'హైదరాబాద్ను యూటీ చేస్తే విభజనకు ఒప్పుకుంటాం'
న్యూఢిల్లీ : హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం స్పష్టం చేశారు. హైదరాబాద్ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని వారు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేశారు. జీవోఎం సమావేశం ముగిసిన అనంతరం జీవోఎం సభ్యులు షిండే, జైరాం రమేష్, నారాయణ స్వామితో ....కావూరి, శీలం భేటీ అయ్యారు. భేటీ అనంతరం కావూరి, జేడీ శీలం మాట్లాడుతూ తాము ప్రస్తుతం హైదరాబాద్పై దృష్టి పెట్టామని, ప్యాకేజీలపై తర్వాత చర్చిస్తామన్నారు.
జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలు ప్యాకేజీల కోసం తాము చేస్తున్న డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కూడా కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్‌షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్‌లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందేనని సూచించారు.