ఫిబ్రవరి నెలాఖరుకల్లా విభజన పూర్తి: సర్వే
ఫిబ్రవరి నెలాఖరు కల్లా విభజన ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విభజన ఆగిపోతుందని కొంతమంది సీమాంధ్ర నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోతుందని, ఆ గడువును పొడగించాలని కోరడం సరికాదని సర్వే అన్నారు. గడువును పొడగించవద్దని తాను రాష్ట్రపతిని కోరుతున్నట్లు చెప్పారు.
విభజన బిల్లుపై ఓటింగ్ ప్రస్తావన లేదని, ఒకవేళ మొత్తం ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా విభజన ఆగదని, అసలు అసెంబ్లీ అభిప్రాయాన్ని ఆమోదించాల్సిన అవసరం పార్లమెంట్‌కు లేదని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విభజన అధికారం పూర్తిగా పార్లమెంటుదేనన్నారు. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ఉందని, తానెక్కడ సీఎం అవుతానో అని తన వ్యతిరేకులు కొందరు ప్రతిష్టను డ్యామేజ్ చేస్తున్నారని వాపోయారు. రాహుల్ ప్రధానమంత్రి కావాలని, ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.