కాంగ్రెస్‌కు ఆ హక్కు లేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని.. 2014లో కేవలం రాజకీయ లబ్ధికోసం ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విభజించిందని ఆయన విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విభజన వేళ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా విభజించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను అప్పుడే బిల్లులో పెట్టకుండా.. ఇప్పుడు ఎందుకు హామీ అమలు చేయడం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీని ప్రశ్నించే హక్కు లేదన్నారు. రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ మొసలి కన్నీరు కార్చుతోందని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వద్దని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ సభలోనే నినదించారని చెప్పారు. హోదా ఇస్తే పొరుగు రాష్ట్రాల పెట్టుబడులు తరలిపోతాయని హ చ్చరించారన్నారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఏపీకి ఎన్నికల్లో ఇచ్చినవి, ఇవ్వని హామీలను కూడా బీజేపీ అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో నీతి అయోగ్‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంప్రదింపులు జరుపుతున్నారని, హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.