కేంద్ర ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి: ఉండవల్లి
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రాకపోవడంలో కేంద్ర ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్ర విభజనను మించి అఘాయిత్యం రాజ్యసభలో జరిగిందన్నారు. చేసిన చట్టాన్ని అమలు చేయలేని దుస్థితిలో కేంద్రం ఉందని ఉండవల్లి దుయ్యబట్టారు. అన్ని పార్టీలు కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
ఏపీకి తీవ్ర అన్యాయం
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. సాక్షాత్తూ ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కేంద్రం అడ్డుపడిందని దిగ్విజయ్ మండిపడ్డారు. జీఎస్టీ బిల్లును చంద్రబాబు వ్యతిరేకిస్తే ప్రత్యేక హోదాకు కేంద్రం కచ్చితంగా ఆమోదం తెలుపుతుందని ఆయన అన్నారు.