కిరణ్ సహా నేతలంతా కాంగ్రెస్‌లోకే!
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారంపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర సహాయ మంత్రి ఏ.సాయిప్రతాప్ స్పందించారు. కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారన్న నమ్మకం ఉందని, బీజేపీలోకి వెళ్లరని తాను భావిస్తున్నానని ఆయన గురువారమిక్కడ చెప్పారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం చెన్నారాయునిపల్లెకు వచ్చిన సందర్భంగా సాయిప్రతాప్ రాజకీయాలు మాట్లాడనంటూనే కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికలకు ముందు పార్టీని వీడివెళ్లిన నేతలు పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్న విషయం వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందేనని అన్నారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికలముందు నుంచీ చెబుతూనే వస్తున్నానని అన్నారు.
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే కొంతకాలం మౌనంగా ఉండడమే మంచిదని అన్నారు. రాజకీయాలు వాతావరణ పరిస్థితుల్లా మారిపోయాయని అన్నారు. వర్షాలు కురుస్తాయని విత్తనం నాటబోతే వర్షం కురవదు.. వర్షంలేదని సాగుకు దూరంగా ఉంటే వర్షం కురుస్తుంది. ఇప్పటి రాజకీయాలు ఇలాగే ఉన్నాయని అన్నారు. పార్టీవీడి వెళ్లిన నేతలంతా తిరిగివస్తే భవిష్యత్తు కాంగ్రెస్‌దేనని ఆశాభావం వ్యక్తం చే శారు.