hyderabad union territory
-
'హైదరాబాద్‌లో భయంగా సీమాంధ్రులు'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం భయాందోళనతో ఉన్నారని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం ద్వారానే వారికి సరైన రక్షణ కల్పించగలమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని తాము గట్టిగా కోరుతున్నామని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణం కాగానే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా తొలగించవచ్చని పల్లంరాజు పేర్కొన్నారు. -
విధిలేకే పోడియం వద్ద ఆందోళన: చిరంజీవి
న్యూఢిల్లీ : విధిలేని పరిస్థితుల్లోనే తాము స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసినట్లు కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని అయితే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటంతో పాటు తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తే చాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. -
తెగించి పోరాడకుండా డ్రామాలేంటి?
* సవరణల పేరుతో విభజనకు అంగీకరిస్తారా? * సీమాంధ్ర మంత్రులపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందు సవరణలు ప్రతిపాదిస్తూ చివరి నిమిషంలో కూడా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగంగా ముందుకు తీసుకెళుతున్న తరుణంలో తెగించి పోరాడకుండా ఈ డ్రామాలేంటని ఆమె కేంద్ర మంత్రులపై నిప్పులు చెరిగారు. గురువారం నాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను యూటీ చేయాలని, సీమాంధ్రకు యూనివర్సిటీలు కావాలంటూ సవరణలు కోరుతారా? ఇదేనా మీరు సమైక్యం కోసం చేస్తున్న పోరాటం’’ అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏదో చేస్తామంటూ ఇంతకాలం మాట్లాడి చివరకు విభజనకు సహకరిస్తూ వారంతా చవటలు, దద్దమ్మలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారిని చీల్చడానికి వీల్లేదని తమ పదవులను వదులుకోవాల్సిన మంత్రులకు అసలు పౌరుషం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏదేదో చేసేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి కేంద్రంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు ఆడుతున్నందునే లగడపాటికి చెందిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించకపోయినా కొత్తగా రూ. 2,300 కోట్ల రుణం మంజూరైందని ఆమె ఆరోపించారు. సుజనాచౌదరి సంస్థలకు కూడా కేంద్రం విరివిగా రుణాలిచ్చిందని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు డిమాండ్ చేస్తున్నదేమిటి? ‘‘అన్ని పార్టీల నేతల వద్దకూ వెళ్లి లాబీయింగ్ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వారిని అడుగుతున్నదేమిటి? అసలు ఆయన డిమాండ్ ఏమిటి?’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కొద్ది నెలల క్రితమే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కచ్చితమైన డిమాండ్‌తో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలసి వారి మద్దతు కూడగ ట్టారని, ఇప్పుడు ఎటువంటి డిమాండ్ లేకుండా బాబు చేస్తున్న హడావుడి జగన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే విధంగా ఉందని చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చివరి వరకూ తలూపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమైక్యం పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేదని తేలిపోయిందని ఆమె విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకుని సమైక్యం కోసం పోరాడేవారన్నారు. ఈ తరుణంలో కిరణ్, చంద్రబాబు, ఎంపీలు, కేంద్రమంత్రులంతా సమైక్యం అనాలని ఆమె డిమాండ్ చేశారు. -
నేటి సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ
-
చివరి దశకు చేరిన తెలంగాణ బిల్లు!
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు చివరిదశకు చేరింది. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇవాళ నిర్వహించే సమావేశమే చివరిదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంశంలోఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. హైదరాబాద్ యూటీకి జీవోఎం నిరాసక్తత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య, విద్య, ఉపాధి, శాంతి భద్రతల అంశాలు కేంద్రం చేతుల్లోకి తీసుకుని ఆ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. వివాదస్పదంగా మారిన భద్రాచలం తెలంగాణకే చెందుతుందని మంత్రుల బృందం తేల్చింది. అయితే పోలవరం ముంపు గ్రామాలు మాత్రం సీమాంధ్రలో కలపాలని ప్రతిపాదించనున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేకుంటే తెలంగాణలో అసంతృప్తి ఉంటుందని...అలా జరిగితే రాజకీయ లబ్ధి పూర్తిగా చేకూరదని జీవోఎం సభ్యులు వాదించినట్లు సమాచారం. దీనిపై బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా మంతనాలు జరిగాయి. మరోవైపు... జైరాంరమేష్, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ అయ్యారు. ఇంతకాలం పోరాడతున్నామని బీరాలు పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు పూర్తిగా చేతులెత్తేశారు రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఇంకా సమైక్యంకోసం ప్రయత్నించడంలో ప్రయోజనం లేదని చెప్పారు. కావూరి, కిశోర్‌చంద్రదేవ్ ఈ తతంగానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ నిర్ణయం కీలకదశలో ఉన్న సమయంలో కావూరి అమెరికా పర్యటన అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇక రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. జీవోఎం మరిన్ని భేటీలు నిర్వహిస్తుందని కేంద్ర హోంమంత్రి షిండే అంటూంటే ..... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాత్రం జీవోఎం నివేదిక పూర్తి చేస్తుందంటున్నారు. నివేదికను కేబినెట్ భేటిలో చర్చించిన తరువాత అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపుతామని దిగ్విజయ్ తెలిపారు. ఎలాంటి సవరణలు లేకుండా రాజ్యంగ పరిథిలోనే హైదరాబాద్‌ను పరిమిత కాలపు ఉమ్మడి రాజధానిగా చేస్తామన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిబద్దత కలిగిన నాయకుడంటూ కితాబిచ్చారు. -
రాష్ట్ర విభజన అనివార్యం : చిరంజీవి
-
రాష్ట్ర విభజన అనివార్యం : చిరంజీవి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. ఇక కలిసుండాలని కోరుకోవటంలో ప్రయోజనం లేదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిందని చిరంజీవి తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా అంతకు ముందు సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌పైనే వారు ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు విజ్ఞప్తి చేశారు. -
యూటీకి కిరణ్ ఓకే!
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆయన వేసుకున్న సమైక్యం ముసుగు క్రమంగా తొలిగిపోతోంది. సీమాంధ్రలో చాంపియన్ కావాలని కిరణ్ ఆడుతున్న నాటకాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి పోయినా లెక్కచేయబోనని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఒప్పుకునేది లేదని కిరణ్ చెబుతున్న మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని స్పష్టమవుతోంది. విభజనకు సహకరిస్తూ బయటకు మాత్రం సమైక్యం అంటున్నారని అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరగనీయబోమని చెబుతూనే లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాను కరడుగట్టిన సమైక్యవాదినని ప్రతి వేదికపైనా కిరణ్ డబ్బా కొట్టుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం పదవీ త్యాగానికి కూడా సిద్ధమని చెబుతున్నారు. సీఎం పోస్టు తనకో లెక్కకాదన్నట్టు లెక్చర్లు దంచారు. ఎన్నికల కోసం రాష్టాన్ని విభజించాలనుకోవడం సరికాదంటూ సన్నాయి నొక్కులు నొక్కాయి. సమైక్యాంధ్ర కొనసాగుతుందని, తన తర్వాత సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటారని జోస్యం చెప్పారు. బయటికి సమైక్యం అంటున్నా హైకమాండ్ ఒత్తిడికి ఆయన తలొగ్గినట్టు కనబడుతోంది. పైకి సమైక్యం అంటూనే విభజనకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని అధిష్టానికి కిరణ్ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి జేడీ శీలం ఈ విషయాన్ని సూచాయగా వెల్లడించారు. హైదరాబాద్‌ను రెండేళ్లు యూటీ చేస్తే విభజనకు కిరణ్ అడ్డుచెప్పరని ఆయన చెప్పారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని శీలం తెలిపారు. అంటే కిరణ్‌ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు. విభజనపై కిరణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారని శీలం వ్యాఖ్యలతో తేలిపోయింది. అయితే ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ ఆడిస్తున్న నాటకమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకునే వ్యూహంలో భాగంగా కిరణ్‌తో సమైక్యం డ్రామా నడుపుతోందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్రం విడిపోతే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న కిరణ్ సొంత పార్టీ పెట్టే యోచనలో కూడా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సమైక్య ముసుగులో కిరణ్ ఆడుతున్న నాటకాలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విభజనను అడ్డుకోవాలని కోరుతున్నారు. -
రాష్ట్ర విభజన తథ్యం : జైపాల్ రెడ్డి
-
హైదరాబాద్‌ను యూటీ చేయొద్దు,సోనియాకు జైపాల్ విజ్జప్తి
-
హైదరాబాద్‌ను యూటీ చేయొద్దు, సోనియాకు జైపాల్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై చర్చించనట్లు సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోగా విభజన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని జైపాల్ రెడ్డి ....సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయరాదని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఆయన అధినేత్రిని కోరినట్లు సమాచారం. అలాగే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే ప్రతిపాదనతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాగా జీవోఎం సిఫార్సులు ఖరారు అవుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి.... సోనియాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
'హైదరాబాద్ యూటీ అంటే ఊటీలో షూటింగ్ కాదు'
రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాల మధ్య సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిచ్చుపెట్టి అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి శనివారం నిజామాబాద్‌లో ఆరోపించారు. సీఎం కిరణ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవిభజనపై కేంద్రంలో,రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి హైదరాబాద్‌ను యూటీ చేయడమంటే ఊటీకి వెళ్లికి షూటింగ్ చేసినట్లు కాదని నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. షరతులు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి ఇటీవల కాంగ్రెస్ అధిష్టాన్నాన్ని, కేంద్ర మంత్రుల బృందాన్ని కలసి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నాగం పైవిధంగా స్పందించారు. -
హైదరాబాద్‌ను యూటీ చేయొద్దు: అసదుద్దీన్
న్యూఢిల్లీ : ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. వీరి ఇరువురి భేటీ సుమారు 45 నిమిషాలు పాటు కొనసాగింది. భేటీ అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దని సోనియాని కోరినట్లు తెలిపారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం లేదని అసద్ అన్నారు. శాంతి భద్రతలు, రెవిన్యూ, భూపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలన్నారు. కేంద్రంలో అతివాద ప్రభుత్వాలు వస్తే ముస్లింలపై దాడులు చేసే అవకాశం ఉంటుందని అసదుద్దీన్ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దంటూ ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కోరనున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. శనివారం వారిద్దరి అపాయింట్మెంట్ కోరానని...వారిని కలిసి ఇదే అంశాన్ని చెబుతానని అన్నారు. తొలి నుంచి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
'హైదరాబాద్‌ను యూటీ చేస్తే విభజనకు ఒప్పుకుంటాం'
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని వారు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేశారు. జీవోఎం సమావేశం ముగిసిన అనంతరం జీవోఎం సభ్యులు షిండే, జైరాం రమేష్, నారాయణ స్వామితో ....కావూరి, శీలం భేటీ అయ్యారు. భేటీ అనంతరం కావూరి, జేడీ శీలం మాట్లాడుతూ తాము ప్రస్తుతం హైదరాబాద్‌పై దృష్టి పెట్టామని, ప్యాకేజీలపై తర్వాత చర్చిస్తామన్నారు. జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలు ప్యాకేజీల కోసం తాము చేస్తున్న డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కూడా కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్‌షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్‌లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందేనని సూచించారు. -
కేంద్రం చేతిలో అధికారం ఉంటే మేము ఏం చేయాలి?
హైదరాబాద్ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకునేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌పై ఏది పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమంటూ కొందరు చేస్తున్న వాదనలపై దానం మండిపడ్డారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే.... ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని (చీపుళ్లు పట్టుకోవాలా) అని ఎద్దేవా చేశారు. కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు. హైదరాబాద్ యూటీ అంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎల్పీలో తీర్మానం చేశామని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు స్పీకర్‌గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ యూటీకి ఒప్పుకోం: నారాయణ
-
హైదరాబాద్ యూటీకి ఒప్పుకోం: నారాయణ
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనకు తాము ఒప్పుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఏ చిన్న గోడ కట్టాలన్నా కేంద్రం అనుమతి కావాలని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. భద్రాచలం తెలంగాణలో భాగంగానే ఉండాలని నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల భయాందోళనలు తొలగించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. విభజన చేస్తున్నవారే అనంతర సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. కాగా రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందంతో సీపీఐ నేతలు ఈరోజు మధ్యాహ్యం భేటీ కానున్నారు. ఆపార్టీ ప్రతినిధులుగా నారాయణ, జెల్లీ విల్సన్ తమ అభిప్రాయాలను తెలుపనున్నారు. -
యూటీ చేయడం అసాధ్యం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయడం అసాధ్యమన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్లకు వ్యతిరేకంగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లేని తెలంగాణ, తెలంగాణ లేని హైదరాబాద్ లేదని, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భౌగోళికంగా ఏ ప్రాంతంలో కలవడానికి వీలులేని ప్రాంతాన్ని మాత్రమే యూటీగా చేస్తారని, కానీ హైదరాబాద్ 10 జిల్లాల తెలంగాణకు మధ్యలో ఉందని వివరించారు. భూ దందాల కోసమే హైదరాబాద్‌లో రామోజీ ఫిలింసిటీ, మాదాపూర్‌లో హైటెక్‌సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి నిర్మాణం జరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ లేదనే వాదనలు కేవలం అపోహలేనన్నారు. జేఏసీ కో చైర్మన్లు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రభుత్వమే సభ జరిపించిందని మండిపడ్డారు. సభకు వచ్చే దగ్గర్నుంచి తిరిగి వెళ్లే వరకూ పోలీసు బందోబస్తు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని తొలగిస్తేనే రాష్ట్రంలో శాంతి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్ఎస్ నేత శ్రవణ్‌కుమార్ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: సాయిప్రతాప్
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని రాజంపేట లోక్‌సభ సభ్యుడు సాయి ప్రతాప్ ఆదివారం కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 9 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నామని న్యూఢిల్లీలో ఏ నాయకుడు తమకు చెప్పలేదన్నారు. అలాగే రాష్ట విభజనకు తాము సిద్దమని కూడా అధిష్టానం వద్ద చెప్పలేదని పేర్కొన్నారు. అయితే విభజనపై ఎవరితో మాట్లాడారో మాకు తెలియదని సాయి ప్రతాప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లాలో ఆందోళనలు ఆదివారం కూడా ఉధృతంగా సాగుతున్నాయి. కడప నగరంలోని పొట్టిశ్రీరాముల విగ్రహానికి సమైక్యవాదులు పాలభిషేకం చేశారు. అనంతరం నగరంలో మానవహారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతుంది. అలాగే పులివెందుల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సమైక్యవాదులతో కిక్కిరిశాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కడపజిల్లా కోర్టు ముందు న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరాయి. జమ్మలమడుగులో సమైక్యాంధ్ర కోసం భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అదే జిల్లాలోని రైల్వేకోడూరులో సమైక్యవాదులు నిరసనలు మిన్నంటాయి. సీమాంధ్ర నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగాలకు చెందిన ఐక్యకార్యాచరణ కమిటి ధర్నా నిర్వహించింది. -
చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి
హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌నేత మైసూరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల 3 ప్రాంతాలకు నదీజలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అంతరాష్ట్ర నదీజలాల బోర్డు ఏర్పడితే ప్రాజెక్ట్‌లు వట్టిపోతాయని మైసూరారెడ్డి తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా నిర్ణయంతో దేశం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేదన్న ఒకే ఒక్క స్వార్థంతో రాష్ట విభజన చిచ్చుపెట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు. విదేశీయురాలైన సోనియాకు దేశ సమగ్రతపై ఏమంత అవగాహన ఉందని దాడి వీరభద్రరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని భారతదేశానికి రెండో రాజధానిగా చేయాలి లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రమంత్రి చిరంజీవి శనివారం కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.