హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని రాజంపేట లోక్సభ సభ్యుడు సాయి ప్రతాప్ ఆదివారం కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 9 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నామని న్యూఢిల్లీలో ఏ నాయకుడు తమకు చెప్పలేదన్నారు. అలాగే రాష్ట విభజనకు తాము సిద్దమని కూడా అధిష్టానం వద్ద చెప్పలేదని పేర్కొన్నారు. అయితే విభజనపై ఎవరితో మాట్లాడారో మాకు తెలియదని సాయి ప్రతాప్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లాలో ఆందోళనలు ఆదివారం కూడా ఉధృతంగా సాగుతున్నాయి. కడప నగరంలోని పొట్టిశ్రీరాముల విగ్రహానికి సమైక్యవాదులు పాలభిషేకం చేశారు. అనంతరం నగరంలో మానవహారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతుంది. అలాగే పులివెందుల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సమైక్యవాదులతో కిక్కిరిశాయి.
సమైక్యాంధ్రకు మద్దతుగా కడపజిల్లా కోర్టు ముందు న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరాయి. జమ్మలమడుగులో సమైక్యాంధ్ర కోసం భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అదే జిల్లాలోని రైల్వేకోడూరులో సమైక్యవాదులు నిరసనలు మిన్నంటాయి. సీమాంధ్ర నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగాలకు చెందిన ఐక్యకార్యాచరణ కమిటి ధర్నా నిర్వహించింది.