తెలుగువారికి సీనియర్ నేత జైపాల్ రెడ్డి: జేడీ శీలం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో గురువారం జేడీ శీలం భేటీ అయ్యారు. జైపాల్ నివాసంలో దాదాపు ఇరువురు 20 నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ తెలుగువారికి సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అని అన్నారు.
అందుకనే ఆయనతో ఇరు ప్రాంతాలకు చెందిన కొన్ని అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమస్యలపై ఇరు ప్రాంతాల నేతలు మాట్లాడాల్సి ఉందని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగానే జైపాల్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై సహచర మంత్రులతో కూడా కలవనున్నట్లు తెలిపారు.
కాగా తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జేడీ శీలం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో మర్రి శశిధర్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణలో సీట్ల పెంపుపై ఆయన చర్చించినట్లు సమాచారం.