sai pratap
-
టీడీపీకి షాక్ మీద షాక్‌లు!
కడప వైఎస్సార్ సర్కిల్/ఎమ్మిగనూరు టౌన్/రేణిగుంట(చిత్తూరు): ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజు రోజుకు ఆ పార్టీ నుంచి ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూ ఉంది. తాజాగా శనివారం కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సాయి ప్రతాప్ టీడీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో కోడుమూరు ఎమ్మెల్యే మణి గాంధీ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, కర్నూలు జిల్లా కార్యదర్శి మురళీధర్‌నాయుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి దేవ స్థానం మాజీ చైర్మన్, టీడీపీ కీలక నేత కొం డుగారి శ్రీరామ్మూర్తి టీడీపీని వీడి వైఎస్సా ర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతోపాటు టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా చేరారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు ఎస్సీవీ నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షం లో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు. అవమానించారు: సాయిప్రతాప్ టీడీపీలో ఉన్న మూడు సంవత్సరాల కాలం అజ్ఞాతంగా, అరణ్యవాసంగా గడిపానని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజంపేటకు ఇన్చార్జ్గా ఉండమని చెప్పి, ఘోరంగా అవమానించారని చెప్పారు. అమరావతికి రమ్మని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావు మొహం తిప్పుకుని చూసీ చూడనట్లు వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు. టీడీపీలో డబ్బులు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. సొంత ఇంటికి వచ్చా: మణిగాంధీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టీడీపీకి వెళ్లి పెద్ద తప్పు చేశానని కర్నూలు జిల్లా, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆయన అన్నారు. -
కడప జిలాలో టీడీపీకి గట్టి షాక్
-
అమరావతి రమ్మని నన్ను ఘోరంగా అవమానించారు
సాక్షి, కడప : మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ సీనియర్ నేత సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్ వెల్లడించారు. కాగా రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణాంతరం సాయిప్రతాప్ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా సాయిప్రతాప్ కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘దిక్కుతోచని స్థితిలో నా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరడం జరిగింది. రాయలసీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు లేఖలు ఇచ్చాను. కానీ ఇంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉంది. నన్ను రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉండమన్నారు. కానీ నా పార్లమెంట్ పరిధిలో జరిగే ఎటువంటి పార్టీ కార్యక్రమాలపై నాకు సమాచారం ఇవ్వరు. ఇన్ఛార్జ్కు పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకున్నా. నా అల్లుడు సాయి లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగటం జరిగింది. కానీ నాకు మొండిచేయి చూపించారు. ఈరోజు టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నన్ను అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు నన్ను చూసి పక్కకు మొహం తిప్పుకుని చూడనట్లు వ్యవహరించారు. టీడీపీలో సరైన విలువలు ఇవ్వలేదు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. డబ్బులు లేని వారికి టీడీపీలో స్థానం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీలో చంద్రబాబు అన్యాయం చేసారు. చంద్రబాబు తీరు వల్ల గత వారం రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యను. టీడీపీలో స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారు. సీనియర్ నాయకులకే విలువ లేని టీడీపీలో యువతరానికి విలువలు ఉంటాయా...? రెండు రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లేది భవిష్యత్ కార్యాచరణ తెలుపుతాను’ అని అన్నారు. -
కిరణ్ సహా నేతలంతా కాంగ్రెస్‌లోకే!
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారంపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర సహాయ మంత్రి ఏ.సాయిప్రతాప్ స్పందించారు. కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారన్న నమ్మకం ఉందని, బీజేపీలోకి వెళ్లరని తాను భావిస్తున్నానని ఆయన గురువారమిక్కడ చెప్పారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం చెన్నారాయునిపల్లెకు వచ్చిన సందర్భంగా సాయిప్రతాప్ రాజకీయాలు మాట్లాడనంటూనే కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడివెళ్లిన నేతలు పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్న విషయం వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందేనని అన్నారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికలముందు నుంచీ చెబుతూనే వస్తున్నానని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే కొంతకాలం మౌనంగా ఉండడమే మంచిదని అన్నారు. రాజకీయాలు వాతావరణ పరిస్థితుల్లా మారిపోయాయని అన్నారు. వర్షాలు కురుస్తాయని విత్తనం నాటబోతే వర్షం కురవదు.. వర్షంలేదని సాగుకు దూరంగా ఉంటే వర్షం కురుస్తుంది. ఇప్పటి రాజకీయాలు ఇలాగే ఉన్నాయని అన్నారు. పార్టీవీడి వెళ్లిన నేతలంతా తిరిగివస్తే భవిష్యత్తు కాంగ్రెస్‌దేనని ఆశాభావం వ్యక్తం చే శారు. -
ఆమె ‘అన్న’ కూతురైతే...నేను జగన్ తమ్ముణ్ని
రాజంపేట: ‘ఆమె అన్న కూతురైతే, నేను జగనన్న తమ్ముణ్ని.. జగనన్నే నా బలం. ఎన్నికలయ్యాక వెంట తెచ్చుకున్న సూట్‌కేసుతో వెళ్లిపోతారు. నేను స్థానికుడిని. ఇక్కడే ఉండి మీ సమస్యలను పట్టించుకుంటాను’ అని వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆయన బి కొత్తకోట, పీటీఎం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, సాయిప్రతాప్ ఎంపీ పదవికి, డబ్బుందని వ్యాపారి శంకర్ తంబళ్లపల్లె ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారన్నారు. వారు డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని, దీనికి ఓటర్లు బలికావద్దని కోరారు. ఓటుకు రూ.500 తీసుకుని వారికి ఓటేస్తే.. ఐదేళ్లపాటు నష్టపోవాల్సివస్తుందని హెచ్చరించారు. భవిష్యత్‌లో కష్టాలు రాకుండా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీని ఆదరించాలన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడారని అన్నారు. తాను పల్లెల్లో పర్యటిస్తున్నప్పుడు చికిత్సలతో ప్రాణం పోసుకున్న వారంతా తమ శరీరంపై ఆపరేషన్లు చేసిన గుర్తులను చూపిస్తున్నారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసేందుకు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తని అని సీఎం కాగానే మహిళా రుణాలను మాఫీ చేస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులను జైళ్లకు పంపారని, బిల్లులు కట్టలేమన్న అన్నదాతలపై కేసులు పెట్టించారని గుర్తు చేశారు. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే, తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చంటూ ఎగతాళిచేసిన చంద్రబాబు నేడు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆల్‌ఫ్రీ మాటలు చెబుతున్నారని విమర్శించారు. మతతత్వ బీజేపీ ఎంపీ అభ్యర్థిని, ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కనీసం నీటి సమస్యనైనా తీర్చలేకపోయాడన్నారు. నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని తాను, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలో నెలకొన్న సమస్యలను జగన్ మోహన్ రెడ్డి తీరుస్తారని అన్నారు. రాజంపేట ఎంపీగా తనను, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఈ ఇద్దరిదీ ఎదురీతే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాజంపేట లోక్‌సభ స్థానంలో ఓ యువ తేజంతో ఇరువురు రాజకీయ ఉద్దండులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష రాజకీయూల్లో పాల్గొనలేదు. ఆయన తండ్రి రాజకీయూల్లో ఉన్నారు. తండ్రి సూచనలు, సలహాలు తీసుకుంటూ భారత పార్లమెంటు మెట్లు ఎక్కేందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన పేరు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. యువకుడు, విద్యావంతుడు. తండ్రి రాష్ట్ర మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొదటి నుంచీ రాజకీయ కుటుంబమే. అయితే మిథున్ మాత్రం రాజకీయూలకు కొత్త. ఆయన ప్రసంగం తీరు, యువతను కలుపుకుని పోయే శైలి, జనంతో మమేకమై తిరుగుతున్న తీరును పరిశీలిస్తే ప్రత్యర్థులను మట్టికరిపించడం ఖాయమని స్పష్టమవుతోంది. హేమాహేమీలతో పోరాటం కాంగ్రెస్, బీజేపీ నుంచి హేమాహేమీలైన రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి ఏ.సాయిప్రతాప్, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి రంగంలో ఉన్నారు. ఇరువురూ నామినేషన్లు దాఖలు చేశారు. సాయిప్రతాప్ తలపండిన రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన ఇప్పటికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేయలేదు. ఇది ఆయన రాజకీయ పరిణితికి దర్పణంగా చెప్పవచ్చు. సంక్షేమం అంటే వైఎస్ఆర్ను చూసి నేర్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చచ్చిపోయింది. ఈ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే సాయిప్రతాప్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఓటమి తప్పదని తెలుసు. డిపాజిట్లు కూడా వస్తాయో రావోననే బాధ ఆయనలో ఉంది. అయినా గాంభీర్యంగా నామినేషన్ వేసి జనం ఏ తీర్పు ఇస్తే దానికి శిరసావహిస్తానని చెప్పారు. మరో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి రాజంపేట ఎటువైపు ఉంటుందో మ్యాప్‌లో చూసి తెలుసుకోవడం తప్ప అక్కడికి వెళ్లి జనంతో మాట్లాడిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల కాలం మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి కాంగ్రెస్ పార్టీ వారు అప్పట్లో వైఎస్ఆర్ను చూసి ఉన్నత స్థానం కల్పించారు. పదవీ వ్యామోహం ఎంత పని చేయిస్తుందో ఈమెను చూసి తెలుసుకోవచ్చు. పదేళ్లు కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరి రానున్న ఐదేళ్లు పదవి లేకుండా ప్రజాసేవ చేయవచ్చు. అయితే బీజేపీలో చేరి ఊహించని విధంగా రాజంపేట స్థానం నుంచి టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. లోక్‌సభ పరిధిలో చిత్తూరు జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్ జిల్లా నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీని ఇస్తాయి. ఇక వైఎస్ఆర్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురందేశ్వరికి లోక్‌సభ పరిధిలోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం గురించి కూడా తెలియదు. పైగా ఆమె ఈ 15 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో కూడా పాల్గొనే అవకాశం లేదు. అంటే కనీసం జనం ముందుకు కూడా వెళ్లకుండా జనం తమకు ఓట్లేస్తారని భావిస్తే పొరపాటే అవుతుంది. పైగా టీడీపీ వారు పనిగట్టుకుని పురందేశ్వరికి డిపాజిట్లు దక్కకుండా చేయూలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఇరువురు కేంద్ర మాజీమంత్రులు యువకుడైన మిథున్‌రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయం. -
కిరణ్‌కు మిగిలేవి చెప్పులేనా?
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ గుర్తును ఏ ముహూర్తంలో నిర్ణయించుకున్నారో గానీ.. ఆయనకు మిగిలేది ఆ చెప్పుల జత ఒక్కటే అనిపిస్తోంది. నాయకులు అందరూ ఒక్కొక్కళ్లుగా జై సమైక్యాంధ్ర పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గరుండి పార్టీ పెట్టించిన వాళ్లంతా క్రమంగా జారుకుంటున్నారు. నమ్మిన బంటులా ఉన్న పితాని సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. అనుంగు అనుచరుడిగా భావించిన రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ తాను రాజంపేట నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కూడా చెప్పేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆశీస్సులు తీసుకుని మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమైపోయారు. (చదవండి: కిరణ్‌కు సాయిప్రతాప్ షాక్) దీంతో తాను నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక కిరణ్ కుమార్ రెడ్డి తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఎన్నికల గుర్తుగా పెట్టుకున్న చెప్పుల జత వేసుకుని కిరణ్ వెళ్లిపోవాల్సి ఉంటుందని అంటున్నారు. -
కిరణ్ కు సాయిప్రతాప్ షాక్
-
బహిష్కృత వేటుపై ఎంపీల స్పందన
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురి ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంపై సీమాంధ్ర ఎంపీలు స్పందించారు. 'కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. 30 ఏళ్లపాటు సేవచేసిన నన్ను బహిష్కరించడం బాధాకరం. రాష్ట్ర కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తున్నారు. వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురవ్వడం ఖాయం' - ఎంపీ సాయిప్రతాప్ 'మా బహిష్కరణకు సంబంధించి నోటీసులందిన తర్వాత స్పందిస్తాం. అందరినీ కలుపుకుని పార్లమెంట్లో మరింత సమర్థవంతంగా సమైక్యవాణి వినిపిస్తాం' - ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. అన్నింటికి సిద్దపడే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. అవిశ్వాస తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు, పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాత్రమే - రాయపాటి సాంబశివరావు అన్నింటికి సిద్దపడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాటం చేస్తున్నాం. సస్పెన్షన్ వేటు పడినా తమ పోరాటంలో ఎలాంటి సడలింపు ఉండదు. అప్రజాస్వామిక పద్దతిలో విభజన బిల్లును పార్లమెంట్ లో ఎలా ప్రవేశపెడుతారు - లగడపాటి తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. విభజన బిల్లును అడ్డుకోవడం, వ్యతిరేకించి ఓటు వేసే అవకాశం కల్పించి కాంగ్రెస్ తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక తమను అడ్డుకునేవారు ఉండరని అన్నారు. తమను పార్టీ నుంచి బహిష్కరించగలరు కానీ పార్లమెంట్ తప్పించలేరు. - సబ్బం హరి ఎప్పుడో అవిశ్వాస తీర్మానం నోటిస్ ఇచ్చాం. ఇప్పడు వేటు వేశారు. ఈ వ్యవహారం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది. చిదంబరం, జై రాంరమేశ్ లు సోనియాను తప్పుదారి పట్టిస్తున్నారు. సోనియా తప్పుడు సలహాలు ఇస్తున్న చిదంబరం, జై రాం రమేశ్ లు రాజీనామా చేయాలి. - హర్ష కుమార్ 'మా సహచర ఎంపీలను బహిష్కరించడం బాధాకరం. విభజనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. మేమంతా సమైక్యవాదులం' - అనంత వెంకట్రామిరెడ్డి -
సబ్బం హరి, సాయి ప్రతాప్ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు సబ్బం హరి, సాయి ప్రతాప్ తమ రాజీనామా లేఖలను లోక్‌సభ జనరల్ సెక్రెటరీకి అందజేశారు. అనంతరం సాయిప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలోచన లేకుండా చేసిందన్నారు. ప్రజా ఉద్యమం ద్వారానే తాము కూడా సమైక్యాంధ్ర కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ అంశాల ద్వారానే విభజనను ఆపాలన్నారు. -
ఉండవల్లి, సాయిప్రతాప్ రాజీనామా!
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. టీ నోట్ ఆమోదం పొందిన వెంటనే ఉండవల్లి గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు తన నిర్ణయం వెల్లడించారు. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని యథాతథంగా ఆమోదించడానికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ అధిష్టానానికి లేఖ పంపానన్నారు. 2014 వరకూ రాష్ట్ర విభజన పూర్తికాదని ఇంకా నమ్ముతున్నానని, ఆ తర్వాతా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌పార్టీ సభ్యునిగా ఏమీ చేయలేను కాబట్టి, ప్రజాభిమతానికి అనుగుణంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎనలేని సేవలందించినా, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేబినెట్లో టీ.నోట్‌ను పెట్టడంపై సాయిప్రతాప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను వీడడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు కోట్ల రాజీనామా!: మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. కేబినెట్ నిర్ణయానంతరం కర్నూలులో విలేకరులతో మాట్లాడిన మంత్రి శుక్రవారం ఢిల్లీకి వెళ్లి ప్రధానికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. కావూరి, పళ్లంరాజులను వారించిన ప్రధాని: మరోవైపు గురువారం నాటి కేంద్ర కేబినెట్ భేటీలో పాల్గొన్న సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు.. భేటీ తర్వాత ప్రధాని మన్మో„హన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగలేమని చెప్పారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని ప్రధాని నచ్చజెప్పారు. దీంతో రాజీనామాలపై వారెలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
డెడ్ లైన్..18
వైవీయూ, న్యూస్‌లైన్: ఈ నెల 18వ తేదీలోపు మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యుడు సాయిప్రతాప్ రాజీనామా చేయాలని హెచ్చరిక పేరుతో రూపొందించిన పోస్టర్‌ను వారి ఇళ్లకు అతికించారు. సోమవారం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యనినాదాలు చేస్తూ తొలుత మంత్రి సి. రామచంద్రయ్య ఇంటివద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ‘హెచ్చరిక’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఇంటికి అతికించారు. సమైక్యద్రోహులు మంత్రులు రాజీనామాలు చేయాలంటూ నినదించారు. అనంతరం మంత్రి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటికి పోస్టర్లు అతికించారు. మంత్రి తనయుడు అషఫ్త్రో సమైక్యవాదులు వాగ్వాదానికి దిగారు. సమైక్యవాదులుగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. అక్కడి నుంచి రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఇంటివద్దకు వెళ్లారు. అక్కడ ఆయన ఇంటికి, కారుకు స్టిక్కర్లు అతికించారు. మంత్రులు, ఎంపీలు రాజీనామాలు ఆమోదింపచేసుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాప్రతినిధుల ఇంటి వద్దే దీక్షలకు పూనుకుంటామన్నారు. పోలీసులతో వాగ్వాదం.. బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సమైక్యవాదులను సీఐ శివన్న ఆధ్వర్యంలో పోలీసులు ఆడ్డుకునే యత్నం చేశారు. దీనికి సమైక్యవాదులు ప్రతిఘటించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఉద్యమాలు ఎలా చేస్తారంటూ సీఐ ప్రశ్నించడంతో సమైక్యవాదులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉద్యమాలను ఖాకీజులుంతో అణగదొక్కాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు శ్రీనివాసులు, జయరామయ్య, బాలశౌరిరెడ్డి, జమాల్‌రెడ్డి, గంగాధర్, తిరుపాల్, నరసారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులు, రామ్మూర్తి, శంకరయ్య, రవిశంకర్‌రెడ్డి, దామోదర్, శ్రీనివాసయాదవ్, పి.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: సాయిప్రతాప్
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని రాజంపేట లోక్‌సభ సభ్యుడు సాయి ప్రతాప్ ఆదివారం కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 9 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నామని న్యూఢిల్లీలో ఏ నాయకుడు తమకు చెప్పలేదన్నారు. అలాగే రాష్ట విభజనకు తాము సిద్దమని కూడా అధిష్టానం వద్ద చెప్పలేదని పేర్కొన్నారు. అయితే విభజనపై ఎవరితో మాట్లాడారో మాకు తెలియదని సాయి ప్రతాప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లాలో ఆందోళనలు ఆదివారం కూడా ఉధృతంగా సాగుతున్నాయి. కడప నగరంలోని పొట్టిశ్రీరాముల విగ్రహానికి సమైక్యవాదులు పాలభిషేకం చేశారు. అనంతరం నగరంలో మానవహారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతుంది. అలాగే పులివెందుల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సమైక్యవాదులతో కిక్కిరిశాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కడపజిల్లా కోర్టు ముందు న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరాయి. జమ్మలమడుగులో సమైక్యాంధ్ర కోసం భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అదే జిల్లాలోని రైల్వేకోడూరులో సమైక్యవాదులు నిరసనలు మిన్నంటాయి. సీమాంధ్ర నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగాలకు చెందిన ఐక్యకార్యాచరణ కమిటి ధర్నా నిర్వహించింది.