పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
తెలంగాణ బిల్లుకు తాము 10 సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలని, తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలని తాము కోరామన్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిని యూటీ చేయాలని శీలం అన్నారు.
అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని, సీమాంధ్రలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు ఉండేలా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు భాగం కావాలని, సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయితీలు ఇవ్వాలని శీలం అన్నారు. ఉమ్మడి సదుపాయాలను అలాగే కొనసాగించాలని, ఇప్పుడున్న సంస్థల్లో రెండు ప్రాంతాలకూ అవకాశమివ్వాలని తెలిపారు.
సీమాంధ్రలో కొత్త విద్యాసంస్థలు ఏర్పడేవరకు ఇప్పుడున్న విద్యాసంస్థల్లో అందరికీ అవకాశాలు కల్పించాలని, ఈ సవరణలకు ఆమోదం తెలిపితే రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.