సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీకి టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రహస్య మిత్రుడని, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న చోట టీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను పోటీలో నిలిపిందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే రీతిన ఇరు పార్టీలు పోటీ చేస్తాయన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక కేసీఆర్‌కు లెక్కలేనంత అహంకారం పెరిగిందని, రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణావతారం ఎత్తితే, తర్వాత లంచావతారం ఎత్తారని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్‌కు ముందస్తు ఎన్నికలతో భంగపాటు తప్పదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగానే 75 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీట్ ది మీడియా కార్యక్రమానికి జైపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మట్లాడారు.
ముందస్తుపై ఆయనే బాధపడుతున్నారు
ఇందిరాగాంధీ ఒక్కరు మినహా ఎవరూ ముందస్తుకు వెళ్లినా గెలిచిన వారు లేరని.. కేసీఆర్ సైతం ఎందుకు ముందస్తు కాల్వలో కాలుపెట్టానని బాధపడుతున్నారని జైపాల్ వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, ఇంటింటికీ తాగునీరు.. వంటి ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 70 ఏళ్లలో రూ.70 వేల కోట్ల అప్పులు చేస్తే కేవలం నాలుగున్నరేళ్లలో రూ.1.50లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని చెప్పారు.
కేటీఆర్‌ను రాజకీయ నేతగా గుర్తించట్లేదు
రాజకీయాలు జీవనదిలాంటివే తప్ప మురికిగుంట కాదని జైపాల్ చెప్పారు. ఈ జీవనదిలోకి అనేక నదులు కలసి ఉప్పొంగిన మాదిరే టీడీపీ కాంగ్రెస్‌తో కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం మోదీని ఓడించాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకే చంద్రబాబుతో కలసి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నా నదీజలాల విషయంలో బాబుతో ఎలాంటి రాజీ ఉండదన్నారు. పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు ముమ్మాటికీ పాతవేనని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా.. ‘కేటీఆర్‌ను రాజకీయ నేతగా గుర్తించలేదు. రాజకీయ సన్యాసంపై స్పందించను. కేసీఆర్‌ను మాత్రమే రాజకీయ నేతగా గుర్తిస్తా’అని వ్యాఖ్యానించారు.
స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను దెబ్బతీసిన మోదీ
మోదీవి అవాస్తవిక వాగ్దానాలు చేశారని జైపాల్ మం డిపడ్డారు. ఇతర దేశాల్లో దాచుకున్న రూ.80 లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తానని, ప్రతి పౌరుడి ఖాతా లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పారని గుర్తుచేశారు. కనీసం 15 పైసలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను దెబ్బతీశారని ఆరోపించారు. మోదీ హయాంలో నోట్ల రద్దు అతి పెద్ద తప్పిదమని విమర్శించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా నష్టపోయిందన్నారు.
మోదీకి కేసీఆర్ రహస్య మిత్రుడు
Published Fri, Nov 23 2018 12:40 AM | Last Updated on Fri, Nov 23 2018 6:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment