సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ‘వయసు’ గుబులు పట్టుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండదని, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని ఇటీవల జరిగిన ప్లీనరీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడంతో తమకు సీట్లు వస్తాయా రావా అనే సందేహం వారిని వేధిస్తోంది. రాహుల్ చెప్పినట్టు చేస్తే రాష్ట్రం నుంచి ఐదారుగురు ముఖ్య నేతల టికెట్లు గల్లంతయ్యే అవకాశముందన్న చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ లెక్కన ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుల టికెట్లు సైతం గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా సీనియర్ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జాతీయ విపత్తు నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. వీరందరి వయసు 70 కన్నా ఎక్కువ ఉండటంతో ఈసారి వీరికి టికెట్లు రావన్న చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. లోలోన గుబులుగానే ఉన్నా తమకు టికెట్ కచ్చితంగా వస్తుందని వారు పేర్కొంటున్నా రు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆశతో ఉన్న జానారెడ్డి.. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ తెచ్చుకుంటానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.
పొన్నాల లక్ష్మయ్య సైతం ఈసారి తన గెలుపు కచ్చితమన్న అంచనాతో ఉన్నారు. గీతారెడ్డి తన కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా.. ఈసారికి తానే పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక జైపాల్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని మాజీ మంత్రి డీకే అరుణ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటం సీనియర్లకు తలనొప్పిగా మారింది. జైపాల్‌కు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీలో అవకాశం ఇస్తారని అంటున్నారు.
ఆయన మాత్రం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మర్రిÔ¶ శశిధర్‌రెడ్డి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌గా క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే టికెట్‌పై ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని కొందరు యువనేతలు ప్రచారం చేస్తున్నట్టు వీరి ఆశలు నిరాశలవుతాయా? లేదా రాహుల్ ప్రత్యేక నిర్ణయం తీసుకుని వీరికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సిందే!
వారసులొస్తారా?
వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారు పోటీ చేసే అవకాశం లేదని పార్టీ కచ్చితంగా నిర్ణయిస్తే ఆయా నేతల వారసులకు లైన్‌క్లియర్ అవుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతల్లో జైపాల్‌రెడ్డికి రాజకీయంగా వారసులు లేకపోయినా జానా కుమారుడు రఘువీర్‌రెడ్డి, పొన్నాల కోడలు వైశాలి, శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి లాంటి యువ నాయకత్వం ఈసారి బరిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది.
రాహల్ మదిలో ఏముంది?
వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ సీనియర్ల హవానే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద వయసున్న నేతలే అటు పార్టీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ కనిపిస్తుంటారు. అయితే రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన విభాగాలకు ఎన్నికలు నిర్వహించడం మొదలు పార్టీలో సీనియర్లు, జూనియర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆయన తనదైన ఆలోచనతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ‘‘20–40 ఏళ్ల వయసున్న వారిని వర్కింగ్ యూత్‌గా, 40–60 వరకు సీనియర్ యూత్‌గా, 60–70 సలహా సంఘంగా, 70 కన్నా ఎక్కువ వయసున్న వారిని పూర్తిగా పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 60–70 ఏళ్ల వయసున్న వారికి టికెట్లు ఇచ్చే విషయంలో కొంత రిజర్వ్‌డ్‌గానే ఉండాలని ఆయన ఉన్నారు. ఇదే విషయాన్ని ప్లీనరీలో ప్రకటించారు’’ అని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్
సీనియర్ నేతలకు టికెట్ల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. 70 ఏళ్లు దాటిన నాయకులకు టికెట్లు ఇవ్వబోమని పార్టీలో ఎక్కడా చెప్పలేదంటూనే.. ఈసారి యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ చెప్పినట్లు వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment