నల్లధనమంతా వెలికితీస్తాం: వెంకయ్య
నెల్లూరు (సెంట్రల్)/వెంకటాచలం/ఉంగుటూరు (గన్నవరం): అవినీతి పరుల కోరలు పీకి నల్లధనాన్ని అంతా వెలికి తీస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. శనివారం రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన డిజిధన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆయన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌తో కలసి రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాన్ని ప్రారంభించారు.
వెంకటాచలంలో రుర్బన్ మిషన్‌కు శంకుస్థాపన చేశారు. కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నగదు రహితంగా లావాదేవీలు జరిపిన వారికి ఈ నెల 14న లక్కీడ్రా తీస్తామన్నారు. కృష్ణాజిల్లాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేయలేని సేవలను స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా అందించడం అభినందనీయమన్నారు.
వెంకయ్యకు నేడు అభినందన సభ
విజయవాడలో భారీ ర్యాలీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ శాఖ ఆదివారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు అభినందన సభ నిర్వహించనుంది. కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడంలో కృషి చేసినందుకు పార్టీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఉన్న జ్యోతిమహల్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నేతలు కేంద్రమంత్రిని సన్మానించనున్నారు.