ప్రజలను రెచ్చగొడుతున్నాయి
కాంగ్రెస్, లెఫ్ట్‌లపై వెంకయ్య ధ్వజం
⇒ ఉనికికోసం వర్సిటీల్లో అశాంతిని సృష్టిస్తున్నాయి
⇒ జాతి వ్యతిరేక శక్తులకు వంతపాడుతున్నాయి
⇒ రాష్ట్రపతి పదవి రేసులో లేను
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడబలుక్కుని వర్సిటీల్లో అశాంతిని రేపుతూ అస్థిత్వాన్ని చాటుకునేందుకు ప్రయ త్నిస్తున్నాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ నోట్ల రద్దు తర్వాత కూడా పురోగమిస్తోందని, ప్రధాని మోదీ విజయాలను జీర్ణించుకోలేకే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్ని రెచ్చ గొడుతున్నాయని దుయ్యబట్టారు. మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలను కొత్త ఎత్తుగడలతో కులాలు, మతాల పేరుతో చీలుస్తున్నాయని ఆరో పించారు. ప్రధానిని ఎదుర్కోలేక జాతి వ్యతిరేక శక్తులకూ వంత పాడేందుకు సిద్ధపడుతున్నాయని మండిపడ్డారు.
శుక్రవారం తన నివాసంలో పార్టీ నాయకులు నల్లు ఇంద్ర సేనారెడ్డి, కృష్ణసాగర్‌రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని, వామపక్షాలతో కలసి వర్సిటీల్లో అశాంతిని రాజేస్తున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో వాద, ప్రతివాదనలు సహజమన్నారు. ఏ సమస్యపై అయినా రాజకీయపార్టీలతో తాము చర్చకు సిద్ధమని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. తాను రాష్ట్రపతి పదవి కోసం రేసులో లేనని ఒక ప్రశ్నకు వెంకయ్య బదులిచ్చారు. తాను కేంద్ర మంత్రిగా ఉండడం మీడియాకు ఇష్టం లేదా అని సరదాగా ప్రశ్నించారు.
బీజేపీ గెలుస్తుంది...
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే విశ్వాసం తనకుందని వెంకయ్య నాయుడు చెప్పారు. తన కంచుకోట అయిన అమేథీలోనూ కాంగ్రెస్ పార్టీ బీటలు వారుతోందని, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతం విఫలమవు తోందని, వామపక్ష అతివాదాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. హత్యా రాజకీయా లు సీపీఎంకు ఏమాత్రం ఉపయోగపడవన్నారు. కేరళలో ఆరెస్సెస్ కార్యాలయాలు, బీజేపీ నాయకులపై దాడులకు దిగుతున్నారన్నారు. కాగా, కేరళ సీఎం విజయన్‌ను హత్య చేస్తే రూ. కోటి ఇస్తానంటూ ఓ ఆర్‌ఎస్‌ఎస్ నేత చేసిన ప్రకటనను ఖండిస్తున్నామన్నారు.