లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్!
కసరత్తులు ప్రారంభించిన హైకమాండ్
ఆశలు పెట్టుకున్న సీనియర్లు
తమకే ఇవ్వాలంటూ హైకమాండ్‌కు ఇప్పటికే విజ్ఞప్తులు
అసంతృప్తులు బయటకు రాకుండా.. ఆచితూచీ నిర్ణయం తీసుకోనున్న అధిష్టానం
సీఎం రేవంత్‌తో కలుపుగోలుగా ఉండేవాళ్లకే ఛాన్స్?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయాల కోసం హైకమాండ్ ఎంతగా మల్లగుల్లాలు పడుతోంది గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయబోతోంది. గాంధీభవన్‌కు కొత్త బాస్ ఎవరు కానున్నారు?.. సీనియర్ల అభ్యంతరాలు-గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ నియామకాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయబోతోంది?..
పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి స్థానంలో.. పార్టీకి కొత్త చీఫ్‌గా ఎవరు రాబోతున్నారు?. అసలు ఆ రేసులో ఉన్న నాయకులు ఎవరు? ఈసారి అగ్ర వర్ణాలకు ఇస్తారా? బీసీలకు ప్రాధాన్యమిస్తారా? లేక ఎస్‌సీ వర్గంలో సీనియర్ నేతకు ఛాన్స్ ఇస్తారా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది? పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించినవారు ఎవరు?..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి...పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన హైకమాండ్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ వస్తారని తెలిపింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి గనుక.. ఫలితాలు రాగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త నేత వస్తారంటున్నారు. రేవంత్‌రెడ్డి కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇక హైకమాండ్ కూడా గాంధీభవన్‌కు కొత్త బాస్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ పదవి కావాలని హై కమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజికవర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం.
అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం పదికి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలనుంచి ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment