ఈ ఇద్దరిదీ ఎదురీతే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాజంపేట లోక్‌సభ స్థానంలో ఓ యువ తేజంతో ఇరువురు రాజకీయ ఉద్దండులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష రాజకీయూల్లో పాల్గొనలేదు. ఆయన తండ్రి రాజకీయూల్లో ఉన్నారు. తండ్రి సూచనలు, సలహాలు తీసుకుంటూ భారత పార్లమెంటు మెట్లు ఎక్కేందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన పేరు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. యువకుడు, విద్యావంతుడు. తండ్రి రాష్ట్ర మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొదటి నుంచీ రాజకీయ కుటుంబమే. అయితే మిథున్ మాత్రం రాజకీయూలకు కొత్త. ఆయన ప్రసంగం తీరు, యువతను కలుపుకుని పోయే శైలి, జనంతో మమేకమై తిరుగుతున్న తీరును పరిశీలిస్తే ప్రత్యర్థులను మట్టికరిపించడం ఖాయమని స్పష్టమవుతోంది.
హేమాహేమీలతో పోరాటం
కాంగ్రెస్, బీజేపీ నుంచి హేమాహేమీలైన రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి ఏ.సాయిప్రతాప్, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి రంగంలో ఉన్నారు. ఇరువురూ నామినేషన్లు దాఖలు చేశారు. సాయిప్రతాప్ తలపండిన రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన ఇప్పటికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేయలేదు. ఇది ఆయన రాజకీయ పరిణితికి దర్పణంగా చెప్పవచ్చు. సంక్షేమం అంటే వైఎస్‌ఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చచ్చిపోయింది.
ఈ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే సాయిప్రతాప్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఓటమి తప్పదని తెలుసు. డిపాజిట్లు కూడా వస్తాయో రావోననే బాధ ఆయనలో ఉంది. అయినా గాంభీర్యంగా నామినేషన్ వేసి జనం ఏ తీర్పు ఇస్తే దానికి శిరసావహిస్తానని చెప్పారు.
మరో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి రాజంపేట ఎటువైపు ఉంటుందో మ్యాప్‌లో చూసి తెలుసుకోవడం తప్ప అక్కడికి వెళ్లి జనంతో మాట్లాడిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల కాలం మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి కాంగ్రెస్ పార్టీ వారు అప్పట్లో వైఎస్‌ఆర్‌ను చూసి ఉన్నత స్థానం కల్పించారు. పదవీ వ్యామోహం ఎంత పని చేయిస్తుందో ఈమెను చూసి తెలుసుకోవచ్చు. పదేళ్లు కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరి రానున్న ఐదేళ్లు పదవి లేకుండా ప్రజాసేవ చేయవచ్చు. అయితే బీజేపీలో చేరి ఊహించని విధంగా రాజంపేట స్థానం నుంచి టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
లోక్‌సభ పరిధిలో చిత్తూరు జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ స్థానాలు, వైఎస్‌ఆర్ జిల్లా నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీని ఇస్తాయి. ఇక వైఎస్‌ఆర్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పురందేశ్వరికి లోక్‌సభ పరిధిలోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం గురించి కూడా తెలియదు. పైగా ఆమె ఈ 15 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో కూడా పాల్గొనే అవకాశం లేదు. అంటే కనీసం జనం ముందుకు కూడా వెళ్లకుండా జనం తమకు ఓట్లేస్తారని భావిస్తే పొరపాటే అవుతుంది. పైగా టీడీపీ వారు పనిగట్టుకుని పురందేశ్వరికి డిపాజిట్లు దక్కకుండా చేయూలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఇరువురు కేంద్ర మాజీమంత్రులు యువకుడైన మిథున్‌రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయం.