'జగన్ నన్ను కార్నర్ చేస్తున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీలో గుబులు రేపింది. బంద్ కు అన్ని వర్గాల ప్రజల మద్దతు తెలియజేయడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎక్కడికక్కడ నేతలు కార్యకర్తలను వందలాదిగా అరెస్టులు చేసినప్పటికీ సంపూర్ణ బంద్ జరగడం టీడీపీ ముఖ్యులకు మింగుడుపడటం లేదు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించం అత్యంత కీలకమైన విషయం, కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా మారిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటించి ప్రత్యేక హోదా డిమాండ్ ను మరోసారి గట్టిగా వినిపించిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
అయితే ప్రత్యేక హోదా డిమాండ్ పై కేంద్రంపై గట్టిగా పోరాడుతామన్న అంశంకన్నా ఆయన జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంపైనే ఎక్కువ శ్రద్ధ కనబరిచారు. జగన్ మోహన్ రెడ్డి తనను వ్యక్తిగతంగా కార్నర్ చేస్తున్నారంటూ ఆక్రోశం వెల్లగక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్ చేయడం వల్ల రాష్ట్రం చాలా ఆదాయాన్ని కోల్పోయిందని నిందించారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉంటే ఇలాంటి చర్యలతో నష్టపోతున్నామంటూ విమర్శలు గుప్పించారు. ఉన్మాదంతో మాట్లాడే మాటలు జగన్ కు సహజమని, తాను జగన్ మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోకపోయినా క్లారిటీ ఇవ్వడం అవసరం అనిపించి మాట్లాడుతున్నాని చెప్పుకొచ్చారు. బంద్ వద్దంటే వినలేదన్నారు. బంద్ చేయడం వల్ల లాభమేంటో చెప్పాలన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మరోసారి మోసం చేయబోయాయన్నారు. జగన్ కు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదని నిందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నది కొత్త రాష్ట్రం కోసమేనని వివరించారు. అన్నీ పరిష్కారం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ఫోన్ లో చెప్పారన్నారు. కేంద్రం చేసిన మంచిని ఒప్పుకుంటూనే న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మనం ఏ పని తొందరపడి చేసినా రాష్ట్రం నష్టపోతుందని హితవు పలికారు.