
కడప వైఎస్సార్ సర్కిల్/ఎమ్మిగనూరు టౌన్/రేణిగుంట(చిత్తూరు): ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజు రోజుకు ఆ పార్టీ నుంచి ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూ ఉంది. తాజాగా శనివారం కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సాయి ప్రతాప్ టీడీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో కోడుమూరు ఎమ్మెల్యే మణి గాంధీ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, కర్నూలు జిల్లా కార్యదర్శి మురళీధర్‌నాయుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి దేవ స్థానం మాజీ చైర్మన్, టీడీపీ కీలక నేత కొం డుగారి శ్రీరామ్మూర్తి టీడీపీని వీడి వైఎస్సా ర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతోపాటు టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా చేరారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు ఎస్సీవీ నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షం లో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు.
అవమానించారు: సాయిప్రతాప్
టీడీపీలో ఉన్న మూడు సంవత్సరాల కాలం అజ్ఞాతంగా, అరణ్యవాసంగా గడిపానని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజంపేటకు ఇన్‌చార్జ్‌గా ఉండమని చెప్పి, ఘోరంగా అవమానించారని చెప్పారు. అమరావతికి రమ్మని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావు మొహం తిప్పుకుని చూసీ చూడనట్లు వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు. టీడీపీలో డబ్బులు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
సొంత ఇంటికి వచ్చా: మణిగాంధీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టీడీపీకి వెళ్లి పెద్ద తప్పు చేశానని కర్నూలు జిల్లా, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment