సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు.
ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు.
ఎస్పీవీ ఏర్పాటు చేయండి..
‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌ఆర్‌బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment