'లైవ్ టెలికాస్ట్ ఆపి రాష్ట్రాన్ని విడగొట్టారు'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాజ్యసభలో చెప్పిన సంగతిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి.. ఇవాళ ప్రత్యేక హోదాను మరొక రూపంలో ఇస్తామనడం సరికాదని ఉండవల్లి అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ చెప్పిందని.. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాయన్నారు.
మెజార్టీ పార్టీలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్-బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయన్నారు. లైవ్ టెలికాస్ట్ ను కూడా కట్ చేసి రాష్ట్రాన్ని విడగొట్టారని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలను విడగొట్టలేదు కదా అని ఉండవల్లి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ప్రజల్లో కోపం, బాధ తగ్గిపోలేదని ఆయన తెలిపారు.