్నం చే సినా.. వారిమధ్య వాగ్వాదాలు సద్దుమణగలేదు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దొంగే..దొంగదొంగ అని అరిచినట్లు చంద్రబాబు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని.. అతనికి భవిష్యత్‌లో ఘోరపరాభవం ఎదురుకానున్నదని రఘువీరా జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంభోదించగా.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌కల్యాణ్‌ను స్తుతిస్తూ కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. పలువురు రాష్ట్ర నేతలు మాట్లాడినప్పటికీ.. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, సీమాంధ్ర ప్యాకేజీలపై కార్యకర్తల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు. చివరికి చిరంజీవి ప్రసంగంలో ఒంగోలును జపాన్ చేస్తానని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రకాశం రైతులకు మేలంటూ .. చెప్పడంపై విసుగు చెందిన పలువురు నేతలతో పాటు సమావేశం నుంచి భారీగా కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ‘స్టాలిన్’ డైలాగ్‌ను గుర్తుచేసిన పనబాక కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా డైలాగ్‌ను చెబుతూ.. కాంగ్రెస్‌పై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఒకరు మరో ముగ్గురుతో మాట్లాడి తిప్పికొట్టాలని సూచించారు. చిరంజీవి అభిమానులు ఈలలు, చప్పట్లకు పరిమితం కాకూడదంటూ.. రానున్న కాలంలో యువతకు తమపార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో అశ్లీలపొత్తుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఆయన తొమ్మిదేళ్లహయాంలో ఇంకుడు గుంతలు, నీరు, మీరు, వనం..మనం తదితర పథకాలతో పచ్చకండువాల నేతలకు రాష్ట్ర్రాన్ని బేరం పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. సీమాంధ్రకు కేంద్రమిచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఒక్కో పట్టణాన్ని ఒక్కో భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీమంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ పదవులు అనుభవించి పక్కకెళ్లిన నేతల కారణంగా కాంగ్రెస్‌కు కష్టాలు దాపురించాయన్నారు. త్వరలో సీమాంధ్ర అద్భుతప్రగతిని చూస్తుందన్నారు. మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ శేషు తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, జీవి శేషు మినహా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కార్యక్రమం అంతటా చిరంజీవి అభిమానులు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దగా కనిపించలేదు. గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చిరంజీవి చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు. చిరంజీవి మాట్లాడుతూ మాగుంట కాస్త అటూఇటుగా ఉన్నారని, ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని అన్నారు. విభజనపై తాను బాధపడుతున్నానని ఆయన చెప్పుకుంటూనే కాంగ్రెస్‌ను ఓట్లేసి గెలిపించమనడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బస్సుయాత్ర ఫ్లాప్‌షోగా మిగిలిపోయింది. -
ఏడు అసెంబ్లీ స్థానాలకు
త్వరలో ఇన్‌చార్జ్‌ల నియామకం కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చీమకుర్తి, న్యూస్‌లైన్: బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనున్న ఏడు అసెంబ్లీ స్థానాలకు త్వరలో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. చీమకుర్తిలోని డాక్టర్ జవహర్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పనబాక మాట్లాడుతూ ఇన్చార్జిలను నియమించేందుకు ఈ పాటికే ప్రతిపాదనలను పంపించామని, అవి ఆమోదం పొందగానే అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్చార్జిలు వస్తారన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయకుమార్ ఉన్నారుగదా..? అని విలేకరులు గుర్తు చేయగా ఆయన టచ్‌లో లేరని అందువలనే ఇన్చార్జిని నియమించాల్సి వస్తుందని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నిటిలోనూ కాంగ్రెస్‌పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కీరోల్ వహించనుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఆమె వెంట ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, అవిశనేని వెంగన్న, కడియాల సుబ్బారావు, పాలడుగు తిరుపతయ్య, బండి శ్రీహరి, డాక్టర్ బీ.జవహర్ ఉన్నారు. -
గుడివాడలో కేంద్రమంత్రి పనబాకకి 'సమైక్య సెగ'
కృష్ణాజిల్లా గుడివాడలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీని మంగళవారం సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చొరవ తీసుకోవాలని ఏపీఎన్జీవోలు పనబాక లక్ష్మీకి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇకనైన ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాని వారు కేంద్రమంత్రి పనబాక లక్ష్మీని ఈ సందర్భంగా వారు కోరారు. దాదాపు 60 రోజులుగా తాము సమైక్య ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు నిమ్మకు నిరెత్తినట్లు వ్యహారిస్తుండటం పట్ల ఏపీఎన్జీవోలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.